ఖమ్మం, న్యూస్‌లైన్: గత మూడు రోజులుగా కురిసిన అకాలవర్షంతో జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల మేరకు పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా. అయితే వ్యవసాయశాఖాధికారులు మాత్రం కొండంత నష్టం జరిగితే గోరంత అంచనాలను చూపుతూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 1900 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని అధికారులు నిర్ధారించడం విడ్డూరమని, పంటనష్టం అంచనా వేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు మరోసారి వంచనకు పాల్పడుతున్నారని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి.
నష్టం కోట్లల్లో...
జిల్లా వ్యాప్తంగా వరిపనుగులు, ధాన్యం, మిర్చి, మామిడి, బొప్పాయి, కూరగాయలు, మొక్కజొన్న, వేరుశన, పసుపు మొదలైన పంటలు నీటి మునిగి రూ. 30 కోట్ల మేరకు నష్టం జరిగిందని రైతుసంఘాలు అంచనా వేస్తున్నాయి.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో రెండు వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వరి ధాన్యం, మిర్చి, పత్తి, మొక్కజొన్నలు తడిసి పోయాయి.
కొత్తగూడెం మండల పరిధిలో చేతికందే దశలో ఉన్న వరి నేలవాలింది. వేపలగడ్డ ప్రాంతంలో వరి నూర్పిడి చేసి బస్తాల్లో నింపి పెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. సింగభూపాలెం చెరువులో మత్స్యకారులు వేసిన చేపలు , మత్స్యకారుల వలలు, తెప్పలు, అలుగువల తదితర సామాన్లు సైతం కొట్టుకుపోయాయి. పాల్వంచ మండలంలోని సోములగూడెం, కరకవాగు, పునుకుల, సూర్యతండ, పూసలతండ, సూరారం, కోడిపుంజులవాగు తదితర గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాల్లో కోసి ఆరబోసిన వరిపంట కొంత తడిసింది.
పినపాక నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల పంట తడిసింది.
పాలేరు నియోజకవర్గంలో వరి,మిర్చి,పసుపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు 5వేల ఎకరాల్లో వేసిన వరి పంట ఎక్కువగా కల్లాల్లోనే తడిసిపోయింది. వరి,మిర్చి,పసుపు పంటలకు కలిపి రూ.4కోట్లు నష్టం వాటిల్ల వచ్చని అంచనా.
ఇల్లెందు నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాలకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. బయ్యారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 100 ఎకరాలలో పండించిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. గార్ల మార్కెట్‌యార్డ్‌లో రైతులు ఆరబోసుకున్న సుమారు 2000 క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, మిర్చి నీటిలో తడిసిపోయాయి.
వైరా నియోజకవర్గంలో 8వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిని సుమారు రూ. 2కోట్ల విలువ చేసే నష్టం జరిగింది.
సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు మండలాల్లో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న కంకులు తడిసిపోయాయి. సదాశివునిపాలెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. వివిధ గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యంపై పట్టాలు కప్పినప్పటికీ వర్షపునీరు ఎక్కువగా చేరటంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. నియోజకవర్గంలో సుమారు 4వేల ఎకరాలకు చెందిన వరి, మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
అశ్వారావుపేట మండలంలో మామిడి, పామాయిల్, నిమ్మ, సపోటా తోటలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు వేర్లతో సహా పడిపోయాయి. ముల్కలపల్లి మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి. ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి.
కొండంత నష్టానికి గోరంత అంచనాలు..
అకాలవర్షానికి జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు కనబతున్నా వ్యవసాయ అధికారుల లెక్కలు వేరుగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 948 మంది రైతులకు చెందిన 571 హెక్టార్లలోవరి, 88 హెక్టార్లలో మొక్కజొన్న, 150 ఎకరాల మామిడి, 100 ఎకరాల బొప్పాయి మాత్రమే పంటనష్టం జరిగిందని చెప్పి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ నష్టం అంచనాలు వేయడంలో ప్రభుత్వ నిబంధనలు సాకుగా చెబుతున్నారు.
నష్టం జరిగిన ప్రతీ రైతుకు పరిహారం ఇవ్వాలి: రైతు సంఘాలు
కుండ పోతవర్షం, గాలి దుమారంతో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 30కోట్లకు పైగా పంటనష్టం జరిగిందని ఏపీ రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఏలూరి కోటేశ్వర్‌రావు పేర్కొన్నారు. మొక్కుబడి అంచనాలతో అధికారులు సరిపెట్టకుండా పంటనష్టం జరిగిన ప్రతిరైతు కుటుంబాన్ని అదుకోవాలని డిమాండ్ చేశారు. పరిహారం అందించడంతోపాటు తడిసిన ధాన్యం, రంగుమారిన మిర్చి, పసుపు, మొక్కజొన్నలను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, ఖరీఫ్ సీజన్‌కు ఉచితంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందచేయాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు చేసేందుకు సిద్ధమే అని హెచ్చరించారు.
భారీ నష్టం
Published Sun, May 11 2014 2:48 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement