అయ్యో పాపం నేను | Oops sin I am | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం నేను

Published Sat, Jul 25 2015 10:50 PM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

అయ్యో పాపం నేను - Sakshi

అయ్యో పాపం నేను

అనగనగా ఒక ఆల్కీ! ‘ఆల్కీ’ అంటే ఆల్కహాలిక్. తాగుబోతు. ఆ తాగుబోతు... జీవితం మీద విరక్తి చెంది... ఓరోజు నది ఒడ్డుకు వెళ్లాడు. ఒడ్డున నుంచొని దూకుదామా వద్దా, దూకుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ‘‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది భగవాన్’’ అని తన జీవితాన్నంతా తలిచి తలచి, వగచి వగచి... చివరికి దూకేయాలని డిసైడ్ అయ్యాడు.

ఇంకో క్షణంలో దూకేసేవాడే. ఇంతలో అటుగా ఎగురుకుంటూ వెళుతున్న పక్షి... ఒక్క క్షణం ఆగి అతడి బట్టతలపై రెట్ట వేసి వెళ్లిపోయింది! ఆల్కీ మళ్లీ బాధపడి పోయాడు... ‘‘అయ్యో దేవుడా... నాకే ఎందుకిలా జరుగుతోంది’’అని ఆకాశంలోకి చూస్తూ దీనంగా ప్రశ్నించాడు. అంతేకాదు, దేవుణ్ని అతడు ఇంకో ప్రశ్న కూడా వేశాడు. ‘‘అందరికి కోసం పాటలు పాడే పక్షి... నాకు మాత్రమే ఇలా ఎందుకు రెట్టను ప్రసాదించింది?’’ అని విలపించాడు.

తర్వాత అతడు దూకాడా, దూకలేదా అన్నది  అనవసరం. సెల్ఫ్ పిటీతో ఏడ్చేవాళ్లని చేరదీయకూడద ట, ఓదార్చకూడద ట. ఈ మాట అన్నది జాయ్స్ మేయర్. మత బోధకురాలు. ‘మనం వాళ్లని పట్టించుకోకపోవడమే వాళ్లకు పరమౌషధం’ అని ఆమె అబ్జర్వేషన్.
         
‘నాకే ఇలా ఎందుకు జరుగుతోంది’ అనుకోవడం సెల్ఫ్ పిటీకి మొదటి మెట్టు. లోకంలో అందరూ హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు... నేను తప్ప అనుకోవడం రెండో మెట్టు. కనీసం నా మీద జాలి చూపేవారు కూడా లేరు అనుకోవడం మూడో మెట్టు.
విజయానికి ఐదు మెట్లలా, ఆరు మెట్లలా, ఏడు మెట్లలా... సెల్ఫ్‌పిటీక్కూడా అన్నన్ని మెట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయో కచ్చితంగా చెప్పలేం కానీ.. ప్రతి మెట్టు మీదా మనకు ఇలాంటి వాళ్లు తారసపడుతూనే ఉంటారు. నేను ఎవరి కోసం బతకాలి...  నేను ఎందుకోసం బతకాలి అనుకోవడం మాత్రం చివరి మెట్టు. ఫైనల్ స్టేజ్.
 
చిత్రం ఏమిటంటే ఫైనల్ స్టేజ్‌లో ఉన్నవారు తాము ఫైనల్స్‌లో ఉన్నామని ఊహించలేకపోవడం. ఇలాంటి వారు తమలో ఏ లోపమూ లేకపోయినా, సెల్ఫ్ పిటీ అనే మానసిక రుగ్మత వల్ల అనుక్షణం లోలోపల కుమిలిపోతుంటారట! సైకాలజిస్టులు అంటారు.  సెల్ఫ్ పిటీ అన్ని బంధాలను తెంపే స్తుంది. అన్ని అనుబంధాలను హరించివేస్తుంది.
 
పడి పోతాం... పడి లేస్తాం
‘‘సెల్ఫ్ పిటీని మించిన నరకం లేదు... సెల్ఫ్ పిటీ అనేది అతి హేయమైన, ప్రమాదకరమైన శత్రువు. మనలో ఆ గుణం ఉంటే, ఒక్క మంచి పని కూడా చెయ్యలేం’’ అని అంధురాలైన హెలెన్‌కెల్లర్ సెల్ఫ్ పిటీ సమాజంలో స్ఫూర్తిని నింపారు. ఈ విషయాన్నే సైకాలజిస్టులు ఇంకోలా చెబుతారు. ‘‘ఏడుసార్లు పడిపోతాం. ఎనిమిదోసారి లేస్తాం’’ అంటారు వాళ్లు. సెల్ఫ్ పిటీ స్వభావం ఉన్నవారు ఏ మాత్రం ఆత్మవిశ్వాసం లేనట్టుగా మారిపోతారు. నేను లావుగా ఉన్నాను కాబట్టే నన్ను ఎవ్వరూ ఇష్టపడట్లేదనుకునేవారు కొందరు, నాకు డబ్బు లేదు కనుకనే నాతో ఎవరూ సరిగా ఉండట్లేదనుకునేవారు కొందరు, అందరికీ బాగా చదువు ఉంది... నాకే లేదు అనుకునేవారు కొందరు... ఇలా ఎవరికి వారు సెల్ఫ్ పిటీ చూపుకుంటూ జీవితాన్ని వృథా చేసుకుంటున్నవారు సమాజంలో అసంఖ్యాకంగా ఉన్నారు.
 
శ్రవణడు, లక్ష్మణుడు, ధృతరాష్ట్రుడు
తల్లిదండ్రులను చెరో కావిడిలో భుజానికెత్తుకున్న శ్రవణకుమారుడికి సెల్ఫ్ పిటీ లేదు. తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం దొరికిందనుకున్నాడు. భార్యను విడిచి అన్నా వదినలతో అరణ్యాలకు వచ్చిన లక్ష్మణుడు ఏ నాడూ తనకు ఇలా జరిగిందేంటి అన్న సెల్ఫ్ పిటీ భావనను మనసులోకి రానియ్యలేదు. అన్నావదినలలో తల్లిదండ్రులను చూసుకుంటూ సేవ చేసే భాగ్యం కలిగింది కదా అనుకున్నాడు. వీరిద్దరికీ భిన్న ధృతరాష్ట్రుడు.

తాను అంధుడిగా పుట్టినందుకే తనకు రాజ్యపాలన అధికారం లేదని తరచూ ధృతరాష్ట్రుడు తన మీద తానే సానుభూతి చూపించుకునేవాడు. తానే కనుక దృష్టి దోషం లేకుండా పుట్టి ఉంటే, తానొక పెద్ద సామ్రాజ్రానికి సార్వభౌముడినయ్యే వాడిని కదా అని నిరంతరం కుమిలిపోయేవాడు. అలా ఆయన సెల్ఫ్ పిటీ వల్ల సాధించిందేమీ లేకపోగా, ఆ నిరాశలో తన కన్న సంతానం చేసిన తప్పుల్ని సైతం ఖండించలేకపోయాడు. బాహుబలి చిత్రంలో అవిటి నాజర్ పాత్ర ఇలాంటిదే.
 
శ్రీకృష్ణుడి సుందరి
భాగవతంలో కుబ్జ అనే పూలమ్ముకునే వ్యక్తి శరీర అవకరాలతో ఉంటుంది. తాను అందవిహీనంగా ఉన్నానని తరచు తన మీద తానే సానుభూతి చూపుకునేది. ‘నేను అంద వికారంగా ఉన్నాను కనుక నన్ను ఎవ్వరూ ప్రేమించరు’ అని అద్దం ముందు కూర్చుని బాధపడుతుండేది. కాని శ్రీకృష్ణుడు స్వయంగా ‘ఓ సుందరీ’ అని సంబోధించాడు. అలా అమెలోని సెల్ఫ్‌పిటీకి స్వస్తి పలికాదు.
 
ప్రముఖ వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయడు అంధులనే విషయం జగద్విదితమే. ‘అయ్యో! నన్ను భగవంతుడు అంధునిగా పుట్టించాడు’ అని సెల్ఫ్‌పిటీతో నీరుకారి పోతే భారతదేశానికి ఒక మంచి సంగీత విద్వాంసుడు లభించేవాడే కాదు. ఆయన రెట్టింపు ఉత్సాహంతో వయొలిన్‌ను సోలో ఇన్‌స్ట్రుమెంట్ కచేరీ స్థాయి తీసుకువచ్చారు. అలాగే పాశ్చాత్యులలో బీథోవెన్. వినికిడి శక్తి కోల్పోయాక కూడా అయన సెవన్త్ సింఫనీ కనిపెట్టాడు. ఇక విశ్వవిఖ్యాతుడైన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? శరీరంలో ఏ భాగమూ పనిచేయకపోయినా ఆయన ఏనాడూ తనపై సెల్ఫ్‌పిటీ చూపించుకోలేదు. తన శరీరంలో పనిచేసే భాగాలతోనే విశ్వరహస్యాలు చేధించారు.
- డా. పురాణపండ వైజయంతి
 
సెల్ఫ్ హెల్ప్ కోట్స్
- ఎవరిపై వారు జాలి పడే స్వభావమనేది నల్లమందుకన్నా అత్యంత ప్రమాదకరం.
- సెబాస్టియన్ హర్స్‌లీ
- ప్రతి ఒక్కరి డిప్రెషన్‌కు మూలం తమపై తమకున్న సానుభూతైతే,  ఆ సానుభూతికి కారణం మాత్రం వారికి వారిపై ఉన్న అతి ప్రేమ మాత్రమే.    
- మిల్లిసెంట్ ఫెన్విక్
- తమపై తాము సానుభూతి చూపించుకోవడం అనేది ఎప్పుడూ బతకడానికి సరైన మార్గం కాదు.
- టెస్ కాలోమినో
- ఈ స్వీయ సానుభూతి అనేది మొదట మెత్తటి పరుపుపై హాయిగా పవళిస్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఆ పరుపు గట్టిగా అయినప్పుడే సమస్యలు మొదలవుతాయి.             
- మాయ ఏంజిలా
- నువ్వు మాట్లాడే ప్రతి మాటలో, నిన్ను నువ్వు  ప్రశంసించుకుంటే అది కూడా స్వీయ సానుభూతే
-అలెగ్జాండర్ హేమన్
- స్వీయ సానుభూతనేది జబ్బు లాంటిది. అది మనిషి ప్రాణాలు తీయకుండా జీవితాన్ని హరిస్తుంది
- ఎయిడెన్ చాంబర్స్
- పిరికితనానికి నీచమైన రూపమే సెల్ఫ్ పిటీ             
- మార్కస్ ఆరేలియస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement