Precipitation
-
కుండపోత.. ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వాన.. కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్‌లో మాత్రం మండే ఎండ, ఆపై ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్‌పైనో, కారులోనో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించిన వారికి ఈ వింతైన అనుభవం ఎదురవుతోంది. గతంలో ఒకచోట వర్షం పడుతుంటే ఆ పక్కనున్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతోనే ఒక్కసారిగా అతివృష్టి, లేకుంటే తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని, జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రపంచంలోని పర్యావరణ నిపుణులు గొంతెత్తి చెబుతున్న ఒకేఒక్క మాట ‘ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’. సీజన్‌కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పుడు పర్యావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ, వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం నమోదవుతూ వస్తోంది. ఉదాహరణకు అదిలాబాద్‌లో ప్రస్తుత సీజన్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీ సెల్సీయస్ నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం ఏకంగా 34.3 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీ సెల్సీయస్ కాగా..సోమవారం 34.6 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. రామగుండంలో 31.1 డిగ్రీ సెల్సీయస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతకు గాను 34.2 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ సోమవారం నాడు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వాటికి తీవ్ర ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 49.62 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం నాటికి 56.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర సగటును పరిశీలిస్తే సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలే గణాంకాలను గణనీయంగా పెంచేశాయన్న మాట. ఉమ్మడి మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఈ అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే కొన్నిచోట్ల అతి తక్కువ వర్షాలు లేదా అసలు వర్షమే లేకపోగా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయన్న మాట. వాతావరణంలోనూ ఇదే తరహా భిన్నమైన పరిస్థితులు నెలకొంటుండటం గమనార్హం. పట్టణీకరణ పేరిట వనరుల విధ్వంసం పట్టణీకరణ పేరిట ఇప్పుడు వనరుల విధ్వంసం విపరీతంగా పెరుగుతోంది. పట్టణీకరణ వల్ల నీటివనరులు పెద్దయెత్తున ఆక్రమణలకు గురవుతుండగా.. చెట్లు, పుట్టలను ఇష్టారాజ్యంగా తెగనరికేస్తున్నారు. మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ప్రారంభమై ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెంది అంతకంతకకూ విస్తరిస్తున్నా.. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వందలాది చెరువులతో కళకళలాడిన హైదరాబాద్, ఇప్పుడు నీటి సమస్యతో సతమతమవుతోందని, చెరువులు కబ్జాల పాలుకావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వనరులు కబ్జాలపాలు కావడంతో నీటి ప్రవాహం దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయని, చివరకు నిల్వ చేయాల్సిన నీరు సముద్రం పాలుకావడంతో నీటి సమతుల్యత దెబ్బతింటోందని వివరిస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ స్పేస్ నిబంధనలు గాలికొదిలి అనేక అంతస్తులతో భారీ నిర్మాణాలు చేపట్టడం, విచ్చలవిడి లేఅవుట్లతో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఓపెన్ స్పేస్ ఏరియా ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కడాన్ని గుర్తు చేస్తున్నారు. పెరగని సాగు విస్తీర్ణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోతతో కూడిన విభిన్న వాతావరణం నెలకొనడం పంటల సాగుపైనా ప్రభావం చూపించింది. వానాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. ఈ నెల 14వ తేదీ వరకు 1.03 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయాల్సి ఉంది. కానీ 94 లక్షల ఎకరాల మేర మాత్రమే పంటలు సాగవడం గమనార్హం. నీటి వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి హైదరాబాద్ లాంటి నగరానికి అతి త్వరలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న చెరువులు ఇప్పుడు వందల్లోకి పడిపోయాయి. నీటి నిల్వలకు కేంద్రంగా ఉండే చెరువుల సంఖ్య తగ్గిపోతుండగా కాలువలన్నీ కబ్జాలపాలవుతున్నాయి. ఉదాహరణకు ఫిరంగిరనాలా అనే కాలువతో శివారు ప్రాంతాల్లోని 22 చెరువులు నీటితో నిండేవి. కానీ ఈ నాలా కబ్జాకు గురైంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ నాలాను పునరుద్ధరిస్తే దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతాయి. అదేవిధంగా నగరంలో ఉన్న చెరువులు, ప్రధాన కాలువలను పునరుద్ధరించి పరిరక్షిస్తే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. – ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం... నగరీకరణలో అత్యంత కీలకం సమగ్ర ప్రణాళిక. కానీ ఇప్పుడు కేవలం కట్టడాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉంది. అడ్డగోలు కట్టడాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారడం తప్ప మెరుగైన జీవావరణం ఏవిధంగా సాధ్యమవుతుంది. అందకే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు హైదనాబాద్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలి. – సుబ్బారావు, పర్యావరణ నిపుణులు వర్షాకాలంలోనూ ఎండ వేడిమి...పగటిపూటే కాకుండా రాత్రిళ్లు కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో ఏసీలు, కూల ర్లను రోజంతా వాడక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఆదివారం (ఆగస్టు 18న) 273.665 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా.. గతేడాది ఇదే రోజున 254.123 మిలియన్ యూనిట్ల వినియోగమే నమోదు కావడం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 17 వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం. -
సెగలు.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. -
ఆనాటి కాలం.. వడగాడ్పులు తీవ్రం
సాక్షి, అమరావతి: దేశంలో వడగాడ్పుల తీవ్రత, మరణాలపై గడిచిన తొమ్మిదేళ్లకు సంబంధించి ఇటీవల కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. 2015 నుంచి 2023 వరకు రాష్ట్రాల వారీగా లెక్కలను ఆ నివేదికలో వెల్లడించింది. సంవత్సరాల వారీగా చూస్తే 2015 నుంచి 2019 వరకు వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్‌లో 2,418 మంది మరణించారు. 2015లోనే అత్యధికంగా ఏపీలో 1,422 మంది మరణించినట్లు నివేదిక పేర్కొంది. ఇక 2020 నుంచి 2023 వరకు మన రాష్ట్రంలో వడగాడ్పులకు ఐదుగురు మరణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. మన రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావం తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి వేసవి గాలులపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు, సాంకేతిక సహకారం అందిస్తోంది. ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలను పంపించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. వడగాడ్పులకు చికిత్స ద్వారా సంబంధిత మరణాలను తగ్గించడానికి మౌలిక సదుపాయాలను 28 రాష్ట్రాల్లో కల్పించినట్లు తెలిపింది. భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలను ముందస్తుగా జారీ చేస్తుందని, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చని నివేదిక పేర్కొంది. -
కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?
వాన.. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే, అది ఎక్కువైనా నష్టమే.. తక్కువైనా కష్టమే.. ఎక్కువగా కురిస్తే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు.. తక్కువగా పడితే కరువు, కాటకాలు. గతవారం రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు నీట మునిగి, జనం ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో మొన్నటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. పది రోజుల క్రితం 54శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరింది.ఈ సంగతి అలా ఉంచితే.. మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న వాన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చూద్దామా? చినుకు ఎలా ఉంటుందంటే.. సాధారణంగా వర్షపు చినుకులు బిందువుల మాదిరిగా ఉంటాయనుకుంటాం. కానీ అవి బన్ ఆకారంలో ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసార్ధం కలిగిన చినుకులు గోళాకారంలో ఉంటాయి. కాస్త పెద్ద చినుకులు హాంబర్గ్ బన్‌లా ఉంటాయి. అదే 4.5 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కంటే పెద్ద చినుకులు పారాచూట్ తరహాలో మారి చిన్నచిన్న చినుకులుగా కింద పడతాయి. నిమిషంలో31.2 మిల్లీమీటర్ల వర్షం.. ఒక్క నిమిషంలో అత్యధికంగా కురిసిన వర్షం ఎంతో తెలుసా? 31.2 మిల్లీమీటర్లు. 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లోని యూనియన్విల్లేలో ఇది నమోదైంది. ఇక 1966 జనవరి 7 నుంచి మరుసటి రోజు వరకు 24 గంటల్లో కురిసిన 1825 మిల్లీమీటర్ల వర్షమే ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం. అదే మనదేశంలో అయితే.. మేఘాలయలోని మౌసిన్రామ్లో 2022 జూన్ 17న 1003.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది. మేఘాలయలోని చిరపుంజిలో 1860 నుంచి 1861 వరకు 365 రోజుల వ్యవధిలో కురిసిన 1,042 అంగుళాల (26,470 మిల్లీమీటర్లు) వర్షమే ఇప్పటివరకు ఉన్న మరో రికార్డు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 24 గంటల్లో నమోదైన 649.8 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం. ఒక్క చినుకూ చూడని ప్రదేశం.. భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రై వ్యాలీస్. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. ఇక చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి సగటున 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే దాదాపు లేనట్టేనన్నమాట. ప్రతి చుక్కా కిందకు పడదు.. వర్షపు చినుకు అన్ని సార్లూ భూమిని చేరదు. కొన్ని సందర్భాల్లో అవి భూమిపై పడకుండానే మాయమైపోతాయి. గాలి వేడిగా ఉన్నచోట్ల అక్కడే ఆవిరైపోతాయి. ఇలా భూమిని చేరకుండానే ఆవిరైపోయిన వర్షపు చినుకును విర్గా అంటారు. వర్షానికి వాసన ఉంటుందా? వర్షం వాసన భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండవు. అయితే, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మట్టి వాసన వస్తుంది. ఇది నేల తేమ నుంచి వెలువడుతుంది. వర్షం నుంచి వచ్చే సువాసనను పెట్రిచోర్ అంటారు. 14 మైళ్ల వేగం.. 2 నిమిషాలు.. ఒక్క వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి సగటున దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మేఘాల నుంచి వర్షపు చినుకులు పడే ఎత్తును బట్టి ఇది మారుతూ ఉంటుంది. వర్షపు చినుకులు గంటకు 14 మైళ్ల వేగంతో భూమి మీదకు పడతాయి. పెద్ద చినుకులైతే 20 మైళ్ల వేగంతో వస్తాయి. వర్షపు నీటిలోనూ విటమిన్.. వర్షపు నీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా ఉండే అనేక సూక్ష్మజీవులు విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు నీరు గాలిలోకి రాగానే ఈ సూక్ష్మజీవులు అందులో చిక్కుకుని విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. కనురెప్ప కంటే తక్కువ బరువు.. సగటు వర్షపు చినుకు బరువు కేవలం 0.001 ఔన్సులు (0.034 గ్రాములు). అంటే మన కనురెప్ప కంటే తక్కువ బరువు అన్నమాట. -
ముంచేను రావోను
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తిరుపతి, తిరుమల, సత్యవేడు, నగరి, చిత్తూరు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులతో కూడిన వానతో మామిడి రైతులు నష్టపోయారు. వాతావరణం చల్లబడడంతో ఉక్కపోతతో అల్లాడిన జనానికి ఊరట లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలు పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన జడివాన బుధవారం ఉదయానికి భారీ వర్షంగా మారింది. సాయంత్రం వరకూ పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి, తిరుమల, సత్యవేడు, నగరి, చిత్తూరు పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. తిరుపతి: నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల జిల్లాలోని 61 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సత్యవేడులో అత్యధికంగా 132, వరదయ్యపాళెంలో 109, బీఎన్ కండ్రిగలో 98, నారాయణవనంలో 85, పిచ్చాటూరు, తిరుపతిల్లో 66, 49 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలోని 5 మండలాల్లో భారీ వర్షం, 9 మండలాల్లో మోస్తరు వర్షం, 29 మండలాల్లో సాధారణ, 16 మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. శ్రీవారి ఆలయంలోనికి వర్షపునీరు ప్రవేశించింది. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు దగ్గరుండి విద్యుత్ మోటార్లతో వర్షపునీటిని బయటకు మళ్లించే పనులను పర్యవేక్షించారు. ముందుగానే గదులు అడ్వాన్సు బుకింగ్ చేసుకుని తిరుమల కొండకు చేరిన భ క్తులు దర్శన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా తిరుమల చేరే కాలినడక భక్తులు కూడా వర్షం వల్ల ఇక్కట్లు పడ్డారు. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని మామిడి, సపోటా రైతులు నష్టపోయారు. పీలేరు, కాణిపాకం, పూతలపట్టు, నగరి, చంద్రగిరి, పలమనేరు, మదనపల్లి, చిత్తూరు, కుప్పం, సత్యవేడు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాపు మీదున్న పండ్లు గాలుల తాకి డికి వేలల్లో నేలరాలాయి. అదేవిధంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమాటా రైతులు కూడా వర్షం దెబ్బకు దిగాలు పడ్డారు. కోసిన టమాటా మార్కెట్‌కు తరలించే సమయంలో వర్షం రావడం వల్ల పండ్లు దెబ్బతిన్నాయని మదనపల్లి రైతులు వాపోయారు. ఇక్కడికి సమీపంలోని తంబళ్లపల్లి, పీలేరు, పూతలపట్టు ప్రాంతాల్లో బోర్ల కింద సాగులో ఉన్న వరి పంట కోతకొచ్చింది. కోసిన పనమోపులు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. కూల్...కూల్ వర్షం వల్ల జిల్లా మొత్తం ఉక్కపోత నుంచి బయటపడింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 30కి పడిపోయాయి. దీంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ నెల 16వ తేదీ వరకూ జిల్లా విద్యుత్ వాడకం 15.516 మిలియన్ యూనిట్లు కాగా, 17న ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు మొదలు కావడంతో 11.832 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. 24గంటల్లో 35 లక్షల యూనిట్ల వాడకం తగ్గింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో అత్యంత భారీగా విద్యుత్ వాడకం తగ్గిన జిల్లా ఇదే. -
ఎండ సెగ.. మేనిగనిగ
బ్యూటిప్స్ వేసవిలో ఉక్కపోతకు పొట్టి, స్లీవ్‌లెస్, ట్యాంక్ టాప్స్ దుస్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి స్టైల్‌గానూ ఉంటాయి. అయితే, వీటి వల్ల ఎండకు చర్మం ట్యాన్ అవుతుందని భయపడుతుంటారు. ఈ సమస్య దరిచే రకుండా ఉండాలంటే... వేసవిలో చర్మసంరక్షణ జాబితాలో సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఎస్.పి.ఎఫ్ 40 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను పగటి వేళలో బయటకు వెళ్లడానికి 15-30 నిమిషాల ముందు రాసుకోవాలి. దీని వల్ల సూర్యకాంతి నేరుగా శరీరం మీద పడటం వల్ల కలిగే హాని శాతం తగ్గుతుంది. {పతిరోజూ పగటి వేళలో కనీసం 15-20 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అప్పుడే చర్మం తన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ను కోల్పోదు, త్వరగా పొడిబారదు. ఈతకొట్టేటప్పుడు నీటిలో క్లోరినేటెడ్ శాతం అధికంగా ఉంటే చర్మం, జుట్టు పొడిబారతుంది. అందుకని ఈత కొట్టిన తర్వాత తప్పనిసరిగా మంచినీళ్లతో స్నానం చేయాలి.పగటి వేళలో 3-4 సార్లు ఎలాంటి క్లెన్సర్లు వాడకుండా కేవలం నీటితోనే ముఖాన్ని, చేతులను, పాదాలను శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి డీ-హైడ్రేషన్ సమస్య తలెత్తదు. జిడ్డు చర్మం అయితే స్వేదగ్రంధులు ఈ కాలం మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటప్పుడు ఔషధమూలికలతో తయారైన ఫేస్‌ప్యాక్‌లతో చర్మసౌందర్యాన్ని కాపాడుకోవాలి. పగటి వేళ సూర్యకిరణాల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకని ఈ టైమ్‌లో వీలైనంతవరకు (ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు) బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు. మేకప్ వేసుకునేవారు మినరల్ మేకప్‌ని వాడటం మేలు. లేత రంగులు, చర్మానికి తగినంత చమట పట్టేలా ఉండే సౌందర్య ఉత్పత్తులను వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు, టోపీ తప్పనిసరిగా ఉపయోగిస్తే 70 శాతం ఎండతాకిడి వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చు. -
మళ్లీ మంట!
తోడవుతున్న ఉక్కపోత అల్లాడిపోతున్న జనం విశాఖపట్నం: ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకునే రోజులివి. ఎడతెరపి లేకుండా ఎడాపెడా వానలు కుమ్మరించే కాలమిది. సూర్యుడు ముఖం చూడాలంటే నాలుగైదు రోజులు పట్టే సమయమిది. కానీ మండు వేసవిలా మండిపోతోంది. తెల్లారింది మొదలు పొద్దుగుంకే దాకా ఒక్కటే వేడి. మే నెలను తలపిస్తూ ఎండలు ఇరగదీస్తున్నాయి. రోజు రోజుకూ ఉధృతరూపం దాలుస్తూ దడ పుట్టిస్తున్నాయి. వడగాడ్పులు కాకపోయినా అంతటి తీవ్రతను చూపుతున్నాయి. విశాఖలో కొన్నాళ్లుగా అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సాధారణంకంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదు కావాలి. కానీ నాలుగు డిగ్రీలు అధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతోంది. ఫలితంగా జనం వేసవి కాలంలో మాదిరిగా ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఒక్క ఉష్ణతీవ్రతే కాదు.. దానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. గాలిలో తేమ 60 శాతం వరకూ ఉంటే జనానికి కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ దాదాపు 75 శాతం ఉంటోంది. ఈశాన్య, తూర్పు గాలులు అంతగా వీయడం లేదు. తేమ గాలిలో కలవడం లేదు. ఫలితంగా ఉక్కపోత అధికంగా ఉంటోంది. అక్టోబర్‌లో వేసవిని తలపించే వాతావరణం మునుపెన్నడూ నెలకొనలేదని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఈశాన్య, తూర్పు గాలులు ఊపందుకునే వరకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా ఉపరితల ఆవర్తనమో లేక అల్పపీడనమో ఏర్పడే దాకా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన వివరించారు. -
ఉడుకే ఉడుకు..
38 డిగ్రీల నమోదు వారంలో ఇదే అధికం కొనసాగుతున్న ఉష్ణతాపం విశాఖపట్నం: ఎండ పగబట్టినట్టుగా కాస్తోంది. ఏకధాటిగా సెగలు కక్కుతోంది. రోజురోజుకు ఉష్ణతీవ్రత పెంచుకుంటూ పోతోంది. వారం రోజులుగా జనాన్ని బెం బేలెత్తిస్తున్న భానుడు శుక్రవారం మరింత భగభగలాడాడు. దీంతో విశాఖలో 38 (37.8) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణంకంటే ఇది 5 డిగ్రీలు అధికం. వారం రోజుల్లో ఇదే అత్యధికం కావడం మరో విశేషం. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఒకపక్క ఆకాశంలో మేఘాలున్నా నిప్పులు కురిసిన అనుభూతే కలిగింది. అదే మబ్బులు లేకుండా ఉంటే ఇంకెంతటి వేడిని వెదజల్లి ఉండేదోనంటూ జనం నిట్టూర్చారు. వేడిగాలులు, ఉష్ణతీవ్రతకు జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. దీనికి ఉక్కపోత కూడా తోడయింది. రోజంతా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడప్పుడూ గాలులు వీస్తున్నా ఉక్కపోత వల్ల వచ్చే చెమటను నియంత్రించలేకపోయాయి. బంగాళాఖాతంలో ఆవర్తనమో, అల్పపీడనమో వచ్చి ఉడుకు తగ్గిస్తేనే తప్ప ఉపశమనం కలిగే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడో, రేపో అది అల్పపీడనంగా మారనుంది. అదే జరిగితే ఉత్తరాంధ్రలో వాతావరణాన్ని చల్లబరచి తేలికపాటి వానలు కురిసే వీలుంది. ఇప్పుడు విశాఖ వాసులంతా ఎంత త్వరగా ఉష్ణతీవ్రత తగ్గుతుందా? అని కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు. వారంలో నమోదైన ఉష్ణోగ్రతలు తేది ఉష్ణోగ్రత (డిగ్రీలలో) 12.07.15 34.8 13.07.15 36.6 14.07.15 36.8 15.07.15 36.8 16.07.15 36.6 17.07.15 37.8 -
వర్షంతో పెరిగిన ఉక్కపోత
సాక్షి, ముంబై: నగరంలో రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షంవల్ల ముంబైకర్లు హైరానా పడుతున్నారు. ఒకపక్క చలి పత్తాలేకుండా పోయింది. మరోపక్క ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు. కాని రెండు రోజులుగా ఆకాశమంత మబ్బులు కమ్ముకుని ఉండడంతో వాతావరణం చల్లబడి చలి వేస్తుండవచ్చని అందరూ భావించారు. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చలి వేయకపోగా ఉక్కపోత మాత్రం రెట్టింపు అయింది. శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. రోడ్లన్నీ బురదగా, జారుడుగా మారాయి. వర్షా కాలం ముగిసి దాదాపు నెల రోజులు కావస్తోన్నా ఇంతవరకు చలి పత్తాలేకుండా పోయింది. ఉక్కపోత కారణంగా ఇళ్లలో, కార్యాలయాల్లో ఫ్యాన్లు, ఏసీలు యథాతథంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి తోటల్లో పూత నేల రాలడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. మామిడితోపాటు పత్తి, కందిపప్పు, బత్తాయి, ఉల్లి, ద్రాక్ష పంటలకు నష్టం వాటిల్లగా, మరికొన్ని పంటలకు మేలు జరిగింది. నాసిక్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ద్రాక్ష, ఉల్లి, దానిమ్మ తోటలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈదురు గాలులవల్ల పండ్ల తోటలకు దాదాపు రూ.మూడు కోట్ల మేర నష్టం చేకూరిందని రైతులు చెబుతున్నారు. షోలాపూర్ గ్రామీణ ప్రాంతాల్లో నేలలో నాటిన జొన్న, ఉల్లి, వెల్లుల్లి విత్తనాలు గాలికి చెల్లాచెదురయ్యాయి. దీంతో రైతులు నేలను మళ్లీ సాగుచేసి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పంటలకు ఈ అకాల వర్షాలు వరంగా పరిణమించాయని రైతులు చెబుతున్నారు.