శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంటుంది. ఈ మంచును ముట్టుకున్నప్పుడు ఎంతో సున్నితంగా ఉంటుంది. తాకగానే మంచి మెత్తని పూలను తాకిన అనుభూతినిస్తుంది. ఇదేవిధంగా వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో వడగళ్లు పడుతుంటాయి. అవి ఎంతో గట్టిగా రాళ్లలా ఉంటాయి. వెంటనే కరిగిపోవు. ఒకే ఆకాశం నుంచి పడే మంచు మృదువుగా, వడగళ్లు గట్టిగా ఎందుకు ఉంటాయి. దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతుంది?
మంచు ఎందుకు కురుస్తుంది?
చలికాలంలో రాత్రి వేళ భూమి అధికంగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమంగా వాతావరణపు పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి మరింత చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. వాటికి దుమ్ము, ధూళి లాంటి అతి చిన్న కణాలు ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనినే పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనిపిస్తుంది. చలికాలంలో భూమి అధికంగా చల్లబడడం వలన నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులుగా కనిపిస్తాయి.
వడగళ్లు ఎలా ఏర్పడతాయంటే..
మేఘాల్లో ఉండే నీరు వాతావరణ మార్పులకు కరిగి భూమిపై పడడాన్నే వర్షం అని అంటారు. సాధారణంగా మేఘాల్లోని నీరు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సూపర్ కూల్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇది చిన్న చిన్న మంచు ముక్కలుగా మారి వర్షంగా కురుస్తుంది. అయితే ఆ మంచు ముక్కలు నేలను చేరుకునే సరికి గాలి తాకిడికి నీరుగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ మంచు ముక్కలు గట్టిగా తయారై వడగళ్లుగా వర్షంతో పాటు కిందకు పడతాయి.
ఎక్కువ ఎత్తులో ఉంటూ బలమైన ఉరుములతో కూడిన మేఘాలు వర్షించినప్పుడు మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా కింది నుంచి గాలి పైకి ఒత్తిడి తెచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ముక్కలు కింద పడకుండా తిరిగి మేఘాలపైకి వెళ్తాయి. ఈ క్రమంలో ఆ మంచు ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవడంతో మరికొన్ని మంచు ముక్కలు దగ్గరగా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య జరుగుతున్న కొద్దీ మంచు ముక్కలు ఇంకా పెద్దవిగా రూపాంతరం చెందుతుంటాయి. వీటినే మనం వడగళ్లు అని అంటాం. మేఘం నుంచి వర్షం కురిసేటప్పుడు కొన్ని వడగళ్లు మధ్యలోనే కరుగుతాయి. పెద్ద మంచు ముక్కలు మాత్రం కరగకముందే నేలను చేరుతుంటాయి. వాతావరణ పరిస్థితుల్లో నిలకడ లేనప్పుడు ఇలాంటి వడగళ్ల వానలకు అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు
Comments
Please login to add a commentAdd a comment