సారంపల్లిలో కౌలు రైతు పర్శరాములుతో మాట్లాడుతున్న కేటీఆర్
రైతులను పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
మంత్రులు పొలాల దిక్కు చూడలేదు
15–20 లక్షల ఎకరాలు ఎండాయి
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు
సారంపల్లిలో ఎండిన పొలాలను పరిశీలించిన కేటీఆర్
సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు, నాలుగు నెలలుగా ఎక్కే విమానం.. దిగే విమానం అంటూ.. ఢిల్లీకి జాతరలు.. యాత్రలు చేస్తున్నాడే తప్ప రైతుల బాధలు చూడట్లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో నీరు లేక ఎండిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పొలాలు నీరు లేక ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కానీ, మంత్రులు కానీ పొలాల దిక్కు చూసిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో కాళేశ్వరంపై, కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను రిపేరు చేయకుండా.. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా పొలాలను ఎండబెట్టారని ఆరోపించారు.
గతంలో గోదావరి నీళ్లను ఎత్తిపోసి కాల్వల ద్వారా చెరువులు నింపి పొలాలు ఎండిపోకుండా కేసీఆర్ చూసుకున్నారని గుర్తు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. సారంపల్లిలో పొలాలను చూస్తుంటే.. మేతకు తప్ప కోతకు పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి అప్పులు కడతారా.. చస్తారా.. అన్నట్లుగా వేధిస్తున్నారని ఆరోపించారు.
కాంట్రాక్టర్ల ఖజానా నింపుతున్నారు
యాసంగి సీజన్‌లో రైతుబంధుకు రూ.7వేల కోట్లు సిద్ధం చేస్తే.. రైతులకు ఇవ్వకుండా ఆ నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తూ వాళ్ల ఖజానా నింపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయోజనాల కోసం రైతులను గోసపెడుతోందన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, రైతుల పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అడ్డుకాకుండా ఈసీకి లేఖ రాసి రుణమాఫీని ప్రకటించాలన్నారు.
రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇవ్వాలని, పంటలు ఎండిన రైతులను, కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు ఇచ్చిందని, ఇప్పుడు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల్లో ధైర్యం నింపి వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పొలాలను సందర్శించాలని కేసీఆర్ నిర్ణయించారని వివరించారు. నిరుడు చెరువుల్లోకి కాల్వనీరు వచ్చి పొలం పారిందని, ఈసారి పది ఎకరాల్లో వరి వేస్తే మొత్తం ఎండిపోయిందని కేటీఆర్‌కు పర్శరాములు అనే కౌలు రైతు చెప్పారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment