అతి ఈస్ట్రోజన్ వేళ అతిమద్యం ఛాన్స్
అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరిగిన సందర్భాల్లో మహిళల్లో మద్యం అతిగా తాగాలనే ఆలోచనలు ఎక్కువగా రావొచ్చని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని వెల్ కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల సంబంధిత అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్ కమ్యూనికేషన్స్’జర్నల్‌లో ప్రచురతమయ్యాయి.
ఈస్ట్రోజన్ స్థాయిలకు మహిళల్లో అతి మద్యపాన అలవాట్లకు మధ్య దగ్గరి సంబంధం ఉందని తొలిసారిగా కనుగొన్నామని పరిశోధకులు చెప్పారు. పురుషులతో పోలిస్తే ఈ ధోరణి మహిళల్లోనే ఉందని పేర్కొన్నారు. మహిళ ఒకేసారి నాలుగు కంటే ఎక్కువ పెగ్గులు తాగితే ఆ అలవాటును అతిమద్యపాన సేవనంగా పేర్కొంటారు. సంబంధిత ప్రయోగాన్ని ఎలుకలపై చేసి నిర్ధారించుకున్నారు. మగ ఎలుకలతో పోలిస్తే ఆడ ఎలుకల మెదడులో ‘స్ట్రియా టెరి్మనల్‌లోని బెడ్ న్యూక్లియస్’న్యూరాన్లు ఈస్ట్రోజన్ ఎక్కువ అయినప్పుడు అతిగా మద్యం తాగాలని ప్రేరేపిస్తున్నాయి.
మద్యం అందించిన తొలి 30 నిమిషాల్లోనే వాటిలో ఈ అతిపోకడ కనిపించింది. మహిళల్లో అతిమద్యం అలవాట్లకు కారణం ఏమై ఉంటుందో ఇన్నాళ్లూ బోధపడలేదు. ఎందుకంటే ఇంతకాలం జరిగిన ఈ తరహా పరిశోధనలు కేవలం పురుషులమీదే జరిగాయి. ఈ పరిశోధన ఫలితాలు మహిళల్లో మద్యం అలవాట్లపై అధ్యయనానికి కొత్త బాటలు వేశాయి’’అని వెల్ కార్నెల్ మెడిసిన్‌లోని ఫార్మకాలజీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్, నివేదికలో కీలక రచయిత క్రిస్టీన్ పెయిల్ వ్యాఖ్యానించారు. మహిళల్లో నెలసరి రోజులులాగా ఎలుకల్లో ఈస్ట్రోజన్ చక్రం కొనసాగినంతకాలం ఈ పరిశోధన చేశారు. ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువ ఉన్నన్ని రోజులూ ఆడ ఎలుకలు మద్యం ఫూటుగా తాగడం గమనించారు. మద్యానికి బానిసలైన మహిళా బాధితులకు చికిత్సా విధానాల్లో మార్పుకు ఈ కొత్త పరిశోధన ఎంతగానో సాయపడనుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment