సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ఆదివారం కూడా కొనసాగాయి. దీంతో మామిడి, టమాట, వరి, అరటి, దోస తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు కోలుకోలేని నష్టం సంభవించింది. కోతకు వచ్చే దశలో ప్రకృతి సృష్టించిన బీభత్సంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి, టమోట, వరి పంటలు నేలపాలవ్వగా, రెండు పాడి ఆవులు మృతి చెందాయి. గత నెలలో కురిసిన అకాల వర్షానికి దాదాపు 40 వేల హెక్టార్లలో మామిడి పూత పూర్తిగా దెబ్బతింది. అదేగాక తూర్పు మండలాల్లో అధికంగా సాగయ్యే వరి పంట చేతికందే సమయంలో పూర్తిగా నేలపాలవడం, నూర్పిడిలో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో మొత్తం 2 లక్షల క్వింటాళ్ల మేరకు ధాన్యం దెబ్బతింది. పలు మండలాల్లోని 10 వేల హెక్టార్ల వరకు టమోటా పంట నీటమునిగి కుళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో మళ్లీ శుక్ర, శని, ఆదివారాల్లో కురిసిన వడగండ్ల వర్షంతో ఉన్న కాస్త పంట కూడా చేజారిపోయింది. కురబలకోట, పెద్దతిప్పసముద్రం, వి.కోట, గంగవరం, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో నష్టం ఎక్కువ సంభవించింది. దాదాపు 10 వేల హెక్టార్లకు పైబడి మామిడి పంట నేలపాలయింది. దాదాపు వెయ్యి హెక్టార్లలో కోతకు సిద్ధంగా ఉన్న టమాట పనికిరాకుండా పోయింది. వరి పంట కూడా దాదాపు వెయ్యి ఎకరాల మేరకు దెబ్బతింది. వైఎస్సార్ జిల్లాలో వరుసగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు రూ.12.52 కోట్ల పంట నష్టం సంభవించింది. గత నెల 17న వీచిన గాలులు, వాన దెబ్బకు అరటి, బొప్పాయి, మామిడి, ఉల్లి పంటలతోపాటు ఉడికించి ఎండబోసిన 274 హెక్టార్లలోని పసుపు పంట నీటిపాలైంది. రూ.80 లక్షల నష్టం వాటిల్లింది.
అలాగే, 30, 31 తేదీల్లో ఈదురుగాలులు, వాన బీభత్సానికి అరటి, బొప్పాయి, మామిడి, టమాటా, దోస పంటలు 824.5 హెక్టార్లలో దెబ్బతినగా రూ.11.72 కోట్ల దిగుబడులు రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లాలోనూ పండ్ల తోటలకు రూ.70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. రాప్తాడు, యాడికి, ఎన్‌పీ కుంట, తలుపుల, పుట్లూరు, ఓడీ చెరువు, నార్పల, యల్లనూరు తదితర మండలాల పరిధిలో అరటి, టమాట, మామిడి తోటలు 80 నుంచి 90 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రైతులకు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇదిలా ఉంటే.. మండు వేసవిలో ఉక్కపొతతో అల్లడుతున్న విజయవాడ వాసులు అదివారం రాత్రి కురిసిన తేలికపాటి వర్షంతో సేద తీరారు. సెలవు రోజు కావడంతో కుటుంబంతో బయటకు వచ్చిన వారు కొంత ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరాఫరాకు అంతరాయం కలిగింది.
హైదరాబాద్‌ను కుదిపేసిన వాన
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుమారు అర్ధగంటకు పైగా వర్షం కురవడంతో పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో నగరవాసులకు ఎండ నుంచి ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆదివారం కూడా కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రబీ పంటలను ఊడ్చిపెట్టేసింది. చేతికందే దశలో ఉన్న కష్టార్జితం తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడ చూసినా నేలరాలిన వడ్ల గింజలు, మామిడి కాయలు.. ఇతర పంటలు రైతుకు కన్నీటినే మిగిల్చాయి.
నేడూ రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం, దీని నుంచి కొమరిన్ వరకు విదర్భ, కర్ణాటక, తమిళనాడుల మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉన్నాయని.. వీటి ఫలితంగా సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. అనంతరం రానున్న మూడు రోజులూ రాష్ట్రంలో అక్కడక్కడ జల్లులుగాని, తేలికపాటి వర్షంగాని కురవవచ్చని పేర్కొంది. ద్రోణి, ఆవర్తనాల ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని, దీంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రైతులకు ‘అకాల’ దెబ్బ!
Published Mon, Apr 2 2018 4:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment