సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా నమోదు
ఇటీవలి తుపాను ప్రభావంతో వాతావరణంలో మార్పులే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి.
ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్‌లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment