ప్రయాణికుల కోసం పుస్తక భాండాగారం!
టీవీలు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో లేనపుడు యువతీ యువకులకు పుస్తక పఠనమే అలవాటుగా ఉండేది. సాహిత్య సామాజిక రంగాలకు చెందిన పుస్తకాలు వారి చేతుల్లో కనిపించేవి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి మచ్చుకు కూడ కనిపించడం లేదు. పుస్తకాల స్థానాన్ని సెల్ ఫోన్లు, మాధ్యమాలు ఆక్రమించేశాయి. పుస్తక పఠనం వ్యక్తుల్లో మానసిక వికాసాన్ని కలిగిస్తుందని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. పుస్తకాలు చదవని వారితో పోలిస్తే చదివేవారు లోకజ్ఞానంలోనే కాక, అనేక రకాల సామర్థ్యాలను, ప్రతిభను కలిగి ఉన్నట్లు పరిశోధకులు సైతం గుర్తించారు. అందుకే ప్రయాణీకుల ఖాళీ సమయం వృధా కాకుండా పుస్తక పఠనానికి వినియోగించుకునేందుకు వీలుగా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నూతన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేట్టుగా రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది.
ప్రయాణీకుల ఆసక్తికి అనుగుణంగా, వారి వయసును, ఇష్టాన్నిబట్టి చదువుకునేందుకు వీలుగా షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం ఓ పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణీకులు వారి ఖాళీ సమయంలో తమకిష్టమైన పుస్తకాలు, మ్యాగ్జిన్లు చదువుకునేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లోని మెయిన్ టర్మినల్ లో రీడింగ్ కార్నర్ ను ఏర్పాటు చేసింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇయర్ ఆఫ్ రీడింగ్ 2016 ను జరుపుకోవడంతోపాటు తమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణీకులకోసం ఈ కొత్త సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది.
గల్ఫ్ జాతీయులు, నివాసితుల్లో చదివే సంస్కృతిని పెంపొందించాలన్నదే లక్ష్యంగా విమానాశ్రయాల్లో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ చొరవ చూపించింది. సంస్కృతి మరియు నాలెడ్జ్ మంత్రిత్వ శాఖ మార్గదర్వకత్వంలో ప్రయాణీకులకు మంచి అనుభవాన్ని అందించేందుకు ఈ రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్ అల్ నయాన్ తెలిపారు. విమానాశ్రయంలో ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, వినియోగదారులు పుస్తక పఠనంతో తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు, కొత్త అనుభవాన్నిపొందేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ లో రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా అనేక ప్రచురణలను అక్కడ అందుబాటులో ఉంచినట్లు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయ అథారిటీ ఛైర్మన్ అలీ సేలం అల్ మడ్ఫా తెలిపారు.