దుబాయ్‌ టు సిటీ.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ | 15 KG Gold Seized In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ టు సిటీ.. గోల్డ్‌ స్మగ్లింగ్‌

Published Mon, Aug 14 2023 1:23 AM | Last Updated on Mon, Aug 14 2023 10:51 AM

15 KG Gold Seized In Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు..

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్‌ అధికారులనే కలవరప­రుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్‌ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. 

కిలోకు రూ.5 లక్షల లాభం
విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్‌ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమై­తే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. 

టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. 
బడ్జెట్‌ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవా­ణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమా­ని­స్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమా­నులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్య­వర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువ­తులు, మహి­ళలకు కమీషన్‌ ఇస్తామంటూ ఎర వేస్తున్నా­రు. వీరికి టికెట్లు కొనిచ్చి విదే­శాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేట­ప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకా­రంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. 

స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్‌
దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్‌ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. 

జోరుగా రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌..
చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పౌడర్‌ డబ్బాలతో పాటు మైబైల్‌ చార్జర్స్‌ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచి­కిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరి­ష్టం­గా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపె­ట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కా­ర్బ­న్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. 

క్లెయిమ్‌ చెయ్యకుంటే వేలం
కస్టమ్స్‌ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్‌ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్‌ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్‌ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్‌ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్‌ బంగారం తనదే అని క్లైమ్‌ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్‌ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ  క్లెయిమ్‌ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్‌ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.

రియాద్‌ నుంచి వయా మస్కట్‌
శంషాబాద్‌ (హైదరాబాద్‌):
 రియాద్‌ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయి­ర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్‌ నుంచి వయా మస్క­ట్‌ మీదుగా శంషాబాద్‌ ఎ­యి­ర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌­ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు  కస్ట­మ్స్‌ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్‌ ఏరియాలోకి వచ్చారు. వారి కదలి­కలను అనుమానించిన సీఐఎస్‌ఎఫ్‌ అధికా­రులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్‌ ప్యాకెట్‌లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలు­సులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్ట­మ్స్‌ అధికారులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement