దిగుబడి లేని రంగాపూర్ బత్తాయి రకం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.60 కోట్ల నష్టం
తిరుపతి ఉద్యాన వర్సిటీ నుంచే తెచ్చామంటున్న బత్తాయి రైతులు
రైతుల ఫిర్యాదు... నివేదికలతో అధికారుల సరి
నల్లగొండ రూరల్/గుర్రంపోడు/ తిప్పర్తి/నిడమనూరు: రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలతో రైతులు నిండా మునిగారు. పూత, కాత బాగానే ఉన్నా, కాయ సైజు పెరగలేదు. పైగా నిమ్మకాయల సైజులో ఉండగానే పసుపు రంగులోకి మారి రాలిపోయాయి. తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి బత్తాయిలో రంగాపూర్ రకం మొక్కలు తీసుకొచ్చి సాగు చేసిన సుమారు 200 మంది రైతులు రూ.60 కోట్ల మేర నష్టపోయారు. దీంతో కొందరు రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఉద్యాన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు నివేదికను ఆశాఖకు పంపించారు.
శాస్త్రవేత్తల ప్రచారంతో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు సాగుచేసిన జంబేరి మొక్కలు అతివృష్టి, అనావృష్టి, వాతావరణ పరిస్థితుల కారణంగా క్షీణిన్నాయి. అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశో«ధనా కేంద్రాల్లో లభించే రంగాపూర్ వేరు మూలంపై అంటుగట్టిన సాత్‌గుడి రకం బత్తాయి మొక్కలు నాటుకోవాలని ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి, మహానంది, పెట్లూరు, రైల్వే కోడూరు, మల్లేపల్లి పరిశోధన కేంద్రాల్లోని అంటు మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
2014 నుంచి..
తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన రైతులు రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలు తీసుకురావడం 2014లో మొదలైంది. సాధారణంగా ఐదునుంచి ఆరు సంవత్సరాలలోపు కాతకు వచ్చి దిగుబడి ఇస్తాయి. కానీ రంగాపూర్ వెరైటీ బత్తాయి మాత్రం కాపు వచ్చినా, కాయలు, రంగుమారి, రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. తాము నష్టపోవడానికి మొక్కల నాణ్యత లోపాలే కారణమని గుర్రంపోడు, నల్లగొండ, తిప్పర్తి, నిడమనూరు, కనగల్ మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో ఈ రకం సాగు చేసిన సుమారు 70 మంది రైతులు నిర్ధారణకు వచ్చి ఈనెల 11న రాష్ట్ర ఉద్యాన కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
నాసిరకం మొక్కల విషయమై నాగాపూర్ శాస్త్రవేత్తలతో శాస్త్రీయ పరిశోధన చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై నల్లగొండ కలెక్టర్ ఉద్యాన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ70 మంది రైతులు రూ.21కోట్ల మేర నష్టపోయారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఉద్యానశాఖకు నివేదిక సమర్పించారు. చాలామంది రైతులు ఇప్పటికే తోటలు తొలగించగా, బిల్లులు లేని కారణంగా ఫిర్యాదు చేయని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎకరానికి రూ.6లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గుర్రం శ్రీనివాస్‌రెడ్డి. ఈయనది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మగూడెం. 2019లో తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 700 రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలను తీసుకొచ్చి ఐదు ఎకరాల్లో నాటాడు. మొక్కలకు రూ.49వేలు, గుంతలు తీసి నాటినందుకు రూ.50వేలు ఖర్చు చేశాడు.
మొక్కలు నాటినప్పటి నుంచి ఎకరానికి ఏడాదికి రూ.80వేల చొప్పున నిర్వహణ ఖర్చులయ్యాయి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటించడంతోపాటు ఉద్యాన వన అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ రెండు నుంచి రెండున్నర టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గతనెల 27న తిçరుపతి వర్సిటీ నుంచి వచ్చిన ఈ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం శాంపిల్స్ సేకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఇతడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన రైతు చిర్ర భూపాల్‌రెడ్డి. రంగాపూర్ బత్తాయి వెరైటీ అధిక దిగుబడులు, చీడపీడలనుంచి తట్టుకుంటుందని ఎనిమిది ఎకరాల్లో సాగుచేశాడు. ఆరున్నర సంవత్సరాలు గడిచినా నేటికి దిగుబడి రావడం లేదు. దీంతో మూడు ఎకరాల తోటను తొలగించాడు. ఇప్పటి వరకు రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కాయలు కాస్తున్నా, సైజురాక పసుపురంగులోకి మారి రాలిపోతున్నాయి.
మంచి సైజుకు రాకముందే రాలుతున్నాయి
తిరుపతి పరిశోధన కేంద్రం నుంచి 450 మొక్కలు తెచ్చి 2016లో నాలుగున్నర ఎకరాల్లో నాటాను. ఎనిమిదేళ్లయినా సరైన పూత, కాత రావడం లేదు. 45 నుంచి 50టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 20 టన్నులే వస్తోంది. కాయ సైజు లేకపోగా పక్వానికి రాకముందే రాలిపోతున్నాయి. – కేసాని అనంతరెడ్డి, పిట్టలగూడెం రైతు
దిగుబడి బాగా వస్తుందని చెప్పి
దిగుబడి బాగా వస్తుందని చెప్పి మొక్కలు అంటగట్టారు. నాకున్న మూడున్నర ఎకరాల్లో 380 మొక్కల వరకు నాటాను. మొక్కకు రూ.75 నుంచి రూ.100 వరకు వ్యయం చేసి ఏపీ నుంచి మొక్కలు తెచ్చాను. ఇప్పుడు నాలుగో కాత తెంపాల్సి ఉంది. మొక్కలకు కాయలు అంతంత మాత్రంగానే ఉండడం, కాయ బలంగా రాకపోవడం వల్ల దిగుబడి తగ్గి అనుకున్న విధంగా పెట్టుబడులు రాలేదు. – చిత్రం ప్రసాద్, మారుపాక రైతు
Comments
Please login to add a commentAdd a comment