పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు
అయితే అతివృష్టి లేదా అనావృష్టి
కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు
వాతావరణ మార్పులతో గతి తప్పిన ఎండ, వానలు
సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం
గణాంకాల్లో భారీ వ్యత్యాసం
ఆగస్టులో అసాధారణ ఉష్ణోగ్రతలు
విద్యుత్ వినియోగం భారీగా పెరిగిన వైనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వాన.. కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్‌లో మాత్రం మండే ఎండ, ఆపై ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్‌పైనో, కారులోనో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించిన వారికి ఈ వింతైన అనుభవం ఎదురవుతోంది. గతంలో ఒకచోట వర్షం పడుతుంటే ఆ పక్కనున్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు.
వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతోనే ఒక్కసారిగా అతివృష్టి, లేకుంటే తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని, జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్
ప్రపంచంలోని పర్యావరణ నిపుణులు గొంతెత్తి చెబుతున్న ఒకేఒక్క మాట ‘ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’. సీజన్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పుడు పర్యావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ, వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్‌లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం నమోదవుతూ వస్తోంది.
ఉదాహరణకు అదిలాబాద్‌లో ప్రస్తుత సీజన్‌లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీ సెల్సీయస్ నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం ఏకంగా 34.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీ సెల్సీయస్ కాగా..సోమవారం 34.6 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. రామగుండంలో 31.1 డిగ్రీ సెల్సీయస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతకు గాను 34.2 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది.
ఈ మూడు ప్రాంతాల్లోనూ సోమవారం నాడు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వాటికి తీవ్ర ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో 49.62 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం నాటికి 56.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
రాష్ట్ర సగటును పరిశీలిస్తే సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలే గణాంకాలను గణనీయంగా పెంచేశాయన్న మాట. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఈ అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే కొన్నిచోట్ల అతి తక్కువ వర్షాలు లేదా అసలు వర్షమే లేకపోగా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయన్న మాట. వాతావరణంలోనూ ఇదే తరహా భిన్నమైన పరిస్థితులు నెలకొంటుండటం గమనార్హం.
పట్టణీకరణ పేరిట వనరుల విధ్వంసం
పట్టణీకరణ పేరిట ఇప్పుడు వనరుల విధ్వంసం విపరీతంగా పెరుగుతోంది. పట్టణీకరణ వల్ల నీటివనరులు పెద్దయెత్తున ఆక్రమణలకు గురవుతుండగా.. చెట్లు, పుట్టలను ఇష్టారాజ్యంగా తెగనరికేస్తున్నారు. మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ప్రారంభమై ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెంది అంతకంతకకూ విస్తరిస్తున్నా.. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు వందలాది చెరువులతో కళకళలాడిన హైదరాబాద్, ఇప్పుడు నీటి సమస్యతో సతమతమవుతోందని, చెరువులు కబ్జాల పాలుకావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వనరులు కబ్జాలపాలు కావడంతో నీటి ప్రవాహం దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయని, చివరకు నిల్వ చేయాల్సిన నీరు సముద్రం పాలుకావడంతో నీటి సమతుల్యత దెబ్బతింటోందని వివరిస్తున్నారు.
అదేవిధంగా ఓపెన్ స్పేస్ నిబంధనలు గాలికొదిలి అనేక అంతస్తులతో భారీ నిర్మాణాలు చేపట్టడం, విచ్చలవిడి లేఅవుట్‌లతో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఓపెన్ స్పేస్ ఏరియా ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కడాన్ని గుర్తు చేస్తున్నారు.
పెరగని సాగు విస్తీర్ణం
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోతతో కూడిన విభిన్న వాతావరణం నెలకొనడం పంటల సాగుపైనా ప్రభావం చూపించింది. వానాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ సీజన్‌లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. ఈ నెల 14వ తేదీ వరకు 1.03 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయాల్సి ఉంది. కానీ 94 లక్షల ఎకరాల మేర మాత్రమే పంటలు సాగవడం గమనార్హం.
నీటి వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి
హైదరాబాద్ లాంటి నగరానికి అతి త్వరలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న చెరువులు ఇప్పుడు వందల్లోకి పడిపోయాయి. నీటి నిల్వలకు కేంద్రంగా ఉండే చెరువుల సంఖ్య తగ్గిపోతుండగా కాలువలన్నీ కబ్జాలపాలవుతున్నాయి. ఉదాహరణకు ఫిరంగిరనాలా అనే కాలువతో శివారు ప్రాంతాల్లోని 22 చెరువులు నీటితో నిండేవి.
కానీ ఈ నాలా కబ్జాకు గురైంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ నాలాను పునరుద్ధరిస్తే దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతాయి. అదేవిధంగా నగరంలో ఉన్న చెరువులు, ప్రధాన కాలువలను పునరుద్ధరించి పరిరక్షిస్తే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది.
– ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త
సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం...
నగరీకరణలో అత్యంత కీలకం సమగ్ర ప్రణాళిక. కానీ ఇప్పుడు కేవలం కట్టడాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉంది. అడ్డగోలు కట్టడాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారడం తప్ప మెరుగైన జీవావరణం ఏవిధంగా సాధ్యమవుతుంది. అందకే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు హైదనాబాద్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలి.
– సుబ్బారావు, పర్యావరణ నిపుణులు
వర్షాకాలంలోనూ ఎండ వేడిమి...
పగటిపూటే కాకుండా రాత్రిళ్లు కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో ఏసీలు, కూల ర్లను రోజంతా వాడక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఆదివారం (ఆగస్టు 18న) 273.665 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా.. గతేడాది ఇదే రోజున 254.123 మిలియన్ యూనిట్ల వినియోగమే నమోదు కావడం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 17 వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment