వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
దాని ప్రభావంతో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్
మిగతా చోట్ల మోస్తరు వానలు పడతాయన్న వాతావరణ శాఖ
రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన సాధారణ ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. ఆరు జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ముసురు వాతావరణంతో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర, మిగతా చోట్ల ఒకట్రెండు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 32.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
రెండు జిల్లాల్లో వానలు డబుల్
నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షాలు సాధారణాన్ని దాటిపోయాయి. సీజన్‌కు సంబంధించి ఇప్పటి (సెపె్టంబర్ 5)వరకు 60.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. 40శాతం అధికంగా 84.72 సెంటీమీటర్లు కురిసింది. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే రెండింతలకుపైగా వర్షాలు కురిసినట్టు తెలంగాణ ప్రణాళిక విభాగం గణాంకాలు చెప్తున్నాయి. వనపర్తి జిల్లాలో 37.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 79.14 సెంటీమీటర్లు, అంటే 114 శాతం అధికంగా వర్షం కురిసింది.
నారాయణపేట జిల్లాలో 37.08 సెం.మీ. సాధారణ వర్షపాతానికిగాను 77.15 సెంటీమీటర్లు (108 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఆరు జిల్లాలు వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో అధిక వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment