వాన.. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యం. అయితే, అది ఎక్కువైనా నష్టమే.. తక్కువైనా కష్టమే.. ఎక్కువగా కురిస్తే కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు.. తక్కువగా పడితే కరువు, కాటకాలు. గతవారం రాష్ట్రంలో వానలు దంచి కొట్టాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు నీట మునిగి, జనం ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో మొన్నటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పది రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. పది రోజుల క్రితం 54శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరింది.ఈ సంగతి అలా ఉంచితే.. మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్న వాన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చూద్దామా?
చినుకు ఎలా ఉంటుందంటే..
సాధారణంగా వర్షపు చినుకులు బిందువుల మాదిరిగా ఉంటాయనుకుంటాం. కానీ అవి బన్ ఆకారంలో ఉంటాయి. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ వ్యాసార్ధం కలిగిన చినుకులు
గోళాకారంలో ఉంటాయి. కాస్త పెద్ద చినుకులు హాంబర్గ్ బన్‌లా ఉంటాయి. అదే 4.5 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కంటే పెద్ద చినుకులు పారాచూట్ తరహాలో మారి చిన్నచిన్న
చినుకులుగా కింద పడతాయి.
నిమిషంలో31.2 మిల్లీమీటర్ల వర్షం..
ఒక్క నిమిషంలో అత్యధికంగా కురిసిన వర్షం ఎంతో తెలుసా? 31.2 మిల్లీమీటర్లు. 1956 జూలై 4న అమెరికా మేరీల్యాండ్‌లోని యూనియన్‌విల్లేలో ఇది నమోదైంది. ఇక 1966 జనవరి 7 నుంచి మరుసటి రోజు వరకు 24 గంటల్లో కురిసిన 1825 మిల్లీమీటర్ల వర్షమే ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం. అదే మనదేశంలో అయితే.. మేఘాలయలోని మౌసిన్రామ్‌లో 2022 జూన్ 17న 1003.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది.
మేఘాలయలోని చిరపుంజిలో 1860 నుంచి 1861 వరకు 365 రోజుల వ్యవధిలో కురిసిన 1,042 అంగుళాల (26,470 మిల్లీమీటర్లు) వర్షమే ఇప్పటివరకు ఉన్న మరో రికార్డు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 24 గంటల్లో నమోదైన 649.8 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం.
ఒక్క చినుకూ చూడని ప్రదేశం..
భూమిపై అస్సలు వర్షమే పడని ప్రాంతం అంటార్కిటికాలోని మెక్ ముర్డో డ్రై వ్యాలీస్. ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇప్పటి వరకు ఒక్క వర్షపు చినుకు కూడా చూడలేదు. ఇక చిలీలోని అటకామా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి సగటున 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే దాదాపు లేనట్టేనన్నమాట.
ప్రతి చుక్కా కిందకు పడదు..
వర్షపు చినుకు అన్ని సార్లూ భూమిని చేరదు. కొన్ని సందర్భాల్లో అవి భూమిపై పడకుండానే మాయమైపోతాయి. గాలి వేడిగా ఉన్నచోట్ల అక్కడే ఆవిరైపోతాయి. ఇలా భూమిని చేరకుండానే ఆవిరైపోయిన వర్షపు చినుకును విర్గా అంటారు.
వర్షానికి వాసన ఉంటుందా?
వర్షం వాసన భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి స్వచ్ఛమైన నీటికి రంగు, వాసన ఉండవు. అయితే, వర్షం పడటం ప్రారంభమైనప్పుడు మట్టి వాసన వస్తుంది. ఇది నేల తేమ నుంచి వెలువడుతుంది. వర్షం నుంచి వచ్చే సువాసనను పెట్రిచోర్ అంటారు.
14 మైళ్ల వేగం.. 2 నిమిషాలు..
ఒక్క వర్షపు చుక్క భూమిని చేరుకోవడానికి సగటున దాదాపు 2 నిమిషాలు పడుతుంది. మేఘాల నుంచి వర్షపు చినుకులు పడే ఎత్తును బట్టి ఇది మారుతూ ఉంటుంది. వర్షపు చినుకులు గంటకు 14 మైళ్ల వేగంతో భూమి మీదకు పడతాయి. పెద్ద చినుకులైతే 20 మైళ్ల వేగంతో వస్తాయి.
వర్షపు నీటిలోనూ విటమిన్..
వర్షపు నీటిలో విటమిన్ బీ12 ఉంటుంది. ప్రకృతిలో సహజంగా ఉండే అనేక సూక్ష్మజీవులు విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు నీరు గాలిలోకి రాగానే ఈ సూక్ష్మజీవులు అందులో చిక్కుకుని విటమిన్ బీ12ను ఉత్పత్తి చేస్తాయి.
కనురెప్ప కంటే తక్కువ బరువు..
సగటు వర్షపు చినుకు బరువు కేవలం 0.001 ఔన్సులు (0.034 గ్రాములు). అంటే మన కనురెప్ప కంటే తక్కువ బరువు అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment