విషం తాగుతున్నామా!
జలమండలి నీటిలో ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా
ఏసిరెడ్డి రంగారెడ్డి: బొట్టుబొట్టులో హాలాహలం.. ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా.. మంచినీరే కదా అని తాగారో.. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా, జీర్ణకోశ వ్యాధులు తథ్యం! భాగ్యనగరానికి జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలోకి ఓసారి తొంగిచూస్తే ఇన్ని రకాల జబ్బులు పలకరించాయి మరి!! ఆరోగ్యాన్ని కుప్పకూల్చే బ్యాక్టీరియాలు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు..
నగరంలో 8.65 లక్షల నివాసాలకు జలమండలి మంచినీటి రూపంలో ఇలా హాలాహలాన్ని పంచుతోంది. నగరంలో కలుషిత జలాలపై స్వల్ప కాలంలోనే 647 ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని ‘సాక్షి’ సేకరించింది. ఆ నీటిని ల్యాబ్‌లో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. పలు బస్తీలు, కాలనీలకు సరఫరా చేస్తున్న జలంలో మానవ మలమూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి, సిట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
ఎల్బీనగర్, సికింద్రాబాద్, బహదూర్‌పురా, ముషీరాబాద్, చంచల్‌గూడ, కార్వాన్, మెహిదీపట్నం, సీతాఫల్‌మండి తదితర ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో ఈ విష కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. నగరంలో అనేకచోట్ల మంచినీటి పైప్‌లైన్లు డ్రైనేజీ లైన్లతో కలిసిపోవటం, పలుచోట్ల లీకేజీలు, శుద్ధి కేంద్రాల్లో నిబంధనలను గాలికొదిలేయడంతో మంచినీళ్లు పూర్తిగా కలుషితమైపోతున్నాయి.
చిత్త’శుద్ధి’ఏదీ?: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నీటిని శుద్ధిచేసి సరఫరా చేసేందుకు జలమండలి ఏటా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది.
ప్రతి వెయ్యి లీటర్ల నీటి శుద్ధికి రూ.27 ఖర్చు చేస్తున్నారు. నగరంలో నాలుగు చోట్ల, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల ఫిల్టర్‌బెడ్లున్నాయి. ఈ నీటిని మహానగరానికి సరఫరా చేసేందుకు 250 స్టోరేజీ రిజర్వాయర్లున్నాయి. ఈ కేంద్రాల వద్ద నీటిశుద్ధి ప్రక్రియను గాలికొదిలేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 900 కి.మీ. మేర ట్రంక్‌మెయిన్ భారీ పైపులైన్లు, నగరవ్యాప్తంగా మరో 9 వేల కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. వీటికి తరచూ ఏదో ఓచోట లీకేజీలు ఏర్పడుతుండడంతో పైప్‌లైన్లలోకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరుతోంది.
ఇలా శుద్ధి చేయాలి..
జలాశయాల్లోని నీటిని(రా వాటర్) నాలుగు దశల్లో శుద్ధి చేయాలి.
మొదటి దశ: క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్ రసాయనాలు కలిపి కెమికల్ ట్రీట్‌మెంట్ నిర్వహించాలి.
రెండో దశ: నిల్వ ఉన్న నీటిలో ఆలం కలిపి అందులోని ఘన వ్యర్థాలు, ధూళి కణాలు రిజర్వాయర్ అడుగున చేరేలా చూడాలి.
మూడో దశ: మంచినీటిని వివిధ ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేయాలి. చిన్న, పెద్ద సైజు గులక రాళ్లు, సన్న ఇసుక, దొడ్డు ఇసుక, లేయర్స్ మీడియా ఫిల్టర్ల మీదుగా నీటి ప్రవాహం వెళ్లనివ్వాలి.
నాలుగో దశ: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 2 పీపీఎం, సర్వీసు రిజర్వాయర్ల వద్ద 1.5 పీపీఎం, వినియోగదారుడికి నల్లాల ద్వారా అందించే సమయంలో 0.2 పీపీఎం మోతాదులో క్లోరిన్ ఉండేలా చూడాలి.
* కార్బోనేట్ ఫిల్టర్లను ఏర్పాటు చేసి నీటిని పూర్తి స్థాయిలో శుద్ధిచేయాలి.
* ఫిల్టర్ బెడ్‌లోకి వచ్చిన నీటిలోకి ఆక్సిజన్‌ను అధిక మోతాదులో పంపితే నీటి నాణ్యత మెరుగుపడుతుంది. రంగు మటుమాయమౌతుంది.
కాలుష్యానికి కారణాలెన్నో..
* ఫిల్టర్ బెడ్లు, స్టోరే జీ రిజర్వాయర్ల వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఆలం, క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్‌లను సరైన మోతాదులో కలపడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఇతర రసాయనాలను ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
* ప్రతి స్టోరేజీ రిజర్వాయర్ వద్ద 600 కేజీల ఆలం, 36 కేజీల క్లోరిన్‌గ్యాస్‌ను కలిపి నీటిని శుద్ధి చేయాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించడం లేదు.
* మంచినీటిలోకి ఆక్సిజన్‌ను పంపే ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం. నీటిలో రంగు పూర్తిగా పోవాలంటే నాన్‌ఫెర్రిక్ హైడ్రేటెడ్ లైమ్ కలపాలి. దీన్నీ గాలికొదిలేస్తున్నారు.
* బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ కోసం కేటాయించిన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు పక్కదారిపడుతున్నాయి. దీంతో తగు మోతాదులో క్లోరిన్ ను కలపడం లేదు.
* నగరంలో 250 సర్వీసు రిజర్వాయర్లను సీజన్ మారగానే శుద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. సుమారు 50 రిజర్వాయర్ల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతోంది.
* మంచినీరు, డ్రైనేజీ పైప్‌లైన్లు అల్లుకుపోయిన ప్రాంతాల్లో లీకేజీల వల్ల మురుగు నీరు, మంచినీటి లైన్లలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్‌లో 1,500 బస్తీలు ఉండగా.. లీకేజీల వల్ల తరచూ 100 బస్తీలు కలుషిత జలాల బారిన పడుతున్నాయి.
* నగరంలో యుద్ధప్రాతిపదికన 1,100 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైప్‌లైన్లు మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.
* నీటి నాణ్యత తెలుసుకునేందుకు చేసే ఫిజికో కెమికల్, బ్యాక్టీరియాలజీ పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.
* జలాశయాల నుంచి ఫిల్టర్‌బెడ్‌కు వచ్చే నీటికి కెమిక ల్, క్లోరిన్, బ్లీచింగ్, ఆలం, వైట్ పౌడర్‌లను సరైన మోతాదులో కలపకుండానే శుద్ధి చేస్తున్నారు.
* గండిపేట క్యాండుట్ కాలువ నిజాంకాలం నాటిది. కొన్నిచోట్ల నాలాపై కప్పు లేకపోవడంతో చెత్తాచెదారం చేరుతోంది.
* అనేక స్టోరేజీ రిజర్వాయర్‌ల వద్ద నీటిలో ఘన వ్యర్థాలు, ధూళి కణాలను తొలగించేందుకు ఫిల్టర్లు లేవు.
పురాతన పైపులైన్ల వల్లే..
నగరంలో డ్రైనేజీ, మంచినీరు పైపులైన్లు పక్కపక్కనే ఉండ డం, చాలాచోట్ల 50 ఏళ్ల నాటి పైపులైన్ల కారణంగానే తరచూ జలాలు కలుషితమవుతున్నాయి. తక్ష ణం పురాతన పైపులైన్లు మార్చి స్టెయిన్‌లెస్ స్టీలు పైపులు వేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి
తాగడానికి పనికిరాదు
ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లున్న నీరు తాగడానికి పనికిరాదు. తాగితే తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. యూవీ ఫిల్టర్స్ ద్వారా శుద్ధిచేసిన నీటిని తాగితే మంచిది.
- ఎనుముల రాజు, వాటర్ క్వాలిటీ అనలిస్ట్
జలమండలి వైఫల్యమే..
నగరవాసులకు స్వచ్ఛమైన నీటి ని సరఫరా చేయడంలో జల మండలి విఫలమవుతోంది. కలుషిత జలాలు జనం ఉసురు తీస్తున్నాయి. ఈ నీళ్లు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే బాధ్య త ప్రభుత్వానిదే. జలమండలిపై నమ్మకం లేక జనం ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు.
-ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్
జీర్ణకోశ వ్యాధులు వస్తాయి
కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్న నీళ్లు తాగి తే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా వంటి వ్యాధులకు గురవుతారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలపై దీని ప్ర భావం అధికం. నల్లా నీరు కాచి చల్లార్చి తాగాలి.
- డాక్టర్ బి.రమేష్,గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి