Corner
-
సాఫ్ట్వేర్.. కేరాఫ్ హైదరాబాద్..
దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం 1990లో, దేశంలో తన మొదటి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుండి విండోస్ సృష్టికర్త, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరిస్తోంది. నగరంతో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, కోల్‌కతా, ముంబై, పూణేతో సహా 10 నగరాల్లో ఉన్నప్పటికీ.. మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపుగా సగం మంది నగరంలోనే ఉండడం గమనార్హం. ఐటీ ఉద్యోగాలు, కార్యకలాపాలపైనే ఈ కథనం.. ఉద్యోగుల సంఖ్యలో మాత్రమే కాదు, హైదరాబాద్ చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ ఇష్టపడే నగరంగా ముందంజలో ఉంది. నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రయాణం 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) స్థాపనతో ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాకు ఆవల మైక్రోసాఫ్ట్‌కి ఉన్న అతిపెద్ద ఆర్ అండ్ డీ కేంద్రం ఏదంటే.. అది 54 ఎకరాలలో విస్తరించిన ఐడీసీ హైదరాబాద్ మాత్రమే. అడ్వాంటేజ్ తెలంగాణ ఒప్పందం.. తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ గత ఏడాది జరిగిన తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో అడ్వాంటేజ్ తెలంగాణను ప్రారంభిస్తూ అవగాహనా ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రోగ్రామ్ 2025 నాటికి 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన విస్తరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు భారత పర్యటనలో భాగంగా ఇటీవలే హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ డెవలప్మెంట్తో సహా రాష్ట్ర సాంకేతిక ప్రాధాన్యతలపై చర్చించారు. ఏడాది వ్యవధిలో భారత్‌కు ఆయన రావడం ఇది వరుసగా రెండోసారి. దేశంలోని మొదటి మైక్రోసాఫ్ట్ తన ఓపెన్ ఏఐ కార్యాలయాన్ని కూడా నగరంలోనే ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.మేకగూడలోనూ మైక్రోసాఫ్ట్.. మైక్రోసాఫ్ట్ తన మౌలిక సదుపాయాలను విస్తరించడానికి నగరాన్ని కేంద్రంగా మార్చుకుంది. దేశంలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల నగరానికి సమీపంలోని మేకగూడలో 181.25 కోట్లతో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. గత సంవత్సరం, కూడా నగరంలో దాదాపు 267 కోట్ల రూపాయలతో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రదేశాల్లో కొత్త డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది.అనుకూల వాతావరణం.. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నగరంలో, పూణెలో నిర్వహిస్తున్న రెండు డేటా సెంటర్లలో ప్రస్తుతం 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2026 చివరి నాటికి ఈ సంఖ్య 289 మంది కావచ్చని సమాచారం. ‘హైదరాబాద్, పూణేలలో ఐటీకి మంచి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన విధాన వాతావరణాలు ఉన్నాయి. అలాగే డేటా సెంటర్ పెట్టుబడులకు అనువుగా ఉండే టాలెంట్ కారిడార్లకు ఇవి సమీపంలో ఉన్నాయి’ అని అనరాక్లోని ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ డేటా సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవి శంకర్ అంటున్నారు. ఇటీవలి తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ బెంగళూరు హైదరాబాద్ కార్యకలాపాలు తమ కంపెనీకి బలం అని పేర్కొన్నారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్
ముంబైలోని మురికివాడల్లో ఉదయం పూట మహిళాపోలీసులు ‘కార్నర్ మీటింగ్స్’ నిర్వహిస్తున్నారు. ప్రతి వీధిలోని ఒక మూల మీద అక్కడ పోగైన స్త్రీలకు, పిల్లలకు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’తో మొదలు డ్రగ్స్, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్‌ల గురించి వివరిస్తున్నారు. పెద్దగా చదువులేని మహిళలకు ఈ వీధిమలుపు మీటింగ్‌లు మేలుచేస్తున్నాయి. నిజానికి ప్రతి రాష్ట్రంలో, ప్రతి బస్తీల్లో ఇలాంటి కార్నర్ మీటింగ్‌ల అవసరం ఉంది. నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న స్త్రీల భద్రత గురించి కొంతైనా నిశ్చింత ఉంది. కాని ఇవే నగరాల్లో, పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లోని, బస్తీల్లోని స్త్రీల, పసిపిల్లల భద్రత చాలా కష్టతరమైనది. చట్టపరంగా ఎంత కట్టుదిట్టాలు ఉన్నా స్వీయ అవగాహన లేకపోతే ప్రమాదం తప్పదు. మన దేశంలో నిత్యం పసి పిల్లల మీద అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పిపోతున్న పిల్లల సంఖ్య తీవ్రంగా ఉంది. మరోవైపు అసంఘటిత రంగాల్లో స్త్రీలపై లైంగిక దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు లేని స్త్రీలు ఈ విషయమై ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధ పడతారు, ఆందోళన చెందుతారు. అందుకే ముంబైలో మహిళా పోలీసులు ‘కార్నర్ మీటింగ్’ లు నిర్వహిస్తున్నారు. సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం పోలీసు అధికారుల సూచన మేరకు మహిళా పోలీసులతో మొదలైన ఈ పని సత్ఫలితాలను ఇస్తోంది. ముంబైలోని అతి పెద్ద మురికివాడలకు రోజూ ఉదయం పూట మహిళా పోలీసు బృందాలు చేరుకుని వీధి మూలల్లో ఆడవాళ్లను కూడేసి జాగ్రత్తలు చెప్పడమే ఈ కార్నర్ మీటింగ్‌ల ఉద్దేశం. ఆడపిల్లలకు అర్థమయ్యేలా ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ల గురించి చెప్పడం మరో ముఖ్య ఉద్దేశం. అపరిచితులకు పిల్లల్ని అప్పగించి పనుల్లోకి వెళ్లకుండా చూడటం, మొబైల్ ఫోన్లలో వచ్చే కేటుగాళ్ల కాల్స్ వల్ల ఆర్థికంగా నష్టపోకుండా చూడటం కూడా కార్నర్ మీటింగ్‌ల ముఖ్యవిధిగా ఉంది. ‘రోజూ పది నుంచి పదకొండు గంటల మధ్య బస్తీ స్త్రీలు ఖాళీగా దొరుకుతారు. వారికి అన్ని విధాలా కౌన్సెలింగ్ ఇచ్చి అలెర్ట్ చేస్తాం. చిన్నచిన్న ఫ్యాక్టరీల్లో పని చేసే స్త్రీలు లైంగికపరంగా వేధింపులను ఎదుర్కొంటే ఫిర్యాదు చేయమని చెబుతాం. దీని వల్ల దౌర్జన్యకారుల్లో భయం ఏర్పడుతోంది’ అంటున్నారు మహిళా పోలీసులు. అలాగే వ్యభిచార వృత్తిలోకి ఈడ్చబడే స్త్రీల, బాలికలను కాపాడే బాధ్యత వారి గురించి సమాచారం ఇచ్చే చైతన్యం కూడా బస్తీ మహిళలకు కలిగిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల జరిగే హాని చెబుతున్నారు. నిజానికి ఈ పని ముంబైలోనే కాదు దేశంలోని ప్రతి నగరంలో చదువులేని బీదసాదలు ఉండే అన్నీ ఊళ్ల వాడల్లో జరగాలి. సత్ఫలితాలు ఇస్తున్న ఈ పనిని మిగిలిన రాష్ట్రాల్లోని పోలీసులు కూడా అనుసరిస్తే బాగుంటుంది. -
రెండు లక్షల కొలువులిస్తాం
జవహర్‌నగర్, మేడ్చల్ రూరల్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, తమ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఆగమవుతుందని కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ను అభివృద్ధి చేయకపోగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, మేడ్చల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్ (జంగయ్య) యాదవ్‌ను గెలిపించాలంటూ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఆస్తులున్న కోకాపేట వైపు ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేయకపోగా డంపింగ్ యార్డ్‌ను బహుమతిగా ఇచ్చారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లలో ఐటీ కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. మేడ్చల్‌లో ఐటీ పార్క్ తెస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ పత్తాలేకుండా పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం..’’అని తెలిపారు. మల్లారెడ్డి టికెట్ కోసం ఎన్నికోట్లు ఇచ్చారు? రాష్ట్రంలో కేసీఆర్ వందల కోట్లు దండుకుంటుంటే.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జాచేస్తూ, కిందిస్ధాయి ప్రజాప్రతినిధులకు సీట్లు అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభు త్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టినా పట్టించుకోవడం లేదుగానీ.. పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలి..’’అని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక్కడ మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మూడోసారి గెలిపించాలంటూ వస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాల తరలింపు వంటివి వచ్చిది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదా? అని ప్రశ్నించారు. దొరల ప్రభుత్వాన్ని కూల్చాలి అసలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాందీ, కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో. బిర్లామందిర్ మెట్లపైనో బిచ్చమెత్తుకునే వారని రేవంత్ అన్నారు. హరీశ్‌రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్, కేటీఆర్‌లకు వేల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల పాలనకు, పేదలకు మధ్య పోరాటమని.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 91వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలే వెల్లడించాయని రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి 250 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆడపిల్లలకు పెళ్లినాడే రూ.లక్ష ఆర్థిక సా యంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, జవహర్‌నగర్ ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడు అనిల్, రజక, కురుమ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రోడ్డును పట్టించుకునేదెవరూ ?
సాక్షి, బుగ్గారం: ధర్మపురి నుంచి జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారిపై నేరెళ్ల గ్రామ సమీపంలోని గుట్ట వద్ద రహదారి పూర్తిగా శిథిలమైంది. దీంతో వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. రహదారి అంతా గుంతలమయంగా మారడంతో రాత్రిపూట వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రహదారి గుంతలమయం కావడమే కాకుండా, మూల మలుపు ప్రాంతం కూడా కావడంతో గతంలో ఇదే ప్రాంతంలో వాహనాలు నియంత్రణ కోల్పోయి పలు ప్రమాదాలు సంభవించాయి. పలుమార్లు వాహనాలు బోల్తా పడడంతో పాటు కొంతమంది చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. -
ప్రయాణికుల కోసం పుస్తక భాండాగారం!
టీవీలు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేనపుడు యువతీ యువకులకు పుస్తక పఠనమే అలవాటుగా ఉండేది. సాహిత్య సామాజిక రంగాలకు చెందిన పుస్తకాలు వారి చేతుల్లో కనిపించేవి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి మచ్చుకు కూడ కనిపించడం లేదు. పుస్తకాల స్థానాన్ని సెల్ ఫోన్లు, మాధ్యమాలు ఆక్రమించేశాయి. పుస్తక పఠనం వ్యక్తుల్లో మానసిక వికాసాన్ని కలిగిస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారు లోకజ్ఞానంలోనే కాక, అనేక రకాల సామర్థ్యాలను, ప్రతిభను కలిగి ఉన్నట్లు పరిశోధకులు సైతం గుర్తించారు. అందుకే ప్రయాణీకుల ఖాళీ సమయం వృధా కాకుండా పుస్తక పఠనానికి వినియోగించుకునేందుకు వీలుగా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల ఆసక్తికి అనుగుణంగా, వారి వయసును, ఇష్టాన్నిబట్టి చదువుకునేందుకు వీలుగా షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం ఓ పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు వారి ఖాళీ సమయంలో తమకిష్టమైన పుస్తకాలు, మ్యాగ్జిన్లు చదువుకునేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లోని మెయిన్ టర్మినల్ లో రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016 ను జరుపుకోవడంతోపాటు తమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణీకులకోసం ఈ కొత్త సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ జాతీయులు, నివాసితుల్లో చదివే సంస్కృతిని పెంపొందించాలన్నదే లక్ష్యంగా విమానాశ్రయాల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ చొరవ చూపించింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ మంత్రిత్వ శాఖ మార్గదర్వకత్వంలో ప్రయాణీకులకు మంచి అనుభవాన్ని అందించేందుకు ఈ రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్ అల్ నయాన్ తెలిపారు. విమానాశ్రయంలో ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, వినియోగదారులు పుస్తక పఠనంతో తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు, కొత్త అనుభవాన్నిపొందేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లో రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా అనేక ప్రచురణలను అక్కడ అందుబాటులో ఉంచినట్లు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయ అథారిటీ ఛైర్మన్ అలీ సేలం అల్ మడ్ఫా తెలిపారు. -
గోవింద్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
మర్డర్ కేసులో ప్రధాన కుట్రదారుపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న పోలీసులు విజయవాడ సిటీ : జిల్లాలోని ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో ప్రధాన కుట్రదారుడైన భూతం గోవింద్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విదేశాల్లో తలదాచుకున్న గోవింద్‌ను రప్పించేందుకు ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గోవింద్ ఆచూకీ కోసం ‘రెడ్‌కార్నర్’ నోటీసు జారీ చేసి విదేశీ మీడియా ద్వారా ఫొటోలను విస్తృత ప్రచారం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, పగిడి మారయ్య, గుంజుడు మారయ్య గత నెల 24న ఏలూరు కోర్టు వాయిదాకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవేటు వాహనంలో వెళుతుండగా పెదఅవుటుపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై కిరాయి హంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై నమోదైన కేసులో 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏడుగురు సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో 10మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో భూతం గోవింద్‌ను ప్రధాన కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. తన సోదరుడు భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులను చంపాలని గోవింద్ నిర్ణయించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం విదేశంలోనే కుట్ర రూపొందించాడని వారు పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తన అనుచరుల ద్వారా ఢిల్లీ కిల్లర్ గ్యాంగ్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుని హత్యలు చేయించినట్లు వారు నిర్ధారించుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా గోవిందు పాత్ర కీలకమని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్న గోవింద్‌ను రప్పించేందుకు సీఐడీ విభాగం ద్వారా సీబీఐకి లేఖ రాయనున్నారు. తద్వారా సీబీఐ వర్గాలు ఇంటర్‌పోల్ సాయంతో నిందితున్ని విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపడతాయి. విదేశాల్లో సాధారణ జీవితం గడుపుతున్న గోవింద్‌ను పట్టుకోవడం ఇంటర్‌పోల్‌కు అసాధ్యమేమీ కాదు. అతడిని దేశానికి రప్పించేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంటర్‌పోల్ సాయంతో త్వరలోనే పట్టుకుంటామని వారు చెబుతున్నారు.