చావుకీ 'నీళ్ల' కరువు! | Water drought also to Death! | Sakshi
Sakshi News home page

చావుకీ 'నీళ్ల' కరువు!

Published Sun, Apr 10 2016 4:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

చావుకీ 'నీళ్ల' కరువు!

చావుకీ 'నీళ్ల' కరువు!

♦ పాలివాళ్ల స్నానాలకు నీళ్లు లేక స్వగ్రామంలో అంత్యక్రియలు జరపని వైనం
♦ నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో ఘటన
♦ గత నెల 30న చనిపోయిన పెండ్యాల నారాయణరావు
♦ ఇల్లు ఉన్న గ్రామంలో దహనం వద్దన్న కొడుకులు, బంధువులు
♦ కర్మకాండలు, స్నానాలకు నీళ్లు లేకపోవడమే అసలు కారణం
♦ ఊర్లోనే చేయాలని ప్రజలడిగినా కుటుంబ సభ్యుల వెనుకంజ
 
 (మేకల కల్యాణ్ చక్రవర్తి)
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉన్న ఊరు, కన్న తల్లి... ఈ రెండు పదాలకు మనిషి జీవితంతో విడదీయరాని అనుబంధం ఉంది. తల్లి లాలనలో అల్లారుముద్దుగా పెరిగి పెద్దయిన తర్వాత ఆ మాతృమూర్తి రుణం తీర్చుకోవాలని.. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా.. ఉన్న ఊరికి సేవచేయాలని, కన్ను మూసినప్పుడు మాత్రం ఆ ఊర్లోనేఆరడుగుల స్థలంలో శాశ్వతంగా నిద్రపోవాలని చాలామంది కోరుకుంటారు. అందుకే మనిషి ఎక్కడ చనిపోయినా స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు, కర్మకాండలు జరిపించడం మనదేశంలో ఆనవాయితీ. కానీ, నల్లగొండ జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు ఓ దొరవారిని ఉన్న ఊరికి దూరం చేశాయి.

తాను పుట్టి పెరిగి, విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దమనిషిగా ఎదిగేందుకు దోహదపడిన ఆ గ్రామంతో దొరవారికి ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంపేశాయి. అందుకు కారణమేంటంటే.. నీళ్లు, నీళ్లు, నీళ్లు. దొరవారిని ఊర్లో దహనం చేస్తే పాలివాళ్లు (అదే ఇంటిపేరు కలిగిన చిన్నాన్న, పెదనాన్న తరఫు వాళ్లు) స్నానాలు చేయడానికి కూడా గ్రామం లో నీళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణంతోనే ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వెనుకంజ వేశారు ఆయన కుటుంబసభ్యులు. ఊర్లో పెద్దమనిషిగా పేరున్న దొరవారు తమ ఊర్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్న కోరికతో దొరవారిని ఊర్లోనే దహనం చేయాలని గ్రామస్తులంతా కోరినా.. కేవలం నీటి ఎద్దడి కారణంగానే కుటుంబ సభ్యులు మనోవేదనతో ఊరికి దూరంగా ఆయన అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ఉన్న నీటికొరతకు ఓ మచ్చుతునక.

 దొరవారు.. ఆ ఊరి కథ
 పెండ్యాల నారాయణరావు అనే పెద్దమనిషిది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గుండ్రపల్లి గ్రామం. ఆయన పుట్టి పెరిగింది అక్కడే. ఎంతో క్రమశిక్షణ కలిగిన మనిషిగా, తెలుగుతోపాటు పార్శీ, ఉర్దూ భాషలు నేర్చుకున్న వ్యక్తిగా గ్రామంలో ఆయన తెలియని వారు లేరు. ఆయన మాటంటే గౌరవం కూడా. అందుకే ఆయన్ను నారాయణరావు దొరవారు అని ఆప్యాయంగా కూడా పిలుచుకుంటారు. ఆయనకు ఊర్లోనే భూమి, ఇల్లు, కావాల్సినంత బలగం ఉంది. నలుగురు కుమారులు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ముగ్గురు కుమార్తెలుంటే ఇద్దరు చనిపోగా, మరో కూతురు ఊర్లోనే ఉంటోంది. భార్య యశోదమ్మ 18 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.

రెండేళ్ల క్రితం వరకు ఆయన కూడా ఊర్లోనే ఉన్నారు. దాదాపు 95 ఏళ్ల వయసు రావడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తన రెండో కుమారుడు ఉండే నల్లగొండకు వచ్చారు. ఇటీవలే ప్రమాదవశాత్తు జారిపడ్డ ఆయనకు బాగా సుస్తీ చేసింది. దీంతో గత నెల 30న నల్లగొండలోనే కన్నుమూశారు. ఆయన చనిపోయిన నల్లగొండకు, స్వగ్రామం గుండ్రపల్లికి కేవలం 35 కిలోమీటర్ల దూరమే. పెద్దమనిషి చనిపోవడంతో ఊరికి తీసుకెళ్లి స్వగ్రామంలో దహనం చేయాలని, ఆయన ఇష్టపడి కట్టుకున్న ఇంట్లోనే కర్మకాండలు జరిపించాలని అంతా భావించారు. కానీ, వారి కులస్తులు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసే చోట బావి ఎండిపోయింది.

దాదాపు 300 ఎకరాలకు నీళ్లు పారించిన కుంట కింది బావి కూడా వట్టిపోయింది. ఆ ఊళ్లో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. పేరుకు నాలుగు మంచినీటి ట్యాం కులున్నా.. రాత్రింబవళ్లు నీళ్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిందే. గతంలో ట్యాంకర్లు కొనుక్కుని నీళ్లు తెచ్చుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ ట్యాంకర్లు కూడా లేవు. కనీసం వాడుకునేందుకు... ఒక్క మాటలో చెప్పాలంటే స్నానాలు చేసేందుకు కూడా నీళ్లు లేవు. ఈ పరిస్థితుల్లో నారాయణరావు పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళితే నీటి ఇబ్బంది ఎదురవుతుందన్న చర్చ జరిగింది. ఊర్లోకి తీసుకెళ్లాలని కొందరు, తీసుకెళ్లి ఇబ్బందులు ఎక్కడ పడతామని మరికొందరు.. ఇలా చర్చోపచర్చలు జరిగాయి. ఊరి ప్రజలంతా ఆయనను ఊర్లోకి తీసుకొచ్చి దహనం చేయాలని అడిగారు.. కానీ కుటుంబ సభ్యులకు ధైర్యం సరిపోలేదు. పాలివాళ్లు స్నానాలు చేయడానికి, ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు, కర్మకాండలకు, పెద్దదినాలు చేసేరోజు ఇష్టబంతికి నీళ్లు ఇబ్బందవుతాయని కుమారులు భావిం చారు. అంతే.. ఊరికి తీసుకెళ్లకుండా నల్లగొండలోని ఓ శ్మశాన వాటికలో దహనం చేశారు.

 30 కుటుంబాలవారు అప్ అండ్ డౌన్
 ఇంకేముంది.. ఇప్పుడు ఊర్లోని బంధువులు, పాలివాళ్లు రోజూ నల్లగొండకు వచ్చిపోతున్నారు. దొరవారి కర్మకాండలు, రోజువారీ కార్యక్రమాల కోసం 30 కుటుంబాలకు చెందిన పాలివాళ్లు గుండ్రపల్లికి, నల్లగొండకు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
 
 చుక్క నీళ్లుంటే ఒట్టు..
 చండూరు మండలం గుండ్రపల్లిలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 2 వేలకు పైగా జనాభా ఉంది. ఏనుగువారి గూడెం, అలరాజుబావి గూడెం, కోమటివారి గూడెం అనే మూడు ఆవాస గ్రామాలు కూడా ఉన్నాయి. ఊళ్లో ఉన్న నాలుగు ట్యాంకుల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయా? అని గ్రామస్తులంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి. రాత్రింబవళ్లు నీళ్ల కోసం కాపలా కాయాల్సిందే. ఉన్న బోర్లు వట్టిపోయాయి. 3, 4 రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. అవి తాగేందుకు కూడా సరిపోవడం లేదు. ఇక, వాడుకకు, స్నానాలకు నీళ్లన్న మాటే కరువయ్యాయి. గ్రామంలోని యువకులకు పిల్లనివ్వాలంటేనే నీటి ఎద్దడిని చూసి భయపడుతున్నారని, పొద్దున్నే భర్త నిద్ర లేచి భార్య ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి (భార్య నీళ్ల కోసం ట్యాంక్‌ల వద్దకు వెళ్లి కాపలా కాస్తుంది.) ఏర్పడిందని గ్రామస్తులు చెపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగాది నాడు కూడా స్నానాలు చేయలేదని, స్నానం చేయక బట్టలు ఉప్పురిసి పోయాయని గ్రామంలోని మహిళలు వాపోతున్నారు.
 
 మొన్న పోయినం.. నిన్న పోయినం..ఈ రోజు కూడా పోవాలె
 మా పెదనాన్న నారాయణరావు అంత్యక్రియలు ఊర్లోనే చేయాలనుకున్నాం. కానీ, నీటి సమస్యతో నల్లగొండలోనే చేశారు. ఊర్లో మంచి పేరున్న మా పెదనాన్నను ఊరికి తీసుకురావాలని అందరూ అడిగినా తీసుకురాలేకపోయాం. ఇప్పుడు ఆయన కర్మకాండల కోసం రోజూ నల్లగొండకు వెళ్లి రావాల్సి వస్తోంది. మొన్న పోయినం.. నిన్న పోయినం.. ఇష్టబంతికి ఈ రోజు కూడా పోవాలి. కేవలం ఊర్లో నీళ్లు లేవన్న కారణంతోనే మా పెదనాన్న పార్థివదేహాన్ని నల్లగొండలో పెట్టారు.
 - పెండ్యాల మనోహర్‌రావు, నారాయణరావు బంధువు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement