
యాదాద్రి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌లో వర్షానికి తడిసిన వడ్లను ఎత్తుతున్న మహిళ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత..
చెరువులను తలపించిన రోడ్లు
భారీ వర్షానికి పెచ్చులూడిన చార్మినార్
రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు
నారాయణపూర్‌లో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం
పాలమూరు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి
పలు జిల్లాల్లో నేలరాలిన వడ్లు, మామిడికాయలు
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: ఉపరితల చక్రవాత ఆవర్తనంతో రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై క్రమంగా జల్లులతో మొదలైన వాన... ఆ తర్వాత తీవ్రరూపం దాల్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత చినుకులుగా మొదలై.. పలు ప్రాంతాల్లో కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ తర్వాత నాలాలు పొంగడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.
కీలక రద్దీ సమయంలో భారీ వర్షం కురవడం... రోడ్లు జలమయం కావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓల్డ్‌బోయిన్‌పల్లి–న్యూ బోయిన్‌పల్లి మార్గంలో మోకాలిలోతు వరద చేరడంతో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తుమ్మలబస్తీలోని బల్కాపూర్ నాలాలోని వ్యర్థాలు తీస్తున్న జేసీబీ పూర్తిగా మునిగిపోయింది. సమతానగర్‌లో ఇళ్ల ముందు పార్కు చేసిన కార్లు, బైక్‌లు నీట మునిగాయి.
⇒ రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో గంటల వ్యవధిలోనే జోరుగా పడింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కూడా పడింది.
⇒ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం రాత్రి 8 గంటల నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 9.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ జిల్లా హిమాయత్‌నగర్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో 9.10 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీ సెల్సియస్ మేర తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...ఆదిలాబాద్‌లోనే 39.8 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత కూడా 21.7 డిగ్రీ సెల్సియస్‌గా ఆదిలాబాద్‌లోనే నమోదైంది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదవుతాయని, శనివారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పింది.
పిడుగుపాటుకు నలుగురు మృతి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు మృత్యువాత పడ్డారు.
⇒ నాగర్‌కర్నూల్ జిల్లా పదర శివారులో వ్యవసాయ పనులకు మహిళా కూలీలు వెళ్లారు. వారికి సమీపంలో పిడుగు పడడంతో సుంకరి సైదమ్మ(45) గాజుల వీరమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందారు. సుంకరి లక్ష్మమ్మకు తీవ్ర గాయాలుకాగా, అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
⇒ గద్వాల జిల్లా చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) పొలం వద్ద పశువులు మేపుతుండగా.. పిడుగు పడి మృతి చెందాడు. వడ్డేపల్లి మండలంలోని బుడమర్సకు చెందిన మహేంద్ర(21) తుంగభద్ర తీరంలో గేదెలు మేపుతుండగా.. పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
⇒ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఇశ్రితాబాద్ శివారులో వాన పడుతుండగా, బలరాం లచ్చయ్య జీవాలను చెట్టు కిందకు చేర్చాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో 20 మేకలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో పిడుగు పడి ఆవు, దూడ, కొడంగల్‌లో 25 మేకలు చనిపోయాయి. యాదాద్రి జిల్లా రాజాపేట, వలిగొండ మండలాల్లో పిడుగుపాటుకు ఆవు, పాడి గేదెలు మృతి చెందాయి.
ఈ మినార్ పెచ్చులూడటం రెండోసారి..
చారిత్రక కట్టడమైన చార్మినార్ పైభాగం నుంచి పెచ్చులూడి పడ్డాయి. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్న మినార్ నుంచి మట్టి పెచ్చులూడడంతో అక్కడే ఉన్న పర్యాటకులు, వ్యాపారస్తులు పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పెచ్చులు ఊడి పడడంతో పిడుగు పడిందనుకున్నామని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయ పూజారి సచిన్ తెలిపారు. గతంలో కూడా ఈ మినార్ నుంచి పెచ్చులూడడంతో ఆర్కియాలజీ అధికారులు మరమ్మతులు చేపట్టారు.
అకాల వర్షం...రైతులు ఆగమాగం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాల్లో చేతికొచి్చన మామిడి కాయలు, ధాన్యం నేలరాలింది. మోత్కూరులోని వ్యవసాయ మార్కెట్‌లో, గుండాలలో బండపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. గద్వాల జిల్లా గట్టు మండంలో ఆర బెట్టిన పొగాకు వానకు తడిసింది.
⇒ నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, మెండోరా, ముప్కాల్, వర్ని మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. మెండోరా, ముప్కాల్ మండలాల పరిధిలో కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం, మక్కలు తడిసి పోయాయి. కామారెడ్డి జిల్లాలోని పెద్దకొడప్‌గల్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్, బాన్సువాడ, రామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి తదితర మండలాల్లోని కొన్ని చోట్ల రాళ్ల వర్షం కురిíసి వడ్లు నేలరాలాయి. ఈదురుగాలులతో మక్క నేలవాలింది.
⇒ మహబూబాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో బయట ఉంచిన మిర్చి బస్తాలు వర్షానికి తడిసిముద్దయ్యాయి. రెండు గంటలపాటు వర్షం కురవడంతో రైతులు పడరాని పాట్లు పడ్డారు.