సాక్షి, అమరావతి: ఈ నైరుతి సీజన్‌లో వర్షాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఆగస్టులో వర్షాభావం నెలకొనడంతో సీజన్ మొత్తం ప్రభావితమవుతుందనే ఆందోళన నెలకొంది. కానీ గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోటు వర్షపాతం దాదాపు భర్తీ అయినట్లేనని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, ఆగస్టులో 55 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
సాధారణంగా జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 96 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సివుండగా 66 మిల్లీమీటర్లు నమోదైంది. 31 శాతం లోటు ఏర్పడింది. జూలై నెలలో 159 మిల్లీమీటర్లకు 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ నెలలో 10 శాతం అధిక వర్షాలు కురిశాయి. ఇక ఆగస్టు నెలలో మాత్రం 165 మిల్లీమీటర్లకు 74 మిల్లీమీటర్లే వర్షం కురిసింది. 55 శాతం లోటు ఏర్పడటంతో ఈ సీజన్‌లో వర్షాభావంతో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి.
ఈ నెలలో వర్షాలు
ఈ నెలంతా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులు మారి లానినా పరిస్థితులతో దేశంలో నైరుతి రుతుపవనాల ద్రోణి చురుగ్గా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీంతో ఈ నెలలో సమృద్ధిగా వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అల్పపీడనంతో వారంపాటు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రమంతా భారీ వర్షాలు కురిశాయి. ఒకటి నుంచి 7వ తేదీ వరకు 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సివుండగా 63 మిల్లీమీటర్ల వర్షం పడింది. 89 శాతం అదనపు వర్షం కురిసింది. దీంతో ఆగస్టులో ఏర్పడిన లోటు భర్తీ అయింది. మొత్తం జూన్ నుంచి ఇప్పటి వరకు 453 మిల్లీమీటర్ల సగటు వర్షం పడాల్సివుండగా ఇప్పటివరకు 378 మిల్లీమీటర్లు పడింది.
కేవలం 16 శాతం మాత్రమే తగ్గింది. 20 శాతం లోపు లోటు అయితే దాన్ని సాధారణంగానే పరిగణిస్తారు. మొత్తం ఈ సీజన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధిక వర్షం కురిసింది. కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, నెల్లూరు, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మాత్రం లోటు నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment