కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదు
రాష్ట్రంలోని దాదాపు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీలకు దిగువనే..
ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు శీతల గాలుల సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రివేళ చలి పెరిగిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ప్రస్తుత సమయంలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దిగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
గరిష్టం నిజామాబాద్ ః 32.4
శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 32.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట అదిలాబాద్‌లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రాష్ట్రంలోని దాదా పు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, మెదక్, హనుమకొండల్లో 3 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదైంది.
అక్కడక్కడా తేలికపాటి వర్షాలు
తాజా పరిస్థితుల్లో కుమ్రుంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉదయం పూట పొగమంచుకు అవకాశం ఉంటుందని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment