సాక్షి, నెట్‌వర్క్/సాక్షి, అమరావతి: అప్పటివరకు నిప్పులు కురిపించిన సూరీడుని కారుమబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం మూడింటికే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోగా భీకర శబ్దంతో కూడిన ఉరుములు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మరోవైపు జనజీవనం అస్తవ్యస్థమయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ధాటికి చేతికొచ్చాయనుకున్న అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోగా.. కళ్లాల్లో ఆరబోసిన పసుపు, ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి
కృష్ణా జిల్లాలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. దీంతో విజయవాడలోని పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీపట్నం మండలం గుంటుపల్లి రమేశ్‌నగర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళుతున్న బస్సుపై చెట్టు విరిగిపడటంతో రోడ్డుకు ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో హైవే సిబ్బంది, పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నూజివీడు, మైలవరం మండలాల్లోని మామిడి కాయలు నేలరాలి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. ఇబ్రహీంపట్నం మండలంలో వడగళ్ల వాన పడగా.. గుడివాడ, కైకలూరు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మరోవైపు గుంటూరు జిల్లాలో పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. పుసులూరుకు చెందిన సీతారపు మాధవి, కొండేపాటి వెంకట్రావు, తాడికొండ మండలంలో కశమ్ కుమారి, బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో మేరుగు గోపికృష్ణ, మేరుగు మరియబాబు, అనంతవరప్పాడులో వేజెండ్ల రత్నకుమారి, పెదమక్కెనలో గుంటుపల్లి గోపి పిడుగుల ధాటికి మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈదురుగాలులకు 8 పూరిళ్లు, రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లోనే రూ.6 కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. పెదవడ్లపూడిలో పిడుగుపాటుకు మిర్చి పంట దగ్ధమైంది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కనిగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పామూరు మండలంలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
నలుగురు మత్స్యకారులు గల్లంతు..
విశాఖ నగరంలో ఉదయం 9 గంటల నుంచి గంటన్నరకు పైగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నగరంలోని పెదజాలరిపేటకు చెందిన తెడ్డు పెంటయ్య, తెడ్డు పరశయ్య, పోలారావులు మంగళవారం ఉదయం చిన్న తెప్పలపై వేటకు వెళ్లారు. అలల ధాటికి వీరు గల్లంతైనట్లు స్థానిక మత్స్యకారులు చెప్పారు. దీంతో కోస్టుగార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పడమట వీధికి చెందిన జన్యావుల ప్రభాకర్(40) తాటి చెట్టు విరిగి మీదపడటంతో మృతిచెందాడు. కామవరపుకోటకు చెందిన డేగల చిరంజీవి(28) పిడుగుపడి మృతి చెందాడు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో సరఫరా నిలిచిపోయింది.
రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో వరి, జీడిమామిడి, మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. కాకినాడ, పిఠాపురంలో గంటకు పైగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏజెన్సీలోని దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు రూ.7.4 కోట్ల విలువైన పంట నష్టపోయే అవకాశముందని వ్యవసాయాధికారులు చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఉప్పుకయ్యల్లోకి నీరు చేరింది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి దాదాపు 3 గంటలపాటు భయానక వాతావరణం నెలకొంది. చేపలవేటకు వెళ్లిన మూగి బూలోక(తిప్పలవలస), మేడ దానయ్య(చింతలపల్లి)తో పాటు పొలం పనులకు వెళ్లిన రెడ్డి సింహాచలం(వీఆర్ పేట), ఎల్లమ్మ(వెంగాపురం) పిడుగులు పడి మృతి చెందారు. భోగాపురం, పూసపాటిరేగ మండలంలో విస్తరించి ఉన్న తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. భోగాపురం మండలం పెదకొండరాజుపాలెంలో కొట్టుకుపోతున్న బోటును లాక్కొచ్చేందుకు వెళ్లిన బొద్దు చినఅమ్మోరు(28) అలల ధాటికి గల్లంతయ్యాడు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీళ్లు
ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రభుత్వ తీరు కారణంగా కళ్ల ముందే నీటిపాలవ్వడంతో రైతులు కన్నీళ్లుపెట్టుకున్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు పెద్ద ఎత్తున ధాన్యం తరలించారు. తేమ శాతం చూసి, కాట వేసి ధర నిర్ణయించిన అనంతరం ఈ ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల వారం రోజులుగా ధాన్యం మార్కెట్‌లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో యార్డ్‌లోని ధాన్యపు బస్తాలు నీటమునిగాయి. పి.వెంకటేశ్వరరావు అనే రైతు 10 ఎకరాల్లో తాను పండించిన వరి ధాన్యాన్ని ఇటీవల గొల్లపూడి యార్డ్‌కు తీసుకువచ్చాడు. దాన్ని యార్డ్ ఆవరణలోనే ఆరబెట్టడంతో మొత్తం ధాన్యం నీటికి డ్రైన్లలో కొట్టుకుపోయింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించేందుకు సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని వాపోయాడు.
అంధకారంలో రాష్ట్రం
అకాల వర్షం వల్ల పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఒక్క రోజే దాదాపు 780 విద్యుత్ అంతరాయాలు నమోదైనట్టు పంపిణీ సంస్థలు తెలిపాయి. 50 ఫీడర్లలో ఐదు నుంచి ఎనిమిది గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా లక్షలాది మంది అంధకారంలో ఉండాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాలో గాలుల ధాటికి 12 చోట్ల విద్యుత్ తీగలు తెగాయని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది తెలిపారు. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అయ్యాయి. మారుమూల గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మరో 12 గంటల సమయం పట్టవచ్చని అధికారులు చెప్పారు. ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 33కేవీ విద్యుత్ స్తంభాలు నాలుగు, 11కేవీ విద్యుత్ స్తంభాలు 10, ఎల్‌టి విద్యుత్ స్తంభాలు 28, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నాలుగు దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment