బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.
‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్‌డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
బ్లూ కార్నర్ నోటీసులు అంటే?
బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment