
పలు జిల్లాల్లో వడగళ్ల వాన, ఈదురు గాలులు
దెబ్బతిన్న వరి, మామిడి పంటలు
మార్కెట్లలో కొట్టుకుపోయిన ధాన్యం
నల్లగొండ జిల్లాలో పిడుగు పడి రైతు మృతి
నల్లగొండ/జనగామ రూరల్/వేములపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో ఓ రైతు మరణించాడు. జనగామ, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జనగామ మండలంలోని పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల, గానుగుపహాడ్.. చిల్పూర్ మండలం ఫత్తేపూర్.. జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్.. పాలకుర్తి మండలం వావిలాల, నారబోయినగూడెంలో వరి పంట దెబ్బతింది.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ సెంటర్‌లో సుమారు 20 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకూలాయి. శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొట్టుకుపోయింది.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని అనంతారం, తొండ.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, కోడూరు తదితర గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదెపై పడటంతో అది మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాని పలు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో గోపు సుధాకర్‌రెడ్డి (63) అనే రైతు తన పొలం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.