వర్షానికి నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ , సిరిసిల్ల జిల్లా వల్లంపట్లలో కురిసిన వడగండ్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/సిద్దిపేటరూరల్/సిరిసిల్ల: సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శనివారం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వడగండ్లు కురవడంతో సిద్దిపేట జిల్లా రైతాంగం ఉలిక్కిపడింది. జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. అనేక ప్రాంతా ల్లో వర్షం వల్ల చాలా వరకు పంట నష్టం జరిగినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరితో పాటు జిల్లాలో 5000 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. అసలే మామిడి పూత, కాయలు సరిగ్గా లేక రైతులు దిగాలు చెందుతుండగా.. అకాల వర్షాలకు వారంతా ఆందోళన చెందుతున్నారు.
సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం 4 గంటల తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఆ వెంటనే ఈదురుగాలులతో కూడిన వడగండ్లవాన కురిసింది. ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్, బోయినపల్లితోపాటు వేములవాడ పట్టణంలో వడగండ్లు పడ్డాయి. వీటిధాటికి పొట్టదశకు చేరిన వరి పాక్షికంగా దెబ్బతిన్నదని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మామిడి పూత, కాయలు రాలినట్లు రైతులు తెలిపారు.
అకాల వర్షంతో అపార నష్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకాలవర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని యాచారం మండలంలో పిడుగుపాటుతో 13 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి బీమ్లానాయక్ స్పృహతప్పిపోయాడు. ఇబ్రహీంపట్నంలోని ప్రగతినగర్, కుమ్మరికుంటల్లో ఇళ్లలోకి నీరు వచ్చింది. దీంతోపాటు మాడ్గుల మండలంలో సుమారు గంటపాటు వడగళ్లవానకు పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగింది.
Comments
Please login to add a commentAdd a comment