నేరేడు | Blackberry fruit | Sakshi
Sakshi News home page

నేరేడు

Published Sun, Jun 21 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

నేరేడు

నేరేడు

నేరేడు హిస్టరీ: నేరేడును ఇంగ్లిషులో జావా ప్లమ్, బ్లాక్ ప్లమ్, జాంబుల్, ఇండియన్ బ్లాక్‌బెర్రీ... అని రకరకాల పేర్లతో పిలుస్తారు. తమిళంలో నాగపళం అని, మలయాళంలో నవల్‌ఫలం అని అంటారు. నేరేడు శాస్త్రీయనామం ‘సిజీజియ్ క్యుమినీ’. దక్షిణాసియా దేశాలలో నేరేడు ఉనికి ప్రాచీన కాలం నుంచీ ఉన్నప్పటికీ అగ్రరాజ్యమైన యూఎస్‌కు మాత్రం 1911లో మాత్రమే పరిచయమైంది.
 
వర్షరుతువులో వాన పడుతుంది. మామూలే.
వర్షరుతువు రాకుండా కూడా వాన పడుతుంది.
కానీ వానగా పడదు. వడగండ్లుగా పడుతుంది.
అచ్చంగా వాన మాత్రమే కురవాలంటే వర్షరుతువు ప్రవేశించాల్సిందే.
అప్పుడు కూడా వడగండ్లు పడతాయి!
కానీ ఆకాశం నుంచి కాదు. నేరేడు చెట్ల నుంచి... నల్లటి వడగండ్ల లాంటి పండ్లు రాలిపడతాయి. ఆషాఢం వరకు ఆకాశంలో నల్లటి మేఘాలతో పోటీ పడుతూ... నేల కింద  బుట్టల నిండా నల్లటి నేరేళ్లు నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి.
 
చిటపట చినుకుల్లో మొక్కజొన్నపొత్తులదేనా రాజ్యం?
కొద్దిగా వగరు, కొద్దిగా తీపి కలిసిన మృదువైన నేరేడును నాలుకపై వేసుకుని అంగిటతో ఒత్తగానే ఏ కొత్త రాజ్యంలోకో వచ్చిపడినట్లు ఉండదూ!!
రాజ్యం కాదు కానీ, ఒకప్పుడు మనకు ఇలాంటి రాజ్యం లాంటి ద్వీపమే ఉందేది. దాని పేరు జంబూ ద్వీపం. జంబూ వృక్షాలు ఎక్కువగా ఉండడంతో జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది.
జంబూ వృక్షం అంటే నేరేడు చెట్టు. జంబూ ఫలం అంటే నేరేడు పండు. దేవనాగర భాషలోని అర్థం ఇది.
 
జంబూ ద్వీపం: ఏ పూజ చేసినా ముందు మహాసంకల్పం చెప్పుకుంటాం. అంటే భగవంతుడికి మన వేర్ అబౌట్స్‌ని నివేదించుకుంటాం. ఏ రాజ్యంలో, ఏ దిక్కున ఉన్నామో! ఆ మహాసంకల్పంలో ‘జంబూ ద్వీపే భరతవర్షే, భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే’ అంటూ జంబూ ద్వీప ప్రస్తావన వస్తుంది. అలా... నేరేడు లేని పూజ లేదు. పూజా ఫలమూ లేదు. అందుకే నేరేడు దేవతాఫలం అయింది.
 
అందుకు మాత్రమేనా! శ్రీరామ చంద్రుడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం ఉన్నప్పుడు నేరేడు పండ్లతోనే కడుపు నింపుకున్నారట. అందుక్కూడా నేరేడు దైవఫలం అయింది. అంటే దైవం లాంటి ఫలమనీ, దైవం పంపిన ఫలమని కూడా!

శతాబ్దాల క్రితం నాటి అతిప్రాచీనమైన జాగ్రఫీ ప్రకారం మన దేశం జంబూనది మధ్యలో ఉండేది. అందుకే మన భూభాగాన్ని పూర్వీకులు జంబూద్వీపం అన్నారు. జంబూనది నేరేడు చెట్ల మధ్యగా ప్రవహించడం వల్ల ఆ నీరు తియ్యగా, మధురంగా ఉండేదని చెప్తారు. ఈ మాటకు సాక్ష్యాధారాలు అవసరం లేదు. చిన్న నేరేడు పండును నోట్లో వేసుకుంటే చాలు.  
 
నేరేడు కిరణాలు: నేరేడునదిలో (జంబూనదిలో) ఉండే ఇసుక బంగారమట! ఆ నమ్మకం ఇప్పటికీ ఉంది. కృష్ణానది నేరేడు నది పాయేనట. ఆ మాటను నేటికీ విశ్వసిస్తున్నారు. అందుకే వర్షాలు కురవడం మొదలవగానే కృష్ణానది ఒడ్డున బంగారం కోసం వెతుకులాట కూడా మొదలౌతుంటుంది. నేరేటేటి అసల్ (ఇసుక) అని అల్లసాని పెద్దన కూడా జంబూనది గొప్పదనాన్ని వర్ణించాడు. ఏటి ఒడ్డున ఇసుక సూర్యకిరణాలు సోకగానే బంగారంలో తళతళ మెరుస్తుంది. నేరేళ్లూ అంతే, లేలేత ఎండలో మరింత నల్లగా మెరుస్తాయి. నీలిమేఘచ్ఛాయలో ఉన్నవారిని నేరేడుపండులా ఉన్నాడని నలుపును నేరేడు వర్ణంగా చెప్పేది అందుకే.
 
కింటా కుంటే: అలెక్స్ హేలీ నవల్ ‘రూట్స్’లో కింటా కుంటే... అప్పుడే పుట్టిన తన పసికందును చేతులకు ఎత్తుకుని పండులా ఉన్నాడని సంతోషపడతాడు.అక్కడ పండు అంటే ఆపిల్ కాదు. నేరేడు. ఆ బిడ్డను జాబిల్లి వైపు చూపించి... ‘‘నీ కన్నా అందంగా ఉన్నాడు. నువ్వు పాలిపోయి ఉన్నావు. వీడు పండు వెన్నెల్లా ఉన్నాడు’’ అంటాడు.
 
నేరేడు రూట్స్ (వేర్లు) ఒక దేశానికే పరిమితమై లేవు. భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రధానంగా ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియాలలో పాతుకుని ఉన్నాయి. ఫిలిప్పీన్స్, మయన్మార్, అఫ్ఘనిస్థాన్‌లలో కూడా నేరేడు చెట్లు విరివిగా కనిపిస్తాయి. పోర్చుగీసు వాళ్లు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరేడు విత్తనాన్ని బ్రెజిల్ తీసుకెళ్లారని, అక్కడి పక్షులు కొన్ని నేరేడును ఇష్టంగా తింటుండంతో అక్కడి నుంచి వేగంగా ఆసియా దేశాలకు పాకిందనీ చెప్తారు. నేరేడు చెట్టు త్వరగా పెరుగుతుంది. ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వందేళ్లకు పైగా జీవిస్తుంది.
 
ఆధ్యాత్మిక ఫలం: నేరేడు పండు శివకేశవులకు ప్రీతిపాత్రమైది అని చెబుతారు. గణపతికి ‘నేరేడు మారేడు నెలవంక మామిడి’ అని పత్రాలను సమర్పిస్తారు. నేరేడు బెరడుతో గుండ్రంగా ఒక చక్రం తయారుచేసి... బావి తవ్వేటప్పడు కింద ముందుగా ఈ చక్రం వేసి ఆ పైన మిగిలిన ఒరలు వేస్తారు. నేరేడు బెరడు నీటిని శుభ్రం చేసి నీటిని తియ్యగా చేస్తుంది. నీళ్లలోని మలినాలను పోగొడుతుంది. నీళల్లో ఉండే వగరు, చేదు పోయి తియ్యగా నీళ్లు మారతాయి.

జంబుకేశ్వరంలో పరమశివుడిని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు. ఇది కంచి దగ్గర ఉన్న శివక్షేత్రం. ఇక్కడి శివుడు నేరేడు చెట్టు మొదట్లో వెలిశాడు. జంబూనది ఈశ్వరాకారంగా ఉన్నట్లు చెబుతారు. ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ‘నేరేటి పండ్లును నెలయూటి పండ్లును’ అని వర్ణించాడు. కన్నప్ప ఈ పండ్లను నిత్యం శివుడికి నైవేద్యంగా పెట్టాడని చెబుతాడు ధూర్జటి. అలాగే జంబూఫలాన్ని నీలి వర్ణం ఆధారంగా నారాయణస్వామిగా లేదా వెంక టేశ్వరునిగా వర్ణిస్తారు. పండు ఆకారాన్ని బట్టి అది లింగాకారంలో ఉండటంతో ధూర్జటి శివస్వరూపంగా కొలుస్తాడు. మామిడి తోరణాలు దొరకని చోట నేరేడు తోరణాలు కడతారు.
నేరేడు ఇలా భారతీయ ఆత్మలో, దేహంలో కలిసిపోయింది. ఈ వర్షాకాలం వీలైనన్నిసార్లు నేరేడు పండ్లను ఆరగించండి. ఆరోగ్యంగా ఉండండి. ఆధ్యాత్మికంగా పరిపుష్టం కండి.
- డా. పురాణపండ వైజయంతి
 
ఔషధగుణాల రేడు... నేరేడు: నేరేడు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండెజబ్బుల్ని నివారిస్తుంది. దంతసమస్యల్ని దూరం చేస్తుంది. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్రన పోషిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కళ్లను ఆరోగ్యంగా, ఎముకల్ని బలంగా ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను సమంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. డయోరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలను మాన్పుతుంది. జీర్ణక్రియను క్రియాశీలం చేస్తుంది. కాలేయం, మూత్ర సంబంధ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement