మళ్లీ తెరపైకి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల సమస్య
డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో పరిస్థితి జటిలం
కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయంపై ఆధారపడిన ప్రాజెక్టు భవితవ్యం
ఇప్పటికే పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నీలినీడలు కము్మకున్నాయి. ప్రాజెక్టుకి నీటి కేటాయింపులను ప్రశ్నిస్తూ తాజాగా డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తిప్పిపంపడంతో ప్రాజెక్టు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇప్పటికే తీవ్ర ఉల్లంఘనల ఆరోపణలతో పర్యావరణ అనుమతులిచ్చేందుకు కేంద్రం ససేమిరా నిరాకరిస్తుండగా, దీనికి నిధులు, పెండింగ్ బిల్లుల సమస్య తోడుకావడంతో ప్రాజెక్టు నిర్మాణం నీరసించిపోయింది. తాజాగా నీటి కేటాయింపుల అంశం తెరపైకి రావడంతో ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది.
ట్రిబ్యునల్ ఏమంటుందో..?
పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని దశాబ్దాల కిందట గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలు తమవేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ 45 టీఎంసీలకు తోడుగా మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే దీనిని ఏపీ వ్యతిరేకిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీల జలాల వినియోగంపై ఏ రాష్ట్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు పోలవరం నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు గతేడాది కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడంతో ట్రిబ్యునల్ తీసుకోనున్న నిర్ణయంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది.
పనులు నత్తనడక
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ‘పాలమూరు’ను చేర్చింది. ఏటా రూ.6 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసి వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ప్రస్తుత ఏడాది (2024–25)లో రూ.6130 కోట్లు, వచ్చే ఏడాది (2025–26) రూ.6313 కోట్ల పనులు చేయాలని నిర్దేశించుకుంది. అయితే గత ఏడాది కాలంలో రూ.4743 కోట్లు విలువైన పనులు మాత్రమే జరగడంతో నిర్దేశిత గడువు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల్లో రూ.1500 కోట్లు చెల్లించినప్పటికీ మరో రూ.1437 కోట్ల మేర బిల్లులను చెల్లించాల్సి ఉంది.
ఒక్క ఎకరాకూ అందని నీరు
శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల జలాలను తరలించి నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.35,200 కోట్ల అంచనాలతో 2015 జూన్ 10న ప్రాజెక్టుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, తర్వాత అంచనా రూ.55,086 కోట్లకు ఎగబాకింది. గత ప్రభుత్వం రూ.27,554 కోట్ల విలువైన పనులు చేయగా, మొత్తం రూ.32,297 కోట్లు విలువైన పనులు పూర్తిచేసినా, ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. ప్రాజెక్టుకు మరో రూ.22,789 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
ఉద్దండాపూర్ పనులను అడ్డుకుంటున్న రైతులు...
స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్టు ఆరు రిజర్వాయర్లలో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు 2023 నవంబర్ నుంచి నిలిచిపోయాయి.ముంపునకు గురైన ఉద్దండాపూర్, వల్లూరు, పొలేపల్లి గ్రామాలతో పాటు శామగడ్డ, ఒంటిగుడిసె, చిన్నగుట్ట, రాగడిగుట్ట తండాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తక్షణం రూ.30 కోట్ల పరిహారంగా చెల్లిస్తేనే పనుల పునరుద్ధరణ జరగనుంది.
కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై మీమాంస
గత ప్రభుత్వం ఉద్దండాపూర్ సహా 5 రిజర్వాయర్ల పనులను మాత్రమే ప్రారంభించింది. చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుని ప్రత్యామ్నాయ మార్గంలో ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
లభించని పర్యావరణ అనుమతులు
పర్యావరణ అనుమతుల్లేకుండానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లను చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టుకు పలు షరతులతో పర్యావరణ అనుమతులు జారీ చేయాలని గతేడాది సిఫారసులు చేసింది.
పర్యావరణ పునరుద్ధరణకు రూ.153 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పీసీబీ కేసును ఫైల్ చేసింది. తీవ్ర పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలుండడంతో, ఈఏసీ సిఫారసులు చేసినా కేంద్రం పర్యావరణ అనుమతులివ్వడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment