వానలు, వరదలతో ప్రపంచంలో కొన్ని దేశాలు అల్లాడిపోతుంటే, మరి కొన్ని దేశాల్లో గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లకి కరువు వచ్చి పడింది. ప్రపంచంలో 25 దేశాలు నీటికి కటకటలాడుతున్నట్టుగా వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అడ్వకేట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ జనాభాలో 25% మంది ప్రస్తుతం అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
నివేదిక ఏం చెప్పిందంటే..
► ప్రపంచంలోని 25 దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిలో భారత్, సౌదీ అరేబియా, చిలీ, శాన్‌మెరినో, బెల్జియం, గ్రీస్ వంటి దేశాలున్నాయి.
► బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతీ ఏడాది నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. ప్రతీ ఏడాది కరువు బారిన పడుతున్నాయి.
► ప్రపంచంలో నీటి కొరత అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాలు పశి్చమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా. ఈ ప్రాంతాల్లో 83% జనాభా అత్యధికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు.
► దక్షిణాసియా జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశాల్లో 74% మంది జనాభా నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
► ప్రపంచ జనాభాలో 50% మంది అంటే 400 మంది కోట్ల వరకు ప్రతీ ఏడాది ఒక నెల రోజుల పాటు నీటికి కటకటగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 60 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయి.
► నీటి కొరత కారణంగా భారత్, మెక్సికో, ఈజిప్టు, టర్కీ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాయి.
► 2010లో నీటి కొరత వల్ల ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 15 లక్షల కోట్ల డాలర్లు (ప్రపంచ జీడీపీలో 24%) నష్టపోతే, 2050 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 31% నష్టం వాటిల్లుతుంది. అంటే 70 లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తుంది.
► ఆసియా దేశాల్లో భారత్ అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో 80% మందికి సురక్షిత నీరు అందదు.
► ప్రపంచ వ్యవసాయ రంగం 60% నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు పంటలపై ప్రభావం పడుతోంది.
నీటి కటకటకి కారణాలివే..!
జనాభా పెరుగుదల , పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ సమర్థంగా చేయకపోవడం వంటివెన్నో నీటి కటకటకి కారణాలు. భూమ్మీద 70% నీటితో నిండి ఉన్నా మన అవసరాలు తీర్చే నీరు అందులో 3% మాత్రమే. అందులో రెండింట మూడొంతులు మంచు రూపంలో ఉంది. జనాభా పెరిగిపోతూ ఉండడంతో నీటికి డిమాండ్ పెరుగుతోంది. 1960తో పోల్చి చూస్తే నీటికి డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువైంది.
యూరప్, అమెరికాలో నీటికి డిమాండ్ స్థిరంగా ఉంటే ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి నీటికి డిమాండ్ మరో 25% పెరుగుతుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలో సగం దేశాల్లో అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో నీటి వినియోగం అధికమవడమే కాకుండా, కలుíÙత నీరు పెరిగిపోయే ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది.
చేయాల్సింది ఇదే..!
ప్రతీ వాన బొట్టుని సంరక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. వ్యవసాయ, పారిశశ్రామిక రంగాలకే 70% నీటిని వాడాల్సి వస్తోంది. 2050 నాటికి పెరిగే జనాభాకి 2010 కంటే 56% అధికంగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల 2050 నాటికి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు గణనీయంగా తగ్గుతాయని ఒక అంచనా. చిత్తడి నేలలు పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే చర్యలు చేపట్టడం వంటివి చెయ్యాలి. ఇక గ్లోబల్ వారి్మంగ్ అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సి ఉంది.
ఆ 25 దేశాలు ఇవే..!:
భారత్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, యెమన్, బోత్సా్వనా, ఇరాన్, జోర్డాన్, చిలీ, శాన్ మారినో, బెల్జియం, గ్రీస్, టునిషియా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఇరాక్, సిరియా
నీరు మనకి జీవనాధారం. భూమ్మీద లభించే అత్యంత ముఖ్యమైన వనరు అదే. అయినా దాని నిర్వహణలో మనం విఫలమవుతూ వస్తున్నాం. జల సంరక్షణ అనే అంశంలో నేను 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. దురదృష్టవశాత్తూ ప్రతీ ఏడాది అదే నివేదిక, అదే కథనం ఇవ్వాల్సి వస్తోంది. ఈ సంక్షోభ పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాధినేతలు చిత్తశుద్ధితో పని చేస్తూ నీటి వనరుల సంరక్షణకి ఆర్థిక వనరులు కేటాయించాలి’’
–సమంతా కుజ్మా, డబ్ల్యూఆర్‌ఐ నివేదిక రచయిత్రి
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment