సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అక్కడ రైతులంతా సంఘటితమయ్యారు. అంతా మాట్లాడుకొని ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. రైతులు పంటలు సాగు చేసే క్రమంలో దుక్కి దున్నడం మొదలుకొని పంట చేతికొచ్చాక లాభసాటిగా అమ్ముకునే వరకు అంతా ప్రయోజనం పొందడమే లక్ష్యంగా ఏర్పాటైన కంపెనీ. దీనికి 2019లోనే అడుగులు పడ్డాయి. పది మందితో మొదలై నేడు 900 మంది సభ్యులకు చేరుకున్న ఆ కంపెనీ ద్వారా ఇప్పుడు రైతులు గణనీయ అభివృద్ధిని సాధిస్తున్నారు. అదే నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్’.
పది మందితో మొదలై..
ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (ఐఆర్‌డీఎస్) సహకారంతో కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామపంచాయతీ పరిధిలోని గంగదేవిగూడెంలో 2019లో కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ కార్యాలయం ఏర్పాటైంది. మొదట్లో పది మంది డైరెక్టర్లుగా ఏర్పడి, ఒక్కొక్కరు 10 మందిని చేరి్పంచగా, మొత్తంగా ముందుకొచ్చిన 500మంది రైతులతో కంపెనీ ప్రారంభమైంది.
నాబార్డు సహకారంతో
కంపెనీలో చేరిన ఒక్కొక్కరు రూ.1000 చొప్పున రూ.5లక్షలు కూడబెట్టి, నాబార్డు నుంచి మరో రూ.5 లక్షలు ఆర్థిక సహకారం పొంది రూ.10 లక్షలతో తమ పని ప్రారంభించారు. పనితీరును చూసి, నాబ్ కిసాన్ మరో రూ.20 లక్షలు మంజూరు చేసింది. దీంతో నిత్యం వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే ట్రాక్టర్, నానో ట్రాక్టర్, బెయిలర్, రోటో వేటర్లు, డ్రమ్ సీడర్, కల్టివేటర్, ఆప్‌వీల్స్, ప్లవ్, విత్తన డ్రిల్‌తో పాటు పిచికారీ చేసే పంపుసెట్లు కొనుగోలు చేశారు.
వాటన్నింటినీ కంపెనీలోని సభ్యులతోపాటు ఇతర రైతులు బయటి కంటే తక్కువ ఖర్చుతో వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. దీనిపై రైతుల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ సభ్యుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 900 మందికి చేరుకున్న కంపెనీ ద్వారా రైతు సేవలు విస్తృతం అయ్యాయి. దీంతో నాబార్డు తన 41వ వార్షికోత్సవంలో దీనికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డును ఇచ్చింది.
అందుబాటులోకి విత్తనాలు
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొని మోసపోకుండా కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం నుంచే తమకు విత్తనాలు అందేలా మాట్లాడుకున్నారు. ఎరువులు, పురుగు మందులను సబ్ డీలర్ల వద్ద కొనుగోలు చేసినా, తరువాత కంపెనీ పేరుతో డీలర్íÙప్ తీసుకొని మార్క్‌ఫెడ్, ఇఫ్‌కో, కోరమాండల్ కంపెనీలనుంచే నేరుగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. విత్తనాలు కూడా కంపెనీల నుంచే నేరుగా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు వస్తుండటంతో వారు లబ్దిపొందుతున్నారు.
ముందుకొచ్చిన దాతలు
రైతుల ఐక్యతను చూసి దాతలు ముందుకొచ్చారు. ముఖ్యసలహాదారుడిగా సేవలు అందిస్తున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి ఎన్‌ఆర్‌లు సహకరించేలా ఒప్పించారు. దీంతో మూడు టన్నుల కెపాసిటీ కలిగిన ఒక ట్రాక్టర్ ట్రాలీ, ఆరు టన్నుల కెపాసిటీ కలిగిన రెండు ట్రాలీలు వారు కంపెనీకి అందజేశారు. ఆ వాహనాలతో రైతులు పండించిన కూరగాయలు, నిమ్మ, బత్తాయి సరుకులను నేరుగా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. రిటైర్డ్ టీచర్ మేరెడ్డి సత్యనారాయణరెడ్డి తన 2.30 ఎకరాల భూమిని కంపెనీకి ఉచితంగా ఇచ్చారు. అందులో ఆర్గానిక్ ఫాంహౌజ్ ఏర్పాటు చేశారు.
ప్రారంభానికి సిద్ధంగా కోల్డ్ స్టోరేజీలు
మార్కెట్‌లో మంచి ధర వచ్చే వరకు నిమ్మ, బత్తాయి తదితర ఉత్పత్తులను నిల్వచేసుకునేలా కోల్డ్ స్టోరేజీ యూనిట్లను (ఒక్కొక్కటి రూ.15 లక్షలతో) జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసింది. ఒక్కోదాంట్లో 10 టన్నులు స్టోర్ చేసే సదుపాయం కల్పించింది. మండంలోని గంగదేవిగూడెంలో 4 (కంపెనీ కార్యాలయం), అయిటిపాముల –1, బొల్లేపల్లి –1, పామనగుండ్ల–1, నకిరేకల్ మండలం మర్రూర్–1, శాలిగౌరారం–1, నార్కట్‌పల్లి–1, దేవరకొండ మండలం–1. చిట్యాల–1 చొప్పుల ఏర్పాటు చేసి వాటిల్లో నిమ్మ ఉత్పత్తులను పెట్టి పరిశీలిస్తోంది. త్వరలోనే వీటిని ప్రారంభించనుంది. విద్యుత్ బిల్లును అధిగమించేలా సోలార్ సిస్టమ్‌తో వీటిని అనుసంధానం చేసింది.
నిమ్మకు గ్రేడింగ్, ధర వచ్చినప్పుడే విక్రయాలు
కట్టంగూర్ మండలంలో ఎక్కువగా నిమ్మకాయలు పండించే రైతులు ఉండటంతో నిమ్మకాయల గ్రేడింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. నాలుగు వేర్వేరు గ్రేడ్లుగా నిమ్మకాయలను విభజిస్తున్నారు. ఆ గ్రేడ్ల ప్రకారం వేర్వేరుగా కోల్డ్ స్టోరేజీ బాక్స్‌ల్లో నిలువ ఉంచి మార్కెట్ ధర వచ్చినప్పుడే అమ్ముకుంటున్నారు. గ్రేడ్ 2, గ్రేడ్–3 రకం నిమ్మకాయలతో నిమ్మ ఒరుగులు తయారు చేసి వాటిని కూడా అమ్ముతున్నారు. నిమ్మకాయలను హైదరాబాద్‌లోని రహేజా, పొలిమేర, విజేత వంటి కంపెనీలకు నేరుగా విక్రయిస్తారు.
ఐక్యంగా ముందుకు..
ఐక్యంగా ముందుకు సాగుతున్నాం. నకిలీ విత్తనాలు, పురుగు మందులతో మోసపోకుండా, దళారులకు çపంటలు అమ్మి నష్టపోకుండా ముందుకు సాగుతున్నాం. అభివృద్ధిని సాధిస్తున్నాం. – చెవుగోని సైదమ్మ, కంపెనీ చైర్మన్
సాగులో ఖర్చు తగ్గించేలా
పంటల సాగులో రైతులకు ఖర్చు తగ్గించేలా కంపెనీ పని చేస్తోంది. పనిముట్లు మార్కెట్ కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి.
– వాడేపల్లి రమేష్, ఐఆర్‌డీఎస్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment