
రూ.416 కోట్ల నుంచి రూ.780 కోట్లకు పెరిగిన ప్యాకేజీ–3 అంచనాలు
ఆమోదించిన మంత్రివర్గం
రూ.148 కోట్లతో ఘన్‌పూర్ ప్రధాన కాల్వ లైనింగ్‌కు ఓకే
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం 1.41 టీఎంసీలకు కుదింపు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–3 కింద నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్ మధ్య 8.32 కి.మీ.ల ఓపెన్ కాల్వ నిర్మాణం పనుల అంచనాల పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. అంచనాలను రూ.416.1 కోట్ల నుంచి రూ.780.63 కోట్లకు సవరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్‌ఎస్ ఘన్‌పూర్ రిజర్వాయర్ ప్రధాన కాల్వను 12.65– 31.2 కి.మీ.ల మధ్య రూ.148.76 కోట్ల అంచనాలతో లైనింగ్ చేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
రూ.153 కోట్లతో రొల్లవాగు చెరువు సామర్థ్యం పెంపు పనులకు కూడా ఓకే చెప్పింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గిస్తూ, ఆ మేరకు రూ.574.56 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చింది.
గతంలో ఈ పనులను రూ.860.25 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనపర అనుమతులివ్వగా, రిజర్వాయర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. తొలుత ఈ రిజర్వాయర్‌ను 9.8 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించగా, ఆ తర్వాత 4.8 టీఎంసీలకు, తాజాగా 1.41 టీఎంసీలకు తగ్గించారు.
సీతారామపై మంత్రుల మధ్య సంవాదం !
సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనాలు సవరించే అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య సంవాదం జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,324 కోట్లకు పెంచాలనే ప్రతిపాదనలపై వాడీవేడి చర్చ జరిగింది. దీంతో ఈ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించకుండా, రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనకు పంపాలని నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో దీనిని రాజీవ్‌సాగర్/ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా ప్రతిపాదించగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేసిందంటూ ఓ మంత్రి తప్పుబట్టినట్టు తెలిసింది. 67.5 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 3.89 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన నేపథ్యంలో మళ్లీ పాత పథకాల ప్రస్తావన అనవసరమని మరో మంత్రి బదులిచ్చినట్టు సమాచారం.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘంలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ నుంచి అనుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని, మళ్లీ పాత ప్రాజెక్టులను తెరపైకి తెచ్చి సమస్యను జటిలం చేయవద్దంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రూ.7,926.14 కోట్ల అంచనాలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 2016 ఫిబ్రవరి 18న గత ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, 2018లో అంచనాలను రూ.13,057 కోట్లకు పెంచింది.