సాక్షి, ముంబై: నగరంలో రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షంవల్ల ముంబైకర్లు హైరానా పడుతున్నారు. ఒకపక్క చలి పత్తాలేకుండా పోయింది. మరోపక్క ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు. కాని రెండు రోజులుగా ఆకాశమంత మబ్బులు కమ్ముకుని ఉండడంతో వాతావరణం చల్లబడి చలి వేస్తుండవచ్చని అందరూ భావించారు. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చలి వేయకపోగా ఉక్కపోత మాత్రం రెట్టింపు అయింది.
శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. రోడ్లన్నీ బురదగా, జారుడుగా మారాయి. వర్షా కాలం ముగిసి దాదాపు నెల రోజులు కావస్తోన్నా ఇంతవరకు చలి పత్తాలేకుండా పోయింది. ఉక్కపోత కారణంగా ఇళ్లలో, కార్యాలయాల్లో ఫ్యాన్లు, ఏసీలు యథాతథంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ముఖ్యంగా మామిడి తోటల్లో పూత నేల రాలడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. మామిడితోపాటు పత్తి, కందిపప్పు, బత్తాయి, ఉల్లి, ద్రాక్ష పంటలకు నష్టం వాటిల్లగా, మరికొన్ని పంటలకు మేలు జరిగింది. నాసిక్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ద్రాక్ష, ఉల్లి, దానిమ్మ తోటలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈదురు గాలులవల్ల పండ్ల తోటలకు దాదాపు రూ.మూడు కోట్ల మేర నష్టం చేకూరిందని రైతులు చెబుతున్నారు. షోలాపూర్ గ్రామీణ ప్రాంతాల్లో నేలలో నాటిన జొన్న, ఉల్లి, వెల్లుల్లి విత్తనాలు గాలికి చెల్లాచెదురయ్యాయి. దీంతో రైతులు నేలను మళ్లీ సాగుచేసి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పంటలకు ఈ అకాల వర్షాలు వరంగా పరిణమించాయని రైతులు చెబుతున్నారు.
వర్షంతో పెరిగిన ఉక్కపోత
Published Sat, Nov 15 2014 10:58 PM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement