2024లో భయపెట్టిన వేసవి
3–4 సెల్సియస్ డిగ్రీలు అధికం
అక్టోబరులోనూ అనూహ్య వేడిమి
బనశంకరి: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా 2024 ఎండాకాలంలో వేడిమి నమోదైంది. ఏప్రిల్, మే మాసాల్లో రాష్ట్రంలో సరాసరి ఉష్ణోగ్రత కంటే 3–4 సెల్సియస్ డిగ్రీలు పెరిగి ప్రజలు అల్లాడిపోయారు. గత ఐదేళ్లలో ఉష్ణోగ్రతలను గమనిస్తే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే మాసాలలో, అలాగే అక్టోబరులో ఎండలు ఎక్కువని తేలింది. కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక ప్రాంతాల్లో కనబడుతున్న అధిక ఎండలతో అక్కడి ప్రజలు హైరానా పడుతున్నారు. బెళగావి, బాగల్‌కోటే, ధారవాడ, హావేరి, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో సరాసరి ఉష్ణోగ్రత 3– 4 డిగ్రీలు సెల్సియస్ పెరిగింది. దీంతో రాబోయే వేసవిని తలచుకుని భయపడాల్సి వస్తోంది.
ఈ జిల్లాల్లో హడల్
బాగల్‌కోటే, బెళగావి, బీదర్, ధారవాడ, గదగ, కొప్పళ, హావేరి, హాసన్, కలబుర్గి, ఉత్తర కన్నడ, కొడగు, మంగళూరు, రాయచూరు, విజయపుర జిల్లాల్లో గత అక్టోబరులో 30 డిగ్రీలు సెల్సియస్ కంటే ఎక్కువ తాపమానం ఏర్పడింది. బెంగళూరులో 29 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. వర్షంతో పాటు వేడి కూడా పెరిగింది. అక్టోబరులో ఇంత వేడి రావడం వాతావరణ నిపుణులను కూడా విస్మయపరచింది. ఇక బెంగళూరులో వేసవిలో అనేక ప్రాంతాల్లో చుక్క నీటికి కటకటలాడారు.
అక్టోబరులో ఎందుకలా?
సెప్టెంబరులో వర్షం పడకపోతే నేలలో తేమ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బెంగళూరు కేంద్ర వాతావరణశాఖ డైరెక్టర్ సీఎస్ పాటిల్ తెలిపారు. ఎల్‌నినో, లానినో ప్రభావాల వల్ల అధిక ఎండలు, ఆకస్మిక వరదలు సంభవిస్తున్నట్లు చెప్పారు. వాతావరణానికి అనుగుణంగా ఈ ఏడాది వానలు కురవలేదని, అనూహ్యంగా అక్టోబరులో ఉష్ణోగ్రతలు పెరిగాయని ధార్వాడ అగ్రి యూనివర్శిటీ వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రవిపాటిల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment