నీరుగారుతున్న మామిడి రైతుల ఆశలు
వాతావరణ మార్పులతో విరబూయని పూత
చలి వల్ల ఆలస్యమవుతున్న వైనం
దిగుబడిపై పడనున్న ప్రభావం
ఆందోళనలో రైతన్నలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 వేలకు పైగా ఎకరాల్లో మామిడి తోటలు
మామిడి రైతుకు దిగుబడి దిగులు పట్టుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమవుతోంది. జనవరి (January) మాసం ప్రారంభమై పక్షం రోజులైనా ఆశించిన మేర పూత రాలేదు. ఏటా డిసెంబర్ చివరికల్లా మామిడిచెట్లు పూతతో నిండి కళకళలాడేవి. ఈసారి చలి తీవ్రత, పొగమంచు ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న మామిడితోట (Mango Field) కర్నూలు మండలం శివరామపురం గ్రామం రైతుది. ఎలాగైనా ఈసారి మంచి దిగుబడులు సాధించాలని పైరు చీడ పీడల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వేలాది రూపాయలు పెట్టి ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశాడు. చివరకు చలి తీవ్రత, పొగమంచు ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటి వరకు చెట్లకు పూత పూయలేదు.
కర్నూలు(అగ్రికల్చర్): ఈసారి వ్యవసాయం రైతులకు కలిసి రాలేదు. తొలుత అధిక వర్షాలు, తర్వాత వర్షాభావంతో ఖరీఫ్(Kharif) నిరాశకు గురి చేస్తే, వరుస తుఫానులు రబీ ఆశలను దెబ్బతీశాయి. ఈ క్రమంలో కొందరు రైతులు మామిడి తోటలపై నమ్మకం పెంచుకుంటే ప్రస్తుతం నెలకొన్న చలి తీవ్రత ప్రతికూలంగా మారింది. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో మామడి తోటలు భారీగానే ఉన్నాయి.
మామిడితోటలకు పెట్టింది పేరు బనగానపల్లె ప్రాంతం. బనగానపల్లె, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, పాణ్యం, వెల్దురి, బేతంచెర్ల తదితర మండలాల్లో భారీగా మామడి తోటలున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ ప్రోత్సాహంతో 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా అభివృద్ధి చెందాయి. ఒకవైపు ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీ ఇస్తుండటం, మరోవైపు ఉద్యాన శాఖ ఆకర్షనీయమైన రాయితీల వల్ల మామిడితోటలు పెరిగాయి.
కర్నూలు జిల్లాలో విభిన్న పరిస్థితి
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మామిడి పూత కొంత కనిపిస్తుండగా..తూర్పు ప్రాంతంలో ఇంకా పట్టే దశలోనే ఉంది. ఈభిన్న పరిస్థితికి వాతావరణంలో మార్పే కారణంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు 10–11 డిగ్రీలకు పడిపోయాయి. ఈ వాతావరణం మామిడికి ఇబ్బందికరంగా మారింది. చల్లని వాతావరణం ఉంటే తోటల్లో కొత్త చిగుళ్లు వస్తాయి.
నేడు పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మామిడిలో కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. పత్తికొండ, దేవనకొండ. తుగ్గలి, గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల్లో 50 శాతం వరకు మామిడి పూత వచ్చింది. వెల్దుర్తి, ఓర్వకల్లు, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లి, కృష్ణగిరి, కల్లూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకే పూత వచ్చింది. మామూలుగా అయితే జనవరి మొదటి పక్షంలోపు అన్ని ప్రాంతాల్లోని మామిడిలో 80 శాతంపైగా పూత రావాలి. వాతావరణం చల్లగా ఉండటం, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా పలు ప్రాంతాల్లో పూత ఆలస్యమవుతోంది.
ఒకతోటలో 100 చెట్లు ఉంటే ఇందులో 35–40 శాతం చెట్లు పూతకు వచ్చాయి. మిగిలిన చెట్లలో పూత ఆలస్యమవుతోంది. జనవరి మొదటి పక్షం గడుస్తున్నా ఆశించిన మేర పూత పట్టకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు చలి తీవ్రత వల్ల తేనెమంచు, పురుగుల బెడద పెరుగుతోంది. ఇది మామిడి రైతులను నిరాశకు గురి చేస్తోంది.
వచ్చిన పూత నిలిచేనా...
కొన్ని ప్రాంతాల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ నిలిస్తేనే కాపు బాగుంటుంది. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూత పిందె రాలిపోతుంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో ఆరంభంలో పూత బాగానే వచ్చినప్పటికి తర్వాత ఎండల ప్రభావంతో 60 శాతంపైగా రాలిపోయింది. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో పూత విశేషంగా వచ్చినప్పటికి ఎంత వరకు నిలిచి కాపుగా మారుతుందనేది ప్రశ్నార్థకం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఇందులో కర్నూలు జిల్లాలో 4848 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,167 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 40 శాతం తోటల్లో 50 శాతంపైగా పూత వచ్చింది. 50 శాతం తోటల్లో 30 శాతం వరకే పూత వచ్చింది. 10 శాతం తోటల్లో ఇంకా పూత రాలేదు. పూత రావడంలో హెచ్చు తగ్గులుండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఉద్యాన అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి చెందిన మామిడిలో 70 నుంచి 80 శాతం వరకు బేనిసా ఉంటోంది.
బేనిసా చెట్లు ఒక ఏడాది బాగా కాపు ఇస్తే... మరుసటి ఏడాది కాపునకు రావు. మామిడిలో చాల వరకు పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పూతను బట్టి మామడి కొనుగోలు యత్నాలు జరుగుతాయి. పూత బాగా నిలిస్తే ఎకరాకు 7–8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి వాతావరణం ప్రతికూలతతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది పూత బాగుండేది
నాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గతంలో ఈ సమయానికి మామిడి చెట్లకు పూత బాగా ఉండేది. ఇప్పటి వరకు ఆశించిన మేర పూత లేదు. తేమశాత ఎక్కువ కవడామో లేక వాతావరణ ప్రభావమో తెలియదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట రాకపోతే ప్రభుత్వం అదుకోవాలి.
– కురువ శంకర్, మామిడి రైతు, పూడురు గ్రామం
దిగుబడిపై ప్రభావం
నేను బనగానపల్లె, పాణ్యం, బేతంచర్ల మండలాల్లో సుమారు 14 ఎకరాల తోటలను రూ.3 లక్షల కౌలు ఇచ్చి తీసుకున్నాను. దీనికితోడు మందుల పిచికారీ తదితర వాటి కోసం ల్చక్షకు పైగా ఖర్చు చేశాను. సాధారణంగా ఈ సమయానికి పూత వచ్చి ఉండాలి. ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.– పాంషా, మామిడి తోటల కౌలు రైతు, బనగానపల్లె
మామిడిలో పూతరాకపోతే ఇలా చేయాలి
పలు ప్రాంతాల్లో మామిడిలో పూత రావడం ఆలస్యమ్చవుతోంది. పూత రాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్పర్, 1.6 ఎంఎల్ మోనోక్రోటోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రానితోటల్లో పొగపెట్టాలి. ఇలా చేయడం ద్వారా పూత వచ్చే అవకాశం ఉంది. మరో 10–15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోని అన్ని తోటల్లో పూత వచ్చే అవకాశం ఉంది. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత వచ్చిన తోటల్లో చీడపీడల యాజమాన్యంలో భాగంగా సాఫ్–2 జిఎం, క్లోరోఫైరిఫాస్ 2 ఎంఎల్, బోరాన్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత ఉన్నట్లైతే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 గ్రాములు, హెక్షాకొనజోల్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంది.
– పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment