Drs. Puranapanda Vyjayanthimala
-
అయ్యో పాపం నేను
అనగనగా ఒక ఆల్కీ! ‘ఆల్కీ’ అంటే ఆల్కహాలిక్. తాగుబోతు. ఆ తాగుబోతు... జీవితం మీద విరక్తి చెంది... ఓరోజు నది ఒడ్డుకు వెళ్లాడు. ఒడ్డున నుంచొని దూకుదామా వద్దా, దూకుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ‘‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది భగవాన్’’ అని తన జీవితాన్నంతా తలిచి తలచి, వగచి వగచి... చివరికి దూకేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంకో క్షణంలో దూకేసేవాడే. ఇంతలో అటుగా ఎగురుకుంటూ వెళుతున్న పక్షి... ఒక్క క్షణం ఆగి అతడి బట్టతలపై రెట్ట వేసి వెళ్లిపోయింది! ఆల్కీ మళ్లీ బాధపడి పోయాడు... ‘‘అయ్యో దేవుడా... నాకే ఎందుకిలా జరుగుతోంది’’అని ఆకాశంలోకి చూస్తూ దీనంగా ప్రశ్నించాడు. అంతేకాదు, దేవుణ్ని అతడు ఇంకో ప్రశ్న కూడా వేశాడు. ‘‘అందరికి కోసం పాటలు పాడే పక్షి... నాకు మాత్రమే ఇలా ఎందుకు రెట్టను ప్రసాదించింది?’’ అని విలపించాడు. తర్వాత అతడు దూకాడా, దూకలేదా అన్నది అనవసరం. సెల్ఫ్ పిటీతో ఏడ్చేవాళ్లని చేరదీయకూడద ట, ఓదార్చకూడద ట. ఈ మాట అన్నది జాయ్స్ మేయర్. మత బోధకురాలు. ‘మనం వాళ్లని పట్టించుకోకపోవడమే వాళ్లకు పరమౌషధం’ అని ఆమె అబ్జర్వేషన్. ‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది’ అనుకోవడం సెల్ఫ్ పిటీకి మొదటి మెట్టు. లోకంలో అందరూ హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు... నేను తప్ప అనుకోవడం రెండో మెట్టు. కనీసం నా మీద జాలి చూపేవారు కూడా లేరు అనుకోవడం మూడో మెట్టు. విజయానికి ఐదు మెట్లలా, ఆరు మెట్లలా, ఏడు మెట్లలా... సెల్ఫ్పిటీక్కూడా అన్నన్ని మెట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయో కచ్చితంగా చెప్పలేం కానీ.. ప్రతి మెట్టు మీదా మనకు ఇలాంటి వాళ్లు తారసపడుతూనే ఉంటారు. నేను ఎవరి కోసం బతకాలి... నేను ఎందుకోసం బతకాలి అనుకోవడం మాత్రం చివరి మెట్టు. ఫైనల్ స్టేజ్. చిత్రం ఏమిటంటే ఫైనల్ స్టేజ్‌లో ఉన్నవారు తాము ఫైనల్స్‌లో ఉన్నామని ఊహించలేకపోవడం. ఇలాంటి వారు తమలో ఏ లోపమూ లేకపోయినా, సెల్ఫ్ పిటీ అనే మానసిక రుగ్మత వల్ల అనుక్షణం లోలోపల కుమిలిపోతుంటారట! సైకాలజిస్టులు అంటారు. సెల్ఫ్ పిటీ అన్ని బంధాలను తెంపే స్తుంది. అన్ని అనుబంధాలను హరించివేస్తుంది. పడి పోతాం... పడి లేస్తాం ‘‘సెల్ఫ్ పిటీని మించిన నరకం లేదు... సెల్ఫ్ పిటీ అనేది అతి హేయమైన, ప్రమాదకరమైన శత్రువు. మనలో ఆ గుణం ఉంటే, ఒక్క మంచి పని కూడా చెయ్యలేం’’ అని అంధురాలైన హెలెన్‌కెల్లర్ సెల్ఫ్ పిటీ సమాజంలో స్ఫూర్తిని నింపారు. ఈ విషయాన్నే సైకాలజిస్టులు ఇంకోలా చెబుతారు. ‘‘ఏడుసార్లు పడిపోతాం. ఎనిమిదోసారి లేస్తాం’’ అంటారు వాళ్లు. సెల్ఫ్ పిటీ స్వభావం ఉన్నవారు ఏ మాత్రం ఆత్మవిశ్వాసం లేనట్టుగా మారిపోతారు. నేను లావుగా ఉన్నాను కాబట్టే నన్ను ఎవ్వరూ ఇష్టపడట్లేదనుకునేవారు కొందరు, నాకు డబ్బు లేదు కనుకనే నాతో ఎవరూ సరిగా ఉండట్లేదనుకునేవారు కొందరు, అందరికీ బాగా చదువు ఉంది... నాకే లేదు అనుకునేవారు కొందరు... ఇలా ఎవరికి వారు సెల్ఫ్ పిటీ చూపుకుంటూ జీవితాన్ని వృథా చేసుకుంటున్నవారు సమాజంలో అసంఖ్యాకంగా ఉన్నారు. శ్రవణడు, లక్ష్మణుడు, ధృతరాష్ట్రుడు తల్లిదండ్రులను చెరో కావిడిలో భుజానికెత్తుకున్న శ్రవణకుమారుడికి సెల్ఫ్ పిటీ లేదు. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం దొరికిందనుకున్నాడు. భార్యను విడిచి అన్నా వదినలతో అరణ్యాలకు వచ్చిన లక్ష్మణుడు ఏ నాడూ తనకు ఇలా జరిగిందేంటి అన్న సెల్ఫ్ పిటీ భావనను మనసులోకి రానియ్యలేదు. అన్నావదినలలో తల్లిదండ్రులను చూసుకుంటూ సేవ చేసే భాగ్యం కలిగింది కదా అనుకున్నాడు. వీరిద్దరికీ భిన్న ధృతరాష్ట్రుడు. తాను అంధుడిగా పుట్టినందుకే తనకు రాజ్యపాలన అధికారం లేదని తరచూ ధృతరాష్ట్రుడు తన మీద తానే సానుభూతి చూపించుకునేవాడు. తానే కనుక దృష్టి దోషం లేకుండా పుట్టి ఉంటే, తానొక పెద్ద సామ్రాజ్రానికి సార్వభౌముడినయ్యే వాడిని కదా అని నిరంతరం కుమిలిపోయేవాడు. అలా ఆయన సెల్ఫ్ పిటీ వల్ల సాధించిందేమీ లేకపోగా, ఆ నిరాశలో తన కన్న సంతానం చేసిన తప్పుల్ని సైతం ఖండించలేకపోయాడు. బాహుబలి చిత్రంలో అవిటి నాజర్ పాత్ర ఇలాంటిదే. శ్రీకృష్ణుడి సుందరి భాగవతంలో కుబ్జ అనే పూలమ్ముకునే వ్యక్తి శరీర అవకరాలతో ఉంటుంది. తాను అందవిహీనంగా ఉన్నానని తరచు తన మీద తానే సానుభూతి చూపుకునేది. ‘నేను అంద వికారంగా ఉన్నాను కనుక నన్ను ఎవ్వరూ ప్రేమించరు’ అని అద్దం ముందు కూర్చుని బాధపడుతుండేది. కాని శ్రీకృష్ణుడు స్వయంగా ‘ఓ సుందరీ’ అని సంబోధించాడు. అలా అమెలోని సెల్ఫ్పిటీకి స్వస్తి పలికాదు. ప్రముఖ వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయడు అంధులనే విషయం జగద్విదితమే. ‘అయ్యో! నన్ను భగవంతుడు అంధునిగా పుట్టించాడు’ అని సెల్ఫ్పిటీతో నీరుకారి పోతే భారతదేశానికి ఒక మంచి సంగీత విద్వాంసుడు లభించేవాడే కాదు. ఆయన రెట్టింపు ఉత్సాహంతో వయొలిన్‌ను సోలో ఇన్స్ట్రుమెంట్ కచేరీ స్థాయి తీసుకువచ్చారు. అలాగే పాశ్చాత్యులలో బీథోవెన్. వినికిడి శక్తి కోల్పోయాక కూడా అయన సెవన్త్ సింఫనీ కనిపెట్టాడు. ఇక విశ్వవిఖ్యాతుడైన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? శరీరంలో ఏ భాగమూ పనిచేయకపోయినా ఆయన ఏనాడూ తనపై సెల్ఫ్పిటీ చూపించుకోలేదు. తన శరీరంలో పనిచేసే భాగాలతోనే విశ్వరహస్యాలు చేధించారు. - డా. పురాణపండ వైజయంతి సెల్ఫ్ హెల్ప్ కోట్స్ - ఎవరిపై వారు జాలి పడే స్వభావమనేది నల్లమందుకన్నా అత్యంత ప్రమాదకరం. - సెబాస్టియన్ హర్స్‌లీ - ప్రతి ఒక్కరి డిప్రెషన్‌కు మూలం తమపై తమకున్న సానుభూతైతే, ఆ సానుభూతికి కారణం మాత్రం వారికి వారిపై ఉన్న అతి ప్రేమ మాత్రమే. - మిల్లిసెంట్ ఫెన్విక్ - తమపై తాము సానుభూతి చూపించుకోవడం అనేది ఎప్పుడూ బతకడానికి సరైన మార్గం కాదు. - టెస్ కాలోమినో - ఈ స్వీయ సానుభూతి అనేది మొదట మెత్తటి పరుపుపై హాయిగా పవళిస్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఆ పరుపు గట్టిగా అయినప్పుడే సమస్యలు మొదలవుతాయి. - మాయ ఏంజిలా - నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, నిన్ను నువ్వు ప్రశంసించుకుంటే అది కూడా స్వీయ సానుభూతే -అలెగ్జాండర్ హేమన్ - స్వీయ సానుభూతనేది జబ్బు లాంటిది. అది మనిషి ప్రాణాలు తీయకుండా జీవితాన్ని హరిస్తుంది - ఎయిడెన్ చాంబర్స్ - పిరికితనానికి నీచమైన రూపమే సెల్ఫ్ పిటీ - మార్కస్ ఆరేలియస్ -
నేరేడు
నేరేడు హిస్టరీ: నేరేడును ఇంగ్లిషులో జావా ప్లమ్, బ్లాక్ ప్లమ్, జాంబుల్, ఇండియన్ బ్లాక్‌బెర్రీ... అని రకరకాల పేర్లతో పిలుస్తారు. తమిళంలో నాగపళం అని, మలయాళంలో నవల్ఫలం అని అంటారు. నేరేడు శాస్త్రీయనామం ‘సిజీజియ్ క్యుమినీ’. దక్షిణాసియా దేశాలలో నేరేడు ఉనికి ప్రాచీన కాలం నుంచీ ఉన్నప్పటికీ అగ్రరాజ్యమైన యూఎస్‌కు మాత్రం 1911లో మాత్రమే పరిచయమైంది. వర్షరుతువులో వాన పడుతుంది. మామూలే. వర్షరుతువు రాకుండా కూడా వాన పడుతుంది. కానీ వానగా పడదు. వడగండ్లుగా పడుతుంది. అచ్చంగా వాన మాత్రమే కురవాలంటే వర్షరుతువు ప్రవేశించాల్సిందే. అప్పుడు కూడా వడగండ్లు పడతాయి! కానీ ఆకాశం నుంచి కాదు. నేరేడు చెట్ల నుంచి... నల్లటి వడగండ్ల లాంటి పండ్లు రాలిపడతాయి. ఆషాఢం వరకు ఆకాశంలో నల్లటి మేఘాలతో పోటీ పడుతూ... నేల కింద బుట్టల నిండా నల్లటి నేరేళ్లు నిగనిగలాడుతూ కనిపిస్తుంటాయి. చిటపట చినుకుల్లో మొక్కజొన్నపొత్తులదేనా రాజ్యం? కొద్దిగా వగరు, కొద్దిగా తీపి కలిసిన మృదువైన నేరేడును నాలుకపై వేసుకుని అంగిటతో ఒత్తగానే ఏ కొత్త రాజ్యంలోకో వచ్చిపడినట్లు ఉండదూ!! రాజ్యం కాదు కానీ, ఒకప్పుడు మనకు ఇలాంటి రాజ్యం లాంటి ద్వీపమే ఉందేది. దాని పేరు జంబూ ద్వీపం. జంబూ వృక్షాలు ఎక్కువగా ఉండడంతో జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. జంబూ వృక్షం అంటే నేరేడు చెట్టు. జంబూ ఫలం అంటే నేరేడు పండు. దేవనాగర భాషలోని అర్థం ఇది. జంబూ ద్వీపం: ఏ పూజ చేసినా ముందు మహాసంకల్పం చెప్పుకుంటాం. అంటే భగవంతుడికి మన వేర్ అబౌట్స్ని నివేదించుకుంటాం. ఏ రాజ్యంలో, ఏ దిక్కున ఉన్నామో! ఆ మహాసంకల్పంలో ‘జంబూ ద్వీపే భరతవర్షే, భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే’ అంటూ జంబూ ద్వీప ప్రస్తావన వస్తుంది. అలా... నేరేడు లేని పూజ లేదు. పూజా ఫలమూ లేదు. అందుకే నేరేడు దేవతాఫలం అయింది. అందుకు మాత్రమేనా! శ్రీరామ చంద్రుడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం ఉన్నప్పుడు నేరేడు పండ్లతోనే కడుపు నింపుకున్నారట. అందుక్కూడా నేరేడు దైవఫలం అయింది. అంటే దైవం లాంటి ఫలమనీ, దైవం పంపిన ఫలమని కూడా! శతాబ్దాల క్రితం నాటి అతిప్రాచీనమైన జాగ్రఫీ ప్రకారం మన దేశం జంబూనది మధ్యలో ఉండేది. అందుకే మన భూభాగాన్ని పూర్వీకులు జంబూద్వీపం అన్నారు. జంబూనది నేరేడు చెట్ల మధ్యగా ప్రవహించడం వల్ల ఆ నీరు తియ్యగా, మధురంగా ఉండేదని చెప్తారు. ఈ మాటకు సాక్ష్యాధారాలు అవసరం లేదు. చిన్న నేరేడు పండును నోట్లో వేసుకుంటే చాలు. నేరేడు కిరణాలు: నేరేడునదిలో (జంబూనదిలో) ఉండే ఇసుక బంగారమట! ఆ నమ్మకం ఇప్పటికీ ఉంది. కృష్ణానది నేరేడు నది పాయేనట. ఆ మాటను నేటికీ విశ్వసిస్తున్నారు. అందుకే వర్షాలు కురవడం మొదలవగానే కృష్ణానది ఒడ్డున బంగారం కోసం వెతుకులాట కూడా మొదలౌతుంటుంది. నేరేటేటి అసల్ (ఇసుక) అని అల్లసాని పెద్దన కూడా జంబూనది గొప్పదనాన్ని వర్ణించాడు. ఏటి ఒడ్డున ఇసుక సూర్యకిరణాలు సోకగానే బంగారంలో తళతళ మెరుస్తుంది. నేరేళ్లూ అంతే, లేలేత ఎండలో మరింత నల్లగా మెరుస్తాయి. నీలిమేఘచ్ఛాయలో ఉన్నవారిని నేరేడుపండులా ఉన్నాడని నలుపును నేరేడు వర్ణంగా చెప్పేది అందుకే. కింటా కుంటే: అలెక్స్ హేలీ నవల్ ‘రూట్స్’లో కింటా కుంటే... అప్పుడే పుట్టిన తన పసికందును చేతులకు ఎత్తుకుని పండులా ఉన్నాడని సంతోషపడతాడు.అక్కడ పండు అంటే ఆపిల్ కాదు. నేరేడు. ఆ బిడ్డను జాబిల్లి వైపు చూపించి... ‘‘నీ కన్నా అందంగా ఉన్నాడు. నువ్వు పాలిపోయి ఉన్నావు. వీడు పండు వెన్నెల్లా ఉన్నాడు’’ అంటాడు. నేరేడు రూట్స్ (వేర్లు) ఒక దేశానికే పరిమితమై లేవు. భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రధానంగా ఇండియా, పాకిస్థాన్, ఇండోనేషియాలలో పాతుకుని ఉన్నాయి. ఫిలిప్పీన్స్, మయన్మార్, అఫ్ఘనిస్థాన్లలో కూడా నేరేడు చెట్లు విరివిగా కనిపిస్తాయి. పోర్చుగీసు వాళ్లు ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేరేడు విత్తనాన్ని బ్రెజిల్ తీసుకెళ్లారని, అక్కడి పక్షులు కొన్ని నేరేడును ఇష్టంగా తింటుండంతో అక్కడి నుంచి వేగంగా ఆసియా దేశాలకు పాకిందనీ చెప్తారు. నేరేడు చెట్టు త్వరగా పెరుగుతుంది. ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వందేళ్లకు పైగా జీవిస్తుంది. ఆధ్యాత్మిక ఫలం: నేరేడు పండు శివకేశవులకు ప్రీతిపాత్రమైది అని చెబుతారు. గణపతికి ‘నేరేడు మారేడు నెలవంక మామిడి’ అని పత్రాలను సమర్పిస్తారు. నేరేడు బెరడుతో గుండ్రంగా ఒక చక్రం తయారుచేసి... బావి తవ్వేటప్పడు కింద ముందుగా ఈ చక్రం వేసి ఆ పైన మిగిలిన ఒరలు వేస్తారు. నేరేడు బెరడు నీటిని శుభ్రం చేసి నీటిని తియ్యగా చేస్తుంది. నీళ్లలోని మలినాలను పోగొడుతుంది. నీళల్లో ఉండే వగరు, చేదు పోయి తియ్యగా నీళ్లు మారతాయి. జంబుకేశ్వరంలో పరమశివుడిని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు. ఇది కంచి దగ్గర ఉన్న శివక్షేత్రం. ఇక్కడి శివుడు నేరేడు చెట్టు మొదట్లో వెలిశాడు. జంబూనది ఈశ్వరాకారంగా ఉన్నట్లు చెబుతారు. ధూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ‘నేరేటి పండ్లును నెలయూటి పండ్లును’ అని వర్ణించాడు. కన్నప్ప ఈ పండ్లను నిత్యం శివుడికి నైవేద్యంగా పెట్టాడని చెబుతాడు ధూర్జటి. అలాగే జంబూఫలాన్ని నీలి వర్ణం ఆధారంగా నారాయణస్వామిగా లేదా వెంక టేశ్వరునిగా వర్ణిస్తారు. పండు ఆకారాన్ని బట్టి అది లింగాకారంలో ఉండటంతో ధూర్జటి శివస్వరూపంగా కొలుస్తాడు. మామిడి తోరణాలు దొరకని చోట నేరేడు తోరణాలు కడతారు. నేరేడు ఇలా భారతీయ ఆత్మలో, దేహంలో కలిసిపోయింది. ఈ వర్షాకాలం వీలైనన్నిసార్లు నేరేడు పండ్లను ఆరగించండి. ఆరోగ్యంగా ఉండండి. ఆధ్యాత్మికంగా పరిపుష్టం కండి. - డా. పురాణపండ వైజయంతి ఔషధగుణాల రేడు... నేరేడు: నేరేడు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండెజబ్బుల్ని నివారిస్తుంది. దంతసమస్యల్ని దూరం చేస్తుంది. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. చర్మ సంరక్షణలో ముఖ్యమైన పాత్రన పోషిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కళ్లను ఆరోగ్యంగా, ఎముకల్ని బలంగా ఉంచుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను సమంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. డయోరియా నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలను మాన్పుతుంది. జీర్ణక్రియను క్రియాశీలం చేస్తుంది. కాలేయం, మూత్ర సంబంధ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.