మళ్లీ మంట!
తోడవుతున్న ఉక్కపోత
అల్లాడిపోతున్న జనం
విశాఖపట్నం: ఆకాశం నిండా కారుమబ్బులు కమ్ముకునే రోజులివి. ఎడతెరపి లేకుండా ఎడాపెడా వానలు కుమ్మరించే కాలమిది. సూర్యుడు ముఖం చూడాలంటే నాలుగైదు రోజులు పట్టే సమయమిది. కానీ మండు వేసవిలా మండిపోతోంది. తెల్లారింది మొదలు పొద్దుగుంకే దాకా ఒక్కటే వేడి. మే నెలను తలపిస్తూ ఎండలు ఇరగదీస్తున్నాయి. రోజు రోజుకూ ఉధృతరూపం దాలుస్తూ దడ పుట్టిస్తున్నాయి. వడగాడ్పులు కాకపోయినా అంతటి తీవ్రతను చూపుతున్నాయి. విశాఖలో కొన్నాళ్లుగా అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సాధారణంకంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదు కావాలి. కానీ నాలుగు డిగ్రీలు అధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతోంది. ఫలితంగా జనం వేసవి కాలంలో మాదిరిగా ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.
ఒక్క ఉష్ణతీవ్రతే కాదు.. దానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. గాలిలో తేమ 60 శాతం వరకూ ఉంటే జనానికి కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ దాదాపు 75 శాతం ఉంటోంది. ఈశాన్య, తూర్పు గాలులు అంతగా వీయడం లేదు. తేమ గాలిలో కలవడం లేదు. ఫలితంగా ఉక్కపోత అధికంగా ఉంటోంది. అక్టోబర్‌లో వేసవిని తలపించే వాతావరణం మునుపెన్నడూ నెలకొనలేదని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఈశాన్య, తూర్పు గాలులు ఊపందుకునే వరకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా ఉపరితల ఆవర్తనమో లేక అల్పపీడనమో ఏర్పడే దాకా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన వివరించారు.