ఉధృతమవుతున్న వడగాడ్పులు
నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీలు నమోదు
మే 3వ తేదీ తర్వాత మరింత తీవ్రం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment