ఐదేళ్ల చిన్నారి దుర్మరణం
మరో ఘటనలో చెట్టుకొమ్మ విరిగిపడి టెన్త్ విద్యార్థి కూడా..
సిద్దిపేట జిల్లాలో బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
పలు పంటలకు అపార నష్టం
గజ్వేల్ రూరల్/ కౌడిపల్లి (నర్సాపూర్): రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి పక్కింటి డాబాపై పడి మృతిచెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలిన ఘటనలో ఓ టెన్త్ విద్యార్థి కన్నుమూశాడు. వడగళ్ల వాన ధాటికి సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్‌సింగ్, మంజుల దంపతులకు ఒక కుమా రుడు, కవలలు సీత, గీత ఉన్నారు. దంపతులు కూలిపనులకు వెళ్లగా పిల్లలు, నానమ్మ ఇంటివద్ద ఉన్నారు.
మంగళవారం గాలి వాన ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీర ఉయ్యాలలో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతో పాటు ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య–రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ గజ్వేల్‌లో ఐటీఐ చదువుతుండగా, రెండో కుమారుడు వెంకటేశ్ (15) పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. రోజుమాదిరిగానే పొలం వద్ద ఉన్న పశువులను సాయంత్రం వేళ ఇంటికి తోలుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల ధాటికి రోడ్డుపక్కనున్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలు
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కురిసిన వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. పట్టణంలో అత్యధికంగా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గాలి దుమరానికి చెట్లు విరిగి ఇళ్లపై, వాహనాలపై పడి తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment