Hailstorm Rain
-
ఈదురు గాలులకు ఊయలతో సహా ఎగిరిపడి..
గజ్వేల్ రూరల్/ కౌడిపల్లి (నర్సాపూర్): రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి పక్కింటి డాబాపై పడి మృతిచెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలిన ఘటనలో ఓ టెన్త్ విద్యార్థి కన్నుమూశాడు. వడగళ్ల వాన ధాటికి సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్సింగ్, మంజుల దంపతులకు ఒక కుమా రుడు, కవలలు సీత, గీత ఉన్నారు. దంపతులు కూలిపనులకు వెళ్లగా పిల్లలు, నానమ్మ ఇంటివద్ద ఉన్నారు. మంగళవారం గాలి వాన ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీర ఉయ్యాలలో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతో పాటు ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య–రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ గజ్వేల్‌లో ఐటీఐ చదువుతుండగా, రెండో కుమారుడు వెంకటేశ్ (15) పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. రోజుమాదిరిగానే పొలం వద్ద ఉన్న పశువులను సాయంత్రం వేళ ఇంటికి తోలుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల ధాటికి రోడ్డుపక్కనున్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలు ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కురిసిన వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. పట్టణంలో అత్యధికంగా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గాలి దుమరానికి చెట్లు విరిగి ఇళ్లపై, వాహనాలపై పడి తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు.. వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణాలోని పలుజిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతున్నాయి. శ్రీశైలంలో గాలివానకు కారుపై భారీ వృక్షం విరిగిపడింది. అయితే కారులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భద్రాద్రి, జనగామ, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణ్‌ఖేడ్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో భారీ వర్షం కురుస్తోంది. కరీంనగర్లో పిడుగుపడి ఓ యువకుడు మృతి చెందాడు. వడగళ్ల వానతో పలుజిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన ధాన్యం తడవడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణకేం ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ►ఎన్టీఆర్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వాన బీభత్సం ►నిజామాబాద్‌లోని సిరికొండలో ఈదురుగాలులతో కూడిన వర్షం. ►ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం. ►కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పెట్టులో వడగళ్ల వాన ►ప్రకాశం జిల్లా దర్శిలో ఈదురుగాలులతో భారీ వర్షం ►విజయవాడలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ►పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం ►వినుకొండలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 31 నుంచి 21 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలతిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా మాల్దీవుల నుంచి కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుండగా.. ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు, పిడుగులు పడతాయని చెబుతున్నారు. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు పొలం పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ -
TS: పలు జిల్లాల్లో వడగండ్ల వానలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. అయితే, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉపరిత ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. సోమవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని సూచించింది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 21.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
అమెరికాలో మంచు వడగండ్ల వాన
ఆస్టిన్/న్యూయార్క్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌లో అసాధారణం న్యూయార్క్ వాసులు ఏటా డిసెంబర్– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్తో కొట్లాడుతూ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్‌లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఉటాహ్‌లోని వెల్స్విల్లెలో మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి -
భారీగా వడగళ్ల వాన
సాక్షి, పాడేరు: జిల్లాలో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, డుంబ్రిగుడ, పెదబయలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు, వడగళ్లతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాసింది, మధ్యాహ్నం 12గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పాడేరు, హుకుంపేట ప్రాంతాల్లో సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది. భారీ సైజులో వడగళ్లు పడ్డాయి. పాడేరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు తమ సెల్ కెమెరాల్లో బంధించి, సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. వడగళ్లను సేకరించేందుకు పిల్లలు పోటీపడ్డారు. పాడేరు ఘాట్‌రోడ్డులో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కొయ్యూరు: మండలంలో సుమారు గంట పాటు పెద్ద శబ్దాలు, తీవ్రమైన కాంతితో ఉరుములు, మెరుపులు రావడంతో పాటు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. -
అకాల వర్షం .. అతలాకుతలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన పడింది. దీంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, పసుపు, మిర్చి, అరటి పంటలు నేలవాలాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇటీవల ఏర్పాటు చేసిన సీతారాములు పట్టాభిషేకం భారీ కటౌట్ కుప్పకూలింది. జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా వర్షపాతం నమోదయ్యింది. జగిత్యాల జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొక్కజొన్న, పసుపు, మిర్చి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడిచెట్ల పూత రాలిపోయింది. మేడిపల్లి మండలం గోవిందారంలో 68.0 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం వడగళ్ల వాన దంచి కొట్టింది. దీంతో కూరగాయల తోటలు, నాటు వేసిన పొలాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా జన్నారం, భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, మంచిర్యాల మండలాల్లో వర్షం కురిసింది. జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానలో గాయపడిన పెంద్రం రాజు పటేల్ (55) మంగళవారం చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లాలో కంది, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగు కట్ట తెగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో వడగళ్ల వాన పడింది. పాలమూరులో భారీ వర్షం కురిసింది. ఇక వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. -
‘దడ’గళ్ల వాన
కోటగిరి/రుద్రూర్ (బోధన్): నిజామాబాద్ జిల్లా కోటగిరి, రుద్రూర్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో బుధవారం రాత్రి 8.30 నుంచి గంట పాటు వడగళ్ల వాన జోరుగా కురిసింది. కోటగిరి మినహా మండలంలోని హెగ్డోలి, ఎత్తొండ, వల్లభాపూర్, యాద్గార్ పూర్, కొల్లూర్ గ్రామాలతో పాటు రుద్రూర్ మండల కేంద్రంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. యాసంగిలో వేసిన సూర్యకాంతం పూలు, మొక్కజొన్న, గోధుమ పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నట్టు సమాచారం. -
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
సాక్షి, కరీంనగర్: మండే ఎండలు ఒకవైపు.. అకాల వర్షాలు మరోవైపుతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమైన రైతన్నలకు అపారనష్టాన్ని కలగజేసింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కూడా గాలివాన, వడగళ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని మేడిపల్లి, మల్యాల, గన్నేవరం, బెజ్జంకి, కోహెడ మండల్లాలో వడగళ్ల వాన కురిసింది. గాలులు వీచడంతో జగిత్యాల, నిజామాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అకాల వడగండ్ల వానతో పంటనష్టం సంభవించి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది .. ఆకాశం మేఘావృతమై…మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్ నగరంలో నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో భారీ వర్షం సంభవించింది. దీంతో పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. -
కుప్పకూలిన విమానం
డ్యురాంగో: భారీ వడగళ్ల వానకు ఉత్తర మెక్సికోలో ఏరోమెక్సికోకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. డ్యురాంగో నుంచి మెక్సికోకు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వడగళ్ల వానలో విమానం చిక్కుకుంది. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో విమానం కుప్పకూలింది. వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 99 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇద్దరు విమాన సిబ్బంది కలిపి మొత్తం 103 మంది అందులో ఉన్నారు. వారిలో 97 మందికి గాయాలయ్యాయి. పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. విమాన సిబ్బంది ఎంతో చాకచక్యంగా, నేర్పరితనంతో విమానాన్ని భారీ ప్రమాదం నుంచి తప్పించారని ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ జనరల్ ఆండ్రెస్ కొనేసా అభినందించారు. విమానం భద్రతా ప్రమాణాల వల్లే.. ఏరోమెక్సికో విమాన ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడానికి కారణం దాన్ని తయారుచేసిన విధానం, భద్రతా ప్రమాణాల వల్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. విమానం లోపలి భాగాలు మంటలు అంటుకుని కాలిపోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని, ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కాకపోవడం వల్లే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. -
పిడుగుల వర్షం
సాక్షి, నెట్వర్క్/సాక్షి, అమరావతి: అప్పటివరకు నిప్పులు కురిపించిన సూరీడుని కారుమబ్బులు కమ్మేశాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం మూడింటికే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోగా భీకర శబ్దంతో కూడిన ఉరుములు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మరోవైపు జనజీవనం అస్తవ్యస్థమయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ధాటికి చేతికొచ్చాయనుకున్న అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోగా.. కళ్లాల్లో ఆరబోసిన పసుపు, ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి కృష్ణా జిల్లాలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. దీంతో విజయవాడలోని పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీపట్నం మండలం గుంటుపల్లి రమేశ్‌నగర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళుతున్న బస్సుపై చెట్టు విరిగిపడటంతో రోడ్డుకు ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో హైవే సిబ్బంది, పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నూజివీడు, మైలవరం మండలాల్లోని మామిడి కాయలు నేలరాలి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. ఇబ్రహీంపట్నం మండలంలో వడగళ్ల వాన పడగా.. గుడివాడ, కైకలూరు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు గుంటూరు జిల్లాలో పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. పుసులూరుకు చెందిన సీతారపు మాధవి, కొండేపాటి వెంకట్రావు, తాడికొండ మండలంలో కశమ్ కుమారి, బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో మేరుగు గోపికృష్ణ, మేరుగు మరియబాబు, అనంతవరప్పాడులో వేజెండ్ల రత్నకుమారి, పెదమక్కెనలో గుంటుపల్లి గోపి పిడుగుల ధాటికి మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈదురుగాలులకు 8 పూరిళ్లు, రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లోనే రూ.6 కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. పెదవడ్లపూడిలో పిడుగుపాటుకు మిర్చి పంట దగ్ధమైంది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కనిగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పామూరు మండలంలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. నలుగురు మత్స్యకారులు గల్లంతు.. విశాఖ నగరంలో ఉదయం 9 గంటల నుంచి గంటన్నరకు పైగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నగరంలోని పెదజాలరిపేటకు చెందిన తెడ్డు పెంటయ్య, తెడ్డు పరశయ్య, పోలారావులు మంగళవారం ఉదయం చిన్న తెప్పలపై వేటకు వెళ్లారు. అలల ధాటికి వీరు గల్లంతైనట్లు స్థానిక మత్స్యకారులు చెప్పారు. దీంతో కోస్టుగార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పడమట వీధికి చెందిన జన్యావుల ప్రభాకర్(40) తాటి చెట్టు విరిగి మీదపడటంతో మృతిచెందాడు. కామవరపుకోటకు చెందిన డేగల చిరంజీవి(28) పిడుగుపడి మృతి చెందాడు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో వరి, జీడిమామిడి, మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. కాకినాడ, పిఠాపురంలో గంటకు పైగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏజెన్సీలోని దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు రూ.7.4 కోట్ల విలువైన పంట నష్టపోయే అవకాశముందని వ్యవసాయాధికారులు చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఉప్పుకయ్యల్లోకి నీరు చేరింది. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి దాదాపు 3 గంటలపాటు భయానక వాతావరణం నెలకొంది. చేపలవేటకు వెళ్లిన మూగి బూలోక(తిప్పలవలస), మేడ దానయ్య(చింతలపల్లి)తో పాటు పొలం పనులకు వెళ్లిన రెడ్డి సింహాచలం(వీఆర్ పేట), ఎల్లమ్మ(వెంగాపురం) పిడుగులు పడి మృతి చెందారు. భోగాపురం, పూసపాటిరేగ మండలంలో విస్తరించి ఉన్న తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. భోగాపురం మండలం పెదకొండరాజుపాలెంలో కొట్టుకుపోతున్న బోటును లాక్కొచ్చేందుకు వెళ్లిన బొద్దు చినఅమ్మోరు(28) అలల ధాటికి గల్లంతయ్యాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీళ్లు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రభుత్వ తీరు కారణంగా కళ్ల ముందే నీటిపాలవ్వడంతో రైతులు కన్నీళ్లుపెట్టుకున్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు పెద్ద ఎత్తున ధాన్యం తరలించారు. తేమ శాతం చూసి, కాట వేసి ధర నిర్ణయించిన అనంతరం ఈ ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల వారం రోజులుగా ధాన్యం మార్కెట్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో యార్డ్‌లోని ధాన్యపు బస్తాలు నీటమునిగాయి. పి.వెంకటేశ్వరరావు అనే రైతు 10 ఎకరాల్లో తాను పండించిన వరి ధాన్యాన్ని ఇటీవల గొల్లపూడి యార్డ్‌కు తీసుకువచ్చాడు. దాన్ని యార్డ్ ఆవరణలోనే ఆరబెట్టడంతో మొత్తం ధాన్యం నీటికి డ్రైన్లలో కొట్టుకుపోయింది. తన బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించేందుకు సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని వాపోయాడు. అంధకారంలో రాష్ట్రం అకాల వర్షం వల్ల పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఒక్క రోజే దాదాపు 780 విద్యుత్ అంతరాయాలు నమోదైనట్టు పంపిణీ సంస్థలు తెలిపాయి. 50 ఫీడర్లలో ఐదు నుంచి ఎనిమిది గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా లక్షలాది మంది అంధకారంలో ఉండాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాలో గాలుల ధాటికి 12 చోట్ల విద్యుత్ తీగలు తెగాయని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది తెలిపారు. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అయ్యాయి. మారుమూల గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మరో 12 గంటల సమయం పట్టవచ్చని అధికారులు చెప్పారు. ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 33కేవీ విద్యుత్ స్తంభాలు నాలుగు, 11కేవీ విద్యుత్ స్తంభాలు 10, ఎల్టి విద్యుత్ స్తంభాలు 28, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నాలుగు దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు. -
కూల్..కూల్..
-
హైదరాబాద్‌లో వడగండ్ల వాన
-
అధైర్యపడొద్దు..ఆదుకుంటాం..
- రైతులకు మంత్రుల హామీ - వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల పరిశీలన సిరికొండ : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు భరోసా ఇచ్చారు. మండలంలోని కొండూర్, న్యావనంది, చిన్నవాల్గోట్ గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, సజ్జ, నువ్వు పంటలను మంత్రులు గురువారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవమేనన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పంటల నష్టానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం చెల్లించామని తెలిపారు. అకాల వర్షాలతో బుధవారం వరకు జిల్లాలో 13300 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని, గురువారం కూడా వర్షం కురుస్తున్నందున నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని తప్పనిసరిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పంటలు నష్టపోయిన కొండూర్ గ్రామ రైతులు గోపాల్, గంగయ్యలు మంత్రి పోచారంతో మాట్లాడారు. తాము కొన్నేళ్లుగా పంటల బీమా చెల్లిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పరిహారం చెల్లించడం లేదని రైతులు వాపోయూరు. మండలాల వారీగా బీమా ఉండటంతో పరిహారంలో నష్టపోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతు గత ఏడాది రాష్ట్రం ఏర్పడకముందే రబీలో కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయూయని, అటువంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. పంటలు పండినా అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీ చైర్మన్ దఫెదార్ రాజు, వైస్ చైర్మన్ సుమనారెడ్డి, జేడీఏ నర్సింహ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట రాజన్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.