నగరంలో విస్తరిస్తున్న మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు
దేశంలోని మిగిలిన సిటీల కన్నా మన దగ్గరే అధికం
అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ సహా మరెన్నో ఏర్పాటు
త్వరలోనే నగరానికి సమీపంలో ఏఐ డేటా సెంటర్
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1990లో, దేశంలో తన మొదటి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుండి విండోస్ సృష్టికర్త, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరిస్తోంది. నగరంతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, కోల్‌కతా, ముంబై, పూణేతో సహా 10 నగరాల్లో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపుగా సగం మంది నగరంలోనే ఉండడం గమనార్హం. ఐటీ ఉద్యోగాలు, కార్యకలాపాలపైనే ఈ కథనం..
ఉద్యోగుల సంఖ్యలో మాత్రమే కాదు, హైదరాబాద్ చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ ఇష్టపడే నగరంగా ముందంజలో ఉంది. నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రయాణం 1998లో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) స్థాపనతో ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాకు ఆవల మైక్రోసాఫ్ట్‌కి ఉన్న అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రం ఏదంటే.. అది 54 ఎకరాలలో విస్తరించిన ఐడీసీ హైదరాబాద్ మాత్రమే.
అడ్వాంటేజ్ తెలంగాణ ఒప్పందం..
తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ గత ఏడాది జరిగిన తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో అడ్వాంటేజ్ తెలంగాణను ప్రారంభిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రోగ్రామ్ 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన విస్తరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు భారత పర్యటనలో భాగంగా ఇటీవలే హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ డెవలప్‌మెంట్‌తో సహా రాష్ట్ర సాంకేతిక ప్రాధాన్యతలపై చర్చించారు. ఏడాది వ్యవధిలో భారత్‌కు ఆయన రావడం ఇది వరుసగా రెండోసారి. దేశంలోని మొదటి మైక్రోసాఫ్ట్ తన ఓపెన్ ఏఐ కార్యాలయాన్ని కూడా నగరంలోనే ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.
మేకగూడలోనూ మైక్రోసాఫ్ట్..
మైక్రోసాఫ్ట్ తన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి నగరాన్ని కేంద్రంగా మార్చుకుంది. దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌లను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల నగరానికి సమీపంలోని మేకగూడలో 181.25 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గత సంవత్సరం, కూడా నగరంలో దాదాపు 267 కోట్ల రూపాయలతో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రదేశాల్లో కొత్త డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది.
అనుకూల వాతావరణం..
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నగరంలో, పూణెలో నిర్వహిస్తున్న రెండు డేటా సెంటర్లలో ప్రస్తుతం 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2026 చివరి నాటికి ఈ సంఖ్య 289 మంది కావచ్చని సమాచారం. ‘హైదరాబాద్, పూణేలలో ఐటీకి మంచి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధాన వాతావరణాలు ఉన్నాయి. అలాగే డేటా సెంటర్ పెట్టుబడులకు అనువుగా ఉండే టాలెంట్ కారిడార్‌లకు ఇవి సమీపంలో ఉన్నాయి’ అని అనరాక్‌లోని ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ డేటా సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవి శంకర్ అంటున్నారు. ఇటీవలి తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ బెంగళూరు హైదరాబాద్ కార్యకలాపాలు తమ కంపెనీకి బలం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment