Hailstone
-
మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది?
శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంటుంది. ఈ మంచును ముట్టుకున్నప్పుడు ఎంతో సున్నితంగా ఉంటుంది. తాకగానే మంచి మెత్తని పూలను తాకిన అనుభూతినిస్తుంది. ఇదేవిధంగా వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో వడగళ్లు పడుతుంటాయి. అవి ఎంతో గట్టిగా రాళ్లలా ఉంటాయి. వెంటనే కరిగిపోవు. ఒకే ఆకాశం నుంచి పడే మంచు మృదువుగా, వడగళ్లు గట్టిగా ఎందుకు ఉంటాయి. దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతుంది?మంచు ఎందుకు కురుస్తుంది?చలికాలంలో రాత్రి వేళ భూమి అధికంగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమంగా వాతావరణపు పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి మరింత చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. వాటికి దుమ్ము, ధూళి లాంటి అతి చిన్న కణాలు ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనినే పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనిపిస్తుంది. చలికాలంలో భూమి అధికంగా చల్లబడడం వలన నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులుగా కనిపిస్తాయి.వడగళ్లు ఎలా ఏర్పడతాయంటే..మేఘాల్లో ఉండే నీరు వాతావరణ మార్పులకు కరిగి భూమిపై పడడాన్నే వర్షం అని అంటారు. సాధారణంగా మేఘాల్లోని నీరు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సూపర్ కూల్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇది చిన్న చిన్న మంచు ముక్కలుగా మారి వర్షంగా కురుస్తుంది. అయితే ఆ మంచు ముక్కలు నేలను చేరుకునే సరికి గాలి తాకిడికి నీరుగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ మంచు ముక్కలు గట్టిగా తయారై వడగళ్లుగా వర్షంతో పాటు కిందకు పడతాయి.ఎక్కువ ఎత్తులో ఉంటూ బలమైన ఉరుములతో కూడిన మేఘాలు వర్షించినప్పుడు మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా కింది నుంచి గాలి పైకి ఒత్తిడి తెచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ముక్కలు కింద పడకుండా తిరిగి మేఘాలపైకి వెళ్తాయి. ఈ క్రమంలో ఆ మంచు ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవడంతో మరికొన్ని మంచు ముక్కలు దగ్గరగా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య జరుగుతున్న కొద్దీ మంచు ముక్కలు ఇంకా పెద్దవిగా రూపాంతరం చెందుతుంటాయి. వీటినే మనం వడగళ్లు అని అంటాం. మేఘం నుంచి వర్షం కురిసేటప్పుడు కొన్ని వడగళ్లు మధ్యలోనే కరుగుతాయి. పెద్ద మంచు ముక్కలు మాత్రం కరగకముందే నేలను చేరుతుంటాయి. వాతావరణ పరిస్థితుల్లో నిలకడ లేనప్పుడు ఇలాంటి వడగళ్ల వానలకు అవకాశం ఉంటుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం
-
గాలివానతో కకావికలం
సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షానికి జనం అతలాకుతలమయ్యారు. బలమైన ఈదురుగాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా అనేక గ్రామాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి, వరి, కూరగాయల పంటలు నేలపాలయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో రాళ్లవాన బీభత్సం అధికంగా ఉంది. ఈ రెండు మండలాల పరిధిలోనే 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా. ఈదురు గాలులకు తీగలు తెగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. మామిడి తోటలూ దెబ్బతిన్నాయి. అలాగే.. జగిత్యాల, రాయికల్, కొడిమ్యాల, మేడిపెల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. పొలాల్లో ఉన్న వరి గింజలు రాలిపోయి తాలు మిగిలింది. మల్యాలలోని కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన వరదతో ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్, కౌటాల మండలం సాండ్‌గాం, కుంబారి గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో వడగండ్లు భారీగా పడ్డాయి. కొత్తపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.కందుకూరు మండలంలో పౌల్ట్రీఫాం రేకులు లేచిపోయాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి, చౌటుప్పల్, మోటకొండూరు మండలాల్లో గాలివానతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ సమీపంలో పౌల్ట్రీషెడ్డు కుప్పకూలడంతో కోళ్లు మృతి చెందాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మందవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోకేశ్వరం చెరువులో రెండేళ్ల తర్వాత నీళ్లు వచ్చాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాగారం కొనుగోలు కేంద్రంలోని 300 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. 500 ఎకరాల్లో వరిపంట నేల కొరగగా మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ములుగు జిల్లా గోవిందరావుపేటలో రెండు గంటలకు పైగా గాలిదుమారం రావడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
‘రైతాంగాన్ని ఆదుకోవాలి’
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి(దేవరకొండ) : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని.. ఆదుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి మండలంలో దెబ్బతిన్న వరి చేనును సోమవారం ఆయన పరిశీలించారు. మండలంలోని బాలాజీనగర్, అంగడిపేట గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి పొలాలను రైతులతో కలిసి కలియతిరిగారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకొని వారికి మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోతే కనీసం సీఎం కేసీఆర్ స్పందించలేదని పేర్కొన్నారు. రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు చెప్పుకోవడం తప్పితే రైతులకు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోని పక్షంలో మహారాష్ట్ర తరహా ఉద్యమం చేస్తా మని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టిం చి పంట పండించిన అన్నదాతపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూ డడం తగదన్నారు. రాబోయేది కాంగ్రెస్ పాలన అని కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు జగన్‌లాల్‌నాయక్,బిల్యానాయక్, కిషన్‌నాయక్, వడ్లపల్లి చంద్రారెడ్డి, కర్నాటి రవికుమార్, కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అర్వపల్లి నర్సింహ, భాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
వడగండ్ల వానతో రైతుల బెంబేలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/సిద్దిపేటరూరల్/సిరిసిల్ల: సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శనివారం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వడగండ్లు కురవడంతో సిద్దిపేట జిల్లా రైతాంగం ఉలిక్కిపడింది. జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. అనేక ప్రాంతా ల్లో వర్షం వల్ల చాలా వరకు పంట నష్టం జరిగినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరితో పాటు జిల్లాలో 5000 హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. అసలే మామిడి పూత, కాయలు సరిగ్గా లేక రైతులు దిగాలు చెందుతుండగా.. అకాల వర్షాలకు వారంతా ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం 4 గంటల తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. ఆ వెంటనే ఈదురుగాలులతో కూడిన వడగండ్లవాన కురిసింది. ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్, బోయినపల్లితోపాటు వేములవాడ పట్టణంలో వడగండ్లు పడ్డాయి. వీటిధాటికి పొట్టదశకు చేరిన వరి పాక్షికంగా దెబ్బతిన్నదని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మామిడి పూత, కాయలు రాలినట్లు రైతులు తెలిపారు. అకాల వర్షంతో అపార నష్టం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అకాలవర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని యాచారం మండలంలో పిడుగుపాటుతో 13 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి బీమ్లానాయక్ స్పృహతప్పిపోయాడు. ఇబ్రహీంపట్నంలోని ప్రగతినగర్, కుమ్మరికుంటల్లో ఇళ్లలోకి నీరు వచ్చింది. దీంతోపాటు మాడ్గుల మండలంలో సుమారు గంటపాటు వడగళ్లవానకు పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగింది. -
నేరేడు
నేరేడు హిస్టరీ: నేరేడును ఇంగ్లిషులో జావా ప్లమ్, బ్లాక్ ప్లమ్, జాంబుల్, ఇండియన్ బ్లాక్‌బెర్రీ... అని రకరకాల పేర్లతో పిలుస్తారు. తమిళంలో నాగపళం అని, మలయాళంలో నవల్ఫలం అని అంటారు. నేరేడు శాస్త్రీయనామం ‘సిజీజియ్ క్యుమినీ’. దక్షిణాసియా దేశాలలో నేరేడు ఉనికి ప్రాచీన కాలం నుంచీ ఉన్నప్పటికీ అగ్రరాజ్యమైన యూఎస్‌కు మాత్రం 1911లో మాత్రమే పరిచయమైంది. వర్షరుతువులో వాన పడుతుంది. మామూలే. వర్షరుతువు రాకుండా కూడా వాన పడుతుంది. కానీ వానగా పడదు. వడగండ్లుగా పడుతుంది. అచ్చంగా వాన మాత్రమే కురవాలంటే వర్షరుతువు ప్రవేశించాల్సిందే. అప్పుడు కూడా వడగండ్లు పడతాయి! కానీ ఆకాశం నుంచి కాదు. నేరేడు చెట్ల నుంచి... నల్లటి వడగండ్ల లాంటి పండ్లు రాలిపడతాయి. ఆషాఢం వరకు ఆకాశంలో నల్లటి మేఘాలతో పోటీ పడుతూ... నేల కింద బుట్టల నిండా నల్లటి నేరేళ్లు నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. చిటపట చినుకుల్లో మొక్కజొన్నపొత్తులదేనా రాజ్యం? కొద్దిగా వగరు, కొద్దిగా తీపి కలిసిన మృదువైన నేరేడును నాలుకపై వేసుకుని అంగిటతో ఒత్తగానే ఏ కొత్త రాజ్యంలోకో వచ్చిపడినట్లు ఉండదూ!! రాజ్యం కాదు కానీ, ఒకప్పుడు మనకు ఇలాంటి రాజ్యం లాంటి ద్వీపమే ఉందేది. దాని పేరు జంబూ ద్వీపం. జంబూ వృక్షాలు ఎక్కువగా ఉండడంతో జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. జంబూ వృక్షం అంటే నేరేడు చెట్టు. జంబూ ఫలం అంటే నేరేడు పండు. దేవనాగర భాషలోని అర్థం ఇది. జంబూ ద్వీపం: ఏ పూజ చేసినా ముందు మహాసంకల్పం చెప్పుకుంటాం. అంటే భగవంతుడికి మన వేర్ అబౌట్స్ని నివేదించుకుంటాం. ఏ రాజ్యంలో, ఏ దిక్కున ఉన్నామో! ఆ మహాసంకల్పంలో ‘జంబూ ద్వీపే భరతవర్షే, భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే’ అంటూ జంబూ ద్వీప ప్రస్తావన వస్తుంది. అలా... నేరేడు లేని పూజ లేదు. పూజా ఫలమూ లేదు. అందుకే నేరేడు దేవతాఫలం అయింది. అందుకు మాత్రమేనా! శ్రీరామ చంద్రుడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం ఉన్నప్పుడు నేరేడు పండ్లతోనే కడుపు నింపుకున్నారట. అందుక్కూడా నేరేడు దైవఫలం అయింది. అంటే దైవం లాంటి ఫలమనీ, దైవం పంపిన ఫలమని కూడా! శతాబ్దాల క్రితం నాటి అతిప్రాచీనమైన జాగ్రఫీ ప్రకారం మన దేశం జంబూనది మధ్యలో ఉండేది. అందుకే మన భూభాగాన్ని పూర్వీకులు జంబూద్వీపం అన్నారు. జంబూనది నేరేడు చెట్ల మధ్యగా ప్రవహించడం వల్ల ఆ నీరు తియ్యగా, మధురంగా ఉండేదని చెప్తారు. ఈ మాటకు సాక్ష్యాధారాలు అవసరం లేదు. చిన్న నేరేడు పండును నోట్లో వేసుకుంటే చాలు. నేరేడు కిరణాలు: నేరేడునదిలో (జంబూనదిలో) ఉండే ఇసుక బంగారమట! ఆ నమ్మకం ఇప్పటికీ ఉంది. కృష్ణానది నేరేడు నది పాయేనట. ఆ మాటను నేటికీ విశ్వసిస్తున్నారు. అందుకే వర్షాలు కురవడం మొదలవగానే కృష్ణానది ఒడ్డున బంగారం కోసం వెతుకులాట కూడా మొదలౌతుంటుంది. నేరేటేటి అసల్ (ఇసుక) అని అల్లసాని పెద్దన కూడా జంబూనది గొప్పదనాన్ని వర్ణించాడు. ఏటి ఒడ్డున ఇసుక సూర్యకిరణాలు సోకగానే బంగారంలో తళతళ మెరుస్తుంది. నేరేళ్లూ అంతే, లేలేత ఎండలో మరింత నల్లగా మెరుస్తాయి. నీలిమేఘచ్ఛాయలో ఉన్నవారిని నేరేడుపండులా ఉన్నాడని నలుపును నేరేడు వర్ణంగా చెప్పేది అందుకే. కింటా కుంటే: అలెక్స్ హేలీ నవల్ ‘రూట్స్’లో కింటా కుంటే... అప్పుడే పుట్టిన తన పసికందును చేతులకు ఎత్తుకుని పండులా ఉన్నాడని సంతోషపడతాడు.అక్కడ పండు అంటే ఆపిల్ కాదు. నేరేడు. ఆ బిడ్డను జాబిల్లి వైపు చూపించి... ‘‘నీ కన్నా అందంగా ఉన్నాడు. నువ్వు పాలిపోయి ఉన్నావు. వీడు పండు వెన్నెల్లా ఉన్నాడు’’ అంటాడు. నేరేడు రూట్స్ (వేర్లు) ఒక దేశానికే పరిమితమై లేవు. భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రధానంగా ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియాలలో పాతుకుని ఉన్నాయి. ఫిలిప్పీన్స్, మయన్మార్, అఫ్ఘనిస్థాన్లలో కూడా నేరేడు చెట్లు విరివిగా కనిపిస్తాయి. పోర్చుగీసు వాళ్లు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరేడు విత్తనాన్ని బ్రెజిల్ తీసుకెళ్లారని, అక్కడి పక్షులు కొన్ని నేరేడును ఇష్టంగా తింటుండంతో అక్కడి నుంచి వేగంగా ఆసియా దేశాలకు పాకిందనీ చెప్తారు. నేరేడు చెట్టు త్వరగా పెరుగుతుంది. ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వందేళ్లకు పైగా జీవిస్తుంది. ఆధ్యాత్మిక ఫలం: నేరేడు పండు శివకేశవులకు ప్రీతిపాత్రమైది అని చెబుతారు. గణపతికి ‘నేరేడు మారేడు నెలవంక మామిడి’ అని పత్రాలను సమర్పిస్తారు. నేరేడు బెరడుతో గుండ్రంగా ఒక చక్రం తయారుచేసి... బావి తవ్వేటప్పడు కింద ముందుగా ఈ చక్రం వేసి ఆ పైన మిగిలిన ఒరలు వేస్తారు. నేరేడు బెరడు నీటిని శుభ్రం చేసి నీటిని తియ్యగా చేస్తుంది. నీళ్లలోని మలినాలను పోగొడుతుంది. నీళల్లో ఉండే వగరు, చేదు పోయి తియ్యగా నీళ్లు మారతాయి. జంబుకేశ్వరంలో పరమశివుడిని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు. ఇది కంచి దగ్గర ఉన్న శివక్షేత్రం. ఇక్కడి శివుడు నేరేడు చెట్టు మొదట్లో వెలిశాడు. జంబూనది ఈశ్వరాకారంగా ఉన్నట్లు చెబుతారు. ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ‘నేరేటి పండ్లును నెలయూటి పండ్లును’ అని వర్ణించాడు. కన్నప్ప ఈ పండ్లను నిత్యం శివుడికి నైవేద్యంగా పెట్టాడని చెబుతాడు ధూర్జటి. అలాగే జంబూఫలాన్ని నీలి వర్ణం ఆధారంగా నారాయణస్వామిగా లేదా వెంక టేశ్వరునిగా వర్ణిస్తారు. పండు ఆకారాన్ని బట్టి అది లింగాకారంలో ఉండటంతో ధూర్జటి శివస్వరూపంగా కొలుస్తాడు. మామిడి తోరణాలు దొరకని చోట నేరేడు తోరణాలు కడతారు. నేరేడు ఇలా భారతీయ ఆత్మలో, దేహంలో కలిసిపోయింది. ఈ వర్షాకాలం వీలైనన్నిసార్లు నేరేడు పండ్లను ఆరగించండి. ఆరోగ్యంగా ఉండండి. ఆధ్యాత్మికంగా పరిపుష్టం కండి. - డా. పురాణపండ వైజయంతి ఔషధగుణాల రేడు... నేరేడు: నేరేడు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండెజబ్బుల్ని నివారిస్తుంది. దంతసమస్యల్ని దూరం చేస్తుంది. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్రన పోషిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కళ్లను ఆరోగ్యంగా, ఎముకల్ని బలంగా ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను సమంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. డయోరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలను మాన్పుతుంది. జీర్ణక్రియను క్రియాశీలం చేస్తుంది. కాలేయం, మూత్ర సంబంధ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. -
వడగండ్లు.. కడగండ్లు
రంగారెడ్డి జిల్లా/ నల్లగొండ: వడగండ్లు రైతన్నకు కడగండ్లు మిగిల్చాయి. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మొయినాబాద్, యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్దఎత్తున వడగండ్లు పడ్డాయి. వరి, కూరగాయలు, మొక్కజొన్న, ఆకుకూరలు, ద్రాక్ష, బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఓ కోళ్లఫాం నేలమట్టమైంది. రాజాపేట మండలంలో మామిడితోటలు దెబ్బతిన్నాయి. తీగజాతి కూరగాయలకు, కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెరువు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో, కళ్లాలలో వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. వడగండ్లు పడడంతో వరిపొలాల్లో ధాన్యం రాలిపోయింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మునుగోడు, చండూరులలో భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు ముగ్గురి మృతి మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం నీటూరు పంచాయతీ పరిధి నర్సాపూర్‌కు చెందిన గొల్ల రాములు, వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన కేశమోని బాలస్వామి గౌడ్(50), నల్లగొండ జిల్లా హుజూర్నగర్ అంబేద్కర్‌కాలనీకి చెందిన గౌని కామేశ్వరమ్మ (45) పిడుగుపాటుకు మృతి చెందారు.