వడగండ్లు.. కడగండ్లు
రంగారెడ్డి జిల్లా/ నల్లగొండ: వడగండ్లు రైతన్నకు కడగండ్లు మిగిల్చాయి. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కళ్ల ముందే దెబ్బతినడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మొయినాబాద్, యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్దఎత్తున వడగండ్లు పడ్డాయి. వరి, కూరగాయలు, మొక్కజొన్న, ఆకుకూరలు, ద్రాక్ష, బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఓ కోళ్లఫాం నేలమట్టమైంది.
రాజాపేట మండలంలో మామిడితోటలు దెబ్బతిన్నాయి. తీగజాతి కూరగాయలకు, కోత దశలో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. హుజూర్‌నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెరువు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో, కళ్లాలలో వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. వడగండ్లు పడడంతో వరిపొలాల్లో ధాన్యం రాలిపోయింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మునుగోడు, చండూరులలో భారీ వర్షం పడింది.
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం నీటూరు పంచాయతీ పరిధి నర్సాపూర్‌కు చెందిన గొల్ల రాములు, వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన కేశమోని బాలస్వామి గౌడ్(50), నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ అంబేద్కర్‌కాలనీకి చెందిన గౌని కామేశ్వరమ్మ (45) పిడుగుపాటుకు మృతి చెందారు.