ముంచేను రావోను
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తిరుపతి, తిరుమల, సత్యవేడు, నగరి, చిత్తూరు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులతో కూడిన వానతో మామిడి రైతులు నష్టపోయారు. వాతావరణం చల్లబడడంతో ఉక్కపోతతో అల్లాడిన జనానికి ఊరట లభించింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలు పడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన జడివాన బుధవారం ఉదయానికి భారీ వర్షంగా మారింది. సాయంత్రం వరకూ పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి, తిరుమల, సత్యవేడు, నగరి, చిత్తూరు పట్టణాల్లో జనజీవనం స్తంభించింది.
తిరుపతి: నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల జిల్లాలోని 61 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సత్యవేడులో అత్యధికంగా 132, వరదయ్యపాళెంలో 109, బీఎన్ కండ్రిగలో 98, నారాయణవనంలో 85, పిచ్చాటూరు, తిరుపతిల్లో 66, 49 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలోని 5 మండలాల్లో భారీ వర్షం, 9 మండలాల్లో మోస్తరు వర్షం, 29 మండలాల్లో సాధారణ, 16 మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. శ్రీవారి ఆలయంలోనికి వర్షపునీరు ప్రవేశించింది. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు దగ్గరుండి విద్యుత్ మోటార్లతో వర్షపునీటిని బయటకు మళ్లించే పనులను పర్యవేక్షించారు. ముందుగానే గదులు అడ్వాన్సు బుకింగ్ చేసుకుని తిరుమల కొండకు చేరిన భ క్తులు దర్శన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా తిరుమల చేరే కాలినడక భక్తులు కూడా వర్షం వల్ల ఇక్కట్లు పడ్డారు.
ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల జిల్లాలోని మామిడి, సపోటా రైతులు నష్టపోయారు. పీలేరు, కాణిపాకం, పూతలపట్టు, నగరి, చంద్రగిరి, పలమనేరు, మదనపల్లి, చిత్తూరు, కుప్పం, సత్యవేడు ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులు ఇబ్బందులు పడ్డారు. కాపు మీదున్న పండ్లు గాలుల తాకి డికి వేలల్లో నేలరాలాయి. అదేవిధంగా మదనపల్లి పరిసర ప్రాంతాల్లో టమాటా రైతులు కూడా వర్షం దెబ్బకు దిగాలు పడ్డారు. కోసిన టమాటా మార్కెట్‌కు తరలించే సమయంలో వర్షం రావడం వల్ల పండ్లు దెబ్బతిన్నాయని మదనపల్లి రైతులు వాపోయారు. ఇక్కడికి సమీపంలోని తంబళ్లపల్లి, పీలేరు, పూతలపట్టు ప్రాంతాల్లో బోర్ల కింద సాగులో ఉన్న వరి పంట కోతకొచ్చింది. కోసిన పనమోపులు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి.
కూల్...కూల్
వర్షం వల్ల జిల్లా మొత్తం ఉక్కపోత నుంచి బయటపడింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 30కి పడిపోయాయి. దీంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఈ నెల 16వ తేదీ వరకూ జిల్లా విద్యుత్ వాడకం 15.516 మిలియన్ యూనిట్లు కాగా, 17న ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు మొదలు కావడంతో 11.832 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. 24గంటల్లో 35 లక్షల యూనిట్ల వాడకం తగ్గింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో అత్యంత భారీగా విద్యుత్ వాడకం తగ్గిన జిల్లా ఇదే.