సాగర్ కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు
అనేకచోట్ల దెబ్బతిన్నలైనింగ్.. కొన్నిచోట్లగండ్లు..
మైనర్ కాల్వలతో పాటు మేజర్ కాల్వలదీ అదే దుస్థితి
వానాకాలానికి ముందు ఓఅండ్‌ఎం పనుల్లో నిర్లక్ష్యం
కొన్ని కాల్వలకు ఏళ్ల తరబడి కొరవడిన మరమ్మతులు
బలహీనంగా ఉన్న కట్టలు.. సామర్థ్యం మేరకు విడుదల కాని నీరు
చివరి ఆయకట్టులో వేలాది ఎకరాలకు అందని నీళ్లు..
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో రైతుల అవస్థలు
పక్కనే కాల్వ ఉన్నా బోర్లు, బావులు ఆధారంగా సాగు
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.
ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.
సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఉమ్మడి నల్లగొండలో..
నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్‌కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.
జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి.
ఓఅండ్‌ఎం పనులు అంతంతే..
ఏటా వానాకాలం సీజన్‌కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్‌ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్‌ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.
నారుమడి ఎండిపోయేలా ఉంది
కాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లా
చెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదు
లింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్‌నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా
గత ఏడాది రూ.50 వేల నష్టం
మాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment