Child death
-
ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు
ఇబ్రహీంపట్నం/ మణికొండ/ ఎంజీఎం (వరంగల్): రాష్ట్రంలో వీధి కుక్కల దాడి ఘటనలు మరింతగా పెరుగుతున్నా యి. అభంశుభం ఎరుగని చిన్నారులపై దాడి చేస్తున్న వీధి కుక్కలు ‘విధి’రాత మార్చేస్తున్నాయి. పిల్లలను పొట్టనపెట్టు కుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే జరిగిన మూడు ఘట నలు భయాందోళన రేపుతున్నాయి. శునకాల దాడిలో గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందితే.. మరో ఘటనలో దివ్యాంగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మరోచోట శిశువు మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది.నాలుగేళ్ల చిన్నారి మృతిరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్‌లో గత నెల 12న స్కూల్ బయట వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాలుగేళ్ల చిన్నారి క్రియాన్‡్ష.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ముక్కుపచ్చలారని తమ కుమా రుడిని కుక్కలు పొట్టనపెట్టుకున్నాయంటూ తల్లిదండ్రులు ఉడుగుల మాధురి, శివగౌడ్ దంపతులు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.శుక్రవారం గ్రామంలో నిర్వ హించిన బాలుడి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది.దివ్యాంగ బాలుడిపై దాడిహైదరాబాద్ శివార్లలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని సబితానగర్‌లో ఉంటున్న నర్సింహ, అంజమ్మల కుమా రుడు భరత్ (7). అతను దివ్యాంగుడు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఇంట్లోనే ఉంటాడు. శుక్రవారం అలా ఇంటి వద్దే ఉన్న భరత్.. బహిర్భూమికి వెళ్లి, గుడిసెలోకి వచ్చాడు. వెనకాలే వచ్చిన ఓ వీధికుక్క బాలుడిపై దాడి చేసింది. జననాంగంపై కరిచింది. బాలుడి చేతులు పనిచేయక పోవటం, చిన్న గుడిసె కావడంతో తప్పించుకోలేక పోయాడు. గట్టిగా అరుస్తూ, ఏడవటంతో చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తరిమేశారు. నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి శస్త్రచికిత్స చేయాలని, రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని.. తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ ఘటనతో స్పందించిన నార్సింగి మున్సిపాలిటీ సిబ్బంది.. శుక్రవారం కాలనీలోని కుక్కలను పట్టుకుని, అక్కడి నుంచి తరలించారు.ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క!వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం రద్దీగా ఉండే క్యాజువాలిటీ ప్రాంతం వద్ద ఓ పసికందు మృతదేహాన్ని కుక్క పీక్కుతింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో దీన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ కుక్కను తరిమివేసి ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే శిశువు ఎవరనేది గుర్తించలేనంతగా కుక్క కొరికేసింది. మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఆడ శిశువుగా గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటే కుళ్లిన వాసన వస్తుందని, మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన రాకపోవడంతో శుక్రవారమే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో..ఆ పసికందు ఎవరు? ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువులదా? బయటినుంచి తీసుకువచ్చిందా? శిశువు బతికి ఉండగా కుక్కల బారిన పడిందా? ఎవరైనా శిశువు చనిపోతే ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారా? అనే సందేహాలతో కలకలం చెలరేగింది. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. పసికందును కుక్క ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే.. ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు కేంద్రంలో శుక్రవారం చిన్నారులెవరూ మృతి చెందలేదని.. పసికందు మృతదేహం ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించినది కాదని సూపరింటెండెంట్ మురళి చెప్పారు. శనివారం పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని, వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
అయ్యో రియాన్షిక.. ప్రాణం తీసిన పెన్ను
భద్రాచలం అర్బన్, సాక్షి: కళ్ల ముందే చిరునవ్వులతో హోం వర్క్ చేస్తున్న చిన్నారి(4) ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. తలలో పెన్నుతో నరకయాతన పడుతున్న ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఎలాగైనా ఆమెను బ్రతికించుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, విధికి కన్నుకుట్టి ఆ పసికందు ప్రాణాన్ని బలిగొంది.భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నారి రియాన్షిక తలలో పెన్ను గుచ్చుకుని ప్రాణం పొగొట్టుకుంది. సోమవారం రాత్రి ఆమె హోం వర్క్ చేస్తున్న టైంలో బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. అయితే ప్రమాదవశాత్తు పెన్ను ఆమె తలలో గుచ్చుకుంది. వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతికష్టం మీద వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ను తొలగించారు. పెన్ను తొలగించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పినట్టేనని వైద్యులు భావించారు. ఆమె తల్లి, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం వైద్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు. కానీ, పరిస్థితి విషమించి రియాన్షిక కన్నుమూసింది. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతోనే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. బతికిందని సంతోషించే లోపే బిడ్డ మృతి చెందిందన్న వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుండెలు అవిసేలా రోదిస్తుండడం.. చూసేవాళ్లను కంటతడి పెట్టిస్తోంది. -
పాట్నాలో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..
బీహార్ రాజధాని పాట్నా నిరసనలతో అట్టుడికిపోతోంది. కోపంతో ఊగిపోతున్న కొందరు నడివీధుల వెంట చేరి చేతికి దొరికిన వస్తువుల్ని కాలుస్తున్నారు. ఆ ఆగ్రహావేశాలకు కారణం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి అనుమానాస్పద రీతిలో చనిపోవడం. పాట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. టినీ టాట్ అకాడమీ స్కూల్లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్ ట్యూషన్ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్‌కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్లోకి అర్ధరాత్రి దాకా వెతికారు.చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్‌కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్‌కు చేరుకుని ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.#WATCH | Patna, Bihar: An angry crowd sets a school on fire after the body of a student was allegedly found on school premises. More details awaited. pic.twitter.com/6OwmDe8mjY— ANI (@ANI) May 17, 2024 స్కూల్లోకి వెళ్లిన చిన్నారి.. తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఆ అవరణాలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాం. అయితే చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతదేహాన్ని దాచే యత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారాయన. -
ఈదురు గాలులకు ఊయలతో సహా ఎగిరిపడి..
గజ్వేల్ రూరల్/ కౌడిపల్లి (నర్సాపూర్): రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి పక్కింటి డాబాపై పడి మృతిచెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలిన ఘటనలో ఓ టెన్త్ విద్యార్థి కన్నుమూశాడు. వడగళ్ల వాన ధాటికి సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్సింగ్, మంజుల దంపతులకు ఒక కుమా రుడు, కవలలు సీత, గీత ఉన్నారు. దంపతులు కూలిపనులకు వెళ్లగా పిల్లలు, నానమ్మ ఇంటివద్ద ఉన్నారు. మంగళవారం గాలి వాన ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీర ఉయ్యాలలో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతో పాటు ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన మన్నె సత్తయ్య–రేణుక దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ గజ్వేల్‌లో ఐటీఐ చదువుతుండగా, రెండో కుమారుడు వెంకటేశ్ (15) పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. రోజుమాదిరిగానే పొలం వద్ద ఉన్న పశువులను సాయంత్రం వేళ ఇంటికి తోలుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఈదురు గాలుల ధాటికి రోడ్డుపక్కనున్న చెట్టుకొమ్మ విరిగి వెంకటేశ్‌పై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలు ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కురిసిన వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. పట్టణంలో అత్యధికంగా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా వ్యాప్తంగా 90.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. గాలి దుమరానికి చెట్లు విరిగి ఇళ్లపై, వాహనాలపై పడి తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
ఈ పాపం ఎవరిది? అంబర్‌పేట కుక్కల దాడిపై జనాగ్రహం..
సాక్షి, సిటీబ్యూరో: గుంపుగా వచ్చిన కుక్కలు.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టాయి. జంతువులను వేటాడినట్టు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారి పరిస్థితి.. పులినోట చిక్కిన లేడిపిల్లలా తప్పించుకోలేని దైన్యం. ఏంచేయాలో తెలియని తనం. అరుపులే తప్ప ఆదుకునే వారు లేని దుస్థితి. ఒక కుక్క కాలు.. మరొకటి చేయిని నోట కరిచి లాగేశాయి. ఆ సమయంలో పసికందు వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. నిమిషాల వ్యవధిలో ఆ బాలుడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం నగరంలోని అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. అభం శుభం తెలియని పసిబాలుడిని పీక్కు తినడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నగరంలో ఎక్కడ చూసినా ఈ విషాదకర ఘటన గురించే చర్చిస్తూ కనిపించారు. కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లు కూడా లేని బల్దియా తీరుపై మండిపడ్డారు. కుక్కలు మీదపడి రక్కుతున్న చిత్రాలను చూసి నెటిజెన్లు ఆగ్రహావేశాలతో పోస్టింగులు చేశారు. జంతు ప్రేమికులిప్పుడేం చేస్తారు.. ఏం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో చెప్పాలంటూ గొంతెత్తారు. ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు.. వీధి కుక్కల స్వైర విహారం ఒక్క అంబర్‌పేటకే పరిమితం కాదు. నగరమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా.. అంబర్‌పేట సమీప ప్రాంతాల్లోనే ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సమీపంలోని మూసీ పక్కనే ఉన్న కుక్కల ఆపరేషన్ కేంద్రానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి శునకాలను తీసుకువస్తుంటారు. ఇక్కడికి నిత్యం 50కి పైగా కుక్కలు తీసుకు వచ్చి వాటికి ఆపరేషన్లు చేస్తుంటారు. అనంతరం వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయాల్సి ఉంటుంది. కానీ.. అలా జరగడంలేదు. దీంతో వీధి శునకాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని దుర్గానగర్, గోల్నాక, ప్రేమ్‌నగర్, పటేల్‌నగర్, చే నంబరు చౌరస్తా, బతుకమ్మకుంట ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా నెలకొంది. వీటి భయంతో సాయంత్రం సమయాల్లో మహిళలు, చిన్నారులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. బిస్కెట్ పాకెట్ అనుకుని.. ఆదివారం అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చేతిలో వాటర్ బాటిల్‌తో కనిపించడంతో.. కుక్కలు దానిని బిస్కెట్ ప్యాకెట్ అనుకుని అతని వెంటపడ్డాయి. దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడే ఉన్న తండ్రి గంగాధర్ ఇతర సిబ్బందితో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు బాలుడు అప్పటికే మృతి చెందాడు. అయిదు నిమిషాలు దాడి చేశాయి బాలుడు తండ్రితో పాటు కారు సరీ్వస్ సెంటర్‌కు వచ్చాడు. ప్రాంగణంలో ఆడుకుంటుండగా చూశా. ఒంటరిగా చేతిలో నీటి బాటిల్ పట్టుకుని బయటకు రావడంతో కుక్కలు వెంటబడి దాడి చేశాయి. పెద్దగా శబ్దం రాలేదు. అయినప్పటికీ వెంటనే తరిమేశాం. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. – నాగులు, కారు సర్వీస్ సెంటర్ సెక్యూరిటీ గార్డు సుప్రీం ఆదేశాలు బేఖాతర్.. ► ఆర్ఓసీ నెంబర్ 8938/2009 ఎం 3 ప్రకారం పట్టణాల్లో ఉన్న వీధి కుక్కలకు 90 రోజుల్లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని సుప్రీంకోర్టు దశాబ్దం క్రితం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు నగరంలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. ► నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3500కు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. జంతు సంరక్షణ కేంద్రాలు సరే... కుక్కలతో సహా జంతు సరంక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ.. కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేకపోతోంది. గతంలో ‘కేటీఆర్ అంకుల్ మమ్మల్ని వీధికుక్కల బారినుంచి కాపాడండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. కుక్క కాట్లు..కన్నీటిచారికలు ఆరడం లేదు. టీటీ, ఏఆర్వీ, రిగ్ వ్యాక్సిన్ తప్పనిసరి.. కుక్క కాటుకు టీటీతో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్(ఏఆర్వీ), రేబీస్ ఇమ్యునో గ్లోబులిన్ (రిగ్) వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈవీ నారాయణగూడ ఐపీఎం (కుక్కల దవాఖానా), నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని కుక్కలకు రేబీస్ ఇంజక్షన్లు వేయించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానులు వీటిని తప్పనిసరిగా తమ ఇళ్లలో పెంచుకునే కుక్కలకు వేయించాలన్నారు. వీధి కుక్కలకు జీహెచ్ఎంసీ నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది గత కొద్ది రోజులుగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్క కాటుకు గురైన బాధితులు వెంటనే ఫీవర్‌కు వచ్చి రిగ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కుక్క కరిసిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేబిస్ సోకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రేబిస్ చికిత్సకు మందులేదు. కుక్క కరిస్తే మొదటిరోజు ఒక డోస్ 7, 13, 28వ రోజు ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించుకోవాలి. – డాక్టర్ కె.శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగోలులో దాడి.. ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట డివిజన్ మారుతీనగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తపేట డివిజన్లో మారుతి నగర్ రోడ్ నెంబర్– 18లో వాచ్‌మన్‌గా పనిచేసే బాలు కుమారుడు నాలుగేళ్ల రిషి ఆడుకుంటుండగా కొన్ని శునకాలు వచ్చి బాలుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. గాయాల పాలైన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీధి కుక్కలు ఈ కాలనీలోకి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తూ దారి వెంట వెళ్లే వారిని వెంబడించి దాడికి పాల్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల భయంతో వణికిపోతున్నాం.. కుక్కల బెడద ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం బయటకు వెళ్లడానికి భయమేస్తోంది. సాయంత్రం వీధిలో పిల్లలు ఆడుకోవడానికి జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. – గిరిజ, బతుకమ్మకుంట పిల్లలు వెళ్లే సమయంలో.. నర్సింహ బస్తీలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లో కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ వీధిలో ఓ కుక్క ఇప్పటికే పది మందికి పైగా దాడిచేసి గాయపరిచింది. అంబర్‌పేట ఘటనతో మా బస్తీలో కూడా కుక్కలు పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉంది. – వేణు గౌడ్, నర్సింహ బస్తీ ద్విచక్ర వాహనాలను వెంబడిస్తున్నాయి తిలక్‌నగర్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. ద్విచక్ర వాహనాలపై వచీ్చపోయే వారిని వెంబడిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వెళ్లాలంటే వృద్ధులు, చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదు. -రవి, తిలక్‌నగర్ బస్తీ మేయర్ చెప్పినవన్నీ అబద్ధాలే డెబ్బై అయిదు స్టెరిలైజేషన్ చేశామని నగర మేయర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఇంత పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేసినట్లయితే వీధి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగింది? 2021లో 4,60,000 ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 5 లక్షల 75 వేలకు ఎలా పెరిగింది?. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతను జీహెచ్ఎంసీ వదిలేసి, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం చాలా నష్టకరం. వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. – ఎం శ్రీనివాస్, సీపీఎం, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆ సమయంలో దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఫిబ్రవరి, సెపె్టంబర్ నెలలు కుక్కలకు బ్రీడింగ్ సీజన్ వంటివి. ఆయా నెలల్లో వీధి కుక్కలు మనుషుల్ని కరిచే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఆకలి బాధ కూడా ఒక ప్రధాన కారణమే. ఒక ప్రాంతంలోని శునకాలు మరో ప్రాంతంలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడి వెర్రెత్తి ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో అక్కడ కనిపించే వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సూపర్‌స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి, నారాయణగూడ చదవండి: కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం.. చర్యలతో పునరావృతం కానివ్వం: మేయర్ -
అయ్యో వేదిక.. చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ క్యాప్
కోజికోడ్: అప్పటిదాకా ఆ చిన్నారి ఆటలు, బోసినవ్వులు, వచ్చిరానీ మాటలు చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. బాటిల్ క్యాప్ మింగేయడంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి ఎంత విలవిలలాడిపోయిందో?. చివరికి.. ఆ తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది. కేరళ కోజికోడ్ ముక్కమ్‌లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల వేదిక, తల్లిదండ్రులు బీజూ, ఆర్యలతో కలిసి ఆడుకుంది. అక్కడే ఉన్న ఓ వాటర్ బాటిల్ క్యాప్‌ను మింగేసింది ఆ చిన్నారి. దీంతో ఊపిరి ఆడక విలవిలలాడిపోవడంతో.. ముక్కమ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కోజికోడ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే చికిత్స అందినప్పటికీ అప్పటికే ఊపిరి అందడంలో జాప్యం జరగడంతో ఆ చిన్నారి కన్నుమూసింది. -
ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి
మల్కన్‌గిరి (ఒడిశా): ఓ ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. ఓ బాలిక మృతికి దారితీసింది. బాధిత కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసముంటున్న సందీప్ బెహరా అనే ఫార్మాసిస్ట్ తన ఇంటి వద్దనే క్లినిక్ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన రోగులకు వైద్యం చేస్తుంటాడు. బుధవారం ఉదయం 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంవీ–44 గ్రామానికి చెందిన వాసుదేవ్ బాలా కూతురు వందన బాలా(14)ని చికిత్స కోసం ఇతడి వద్దకు తీసుకువచ్చారు. చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..) పరీక్షించిన సందీప్ బాలికకు బ్లడ్ టెస్ట్(రక్త పరీక్ష) చేయించాలని సూచించారు. ఈ పరీక్ష అనంతరం వచ్చిన రిపోర్టులో సదరు బాలికకు ప్లేట్లెట్స్ తగ్గినట్లు తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తరలించేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో అయితే సకాలంలో వైద్యం అందించరని, ఇక్కడ తానే వైద్యం చేసి, బాగు చేస్తానని సందీప్ వారికి నచ్చజెప్పాడు. ఆయన మాటలు నమ్మి, బాలికను అక్కడే ఉంచారు. ఈ క్రమంలో సందీప్ వైద్యం అందించినప్పటికీ తీవ్ర అస్వస్థతతో గురువారం ఉదయం బాలిక కన్నుమూసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సదురు ఫార్మాసిస్ట్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం సందీప్‌పై ఈడ్చుకుని వెళ్లిమరీ పోలీసులకు అప్పగించి, అతడిపై కేసు నమోదు చేయించారు. -
విషాదం: బిడ్డ మరణాన్ని తట్టుకోలేక...
యశవంతపుర (కర్ణాటక): బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. మండ్యకు చెందిన సంతోశ్, పల్లవిలు ఇక్కడి సుద్దగుంటె పాళ్యంలో నివాసం ఉంటున్నారు. పల్లవికి నెలలు నిండాకుండానే కాన్పు జరిగింది. ఆరు నెలలకే పుట్టిన బిడ్డ సోమవారం మరణించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
‘మా అమ్మ పాలు ఇలానే ఊదేది’.. ఆరేళ్ల బాలుడు మృతి!
ఇండోర్: తెలిసీతెలియని వయసది. పొంగుతున్న వేడిపాలను తల్లి ఏవిధంగా ఊదుతుందో చూసి.. తను కూడా అలాగే అనుసరించాలనే ప్రయత్నంలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లసూడియా పోలీసుల కథనం ప్రకారం... ఫీనిక్స్ టౌన్షిప్లో నవంబర్ 23 సాయంత్రం సమయంలో బాలుడి తండ్రి రామ్‌జీ ప్రసాద్ పనిమీద బయటికి వెళ్లాడు. అతని భార్య రంజూదేవి, కుమారుడు సంజీవ్ కుమార్ (6), రెండున్నరేళ్ల కుమార్తె స్వీటి ఇంటి వద్ద ఉన్నారు. ఆ రోజు సాయంత్రం తల్లి రంజూదేవి గ్యాస్‌పై పాలు పెట్టి వేరేపని నిమిత్రం వంటగది నుంచి బయటికి వెళ్లడం చూసిన సంజీవ్, బల్లపైకెక్కి ప్లాస్టిక్ పైప్‌తో పాలను ఊదడం ప్రారంభించాడు. ఆ టైంలో వేడి పాలు పైపులోనుంచి నోట్లోకి వెళ్లడంతో వేగంగా శ్వాసపీల్చుకున్నాడు. దీంతో నోటిలోపలి భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతుండగా మూడురోజుల తర్వాత ఆదివారం మృతి చెందాడని వివరించారు. ప్రతిరోజూ తల్లి మరుగుతున్న పాలపై ఊదడం చూసేవాడని, అదేవిధంగా పొంగుతున్నపాలను పైపుతో ఆర్పడానికి ప్రయత్నించి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి రామ్‌జీ ప్రసాద్ తెలుపుడూ కన్నీరుమున్నీరయ్యాడు. చదవండి: Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు! -
రెప్పపాటులో ప్రమాదం.. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే
అప్పటివరకు తన కొంగుపట్టుకుని చెంగుచెంగున నడిచిన బిడ్డ ఒక్కసారిగా వెనకపడేసరికి ఆ తల్లి ఉలిక్కిపడింది. బిడ్డ ఏడని చూసేలోగానే రెప్పపాటులో లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ మాతృమూర్తికి తీరని కడుపుకోత మిగిల్చింది. ఆరేళ్ల బాలుడిని నిర్ధాక్షిణ్యంగా బలితీసుకుంది. చిన్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లెదుటే బిడ్డ రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటుంటే ఆ కన్నపేగు విలవిల్లాడిపోయింది. దిక్కులుపిక్కటిల్లేలా.. గుండెలవిసేలా.. రోదించింది. రాజుపాలెం మండలం నకరికల్లులో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరి గుండెలను పిండేసింది. సాక్షి, గుంటూరు: రాజుపాలెం మండలం లక్ష్మీపురం తండాకు చెందిన రమావత్ కొండానాయక్, దేవీబాయి దంపతులకు రాములునాయక్(6), లక్ష్మి ఇద్దరు కవల పిల్లలు. దేవీబాయి పుట్టిల్లు దాచేపల్లి మండలం భట్లుపాలెం తండాలో ఉంది. అక్కడ కార్తిక మాసం సందర్భంగా ఉత్సవాలు జరుగుతుండడంతో పిల్లలతో కలిసి బయలుదేరింది. వీరిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని రమావత్ కొండానాయక్ నకరికల్లులోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై దించాడు. ఆవలి వైపునకు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉండడంతో దేవీబాయి పిల్లలు రాములునాయక్, లక్ష్మితో కలిసి రోడ్డు దాటేందుకు యత్నించింది. రోడ్డు దాటి డివైడర్ ఎక్కే సమయంలో అమ్మ కొంగుపట్టుకుని ఉన్న బాలుడు ఒక్కసారిగా వెనకపడ్డాడు. ఏమైందని చూసేలోపే పిడుగురాళ్లవైపు నుంచి వచ్చిన లారీ రాములునాయక్‌ను ఢీకొట్టింది. దీంతో బాలుడి శరీరం ఛిద్రమైంది. అవయవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కళ్లెదుటే బిడ్డ దుర్మరణాన్ని చూసిన తల్లి గుండె తట్టుకోలేకపోయింది. పెద్దపెట్టున రోదించింది. రోడ్డు ఆవలవైపున ఉన్న తండ్రి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోరను విలపించాడు. క్షణం క్రితం వరకూ తమతో నవ్వుతూ ఊసులు చెప్పిన అన్న రోడ్డుపై విగతజీవిగా పడిఉండడం చూసి చెల్లి లక్ష్మి తల్లడిల్లింది. కవలల్లో పెద్దవాడైన రాములునాయక్, తన చెల్లితో కలిసి తండాలో రెండోతరగతి చదువుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకొని తండావాసులు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. -
ఆ కుటుంబపై పాము పగపట్టింది.. ఒకేసారి ముగ్గుర్ని..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఓ కుటుంబపై పాము పగబట్టింది. భార్యభర్తలతో పాటు చిన్నారిని కాటేసింది. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోగా, భార్యభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో క్రాంతి, మమత దంపతులతో పాటు వారి 3 నెలల చిన్నారిని పాము కాటేసింది. స్థానికులు పామును పట్టుకుని చంపేసి, పాముకాటుకు గురైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి తల్లితండ్రులు చికిత్స పొందుతున్నారు. కాటేసిన పాము విషపూరితమైన నీలిత్రాచని స్థానికులు తెలిపారు. పాముకాటుతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, తల్లిదండ్రులు ఆసుపత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: (Anantapur: కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే..) -
బకెట్లో పడి మృత్యు ఒడికి చిన్నారి
మైసూరు: బకెట్లో పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం జిల్లాలోని హుణసూరు తాలూకా తరికళ్లు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుందర్రాజ్ కుమారుడు సమర్థ(2) శుక్రవారం మధ్యాహ్నం బుడి బుడి అడుగులు వేసుకుంటూ బాత్రూంలోకి వెళ్లి బకెట్లోకి తొంగిచూసి నీటిలోకి తలకిందులుగా పడిపోయాడు. కొంతసేపటికీ ఇంట్లోని వారు బాలుడి కోసం గాలించి బాత్రూమ్లోకి వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు విడిచాడు. -
వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కన్నతల్లి దారుణం!
పాడేరు: అనుమానాస్పద రీతిలో ఓ చిన్నారి కన్నుమూసింది. ప్రియుడితో కలిసి తల్లే చంపేసిందని తండ్రి ఆరోపిస్తుండగా.. ఆరోగ్యం బాగులేక మృతి చెందిందని తల్లి చెబుతోంది. లగిశపల్లి పంచాయతీ పార్వతీపురం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం వీఆర్వో కొండమ్మ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ కోళ్ల ఫారంలో గొల్లోరి రాంబాబు, అతని భార్య రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వారికి శ్రీవల్లి అనే ఐదేళ్ల కుమార్తె ఉంది. రాంబాబు భార్యతో కోళ్లఫారం యజమాని కమలాకర్‌కు వివాహేతర సంబంధం ఉండడంతో భార్యభర్తల మధ్య తరచు తగాదాలు జరిగేవి. పదిరోజుల కిందట రాంబాబు హుకుంపేట మండలంలోని తన స్వగ్రామం తడిగిరి వచ్చాడు. తమకు అడ్డుగా ఉందన్న కోపంతో భర్త లేని సమయంలో ప్రియుడు కమలాకర్‌తో కలిసి తల్లే శ్రీవల్లిని హత్య చేసిందని గ్రామపెద్దలు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన చిన్నారికి కడుపు, వీపు భాగంలో గాయాలు ఉండడంతోపాటు కడుపు ఉబ్బిపోయింది. తల్లి మాత్రం రెండు రోజుల క్రితం మామిడి చెట్టు వద్ద జారి పడిపోవడంతో శ్రీవల్లికి కడుపులో గాయమైందని, కోళ్లఫారం యజమాని చిట్టిమోజు కమలాకర్ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించాడని చెబుతోంది. కడుపు ఉబ్బిపోయి శుక్రవారం సాయంత్రం మృతి చెందిందని పోలీసులకు తెలిపింది. కుమార్తె శ్రీవల్లిని తన భార్య, కోళ్లఫారం యజమాని కమలాకర్ చంపేశారని రాంబాబు, అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసుగా పరిగణించి, విచారణ చేయాలని తడిగిరి పంచాయతీ సర్పంచ్ పి.రంజిత్‌కుమార్, ఇతర గ్రామ పెద్దలంతా ఎస్ఐ శ్రీనివాస్‌ను కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు జిల్లా ఆస్పత్రిలోని శవపరీక్షల గది ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. చిన్నారికి శవపరీక్షలు జరిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కోళ్లఫారం యజమాని కమలాకర్, మృతురాలి తల్లి అనురాధలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ఓటు వేశాక అనుకోని ప్రమాదం: ఇద్దరు ఉద్యోగులు మృతి -
విషాదం: ప్రాణం తీసిన పిల్లర్ గుంత
సాక్షి, బంజారాహిల్స్: పిల్లర్‌కోసం తీసిన గుంత బాలుడి ప్రాణం బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు గుంత వరదనీటితో నిండిపోవడంతో పొరపాటున అందులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా కంచిరాపల్లి తండాకు చెందిన గోపాల్, మోనిక దంపతులు కూలిపనులు చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల చిన్న కుమారుడు మూడవత్ సిద్దు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నాడు. బస్తీని ఆనుకొని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ కాలనీలో పరుచూరి రవీంద్రనాథ్ అనే వ్యక్తి భవన నిర్మాణం చేపట్టాడు. భవన బిల్డర్ నారాయణరావు గత రెండేళ్ల నుంచి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా పలు గుంతలు తీశారు. ఇటీవలి వర్షాలకు ఆ గుంతలు వరదనీటితో నిండిపోయాయి. లిప్ట్ కోసం తీసిన భారీ గుంత కూడా వరద నీటితో నిండిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన సిద్దు ఆ గుంతలో పడిపోయాడు. గంట సేపు గడిచినా కొడుకు కనిపించకపోడంతో తల్లి మోనిక అన్ని ప్రాంతాలు గాలిస్తూ నిర్మాణంలో ఉన్న ఖాళీ ప్లాట్‌లోకి వెళ్లి వెతికింది. ఓ గుంతలో కొడుకు విగత జీవిగా నీళ్లపై కనిపించాడు. బాలుడి మృతితో బస్తీవాసులు విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోడకూలి బాలిక మృతి అబిడ్స్: మంగళ్‌హాట్ ఆర్కేపేట్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత గోడ కూలి ఐదేళ్ల బాలిక మృతిచెందింది. ఆర్కేపేట్లో నివా సం ఉంటున్న ఇమ్రాన్ ఇల్లు ఓ వైపు గోడ కూలడంతో అతని కుమార్తె ఆదిబా(5) మృతి చెందింది. దీంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబ ఫసియుద్దీన్, మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీ సింగ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రియురాలిని మరువలేక.. నాగోలు: ప్రేమించిన యువతిని మరిచిపోలేక ఓ ఆర్ఎంపీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం, ఎల్లాపురం గ్రామానికి చెందిన దున్నా ఉదయ్‌కుమార్ (27) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని ఓ లాడ్జిలో దిగాడు. శనివారం మధ్యాహ్నం వరకు గదిలో నుంచి బయటకు రాలేదు. లాడ్జి సిబ్బంది తలుపుకొట్టినప్పటికీ స్పందించలేదు. దీంతో వారు ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచిచూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు కట్టిన నైలాన్‌తాడుకు ఉదయ్‌కుమార్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహానికి ముందే ఓ యువతిని ప్రేమించానని, ఆ యువతిని మరిచిపోలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నానని అందులో పేర్కొన్నాడు విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఉప్పల్: సెల్లార్లో నిండిన వరద నీటిని తోడటానికి మోటార్ పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘానికి గురైన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..చిలుకానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వద్ద గల జోగు శ్రీనివాస్(45) మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిసెల్లార్ నిండిపోయింది. దీంతో శ్రీనివాస్ సెల్లార్ నీటిని తోడటానికి మోటార్‌ను బిగించి స్విచ్ ఆన్ చేశాడు. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
కని పెంచిన చేతుల కర్కశత్వం
సాక్షి, బళ్లారి: అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులే చెరువులోకి తోసి ప్రాణాలను తీసిన దారుణ సంఘటన ఇది. కూడ్లిగి తాలూకా గుడేకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామదుర్గ చెరువులోకి మల్లనాయకనహళ్లికి చెందిన చిరంజీవి, ఆయన భార్య నందిని తమ కుమార్తె ఖుషి (3), కుమారుడు చిరు(1)ను మంగళవారం రాత్రి చెరువులోకి తోసివేశారు. బైకుపై వెళ్లిన నలుగురు చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. గొడవలతో తీవ్ర నిర్ణయం చిరంజీవి, అతని భార్య నందిని తరచూ గొడవలు పడేవారని, అప్పులు అధికం కావడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చెరువు వద్దకు వెళ్లి మొదట చిన్న పిల్లలను తోసేశారు. భార్యభర్తలిద్దరూ దూకడానికి యత్నించగా ధైర్యం చాలలేదు. దీంతో ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నామని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. అప్పుల బాధ నెపంతో చిన్నారులను రాక్షసంగా చెరువులోకి తోసివేసిన కసాయి తల్లిదండ్రులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గుడేకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పీఎస్ఐ రామప్ప తెలిపారు. -
అన్నాచెల్లెలి కుటుంబాల్లో విషాదం
మేడిపెల్లి(వేములవాడ): అప్పటివరకూ ఇంట్లో అల్లరి చేసిన చిన్నారులు విగతజీవులుగా మారి తల్లిదండ్రులకు కన్నీళ్లను మిగిల్చిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మేడిపెల్లి మండలకేంద్రానికి చెందిన ఓల్పుల జలందర్–మానస దంపతులకు కొడుకు యశ్వంత్(5)తోపాటు కూతురు ఉంది. జలందర్ చెల్లెలు లావణ్యను పెగడపెల్లి మండలం ఆరేళ్లికి గ్రామానికి చెందిన దుబ్బెటి అజయ్‌కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి రుతిక(8)తోపాటు రెండేళ్ల కూతురు ఉంది. రాఖీ పండుగకోసం మేడిపెల్లిలోని సోదరుడి ఇంటికి పిల్లలతోపాటు వచ్చింది. శుక్రవారం జలందర్ కొడుకు యశ్వంత్‌తోపాటు లావణ్య పిల్లలు రుతిక, చిన్నారి చెల్లెలు ఇంటి సమీపంలోని యాదవ సంఘంలో ఆడుకునేందుకు వెళ్లారు. సెప్టింక్‌ట్యాంకుకోసం తీసిన గుంతలో నీరు ఉండగా రుతిక, యశ్వంత్ అందులో పడిపోయారు. నీటిలో మునిగిపోతున్న వీరిని గమనించిన రుతిక చెల్లెలు ఇంట్లోకి వెళ్లి కేకలు వేస్తూ పెద్దలకు చెప్పడంతో గుంత వద్ద, సమీపంలోని బావి వద్ద వెతికారు. గుంతలో పడిపోయారని గుర్తించి బయటకు తీసి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అన్నాచెల్లెల్లకు చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో రెండుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. జలందర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
నిర్లక్ష్యంతోనే శిశువు మృతి?
పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్/ ఓదెల : సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యానికి ప్రసవంలోనే శిశువు కన్నుమూశాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామం నుంచి బుధవారం సాయంత్రం ప్రసవంకోసం ప్రభుత్వాసుపత్రికి గర్భిణి లావణ్యను ప్రైవేటు వాహనంలో తరలించారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది లావణ్యకు హార్ట్ బీట్‌తోపాటు గర్భంలో పిండం సక్రమంగానే ఉందని చెప్పారు. ఉదయం ప్రసవం చేసే సమయంలోనూ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు తీసుకెళ్లిన వైద్యులు 11 గంటలకు బయటకు వచ్చి భర్త సంతకం తీసుకున్నారు. లావణ్యకి మొదటికాన్పుకావడంతో సాధారణ ప్రసవంకోసం సిబ్బంది వేచి చూసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నొప్పులు వస్తున్నాయని చెప్పినా ఆలస్యం చేయడం వల్లే శిశువు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 28న స్కానింగ్ తీసిన సమయంలో పిండం సక్రమంగానే ఉందని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆపరేషన్ చేసే సమయంలో శిశువును బయటకు తీసినట్లు, గర్భంలోనే మెడకు బొడ్డుతాడు పెనవేసుకోవడంతోపాటు ఉమ్మనీరు మింగాడని వైద్యులు చెబుతున్నారు. దీనిపై లావణ్య భర్త రవి, కుటుంబసభ్యులు జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేసి డీడీఓ శ్రీరామ్‌కు అందజేశారు. దీనిపై ఆయన వివరణకోరగా తల్లీబిడ్డను కాపాడడానికి వైద్యులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేశారని వివరించారు. ఆక్సిజన్ పెట్టి బతికించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం కనబడలేదని చెప్పుకొచ్చారు. కాగా సిబ్బంది, డాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు పలు సంఘటనలు ఇది వరకే జరిగాయని విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో శిశువు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
ఘొల్లుమన్న గోస్తనీ
పశ్చిమగోదావరి ,తణుకు: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులు ఇక లేరన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న పెద్ద దిక్కు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు గోస్తనీ నదిలో పడి మృత్యువాత పడటంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తణుకు మండలం వెంకట్రాయపురం పరిధిలో మంగళవారం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వేల్పూరు రోడ్డులో స్థానిక వీమాక్స్ థియేటర్ ఎదురుగా నివాసం ఉంటున్న వడ్లమూడి వరప్రసాద్, ప్రసన్నకుమారి దంపతుల ఇద్దరు కుమారులు వడ్లమూడి అభిషేక్ (7), వడ్లమూడి జాన్‌కెల్విన్(5) స్థానికంగా ప్రైవేటు స్కూలులో మొదటి తరగతి, ఎల్కేజీ చదువుతున్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటికి దగ్గర్లో గోస్తనీ కాల్వ రేవు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటున్నారు. గమనించిన వీరి అమ్మమ్మ మానుకొండ సావిత్రి (60) వారిని హెచ్చరించింది. దీంతో ఆందోళనకు గురైన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయారు. వెంటనే సావిత్రి ఆందోళనతో వారిని రక్షించేందుకు కాల్వలో దూకేసింది. ముగ్గురూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో గమనించిన స్థానికులు రక్షించే యత్నం చేశారు. అప్పటికే వీరంతా మృతి చెందడంతో వీరభద్రపురం సమీపంలో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాలను బంధువులకు అప్పగించారు. తణుకు రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆడుకుంటూ అనంతలోకాలకు.. కలిసిమెలిసి ఆడుకున్న అన్నదమ్ములు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు కళ్ల ముందు మెదిలిన చిన్నారుల మృతదేహాలను చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. వీమాక్స్ థియేటర్ ఎదురుగా గోస్తనీ కాల్వ సమీపంలో నివాసం ఉంటున్న మానుకొండ సావిత్రి తన కుమార్తె ప్రసన్నకుమారిని తాడేపల్లిగూడెంకు చెందిన వడ్లమూడి వరప్రసాద్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. వరప్రసాద్ తాడేపల్లిగూడెంలో ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పని చేస్తుండగా తల్లి ప్రసన్నకుమారి స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కాల్వ రేవు వద్ద ఆడుకుంటున్న అభిషేక్, జాన్‌కెల్విన్‌లను అమ్మమ్మ సావిత్రి హెచ్చరించారు. కాల్వలో పడిపోతారు వచ్చేయండ్రా అంటూ మందలించే క్రమంలో ఆందోళనతో భయపడి ప్రమాదవశాత్తూ చిన్నారులు ఇద్దరూ కాల్వలో పడిపోయారు. వీరిని రక్షించే క్రమంలో సావిత్రి కూడా దూకేయడంతో మృత్యువాత పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని రక్షేంచేందుకు విశ్వప్రయత్నం చేశారు. వీరభద్రపురం సమీపంలో మృతదేహాలను గుర్తించినా.. వీరిలో అభిషేక్, సావిత్రి బతికే ఉన్నారంటూ వీరిద్దరినీ స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. -
అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా..
సాక్షి, సిరిసిల్ల : తన బుడిబుడి నడకలతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ.. తన చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆనందపజేసే బంగారు కొండ.. ముక్కుపచ్చలారని చిట్టి తండ్రి విగతజీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడేళ్ల బుడతడు రుత్విక్ మరణ వార్త విన్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా అని ఆ తల్లి విలపించిన తీరు కలచివేసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కొమిటి దేవయ్య– రేణుక దంపతులకు రుత్విక్ (3) ఒక్కగానొక్క సంతానం. ప్రేమానురాగాలతో సాగిపోతున్న వారి కుటుంబంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. దేవయ్య– రేణుక ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా రుత్విక్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతడిని ఎవరూ గమనించలేదు. కొంత సేపటికి తల్లిదండ్రులు రుత్విక్ కోసం వెతుకుతుండగా నీటి సంపులో పడిఉండడం చూసి అతన్ని హుటాహుటిన సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుత్విక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఒక్కగానోక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆపరేషన్ వాయిదా.. చిన్నారి మృతి
అమీర్‌పేట: కరోనా మహమ్మారి బూచి చూపి చిన్నారికి చేయాల్సిన శస్త్ర చికిత్సను వైద్యులు వాయిదా వేశారు. పరిస్థితి విషమించిన ఆ బాలిక మృతి చెందిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... వనస్థలిపురంలోని నిరుపేద కుటుంబంలో సంతోషిని అనే బాలిక జన్మించింది. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి వెన్నెముకలో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పాపకు వెంటనే శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ను తొలగించాలని, లేదంటే బాలిక బతకడం కష్టమని తేల్చి చెప్పారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఫిబ్రవరి 28న యూసుఫ్‌గూడలోని శిశువివాహర్లో అప్పగించారు. శిశువిహార్ అధికారులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కరోనా కేసులు వచ్చాయని, ప్రస్తుత తరుణంలో శస్త్ర చికిత్స చేయలేదమని, అందులో 40 రోజులపాప కావడంతో శస్త్ర చికిత్స చేయడం కుదరదని, ఐదు నెలల తరువాత తీసుకురావాలని వైద్యులు సూచించారు. బుధవారం చిన్నారిని తిరిగి నీలోఫర్‌కు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున ఆ బాలిక మృతి చెందింది. శిశువిహార్ సూపరింటెండెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. అయితే పాప అనారోగ్యంతో మృతి చెందినందున పోస్టుమార్టం అవసరం లేదని తెలిపారు. దీనిపై శిశువిహార్ సిబ్బంది గొడవకు దిగడంతో విషయం వెలుగులోని వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంకా వీడని మూఢనమ్మకం..
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లాలో మూఢనమ్మకాలు పెచ్చుమీరుతున్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ఈ ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతూ ప్రాణాలు పోగొట్టుకుంటుండడం గమనార్హం. ముఖ్యంగా ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఏ జ్వరం వచ్చినా, జబ్బు చేసినా, కడుపునొప్పి వచ్చినా ఆఖరికి చిన్నారులకు సైతం బాగోలేకపోయినా ఆస్పత్రికి తీసుకువెళ్లరు. తమకు తెలిసిన వైద్యం లేదా మూఢనమ్మకాలపై ఆధారపడి భూతవైద్యులను సంప్రదిస్తారు. ఈ క్రమంలో వారు వైద్యం కింద అప్పుడే పుట్టిన బిడ్డలపై ఇనుపరాడ్లను ఎర్రగా కాల్చి, దాంతో వాతలు పెట్టడం వంటివి చేస్తారు. దీంతో చాలా సందర్భాల్లో చాలామంది శిశువులు చనిపోయినా మళ్లీ పాతకాలం నాటి సంప్రదాయాలనే అవలంభిస్తుండడం జరుగుతోంది. గతంలో ఇటువంటి సంఘటనలు అవిభక్త కొరాపుట్ జిల్లాలో ముఖ్యంగా నవరంగపూర్ జిల్లాలో చాలా జరిగాయి. ఇదే విషయంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అయినా ఎటువంటి సత్ఫలితాలు కనిపించకపోవడం విచారకరం. నాటువైద్యం కారణంగా 28 రోజుల శిశువు చనిపోయిన ఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మంగళవారం జరిగింది. ముండిబుడ గ్రామానికి చెందిన మాలతీ భాయి, డొంబురుదొర యాదవ్ దంపతులకు కొన్నిరోజుల క్రితం ఓ మగబిడ్డ పుట్టారు. బిడ్డపుట్టాడని ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఫంక్షన్ కూడా చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి పుట్టిన శిశువు ఏదో నొప్పితో బాధపడుతూ ఏడుస్తున్నాడు. దీంతో ఆదివాసీ వైద్యుడు దిశారి వద్దకు తీసుకువెళ్లారు. బాలుని కడుపుపై వాతలు పెడితే నయమవుతుందని, చెప్పడంతో శిశువు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలుని కడుపుపై వాతలు పెట్టించారు. అయితే వాతలు పెట్టిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన ఆ బాలుడు మృతిచెందాడు. అప్పుడు అప్రమత్తమైన శిశువు తల్లిదండ్రులు ఉమ్మరకోట్ ప్రభుత్వ ఆస్పత్రికికు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే తమ బాలుని బలిగొన్నాయని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు. -
ట్రాఫిక్‌జామ్: అంబులెన్స్‌లోనే బాలుడి మృతి
భువనేశ్వర్: ట్రాఫిక్‌జామ్ కారణంగా ఓ పసివాని ప్రాణాలు పోయిన సంఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆతృతతో బయల్దేరినా ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. మంగళవారం ఉదయం ఈ విచారకర సంఘటన చోటుచేసుకోగా ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుడితో ఆ బాలుడికి చికిత్స అందజేశారు. సోమవారం రాత్రి అయినా ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు ఉన్నత చికిత్స కోసం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి సిఫారసు చేశారు. కటక్ చేరడంలో ఆలస్యం జరిగితే బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భయంతో చేరువలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం అంబులెన్స్‌లో హుటాహుటినా బాలుడితో కుటుంబ సభ్యులు బయలుదేరారు. అలా వెళ్లే దారిలో ఓ చోట ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆ ట్రాఫిక్‌లో బాలుడు ఉన్న అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఎంతసేపటికీ ఆ అంబులెన్స్‌కు దారి దొకరకకపోవడంతో అందులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డ అంబులెన్స్‌లోనే మృతి చెందాడని బాధిత కుటుంబీకులు బోరుమంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ సందర్భాల్లో అంబులెన్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నిరవధికంగా దూసుకుపోయే అవకాశం కల్పించలేని ప్రభుత్వం, ట్రాఫిక్ వ్యవస్థ పట్ల సాధారణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన పూర్వాపరాలు సమీక్షించిన తర్వాత స్పందిస్తామని ట్రాఫిక్ డీసీపీ సాగరిక నాథ్ తెలిపారు. -
శిశువు ఆందోళనల్లో పాల్గొందా?
న్యూఢిల్లీ: ‘నాలుగు నెలల శిశువు తనంతట తానే ఆందోళనల్లో పాల్గొందా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న నిరసనల్లో చిన్నారి మృతి చెందడంపై కోర్టు పైవిధంగా స్పందించింది. షహీన్‌బాగ్ నిరసనల్లో 4 నెలల చిన్నారి చనిపోవడంపై జాతీయ సాహస అవార్డు గ్రహీత, ముంబైకి చెందిన జెన్ గుణ్‌రతన్ సదవర్తే(10) అనే బాలిక రాసిన లేఖను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ‘నిరసనల్లో పాలుపంచుకున్న చిన్నారులను స్కూళ్లలో తోటి వారు ఉగ్రవాదులు, విప్లవకారులు, పాకిస్తానీ అనే పేర్లతో పిలుస్తున్నారు. దీంతో వారు ఏడ్చుకుంటూ ఇళ్లకు వస్తున్నారు’అంటూ షారూక్ ఆలం, నందితా రావ్ అనే మహిళా న్యాయవాదులు పేర్కొన్నారు. నిరసన తెలపడం చిన్నారుల హక్కు అని ఐక్యరాజ్యసమితి తీర్మానాల్లో కూడా ఉందని, దీనిని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించడం తగదని వారు వాదించారు. తీవ్రంగా స్పందించిన ధర్మాసనం.. ‘ప్రమాదకరమైన ఆ సమర్థనను ఆపండి. అలాంటి వాదనలు చేయకండి. మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చకండి’అని పేర్కొంది. ‘నాలుగు నెలల చిన్నారి ఆందోళనల్లో పాల్గొనేందుకు సొంతంగా వెళతాడా?. మాతృత్వంపై మాకు అత్యున్నత గౌరవం ఉంది. చిన్నారుల క్షేమం గురించి ఆలోచిస్తాం. ఇలాంటి వాదనలతో అపరాధభావం మరింతగా పెంచకండి. నిరసనల్లో పాల్గొని చిన్నారులకు మరిన్ని ఇబ్బందులు కలిగించరాదని తల్లులు గ్రహించాలి’అని ధర్మాసనం పేర్కొంది. షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న తల్లితోపాటుగా ఉన్న నాలుగు నెలల చిన్నారి జనవరి 30వ తేదీ రాత్రి నిద్రలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. మరో పరిణామం.. షహీన్‌బాగ్‌లోని ప్రభుత్వ రహదారిపై చేపట్టిన నిరసనల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ట్రాఫిక్ సజావుగా సాగేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘నిరసనలు తెలిపే హక్కు ప్రజలకుంది. అయితే, కీలకమైన అలాంటి ప్రాంతంలో సుదీర్ఘకాలం ఆందోళనలు సాగించడం తగదు. ప్రభుత్వ రహదారులు, పార్కుల వద్ద కాకుండా ప్రత్యేకించిన ప్రాంతాల్లోనే వారు నిరసనలు చేపట్టాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు’అని పేర్కొంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి కాళిందికుంజ్–షహీన్‌బాగ్ రహదారిపై కొనసాగుతున్న నిరసనలపై స్పందించాలని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
‘దీప్తి’నే...ఆర్పేసింది
అమ్మా, నాన్నల మనస్పర్థలేమిటో ఆ పసి మనసుకు తెలియవు మొదటి తల్లికి పేగు తెంచుకు పుట్టానని నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని వచ్చిన ఆమె సవతి తల్లి అని కూడా తెలుసుకోలేని పసితనం నాన్న జీవితంలోకి వచ్చిన ఆమే తన సర్వస్వం అనుకుంది... దేవుడిచ్చిన అమ్మేనని మురిసిపోయింది కానీ... ఈ అమ్మ మదిలో అంత విషం ఉంటుందని చూపించే ఆ ప్రేమలో అంత కలుషితం పేరుకుపోయిందని లాలించే ఆ చేతుల్లో, చేతల్లో చేదు నిజం దాగుందని తెలుసుకోలేకపోయింది. ఆ పసి హృదయం.. కొడుకు పుట్టిన తరువాత క్రోధం బుసకొట్టింది. ఆ బిడ్డకు ‘మీ అక్కరా’ అంటూ పరిచయం చేసి ఆప్యాయతను పంచాల్సిన ఆమె సంకుచితత్వం పెంచుకుంది. తిట్టడం, కొట్టడం, వాతలు పెట్టినంతవరకూ వెళ్లింది. మా అమ్మే కదా అని అన్నీ భరించింది... ప్రాణం తీసేంత పాషాణ హృదయమని ఊహించలేకపోయింది శాంతి పేరుపెట్టుకున్న ఆమె దీప్తినే ఆర్పేసింది. సాక్షి, కాకినాడ క్రైం: నగరంలోనేకాదు.. రాష్ర ్ట వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిన్నారి దీప్తిశ్రీ ఐసాని (7) హత్య కేసులో ఉత్కంఠ వీడింది. ఆమెను హత్య చేసింది సవతి తల్లి శాంతి కుమారి అని పోలీసుల విచారణలో నిర్థారణ అయ్యింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం కావడంతో 72 గంటల ఉత్కంఠకు తెరపడింది. సవతి కూతురు దీప్తిశ్రీని తన భర్త సత్యశ్యామ్‌కుమార్ గారాబంగా చూడడం, తన అత్త, ఆడపడుచులు దీప్తిశ్రీకి నెలకు రూ. 8 వేలు ఇవ్వాలని శ్యామ్‌కుమార్‌ను అడగడంతో కక్ష పెంచుకున్న సవతి తల్లి శాంతికుమారి ఈ హత్యకు పాల్పడింది. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45–ఒంటి గంట మధ్యలో కాకినాడ జగన్నాథపురంలోని నేతాజీ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల నుంచి దీప్తిశ్రీని శాంతికుమారి తీసుకు వెళ్లింది. తన తల్లి వచ్చిందని, తాను అమ్మతో కలసి వెళ్తున్నట్టు దీప్తిశ్రీ తోటి విద్యార్థులకు చెప్పడం కేసుకు బలమైన ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీప్తిశ్రీని శాంతికుమారి తీసుకు వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్‌లో కని్పంచడంతో శాంతికుమారిని తీసుకు వెళ్లి విచారణ చేపట్టారు. తానే దీప్తిశ్రీని తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి కట్టివేసి ఇంద్రపాలెం వంతెన నుంచి కాలువలో పడేసినట్టు శాంతికుమారి విచారణలో తెలిపింది. ఆమె చెప్పిన మేరకు పోలీసులు మూడున్నర రోజులుగా దీప్తిశ్రీ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఇంద్రపాలెం వంతెన సమీపంతో పాటు ఉప్పుటేరులో జగన్నాథపురం వంతెన ప్రాంతంలోను గాలింపు చేపట్టారు. దీప్తిశ్రీ మృతదేహం దొరకకపోవడంతో ధర్మాడి సత్యం బృందం సహాయం తీసుకున్నారు. చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం ఉన్న మూట ర్మాడి సత్యం బృందం, పోలీసు బృందాలు సోమవారం ఉదయం నుంచి ఇంద్రపాలెం వంతెన సమీపంలో జల్లెడ పట్టాయి. వంతెన సమీపంలో అత్యధికంగా గుర్రపుడెక్క పేరుకుపోయి ఉండడంతో ధర్మాడి సత్యం బృందం, పోలీసులు అక్కడ వెతకగా మధ్యాహ్నం 2.30 గంటల సమ యంలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం దావానలంలా వ్యాపించడంతో దీప్తిశ్రీ కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చారు. దీప్తిశ్రీ తండ్రి సత్యశ్యామ్‌కుమార్ తన కుమార్తె చనిపోయిందని తెలియగానే కుప్పకూలిపోయాడు. నలుగురు మేనత్తలు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎప్పుడూ దీప్తిశ్రీని ఇష్టంగా చూడకపోయినా, అట్లకాడతో వాతలు పెడుతున్నా, వేడినీళ్లు, గంజి వంటివి వంటిపై పోసి హింసిస్తున్నా ఏనాడూ ఆ చిన్నారి తమకు చెప్పలేదని మేనత్తలు విలపించారు. ఎప్పుడూ మమ్మి, మమ్మి అంటూ ఎంతో ఆప్యాయతగా తిరిగే చిన్నారిని చంపేందుకు శాంతికుమారికి ఎలా మనస్సు వచ్చిందంటూ వారు విలపించిన తీరు చూపరులను కలచి వేసింది. ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో చిన్నారి దీప్తిశ్రీ కోసం వెతుకుతున్న బృందాలు తన కుమార్తెను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నానని, తన రెండో భార్య కూడా అదే విధంగా చూసుకుంటుందని భావించానే తప్ప, ఇలా తన చిన్నారిని హింసిస్తూ చివరికి చంపేస్తుందని ఏనాడూ తాను ఊహించలేకపోయానని దీప్తిశ్రీ తండ్రి సత్యశ్యామ్‌కుమార్ విలపించిన తీరు చూపరులకు కన్నీరు పెట్టించింది. అతనిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దీప్తిశ్రీ ఉంటే తనకు పుట్టిన కొడుకుని భర్త పట్టించుకోడని భావించి హత్య చేసిందని కుటుంబ సభ్యులు వివరించారు. గతంలో శాంతికుమారి తల్లితో కలసి తండ్రిని హత్యచేసిందని ఈ సందర్భంగా పలువురు చెప్పుకున్నారు. ఆమెకు నేరచరిత్ర ఉండడం వల్లే దీప్తిశ్రీని ఇలా హత్య చేసి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిందని పలువురు వ్యాఖ్యానించారు. ఒంటరిగానే హతమార్చింది దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి ఒంటరిగానే హత్యమార్చిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. ఇంద్రపాలెం వంతెన వద్ద దీప్తిశ్రీ మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం నయీం అస్మీ విలేకరులతో మాట్లాడారు. శాంతికుమారి జగన్నాథపురంలోని పాఠశాల నుంచి దీప్తిశ్రీని సంజయ్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి ఆమె గొంతుకకు తువ్వాలు బిగించి హత్య చేసినట్టు ఆయన వివరించారు. దీప్తిశ్రీ మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఒక షేర్ ఆటోలో తన కుమారుడిని ఒక పక్క ఎత్తుకొని మరొక పక్క దీప్తిశ్రీ మృతదేహాన్ని పెట్టుకొని ఇంద్రపాలెం వంతెన వద్దకు వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేస్తున్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పోలీసు అధికారులు దీప్తిశ్రీని కిడ్నాప్ చేసిన విషయం సీసీ ఫుటేజ్‌ల ద్వారా తెలిసిందన్నారు. దీప్తిశ్రీ కోసం భర్త సత్యశ్యామ్‌కుమార్ ప్రతి నెల రూ.8 వేలు ఖర్చు చేస్తున్నట్టు ఊహించుకొని ఆమెపై శాంతికుమారి ద్వేషం పెంచుకుందన్నారు. ఆ నేపథ్యంలోనే హత్య చేసిందన్నారు. ఇంద్రపాలెం వంతెనకు 15 మీటర్లు సమీపంలోనే మృతదేహాన్ని ధర్మాడి సత్యం బృందంతో కలసి పోలీసులు వెలికి తీసినట్టు ఎస్పీ తెలిపారు. ధర్మాడి సత్యం బృందాన్ని ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించారు. నిందితురాలిపై కిడ్నాప్, హత్య నేరాలు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కరణం కుమార్, భీమారావు, రూరల్ సర్కిల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, సీఐలు రామ్మోహన్‌రెడ్డి, ఈశ్వరుడు, శ్రీరామకోటేశ్వరరావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
విషాదం..సంతోషం..అంతలోనే ఆవిరి
సాక్షి, హొళగుంద: మృతి చెందిన వాడు మళ్లీ జీవం పోసుకొని కదిలితే..లోకాన్ని విడిచి వెళ్లిన బాలుడి నాడి కొట్టుకుంటూ ఉంటే..రోదిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆశలను బతికించుకునేందుకు వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో ఇలాంటి ఘటనే మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పింజరి పీరుసాబ్, శేఖన్‌బీకి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రహిబ్‌అలి (5) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ నెల 27న రహిబ్ అలి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు, బంధువులు బళ్లారిలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం బాలుడు కోలుకోలేక మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సుళువాయి గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం ముస్లిం ఆచారం ప్రకారంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సమయంలో బాలుడి కాళ్లు కదిలాయని, శ్వాస కొద్దిగా ఆడుతుందని కొందరు గమనించి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆశతో బాలుడిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులు కూడా వారితోపాటు ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడి వైద్యలు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో చేసేదేమి లేక మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. బతుకుతాడనుకున్న కుమారుడు మృతి చెందినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
నామకరణం చేసేలోపే అనంత లోకాలకు
మల్కాజిగిరి: ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఆ ఇంట్లో పండగ వాతావరణం.. అంతలోనే ఆ చిన్నారిని టీకా మందు పొట్టన పెట్టుకొంది. టీకా వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మల్కాజిగిరి సాయినగర్‌కు చెందిన సాయిబాబా, లావణ్య భార్యాభర్తలు. సాయిబాబా కూలి పనులు చేస్తుండగా.. లావణ్య వారు ఉంటున అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా ఉంటోంది. వీరికి రెండేళ్ల భానుశ్రీతో పాటు ఈ ఏడాది జూలై 15న మరో మగబిడ్డ పుట్టాడు. శుక్రవారం ఆ బాలుడికి నామకరణం మహోత్సం చేయాలని నిశ్చయించారు. అయితే, బుధవారం నర్సింహారెడ్డినగర్ కమ్యూనిటీ హాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి పంపిణీ చేసిన టీకాలను ఎఎన్ఎంలు పిల్లలకు వేశారు. ఈ క్రమంలో సాయిబాబా బిడ్డకు కూడా టీకా వేయించారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా జ్వరం ఉండంతో పాటు టీకాలు వేసిన ప్రాంతంలో వాపు తగ్గడానికి ఐస్‌ప్యాక్ పెట్టమని చెప్పడంతో చిన్నారి తల్లితండ్రులు అలాగే చేశారు. గురువారం ఉదయం చూసేసరికి టీకాలు వేసిన ప్రాంతంలో కమిలిపోయి ఉండంతో పాటు చిన్నారిలో స్పందన లేకపోయింది. దీంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వారు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా అప్పటికే బిడ్డ మృతి చెందాడని చెప్పడంతో గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు బాలుడి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, చిన్నారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. నేడు నామకరణం.. అంతలోనే మరణం మొదట పాప పుట్టిన రెండేళ్లకు బాబు పుట్టడంతో సంతోషంగా ఉన్నామని సాయిబాబా, లావణ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఎల్లమ్మ దేవతకు మొక్కుకున్నామని శుక్రవారం మంచిరోజు ఉందని చెప్పడంతో ఆ తల్లి పేరు వచ్చేలా ‘యశ్వానంద్‌కుమార్’ అని పేరు కూడా పెట్టాలని బంధువులను పిలుచుకున్నామన్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని రోదించారు. పాప, బాబు ఉండడంతో లావణ్య కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కూడా చేయించుకుందని బంధువులు తెలిపారు. -
డెంగీతో 9 నెలల బాలుడి మృతి
కీసర: డెంగీతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం కీసర రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్పలో నివసించే సాయిచంద్ర కుమారుడు జి.వినేష్ (9 నెలలు) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు నాగారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో ఏఎస్‌రావునగర్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. దీంతో వినేష్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం
చిలకలగూడ : ఇంటి పైకప్పు కూలి ఓ చిన్నారి(14 నెలలు) మృతి చెందగా, తల్లి తీవ్రంగా గాయపడిన సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్‌మండీలో చోటు చేసుకుంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతాఫల్మండి డివిజన్ మేడిబావి వీరయ్య గల్లీలో రాజు(34), స్వాతి (30) దంపతులు తమ కుమారుడు గీతాన్ష్ అలియాస్ మను(14 నెలలు), రాజు తల్లి పుష్ప, సోదరుడు రమేష్‌లతో కలిసి ఓ పురాతన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజు కుటుంబ సభ్యులతో కలిసి పాల వ్యాపారం నిర్వహించేవాడు. ఆదివారం ఉదయం రాజు, అతని తల్లి పుష్ప పాలు పిండేందుకు బయటికి వెళ్లగా. సోదరుడు రమేష్ బాత్రూంకు వెళ్లాడు. కుమారుడితో కలిసి స్వాతి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిని గుర్తించిన స్థానికులు ఇంటి తలుపులు బద్ధలుకొట్టి లోపటికి వెళ్లి చూడగా శిథిలాల కింద చిక్కుకున్న తల్లి, కుమారుడిని గుర్తించారు. శిథిలాలను తొలగించి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి గీతాన్ష్ అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన స్వాతిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండునెలల క్రితమే చిన్నారి గీతాన్ష్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామని తండ్రి రాజు, నానమ్మ పుష్ప కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ మార్చురీలో చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వైద్యచికిత్సల అనంతరం స్వాతి కోలుకుందని సీఐ బాలగంగిరెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రఘప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రవికుమార్, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐ రవికుమార్ ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన ఇంటి పక్కన నిర్మిస్తున్న భవనం క్యూరింగ్ చేసే సమయంలో నీళ్లు ఇంటిపై నిలిచి పైకప్పు కూలినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న నూతన భవనానికి సంబంధించిన అనుమతులపై జోనల్ కమిషనర్ రఘప్రసాద్ ఆరా తీశారు. డీసీ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ పురాతన భవనంలో ఐదు కుటుంబాలు నివసిస్తున్నాయని, ముందు భాగంలో రంగులు వేయడంతో పురాతన కట్టడంగా తమ సిబ్బంది గుర్తించలేక పోయారన్నారు. మిగిలిన కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. మరోమారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సర్కిల్ పరిధిలోని పురాతన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేసి కూల్చివేస్తామన్నారు. బాధితు కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
నీటి డబ్బాలో తల ఇరుక్కుని..
రాజవొమ్మంగి (రంపచోడవరం) : మామిడి పండు తిని చేతులు కడుక్కోవడానికి నీటి డబ్బా వద్దకు వెళ్లి అందులో తల ఇరుక్కుని ఊపిరాడక ఏడాదిన్నర పాప మరణించిన హృదయవిదారక సంఘటన మంగళవారం రాజవొమ్మంగి మండలం సూరంపాలెంలో జరిగింది. ఆ సమయంలో ఇంట్లోని వారందరూ అక్కడే ఉన్నా పాపకు సంభవించిన ప్రమాదాన్ని దాదాపు 15 నిమిషాల వరకు గుర్తించలేకపోయారు. ఇంట్లో కలివిడిగా తిరుగుతూ సందడి చేసే ఆ చిన్నారి నిర్జీవంగా ఓ ప్లాస్టిక్ నీటిడబ్బాలో పడి ఉండడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. సూరంపాలెం శివారున నివసించే సుర్ల సత్యనారాయణ, గంగలకు ఏడాదిన్నర క్రితం మొదటి కాన్పులో పాప పుట్టింది. ఆ చిన్నారికి దేవ వర్షిణి అని పేరుపెట్టుకున్నారు. పాపే తమ లోకం అని అనుకొంటున్న వారి ఆనందం నిముషాల్లోనే ఆవిరైంది. వర్షిణి మామిడి పండు తిని రోజూ మాదిరిగానే చేతులు కడుక్కోవడానికి ఆ ప్లాస్టిక్ నీటి డబ్బా(ప్లాస్టిక్ టిన్) వద్దకు వెళ్లింది. ఆ డబ్బాలో నీళ్లు అడుగున ఉండడంతో తలవంచి చేతులు కడుక్కోవడానికి ప్రయత్నించే సమయంలో ఆ పాప తల ఆ టిన్నులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు విడిచింది. పాప అలికిడి లేకపోవడంతో నీటి టిన్ను వద్దకు వెళ్లిన తల్లి తండ్రి, నాన్నమ్మ అవాక్కయ్యారు. టిన్నులో పాప తల కిందకు కాళ్లుపైకి కనిపించడంతో వెంటనే పాపను బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలసిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అయినా ఆశ చావక పాపను రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే పాప మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వర్షిణి అచేతనంగా పడి ఉండటంతో నానమ్మ లక్ష్మి దుఃఖానికి అంతులేకుండా పోయింది. నవమాసాలు మోసి కన్న బిడ్డ ఇక లేదని తలచుకొంటూ కుమిలిపోతున్న తల్లి గంగ, తండ్రి సత్యనారాయణలను ఓదార్చడం గ్రామంలో ఎవరి వల్ల కాలేదు. -
తల్లికి కడుపు కోత
పశ్చిమగోదావరి, పెదపాడు : ముక్కుపచ్చలారని ఆ పసికందు లోకాన్ని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు కోసం వచ్చిన తల్లికి కడుపుకోత మిగిలింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు గ్రామానికి చెందిన నాగమణికి పెంటపాడు మండలంలోని అలంపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. గర్భిణి కావడంతో 7వ నెలలో పుట్టింటికి వచ్చింది. పెదపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. మే 27 ప్రసవ సమయంగా నిర్ణయించారు. గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం నొప్పులు రావడంతో ఆమెను పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం నిమిత్తం తీసుకువచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సమయం వరకు ప్రసవం కాలేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్తామని అడిగినా కాన్పు ఇక్కడే జరుపుతామంటూ బదులిచ్చారు. ప్రసవ సమయంలోనే బిడ్డ చనిపోయింది. దీంతో శిశువు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. అనంతరం పెదపాడు పోలీసులకు సాయంత్రం 6 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పెదపాడు ఎస్సై జి.జ్యోతిబసు పరిస్థితిని సమీక్షించి సీఐ వైవీఎల్ నాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకుని వారి నుంచి వివరాలను సేకరించారు. డాక్టరు 11 గంటల సమయంలోనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని, డాక్టరు లేని సమయంలో కాన్పు చేయడం, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిపోతామని చెప్పినా వినకుండా, ఏఎన్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఆరోగ్యంగా ఉన్న బిడ్డ చనిపోయినట్లు బాధితులు ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డ ఎలా చనిపోతుందంటూ బంధువులు ప్రశ్నించారు. దీంతో సీఐ నాయుడు ఆసుపత్రి సిబ్బందిని విచారించారు. బిడ్డ ప్రసవ సమయంలో మట్టిని తినడం వల్లే ఊపిరాడక చనిపోయినట్లు చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. గర్భిణి వైద్య పరీక్షలకు చెందిన పత్రాలను పరిశీలించారు. అనంతరం మృతిచెందిన బిడ్డను పరిశీలించారు. సీఐ నాయుడు విచారణ చేస్తున్నారు. -
‘నిలోఫర్’లో మరణ మృదంగం
సాక్షి, సిటీబ్యూరో: తల్లి కళ్ల ముందే బిడ్డ కన్ను మూస్తోంది. అమ్మకు కడుపుకోత మిగులుతోంది. నిలోఫర్ నవజాత శిశువుల కేంద్రంలో మరణ మృదంగం మోగుతోంది. నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించే శిశువులకు ఇక్కడ కనీస వైద్య సేవలూ అందడం లేదు. గతేడాది 4వేలకు పైగా మంది శిశువులు మరణించగా... ఈ ఏడాది ఇప్పటికే 2వేలకు పైగా మంది శిశువులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదివారం కామారెడ్డికి చెందిన నవజాత శిశువు మృతి చెందడంతో ఆస్పత్రి వైద్యులపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిశువును కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందని పీడియాట్రిక్ వైద్య నిపుణుడు డాక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. సిబ్బంది కొరత... దేశంలోనే రెండో అతిపెద్ద నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రమైన నిలోఫర్ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సమీప కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా బాధితులు వస్తుంటారు. వీరిలో నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు, ప్రసవ సమయంలో ఉమ్మనీరు మింగినవారు, గుండెకు రంధ్రాలు, అవయవ లోపాలతో జన్మించినవారు, పుట్టుకతోనే కామెర్లతో జన్మించిన శిశువులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో వచ్చిన ప్రతి రోగిని చేర్చుకోవాల్సి ఉంటుంది. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి అనుగుణంగా వైద్యులు, నర్సులను నియమించలేదు. గత 15రోజులుగా సీటీ స్కాన్ పనిచేయడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. అప్పటికే అక్కడ వెయిటింగ్ జాబితా భారీగా ఉండడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్ డయాగ్నోస్టిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకురావాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ పేరుతో అవినీతి... ప్రస్తుతం ఆస్పత్రిలో 100 మంది వైద్యులు ఉండగా, 130 మంది నర్సులు ఉన్నారు. నిజానికి నవజాత శిశువుల చికిత్సల్లో నర్సుల పాత్రే కీలకం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 1:1 చొప్పున, సాధారణ వార్డుల్లో ప్రతి 20 మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో ఈ మేరకు నర్సులు లేరు. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కొంతమందిని విధుల్లోకి తీసుకున్నట్లు, వారికి నెలసరి వేతనాలు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పుతున్నప్పటికీ... ఆ మేరకు ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ స్టాఫ్ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రతినెలా వారి పేరుతో బిల్లులు మంజూరు చేస్తుండడాన్ని పరిశీలిస్తే... ఆస్పత్రిలో అవినీతి ఎలా పేరుకపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్తో ఇబ్బందులు... నర్సుల కొరతతో శిశువుల సంరక్షణ బాధ్యతలను కూడా వెంట వచ్చిన బంధువులే చూసుకోవాల్సి వస్తోంది. అసలే చిన్న పిల్లలు చికిత్స పొందే వార్డులు.. ఆపై పెద్దవాళ్లు కూడా రోజంతా పడకల పక్కనే ఉండడం, వారు సరైన శుభ్రత పాటించకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకుతోంది. రెండు రోజుల్లో నయం కావాల్సిన జబ్బులు వారం పది రోజులైనా తగ్గకపోగా మరింత ముదురుతోంది. ఆస్పత్రిలో చేరిన శిశువులకు జబ్బు నయం కాకపోగా, కొత్తగా రకరకాల ఇన్ఫెక్షన్లు సోకి, చివరికి వారు మృతికి కారణమవుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్య నిపుణులే స్పష్టం చేస్తున్నారు. ‘కీలక’ ఇన్చార్జి డుమ్మా.. పడకల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండడం, వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు సరిపడా వైద్యులు ఆస్పత్రిలో లేకపోవడం, ఉన్నవారు కూడా సెలవుల్లో ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన శిశువులకు కనీస వైద్యసేవలు అందక మృత్యువాతపడుతున్నారు. పసిపిల్లల ప్రాణాలు కళ్లముందే పోతుండడంతో వెంటవచ్చిన బంధువులు ఏమీ చేయలేక ఆగ్రహంతో వైద్యులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు లేకపోలేదు. ఆస్పత్రిలోని ఓ కీలక విభాగం ఇన్చార్జి గత 15 రోజులుగా ఆస్పత్రికే రావడం లేదు. కనీసం అధికారికంగా సెలవు కూడా పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత డాక్టర్‌పై కనీస చర్యలు తీసుకోవడం లేదంటే ఆస్పత్రి ఉన్నతాధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుండెకు రంధ్రాలు పడితే? జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న శిశువుల్లో చాలామందికి పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడుతుంటాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఆస్పత్రికి వస్తున్న చిన్నారుల్లో రోజుకు సగటున 15–20 మంది శిశువులు ఇదే సమస్యతో బాధపడుతుంటారు. వీరికి చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవు. దీంతో 2డీఎకో, ఈసీజీ పరీక్షల కోసం వీరిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఇందుకు రెండు అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ... నిర్వహణ లోపం, డీజిల్ ఖర్చులకు నిధులు లేకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అనివార్య పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ వాహనాల్లో అక్కడికి చేరుకుంటే అప్పటికే అక్కడ అనేక మంది వెయిటింగ్లో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. టెస్టుల కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తోంది. రిపోర్టు తీసుకొని తిరిగి ఆస్పత్రికి చేరుకుంటే తీరా ఇక్కడ గుండెకు ఏర్పడిన రంధ్రాలకు చికిత్స చేయరని చెప్పి తిప్పి పంపుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునే స్తోమత లేక, నిలోఫర్‌లో చికిత్సలు అందక అనేక మంది పిల్లలు చనిపోతుండడం తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తోంది. పరిస్థితి విషమించడంతోనే... నాంపల్లి: క్రిటికల్ కండిషన్లో శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చారని, పరిస్థితి విషమించడంతోనే మృతి చెందిందని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని డాక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన బాలమణికి ఆదివారం ఉదయం 4గంటలకు కాన్పు అయింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అయితే శిశువుకు ఊపిరాడడం లేదని మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బంధువులు శిశువును ఉదయం 7గంటలకు నిలోఫర్‌లో చేర్పించారు. శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12గంటలకు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఉద్రిక్తతకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించారని, పరిస్థితి విషమించడంతోనే శిశువు మృతి చెందిందని డాక్టర్ రవికుమార్ వివరణ ఇచ్చారు. -
గర్భిణికి నరక వేదన
తిరువళ్లూరు: ప్రసవం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన మహిళకు గర్భసంచి తొలగించిన సంఘటన తిరువళ్లూరు జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాలు.. కాంచీపురం జిల్లా పిచ్చువాక్కం గ్రామానికి చెందిన రాజేష్ (22), ఓరత్తూరు గ్రామానికి చెందిన స్నేహ(19)కు 2018 మార్చిలో వివాహం జరిగింది. వీరు ప్రస్తుతం తిరువళ్లూరు జిల్లా రామంజేరిలోని బంధువుల వద్ద ఆశ్రయం పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న స్నేహను బుధవారం సాయంత్రం ఏడు గంటలకు పట్రపెరంబుదూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలో ప్రసవం కోసం చేర్పించారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే చికిత్స అందించారు. స్నేహకు నార్మల్ డెలీవరి ఆయ్యే అవకాశం ఉందని, అపరేషన్ వద్దని సూచించిన నర్సులు గురువారం సాయంత్రం వరకు ఎలాంటి చిక్సిత చేయకుండానే కాలయాపన చేశారు. తీరా 8 గంటలకు స్నేహకు నార్మల్ డెలీవరి కాగా, శిశువు మృతి చెందింది. అయితే శిశువు మృతి చెందిన నేపథ్యంలో డెలీవరీ అయిన మహిళను పట్టించుకోకపోవడంతో పాటు డాక్టర్ వైద్యశాలకు రాకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలిసింది. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరగడంతో పాటు ఎంత శ్రమించినా బ్లీడింగ్ ఆగకపోవడంతో ఆమెను మెరుగైన చిక్సిత కోసం తిరువళ్లూరు వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి పది గంటలకు రెఫర్ చేశారు. అయితే తిరువళ్లూరు వైద్యశాలలో డిప్యూటీ డైరెక్టర్ కృష్ణరాజ్ నేతృత్వంలోని ఐదు మంది ప్రత్యేక డాక్టర్లు మూడు గంటల పాటు శ్రమించినా బ్లీడింగ్ ఆగకపోవడంతో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అనంతరం భర్త అనుమతితో అపరేషన్ చేసి గర్భసంచిని తొలగించి మెరుగైన చిక్సిత కోసం చెన్నై వైద్యశాలకు తరలించారు. అర్ధరాత్రి ఆందోళనలు:యువతికి గర్భసంచి తొలగించారన్న విషయం బంధువులకు తెలియడంతో అర్దరాత్రి 1 గంటకు తిరువళ్లూరు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ప్రసవం కోసం చేరిన యువతికి పట్రపెరంబుదూరులో చిక్సిత సరిగ్గా అందించక పోవడంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపించిన బంధువులు, గర్భసంచి తొలగించి యువతి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. వైద్యశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అర్ధరాత్రి బంధువుల ఆందోళనతో తిరువళ్లూరు వైద్యశాల వద్ద కలకలం రేగింది. ఇద్దరు నర్సుల బదిలీ–విచారణకు రావాలని డాక్టర్‌కు ఆదేశం: శిశువు మృతి, మహిళకు గర్భసంచి తొలగింపు వ్యవహరం తీవ్ర కలకలం రేగిన నేపథ్యంలో పట్రపెరంబుదూరులో పని చేస్తున్న ఇద్దరు నర్సులను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. విధులకు హాజరుకానీ డాక్టర్‌ను విచారణకు హజరు కావాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. -
చిన్నారిని కబళించిన వాటర్ ట్యాంకర్
హైదరాబాద్: ఆ చిన్నారి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు..కలలు..బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తుందనుకున్నాడు. కానీ, విధి కర్కశమైంది. వాటర్‌ట్యాంకర్ రూపంలో అకాల మృత్యువు ఆ చిట్టితల్లిని కబళించేసింది. ఆ కూతురిపై పెట్టుకున్న ఆశల్ని చిదిమేసింది. కళ్లముందే కన్న కూతురు ఆ ట్యాంకర్ చక్రాల కింద నలిగిపోతుంటే ఆ తండ్రి పడ్డ క్షోభ వర్ణనాతీతం. కూతురిని బడికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడంతో చిన్నారి విద్యార్థిని మృతి చెందింది. అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలో నివాసముండే నరేశ్‌కుమార్ జైన్‌కు కూతురు దియాజైన్(8),కుమారుడు(3) ఇద్దరు సంతానం. దియాజైన్ గన్‌ఫౌండ్రీలోని రోజరీ కాన్వెంట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. రోజూ కూతురుని నరేశ్‌కుమార్ జైన్ పాఠశాలలో వదిలి వెళ్తుంటాడు. నరేశ్‌కుమార్ జైన్ ఎప్పటిలాగే కూతురిని పాఠశాలలో దింపే క్రమంలో ఇంటినుంచి బడికి బయల్దేరారు. నాంపల్లి నుంచి చాపల్‌రోడ్డు గుండా వెళ్లే క్రమంలో మెథడిస్ట్ చర్చి వద్దకు రాగానే తన ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో తండ్రి, కూతురు కిందపడిపోయారు. అయితే వీరి వెనుకనే వస్తోన్న వాటర్ ట్యాంకర్ వెనుక చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. నరేశ్ కుమార్ జైన్‌కు కాలి తొడలు, కడుపు భాగాల్లో తీవ్ర∙గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయాలతో ఉన్న నరేశ్ కుమార్ జైన్‌ను చికిత్స నిమిత్తం కింగ్‌కోఠిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన దియాజైన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసును ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మయ్య దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన కుటుంబసభ్యులు, విద్యార్థులు చిన్నారి దియాజైన్ మృతిచెందిన వార్త తెలియగానే బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పటివరకు తమ కళ్లముందే తిరిగిన చిన్నారి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నిన్నటివరకు సరదాగా పాఠశాలకు వచ్చి తమతో ఆడిపాడిన విద్యార్థిని మృతిచెందిన విషయం తెలియడంతో దియాజైన్ తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మల్కాజిగిరి/గౌతంనగర్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.ఎస్ఐ రమేష్, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి హిల్‌టాప్ కాలనీకి చెందిన సతీష్ ప్రైవేట్ ఉద్యోగి. అతనికి భార్య శశికళ, కుమారుడు స్టీఫెన్(2) ఉన్నారు. బుధవారం ఉదయం మంచినీళ్లు రావడంతో శశికళ ఇంటి ఆవరణంలో నీళ్లు పడుతుండగా స్టీఫెన్ పక్కింటి వద్ద ఆడుకుంటూ కనిపించాడు. కొద్ది సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గాలింపు చేపట్టిది. పక్కింటి కాంపౌండ్‌లోని సంప్‌లో చిన్నారిని గురించిన ఆమె స్థానికుల సహాయంతో బయటికి తీసి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని శశికళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో అందని వైద్యం.. గాంధీఆస్పత్రి : ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా జూడాల సమ్మె నేపథ్యంలో ఆస్పత్రి ప్రధాన గేటు మూసివేసి ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పడంతో పోలీసులు గేటు తెరిచారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా రెండ్రోజుల క్రితం అత్యవసర విభాగానికి వెళ్లే దారిని మూసివేసి, ఓపీ విభాగం మీదుగా దారి మళ్లించారు. ఓపీ విభాగం వద్ద జూడాలు ధర్నా చేస్తుండటం, దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో చిన్నారిని లోపలికి తీసుకు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. 15 నిమిషాలు ఆలస్యంగా చిన్నారిని అత్యవసర విభాగానికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాబు మృతి చెందినట్లు నిర్దారించారు. వైద్యసేవల్లో జాప్యం కారణంగా చిన్నారి తమకు దక్కలేదని ఆరోపిస్తూ మృతుని తల్లితండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఒకరికి ఒకరు.. మరణంలోనూ వీడని స్నేహం
తరగతులు వేరైనా తరగని బంధం వారిది.. ఎక్కడికి వెళ్లినా ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిందే.. ఆ అనుబంధమే ఇద్దరు బాలలను ఒకేసారి మృత్యు కోరల్లోకి నెట్టివేసింది.. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రుల గుండె చెరువైంది. శ్రీకాకుళం, కాశీబుగ్గ: ఇద్దరూ ఒక తరగతి కాదు.. ఒక వయసు వారు కాదు.. కానీ మనసు ఒకటే. బడికి వెళ్లినా.. ఆటపాటలకు వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అదే అనుబంధం మృత్యువులోనూ కొనసాగడం వారి కన్నవారికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కాశీబుగ్గ–మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రాజపురం గ్రామంలోని గండుగోపాల సాగరం(చెరువు)లో పడి ఆదివారం ఇద్దరు బాలలు మృతి చెందిన ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. బమ్మిడి బాలరాజు కుమారుడు బమ్మిడి మనోజ్ కుమార్ (13), శాసనపురి శ్యాంసుందర్ కుమారుడు శాసనపురి చరణ్ (జితేంద్ర)(10) చినబడం మారుతీనగర్‌లో పక్క పక్క ఇళ్లలో నివసిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో గ్రామంలో ఆడుకుంటూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి కూడా చేరకుండా ఈత కొట్టడానికి సైకిల్పైచెరువు వద్దకు చేరుకున్నారు. ఎండలో ఆటలేమిటని స్థానికులు కొందరు వారించినా నీటిలోకి దిగి ఈతనేర్చుకుంటూ ఒకరిని ఒకరు పట్టుకుని చనిపోయారని పోలీసులకు స్థానికులు తెలిపారు. వారి దుస్తులను బట్టి స్థానికులు వెదకడంతో ఒకరి కాలు దొరకగా బయటకు తీశారు. మరో బాలుడు కూడా కొద్దిసేపటికి దొరికాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఇద్దరి చిన్నారుల మృతదేహాలను చూసి బోరుమని విలపించారు. సంఘటన స్థలానికి నందిగాం సీఐ మల్లా శేషు చేరుకొని కాశీబుగ్గ పోలీసు సిబ్బందితో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పలాస సామాజిక ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న బమ్మిడి మనోజ్‌కుమార్‌కు అమ్మా నాన్న, చెల్లి ఉన్నారు. శాశనపురి చరణ్ (జితేంద్ర) తండ్రి విశ్వబ్రాహ్మణ పనులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. విషాద వదనంతో మనోజ్ సోదరి మనోజ్‌కుమార్, అతని సోదరి బమ్మిడి మౌనిక కవల పిల్లలు. ఇద్దరూ 14 ఏళ్ల క్రితం బమ్మిడి బాలరాజు దంపతులకు జన్మించారు. ఇద్దరి పుట్టిన నక్షత్రాలు ఒక్కటే కావడంతో ఇద్దరికి మ అక్షరంతో పేర్లు పెట్టుకున్నారు. మనోజ్ మరణించడంతో దిక్కుతోచని స్థితికి మౌనిక చేరుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రియల్ ఎస్టేట్‌కు మట్టి తరలించడమే కారణం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఇటీవల అర్ధరాత్రి మట్టి తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ తవ్వకాల వల్ల చెరువు మరీ లోతుగా మారింది. ఈ విషయాన్ని ఊహించని చిన్నారులిద్దరూ మృత్యువాత పడ్డారు. -
మృత శిశువు డిశ్చార్జ్‌కు రూ.5 వేలు డిమాండ్
కర్నూలు ,ప్యాపిలి: స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది కొందరు మానవత్వం మరచిపోతున్నారు. సాటి మనుషులను డబ్బులకు పీక్కు తింటున్నారు. మృత శిశువును డిశ్చార్జి చేసేందుకు కూడా రూ.5 వేలు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని ఎర్రగుంట్లపల్లి గ్రామానికి చెందిన గొల్ల రాము భార్య గొల్ల అరుణ రెండు రోజుల క్రితం రాత్రి 11 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సులు అరుణ, రాజ్యలక్ష్మి.. గర్భిణిని పరీక్షించారు. కడుపులోనే శిశువు మృతిచెందిన విషయం గుర్తించి ప్రసవం చేశారు. భగవంతుడు తమ పట్ల చిన్నచూపు చూశాడని మృత శిశువును చేతుల్లో పెట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ‘ఇక ఏడ్చింది చాలు.. రూ. 5 వేలు ఇచ్చి బయటకు వెళ్లండి’ అని సిబ్బంది కరాఖండిగా చెప్పారు. చికెన్ సెంటర్లో పని చేసుకునే తన వద్ద అంతడబ్బు లేదని రాము వైద్య సిబ్బందితో తన పరిస్థితి చెప్పుకున్నా అక్కడి సిబ్బంది ఏమాత్రం కనికరించకపోగా, డబ్బు ఇవ్వందే డిశ్చార్జ్ చేసేదిలేదన్నారు. దీంతో రాము అప్పటికప్పుడు చికెన్ సెంటర్ వద్దకు వెళ్లి రూ.3 వేలు తెచ్చి వారి చేతులు తడిపి, మృత శిశువుతో ఇంటికి వచ్చాడు. ఈ విషయమై వైద్యాధికారి చెన్నకేశవులును వివరణ కోరగా జరిగిన ఘటనపై తన దృష్టికి కూడా వచ్చిందని, విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
విషాద ‘కీర్తన’
కర్నూలు, కోవెలకుంట్ల: వచ్చీరాని మాటలతో, బుడిబుడి నడకలతో అందరినీ అలరించేది. తల్లిదండ్రులకు తలలో నాలుకలా మెలిగేది. అలాంటి ఆశా దీపాన్ని ఆర్టీసీ బస్సు చిదిమేసింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నె వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మూడున్నరేళ్ల చిన్నారి కీర్తన దుర్మరణం చెందింది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సౌదరదిన్నె గ్రామానికి చెందిన దస్తగిరి అలియాస్బాలరాజు, అనురాధ దంపతులకు కీర్తన, అమృత సంతానం. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. కోవెలకుంట్ల– బనగానపల్లె ఆర్అండ్బీ రహదారి పక్కనే ఉన్న సొంతింట్లో ఉంటూ దస్తగిరి ఆటో డ్రైవర్‌గానూ, అనురాధ కూలి పనులకు వెళుతూ జీవనంసాగిస్తున్నారు. కీర్తన గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తోంది. రోజులాగే ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. 11 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో ఇంటి వద్దనున్న చిన్నారి జేజి నాగేశ్వరమ్మ గ్యాస్ అయిపోవడంతో ఖాళీ సిలిండర్‌ను బయట ఉంచింది. గ్యాస్ సిలిండర్ల ఆటో బనగానపల్లె వైపు నుంచి వస్తుండటాన్ని గమనించిన ఆమె రోడ్డుపైకి చేరింది. చిన్నారి కీర్తన ఆమెను అనుసరించింది. గ్యాస్ సిలిండర్ల ఆటో ఇంటి సమీపంలో రోడ్డుకు అటువైపు ఆగింది. ఇదే సమయంలో వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ04 టీడబ్ల్యూ 2638 నంబర్ గల బస్సు కోవెలకుంట్ల నుంచి కర్నూలుకు వెళుతూ సౌదరదిన్నెకు చేరింది. బస్సు డ్రైవర్ చెన్నయ్య రోడ్డు పక్కన ఆగిఉన్న ఆటోను దృష్టిలో ఉంచుకుని బస్సును ఎడమ వైపు వేగంగా తీసుకెళ్లాడు. రోడ్డు పక్కనే ఉన్న చిన్నారి బస్సు కింద పడడంతో తల వెనుకవైపు నుజ్జు అయ్యి మెదడు బయటకు వచ్చింది. అక్కడికక్కడే మృతి చెందింది. గమనించని బస్సు డ్రైవర్ ఆపకుండా వేగంగా ముందుకెళ్లాడు. బస్సు కింద పడిన మనవరాలిని ఎత్తుకుని జేజి కేకలు వేస్తూ బస్సు వెనుక పరిగెత్తింది. రోడ్డుపక్కనే జొన్న పైరు కోస్తున్న కూలీలు గమనించి రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చి బస్సును ఆపారు. చిన్నారి మృతికి కారకుడైన డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మూడున్నరేళ్లకే చిన్నారికి నూరేళ్లు నిండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. కేసు నమోదు చేసి.. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
పురిట్లో పసికందు మృతి
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి: రాజవొమ్మంగి పీహెచ్సీలో పుట్టిన కొద్ది సేపటికే పసికందు మృతి చెందింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని అప్పలరాజుపేట గ్రామానికి చెందిన చిన్ని (కోలంకి) రాజామణికి మంగళవారం సాయంకాలం పురిటినొప్పులు రాగా రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించారు. బుధవారం దాదాపు మూడు గంటల అనంతరం అతికష్టం మీద రాజామణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డలో కదలిక లేకపోడంతో పురుడుపోసిన వైద్యులు మోనీషా, వంశీలు తల్లీబిడ్డలను ఏలేశ్వరం కమ్యూనిటీ ఆసుపత్రికి అంబులెన్స్ సహాయంతో పంపారు. వారు ఆసుపత్రికి చేరుకొనే లోపు బిడ్డ మరణించినట్టు అక్కడి వైద్యులు తెలపడంతో రాజామణి కుటుంబీకుల కన్నీరుమున్నీరయ్యారు. కాన్పుకు ముందు తల్లి రక్తం లేక బాగా నీరసంగా ఉందని వైద్యులు తెలిపారని, నొప్పులు ఇవ్వడానికి కష్టపడుతున్న తన బిడ్డను వెంటనే మైదాన ప్రాంతంలోని ఆసుపత్రికి పంపి ఉంటే తమ పసిబిడ్డ తమకు దక్కేదని రాజామణి తల్లి రమణమ్మ విలేకరుల వద్ద వాపోయింది. నిండు గర్భిణిని రాజవొమ్మంగి పీహెచ్సీలో 24 గంటలకు పైగా ఉంచి, తీరా పురిటిలో బిడ్డ మరణించాక తల్లీబిడ్డలను మైదానప్రాంతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకొన్నారని విలపించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ దుస్థితి కలిగిందని వాపోయింది. -
తల్లిపాలు తాగుతూ ఊపిరాడక బిడ్డ మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. రక్తం పంచుకుని జన్మించిన బిడ్డకు స్తన్యం ద్వారా పాలివ్వడం అనిర్వచనీయమైన అనుభూతి. అయితే దురదృష్టవశాత్తూ ఇలా పాలుపట్టడమే ఆ తల్లిపాలిట శాపమైంది. బిడ్డ ప్రాణాన్ని హరించివేసిన విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై రాయపురానికి చెందిన వినోద్‌బాబు (25), సంధ్య (22) దంపతులకు ఆనంద్ అనే మూడు నెలల కుమారుడు ఉన్నాడు. బుధవారం రాత్రి సంధ్య తన కుమారుడికి స్థన్యం ద్వారా పాలుపడుతున్న సమయంలో బిడ్డకు ఊపిరాడలేదు. దీంతో తల్లి ఒడిలో తలవాల్చేసి ప్రాణాలు విడిచాడు. ఈ హఠాత్పరిణామాన్ని తట్టుకోలేక తల్లి బిగ్గరగా ఏడవడంతో ఇరుగూపొరుగూ వచ్చి ఓదార్చారు. ఇంతలో పోలీసులు సైతం అక్కడికి చేరుకుని బిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బడికిపోయినా బతికేవాడయ్యా...
ఆటల రందిలో పడి ఎప్పుడో నాలుగు మెతుకులు తిని వెళ్లారు.. ఎటు వెళ్లారో ఏమో అనుకుంటూ బిడ్డల ఆకలి కళ్లలో దాచుకుని గుమ్మం వైపు ఎదురు చూసింది... మధ్యాహ్నం అన్నం వేళ దాటిపోవడంతో కలత చెందిన కన్న పేగు నా బిడ్డ ఎక్కడయ్యా అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంది.. ఇంతలో ఆమె కడుపుపై కన్నీటి కోత మిగుల్చుతూ బిడ్డ మృత్యువార్త ఆమె గుండెలపై రంపపు కోత కోసింది. ముప్పాళ్ల గ్రామంలో ఆటలకని వెళ్లిన ఐదేళ్ల బాలుడిని కాలువే మృత్యువై బలి తీసుకుంది. నిర్జీవమై పడి ఉన్న బిడ్డను చూసిన తల్లి..బడికిపోయినా బతికేవాడయ్యా అంటూ హృదయవిదారకంగా విలపించింది. గుంటూరు, ముప్పాళ్ళ(సత్తెనపల్లి): అప్పటివరకు తన ఏడు నెలల చిన్న తమ్ముడిని ఆడించారు.ముద్దులాడారు. అంగన్వాడీ బడి కూడా లేకపోవటంతో మరో తమ్ముడు వికాస్‌తో కలిసి కాల్వకట్టకు వెళ్లారు. వారికి తెలియదు పాపం...వారి పక్కనే మృత్యువు పొంచి ఉందని... మనోహర్ తన తమ్ముడితో కలిసి కాల్వకట్టమీది నుంచి నీటిలోకి జారారు. కాల్వలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఒక్కసారిగా కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు ఒకరిని బయటకు తీయగా, మరొక బాలుడు గల్లంతై మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల కేంద్రమైన ముప్పాళ్ళలో మంగళవారం జరిగింది. ముప్పాళ్ళ ఎస్సీ కాలనీకి చెందిన మన్నం మనోహర్(5) తన తమ్ముడు వికాస్‌తో కలిసి ఇళ్ల సమీపంలో ఉన్న పెదనందిపాడు బ్రాంచి కాలువ కట్టపై ఆడుకుంటూ కాల్వలోకి జారారు. అక్కడే పొలా లకు ఇంజన్‌తో నీళ్లు పెట్టుకుంటున్న రైతు గమనించి కేకలు వేయటంతో అక్కడే ఉన్న యువకులు పరుగులు తీశారు. అప్పటికే మనో హర్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోగా, వికాస్ మా త్రం పక్కనే ఉన్న జమ్ము, నాచులో ఇరుక్కుపోయి చేతులు పైకి కనిపిస్తుండటంతో బయటకు తీశా రు. వెంటనే వికాస్‌కు స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స అందించటంతో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడు.మనోహర్ మాత్రం గల్లంతయ్యాడు. విషయాన్ని ఎన్నెస్పీ అధికారులకు తెలియజేయటంతో కాల్వలో నీటి ఉద్ధృతిని తగ్గించారు. కొద్దిసేపటికి సమీపంలోని డ్రాపు వద్ద మనోహర్ మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించటంతో బయటకు తీశారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు ఎస్సీ కాలనీకి చెందిన మన్నం మరియబాబు ఆ టో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కృపమ్మ బాలింత కావటంతో ఇంటివద్దే ఉంటోంది. వీరికి మనోహర్, వికాస్‌తో పాటు మ రో ఏడు నెలల బాబు ఉన్నారు. మనోహర్, వికా స్ స్థానిక అంగన్వాడీ బడికి వెళుతుంటారు. అంగ న్వాడీ కార్యకర్త భర్త మృతి చెందటంతో మంగళవారం వారిద్దరూ కేంద్రానికి వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు.అప్పటివరకు చిన్న తమ్ముడిని ఆడిం చిన వారిద్దరూ కనిపించకుండా పోవటంతో, అ ప్పటికే తల్లి కృపమ్మ వారి గురించి వాకబు చేస్తూనే ఉంది. అదే సమయంలో కాల్వలో పడ్డారని చెప్పటంతో నోటమాట రాకుండాపోయింది. ఒకడిని బయటకు తీయగా మరొకడు కాల్వలోనే గల్లంతయ్యాడని తెలిసి కన్నీటిపర్యంతమైంది. అ ప్పటివకు కళ్లముందున్న వాడు క్షణా ల్లోనే మృ త్యువాత పడటంతో తల్లిదండ్రులు,బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బడికి పోయినా బతికేవాడయ్యా అంటూ తల్లి కృపమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. -
నవజాత శిశువు మృతి
తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం.. బొమ్మూరుకు చెందిన శీలం కనక దుర్గ గర్భిణి. నెలలు నిండడంతో ఈనెల 25వ తేదీ ఆదివారం ఆమెకు పురుడు పోసేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో చేర్చారు. సోమవారం ఆమెకు ఆపరేషన్ చేసి ఆడపిల్లకు జన్మించింది. ఆ నవజాత శిశువుకు మంగళవారం వ్యాక్సిన్ వేశారు. సాయంత్రం పాపకు జ్వరం రాగా వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లారు. అయితే వారు వ్యాక్సిన్ వేసిన పాపకు జ్వరం వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి పాపను పట్టించుకోలేదు. రాత్రంతా పాప జ్వరంతోనే ఏడుస్తుండగా కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మరోసారి డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా మృతి చెందినట్టు చెప్పారు. దీంతో డాక్టర్లు పాపను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందినట్టు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు సార్లు తల్లికి అబార్షన్ అయిందని, మూడో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న దంపతులకు మృత శిశువును డాక్టర్లు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకురాలు దుంగా మంగాలక్ష్మి డాక్టర్ల తో చర్చించారు. శిశువు మృతికి కుటుంబ సభ్యులే కారణం నవజాత శిశువు మృతికి కుటుంబ సభ్యులే కారణమని ఆసుపత్రి వైద్యులు ఆర్.ఎం.ఓ పద్మశ్రీ, పిల్లల వైద్యులు కృష్ణ ప్రకాష్, తదితరులు పేర్కొన్నారు. శిశువు ఏడుస్తుందని పటిక బెల్లం నీళ్లు, తల్లి పాలు పట్టించారని శిశువుకు ఊపిరి ఆడక మృతి చెందిందని, ఈ సంఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని వారు పేర్కొంటున్నారు. పుట్టిన పాపకు కనీసం వారం రోజుల వరకు పటికబెల్లం నీళ్లు పట్టించకూడదని, తల్లిపాలు, పటికబెల్లం నీళ్లు ఒకేసారి పట్టించడం వల్ల బిడ్డకు ఊపిరాడక మృతి చెందిందని తెలిపారు. -
సకాలంలో వైద్యం అందక శిశువు మృతి
కర్నూలు, వెల్దుర్తి: సకాలంలో వైద్యం అందక శిశువు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. శిశువు తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్యాపిలి మండలం చండ్రపల్లికి చెందిన శివరామకృష్ణ, పుష్పావతి దంపతులకు ఒక కుమార్తె ఉంది. పుష్పావతి రెండవ కాన్పు కోసం వెల్దుర్తి మండలం నర్సాపురంలోని పుట్టింటికి వచ్చింది. సోమవారంపురిటినొప్పులు రావడంతో వెల్దుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో చేరింది. నర్సు, ఆయాల పర్యవేక్షణలో మంగళవారం అతికష్టం మీద కాన్పు కాగా.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. బిడ్డ ఏడవలేదు. అక్కడి వైద్యుల సూచన మేరకు వెంటనే డోన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక శిశువు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ వెల్దుర్తి ఆసుపత్రి కాంట్రాక్ట్ డాక్టర్ దీపిక నిర్లక్ష్యంతో పాటు, ఆమెకు సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా చేయడంతోనే తన బిడ్డ మృతిచెందినట్లు ఆరోపించాడు. 108 అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేయలేదని చెప్పాడు. కాగా.. ఇక్కడి ఆసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్, సరైన సౌకర్యాలు లేకపోవడం కారణంగా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే శిశువు మృతిచెందినట్లు డాక్టర్ తెలిపారు. బిడ్డ తండ్రి, బంధువుల అంగీకారంతోనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. కాగా.. వెల్దుర్తి ఆసుపత్రి సీహెచ్‌సీ అయినా, వైద్య విధాన పరిషత్‌లో ఉన్నా.. ఇక్కడ ఏళ్లుగా చిన్న పిల్లల డాక్టరు, అనస్తీషియన్ లేరు. వైద్య సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
విశాఖపట్నం∙, భీమునిపట్నం: బే వాచ్ పార్కు నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పదకొండేళ్లకే బాలుడికి నూరేళ్లు నిండిపోవడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అనుమతి లేకుండా గైరావీల్ ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణ లేకుండా బే వాచ్ పార్కు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కె.నగరపాలెం పంచాయతీ చిన మంగమారిపేటకు చెందిన మైలిపల్లి శివదేవాస్(11) రమాద్రి వద్ద ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి మైలిపల్లి శ్రీనివాస్ కూలి పనులు చేస్తుండగా తల్లి దేవి భీమిలి బీచ్ రోడ్డులోని తొట్లకొండ ఎదరుగా ఉన్న బే వాచ్ పార్కులో పని చేస్తుంది. బుధవారం స్కూల్‌కి సెలవు కావడంతో తల్లితో కలిసి శివదేవాస్ పార్కుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌తో తిరిగే గైరా వీల్ ఉంది. అందులో పిల్లలు కూర్చుంటే కిందకు మీదకు తిరుగుతుంది. బాలుడి తల్లి పనిలో ఉండగా శివదేవాస్ దానిపైకి ఎక్కి తిరగడానికి ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి కింద పడిపోవడంతో దాని రాడ్డుకు తల బలంగా తగలడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి తల్లి దేవి తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరైంది. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా చనిపోయిన బాలుడు పెద్ద కొడుకు. చిన్నవాడు జగన్ మూడో తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే... ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న బే వాచ్ పార్కులో గైరా వీల్ నిర్వహించడానికి అనుమతి ఉండాలి. అలాగే దీన్ని తిప్పడానికి అనుభవం ఉన్న ఆపరేటర్ ఉండాలి. అయితే దీనికి అనుమతిగానీ ఆపరేటర్‌గానీ లేరని తెలిసింది. ముఖ్యంగా దీని వద్దకు పిల్లలు వెళ్లకుండా తప్పనిసరిగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే శివదేవాస్ దానిపైకి ఎక్కినా ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాలుడు చనిపోయినా నిర్వహకులు పెద్దగా స్పందించ లేదు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కుటుంబంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అతని ఐదేళ్ల కుమారుడు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. మూడేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మారికవలస బస్టాపు సమీపంలో నిల్చున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పీఎం పాలెం సమీపంలో కారుషెడ్ కూడలి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. విశాఖపట్నం ∙, పెందుర్తి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని పినగాడి జంక్షన్ సమీపంలో సబ్బవరం – పెందుర్తి నేషనల్ హైవేపై జరిగింది. పెందుర్తి ట్రాఫిక్ సీఐ కాంతారావు అందించిన వివరాల ప్రకారం... గొలుగొండకి చెందిన బోయిన అల్లబాబు ద్విచక్ర వాహనంపై భార్య సోమేశ్వరి, కుమారుడు అవినాష్(5), కూతురు వాణి(3)తో కలిసి గొలుగొండ నుంచి తగరపువలస వెళ్తున్నాడు. సబ్బవరం – పెందుర్తి నేషనల్ హైవేలో పినగాడి జంక్షన్ దాటిన వెంటనే కూతవేటు దూరంలో ముందు వెళ్తున్న లారీని అల్లబాబు ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనంపై నుంచి అందరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముందు కూర్చున్న అవినాష్ తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కూతరు వాణి తలకి తీవ్ర గాయమైంది. అల్లబాబుకి, సోమేశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అల్లబాబు భీమిలిలోని దివీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పెందుర్తి లా అండ్ ఆర్డర్ సీఐ సూర్యనారాయణ, ఎస్ఐలు స్వామినాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు వివరాలు సేకరించారు. అవినాష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. అల్లబాబు మద్యం సేవించి బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని ఒకరు... పీఎం పాలెం(భీమిలి): జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి వేర్వేరుచోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... పరదేశిపాలెం అంబేడ్కర్ కాలనీకి చెందిన మదపాక నరసింగరావు (36)మంగళవారం రాత్రి 8: 30 గంటల సమయంలో జాతీయ రహదారిలో మారికవలస బస్టాపు వద్ద నిల్చుని ఉండగా ఆనందపురం వైపునకు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొట్టొంది. తీవ్రంగా గాయపడిన నరసింగరావు సంఘటన స్థలంలోనే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కారు షెడ్ కూడలికి సమీపంలో... పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన పోలిపల్లి పైడిరాజు(60)మంగళవారం రాత్రి కారు షెడ్ కూడలికి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రుడిని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పైడిరాజు మరణించాడు. మృతుని కుమారుడు సింహాద్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అమ్మా... ఎంత ఘోరం!
మల్కాపురం(విశాఖ పశ్చిమ): నెలలు కూడా నిండలేదు... కనీసం కళ్లు విప్పి ఈ లోకాన్ని కూడా లేదు... ఇంతలోనే ఆ చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి... పూర్తిగా రూపం కూడా సంతరించుకోని శిశువును ఓ కఠినాత్మురాలు కర్కసంగా చిదిమేసి కాలువలోకి విసిరేసింది. అమ్మా... మరీ ఇంత ఘోరమా... నేనేం పాపం చేశానని ఈ భూమి మీదకు రానివ్వడం లేదంటూ ఆ శిశువు ఎంతలా విలపించిందో... ఈ హృదయవిదారకర దృశ్యం జీవీఎంసీ 47వ వార్డులో వెలుగుచూసింది. అక్కడి శ్రీహరిపురం, కొత్త రామాలయం వీధిలోని ఓ కాలువలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ మృత శిశువును స్థానికులు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న కొంత మంది చిన్నారులు ఆరు నెలల వయసు గల గర్భస్థ శిశువును చూశారు. ముందుగా ఆట బొమ్మ అనుకుని అక్కడ ఉన్న కర్రతో వారు కదిపారు. అనంతరం బొమ్మ కాదని తెలుసుకుని స్థానికులకు తెలియజేశారు. అక్కడి వారంతా కాలువ వద్దకు చేరుకుని మృత శిశువును గట్టుపైకి తీశారు. ఎవరి చేతిలోనో మోసపోయిన అభాగ్యురాలు ఇలా బిడ్డను బరువు అనుకుని కాలువ పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మృత శిశువును స్థానికులే దూరంగా తీసుకెళ్లి పూడ్చేశారు. ఇక్కడకు సమీపంలో సెయింటాన్స్ ఆస్పత్రి ఉందని, అక్కడ ఎవరైనా బిడ్డకు జన్మనిచ్చి ఇక్కడి కాలువులో పడేశారా..? లేక స్థానికంగా ఎవరైనా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారా..? అని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందలేదు. -
ఆ నవ్వులు ఇక లేవు!
ఆ అంగన్వాడీలో రోజూ వినిపించిన హుషారు గొంతు ఇక వినిపించదు. వప్పంగి పంతులు కాలనీలో చలాకీగా తిరిగిన చిన్నారి ఇక ఆ దారుల్లో కనిపించదు. నాగులచవితి నాడు వెండి పట్టీలు వేసుకుని మురిసిపోయిన పద్మశ్రీ నవ్వు మరి వికసించదు. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతూ ఐదేళ్ల ఈ చిన్నారి అందనంత దూరం వెళ్లిపోయింది. గెడ్డలో దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి కన్ను మూసింది. ఉదయాన్నే కూతుళ్లతో నాగుల చవితి పూజలు చేయించిన తల్లిదండ్రులు సాయంత్రానికి ఓ కుమార్తెను పోగొట్టుకోవడం తట్టుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండలం వప్పంగి పంతులు కాలనీకి చెందిన శిమ్మ రవికుమార్, రూపావతిల కుమార్తె శిమ్మ పద్మశ్రీ(5) ఆదివారం మధ్యాహ్నం గెడ్డలో పడి మృతి చెందింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పద్మశ్రీ చిన్న కూ తురు. ఆదివారం నాగులచవితి కావడంతో పిల్లలి ద్దరి చేత పూజలు చేయించిన తల్లిదండ్రులు పొలం పనులపై ఉదయం 10 గంటలకే బయటకు వెళ్లిపోయారు. అప్పటికే పక్కంటి పిల్లలతో పద్మశ్రీ అక్క సుష్మశ్రీలు ఆడుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత టాయిలెట్కువెళ్లాల్సి రావడంతో సమీపంలోని శివాలయాన్ని ఆనుకుని ఉన్న గెడ్డ వద్దకు వెళ్లారు. గెడ్డ గట్టుపై ముగ్గురు పిల్లలు ఉండగా పద్మశ్రీ ముందుగా దిగింది. లోతు గమనించకపోవడంతో ఒక్కసారిగా కొట్టుకుపోయింది. దీంతో గట్టునే ఉన్న పిల్లలు కంగారు పడి స్థానికులకు విషయం చెప్పారు. వెంటనే స్థానికులు 100తో పాటు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఫైర్సిబ్బందితో పాటు రూరల్ పోలీసులు గెడ్డ గట్టు గుండా ప్రతి కల్వర్టు వద్ద నీటిలో నుంచి వెతకడం ప్రారంభించారు. పొలాల్లోని నీరు గెడ్డలో కలిసిపోతుండడంతో నీటి ప్రవాహం ఎక్కువగా కనిపించింది. సుమారు మూడు గంటల సేపు ప్రతి కల్వర్టు వద్ద జల్లెడ పట్టారు. వీరు వెతుకుతున్నంత సేపు చిన్నారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. తమ కూతురు మళ్లీ తమ వద్దకు వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ సుమారు ఐదు గంటల సమయంలో గార మండలంలోని అంబటివానిపేట పరిధి శిమ్మపేట శివారు గ్రామ పరిధిలోని ఓ కల్వర్టు వద్ద చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నట్లు రూరల్ ఎస్ఐ చిన్నం నాయుడు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులకు శోకానికి అంతు లేకుండాపోయింది. కంటికీ మింటికీ ఒకటే ధారగా రోదించారు. శోకసంద్రంలో కుటుంబం.. పద్మశ్రీ మరణవార్త విని తల్లిదండ్రులిద్దరూ షాక్‌కు గురయ్యారు. ప్రతి రోజు ఉదయం అంగన్వాడీకి వెళ్లేదని, ఎంతో చక్కగా, చలాకీగా ముసిముసి నవ్వులతో పలకరించేదని, నాగులచవితి సందర్భంగా కాళ్లకు వెండి పట్టీలు కూడా పెట్టుకుందని కన్నీళ్లతో అక్కడి వారితో చెప్పుకున్నారు. నాగుల చవితి రోజు ఆ దేవుడు ఇంతటి విషా దాన్ని ఇచ్చాడని బోరున విలపించారు. వారి రోదన చూసి స్థానికులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. చిన్నారి మృతితో వప్పంగిలో విషాదం అలుముకుంది. పద్మశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్ఐ చిన్నంనా యుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడేళ్లకే నూరేళ్లు!
నిండు నూరేళ్ల ఆయుష్షు.. మూడేళ్లకే ముగిసింది!చిన్న కుటుంబం..చింతల్లేని దాంపత్యం..రెక్కల కష్టమే వారి జీవనం ఒక్కగానొక్క మూడేళ్ల ముద్దుల ‘తేజం’ఆ ఇంట అడుగులో అడుగేస్తూ.. బుడిబుడి నడకలేస్తూ..పడుతూ లేస్తూ...కళ్లముందు తిరుగుతుంటే..తప్పటడుగులు పడతాయేమోనని తల్లిదండ్రుల తాపత్రయంవడివడిగా తనయుడిని అనుసరిస్తూ ఊతమయ్యేవారు!‘అమ్మ’ చేతి వేలు పట్టుకొని..అడుగులో అడుగేస్తుంటే.. మా ముద్దుల చిన్ని కృష్ణయ్య అంటూ మురిసిపోయారు!ఎప్పటిలాగే తీపి బిళ్లలేమో అనుకొని నోట్లో విషపుగుళికలు వేసుకున్నాడు.. అంతే...కొద్దిసేపటికి కళ్లు తేలేశాడు దీపావళి పండుగ నాడు కొడుకుచేయి పట్టుకొనికాకర పువ్వులు వెలుగులు నిండాల్సిన ఆ ఇంట..చీకట్లు కమ్ముకుని..కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.. అనంతపురం , ఉరవకొండ/ బొమ్మనహాల్ : పిప్పర్మింట్ బిల్ల అనుకుని టిమెట్ గుళికలను మింగిన చిన్నారి కొద్దిసేపటికే ప్రాణం కోల్పోయాడు. దీపావళి పండుగ వేళ ఆ ఇంట విషాదం నెలకొంది. బొమ్మనహాళ్ మండలం తారకాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తారకాపురం గ్రామానికి చెందిన చిరంజీవి, గీత దంపతులకు తేజ(3) ఒక్కగానొక్క కుమారుడు. చిరంజీవి దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. మంగళవారం ఎప్పటిలాగే ఇంట్లో తమ కుమారుడిని అవ్వ వద్ద పెట్టి పనులకు పోయారు. ఇంట్లో ఆడుకుంటున్న తేజ చేతికందే ఎత్తులో ఉంచిన టిమెట్ (విషపు) గుళికలు ఉండటం గమనించాడు. తాను రోజూ తినే పిప్పరమెంట్ అనుకుని చేతికి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న తేజను కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ గుర్తించి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే తేజను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో తారకాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. -
వివాహేతర ‘బంధం’ పైచేయి సాధించింది..
పిల్లలు దేవుళ్లంటాం బోసి నవ్వుల బుజ్జాయిలంటాంబుగ్గన చుక్క.. నుదుటన తిలకం గాజు బొమ్మల్లా.. కదిలే ‘మట్టి’ ముద్దల్లా.. గుమ్మం ముందు బుడిబుడి నడకలు ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల సవ్వడి.. మురిసిపోతాం.. మైమరిచిపోతాం..కను‘పాప’లని.. ఇంటి వెలుగులనిమా ఇంట మహాలక్ష్మిలని ఎన్నో పేర్లు..అల్లారు ముద్దుగా అమ్మ ‘ఒడి’లో పెరగాల్సిన పసి మొగ్గలు ..అభం శుభం తెలియని ఆ ‘చిరు’దీపాలను ఓ మృగం చిదిమేసింది.‘బంధం’ చిన్నబోయింది..వివాహేతర ‘బంధం’ పైచేయి సాధించింది..చీకటి సుఖం పసిమొగ్గలను పొట్టన పెట్టుకుంది.. గొంతు నులిమాడో తెలియదు..ముక్కు మూశాడో కనలేదు..అమ్మా అనే అరుపు వినిపించనేలేదు..పక్కనే ఉన్న కన్నపేగుకూ కనికరం లేకపోయింది..మూసిన కళ్లు తెరవకనే బోసినవ్వులకు నూరేళ్లు నిండాయి. అనంతపురం, పుట్టపర్తి టౌన్ : వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నారని ఇద్దరు చిన్నారులను కడతేర్చిన నిందితుడి వాంగ్మూలం మేరకు పూడ్చిపెట్టిన మృతదేహాలను శుక్రవారం వెలికి తీశారు. పుట్టపర్తి అర్బన్ సీఐ ఆంజనేయులు, తహసీల్దార్ సత్యనారాయణ, డాక్టర్ లోహిల్ సుకన్య సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన హరిజన ఓబుళేసు బెంగుళూరు నగర పాలక సంస్థలో చెత్త తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి అక్కడి బాట్రాయినపురకు చెందిన గణేష్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమ బంధాన్ని శాశ్వతంగా కొనసాగిద్దామని గత నెలలో తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఓబులేసు భార్య ఇందుకు అడ్డు చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో గత నెల 23న అక్కడి నుంచి నాగమ్మను, ఆమె ఇద్దరి చిన్నారులు (మూడేళ్ల వయసున్న దర్శిని, ఇంకా పేరు పెట్టని ఆరు నెలల పాప)ను పుట్టపర్తికి తీసుకొచ్చి లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని ఉంచాడు. అదే నెల 26వ తేదీ అర్ధరాత్రి నాగమ్మ కూతుళ్లను ఓబులేసు దారుణంగా చంపి.. హంద్రీనీవా కాలువ సమీపంలో పాతిపెట్టాడు. అనంతరం తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించాడు. పిల్లలు కనిపించకపోవడంతో నాగమ్మ తన బంధువులతో కలిసి పుట్టపర్తి అర్బన్ పోలీస్టేషన్లో ప్రియునిపై సీఐ ఆంజనేయులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఓబులేసును అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. తానే చిన్నారులను చంపేశానని, హంద్రీనీవా సమీపంలో పూడ్చిపెట్టానని అంగీకరించాడు. శుక్రవారం సీఐ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో నిందితుడి చూపిన ప్రదేశంలో పూడ్చిన మృతదేహాలను వెలికితీసి డాక్టర్ సమక్షంలో పంచనామా చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. అభం శుభం ఎరుగని చిన్నారుల మృతదేహాలను చూసి తండ్రి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. -
మృగం మేల్కొంది.. మానవత్వం మట్టిగలిసింది!
-
మృగం మేల్కొంది.. మానవత్వం మట్టిగలిసింది!
కట్టుకున్న భర్త.. కనిపెంచిన పిల్లలు.. కంటికి రెప్పలా కాపాడుకునే కుటుంబ సభ్యులు.. వీళ్లందరి పరువు బజారుకీడుస్తూ ‘ఆమె’ తన జీవితాన్ని చేజేతులా కాలరాసుకుంటోంది. తాళికి విలువ లేకుండా పోతోంది. బంధం పలుచనవుతోంది. మానవత్వం మాయమైపోతోంది. ‘చీకటి’ నిర్ణయాలతో జీవితాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షణికమైన ఆనందాలకు కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. వెనక్కు తిరిగి చూసుకుంటే.. నా అనే బంధం లేకుండా పోతోంది. ఈ కోవలో ఓ మహిళ వేసిన తప్పటడుగు ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఒకరికి మూడేళ్లు.. మరొకరికి ఆరు నెలలు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ప్రియుడు ఇద్దరు చిన్నారులను అర్ధరాత్రి నిద్రలోనే కర్కశంగాచంపి పాతిపెట్టిన ఘటన పుట్టపర్తిలో కలకలం రేపింది. అనంతపురం, పుట్టపర్తి టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడే ఆమె ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టపర్తి అర్బన్ సీఐ ఆంజనేయులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు వివరాలివీ.. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన ఓబుళేసు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న గణేష్‌తో ఆరు నెలల క్రితం పరిచయమైంది. గణేష్ భార్య నాగమ్మ కూడా అక్కడే హెల్పర్‌గా పనిచేస్తోంది. ఈ దంపతులకు దర్శిని(3), ఆరు నెలల కూతురు సంతానం. ఈ క్రమంలో నాగమ్మతో ఓబుళేసుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ పరిచయంతో ఓబుళేసు తాను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను సొంత గ్రామమైన వెంకటగారిపల్లికి తీసుకొచ్చాడు. మొదటి భార్య రాములమ్మకు ఆమెను పరిచయం చేసి రెండో వివాహం చేసుకోబుతున్నట్లు చెప్పాడు. హత్యకు గురైన దర్శిని ,హత్యకు గురైన ఆరు నెలల పాప(ఫైల్) అందుకు ఆమె ససేమిరా అన్నా వినిపించుకోలేదు. ఇంట్లో ఉంచేందుకు భార్య అంగీకరించకపోవడంతో ఐదు రోజుల క్రితం పుట్టపర్తిలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని నాగమ్మ, ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు. గత నెల అక్టోబర్ 26న శుక్రవారం నాగమ్మ నిద్రపోతున్న సమయంలో ఓబులేసు ఇద్దరు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా చంపి సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చేశాడు. తెల్లవారుజామున నిద్రలేచిన ఆమె పిల్లలు ఎక్కడని ప్రశ్నించగా.. ఇక్కడ అడ్డు వస్తున్నారని బంధువుల ఇంట్లో వదిలి వచ్చినట్లు నమ్మించాడు. ఆ తర్వాత శనివారం తిరిగి యథావిధిగా ఇద్దరూ బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే పిల్లలు లేకుండా ఒక్కతే రావడంతో భర్త గణేష్‌తో పాటు బంధువులు నిలదీశారు. ఓబులేసు ఏమి చేశాడో తెలియదని చెప్పడంతో అందరూ కలిసి అతన్ని ప్రశ్నించగా చంపినట్లుగా అంగీకరించి పుట్టపర్తికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓబులేసు పిల్లలు లేరు, ఏమి చేసుకుంటారో చేసుకోండని.. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్నీ చంపుతానని బెదిరించాడు. విధిలేని పరిస్థితుల్లో గణేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ఆ మేరకు ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పిల్లలు ఇద్దరినీ తానే చంపినట్లు అంగీకరించాడు. కాగా గురువారం రాత్రి పొద్దుపోవడంతో శుక్రవారం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం చేయిస్తామని సీఐ తెలిపారు. -
మెడకు చున్నీ చుట్టుకుని..
బంజారాహిల్స్: ప్రమాదవశాత్తు మెడకు చున్నీ చుట్టుకుని చిన్నారి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా, రాఘవరం కాపులవీధికి చెందిన రాజేశ్వరి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 71లోని ఓ ఇంట్లో పనిమనిషిగా జీవనం సాగిస్తోంది. ఆమె భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె కుమార్తె శృతిలయ ఫిలింనగర్‌లోని గీతాంజలి స్కూల్లో చదువుకుంటోంది. ప్రతిరోజూ శృతిలయ తన తల్లికి చెందిన చీర, చున్నీని చుట్టుకుని ఆడుకునేది. ఆదివారం రాత్రి కూడా చున్నీతో ఆడుకుంటుండగా మెడకు చుట్టుకొని ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. పనికి వెళ్లిన రాజేశ్వరి తిరిగి వచ్చి చూసేసరికి కుమార్తె ఉలుకుపలుకు లేకుండా పడి ఉండటంతో 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఆలస్యం..
సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. వారిని ఆసుపత్రి సెక్యూరిటీగార్డులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. సుల్తాన్‌బజార్ ఎస్ఐ లింగారెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలం, పలుగు తాండాకు చెందిన మహేందర్ భార్య పద్మ(25) ఈ నెల 16న రెండో కాన్పుకోసం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. ఆదివారం తెల్లవారు జామున ఆమెకు నొప్పులు రావడంతోత నైట్ డ్యూటీ డాక్టర్ టాబ్లెట్ ఇవ్వడంతో నిద్రపోయింది. ఉదయం 5 గంటల సమయంలో పద్మకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తమ శిశువు బతికి ఉండేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ శిశువు మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెలవులు వస్తే అంతే.. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వివాదాలకు నిలయంగా మారుతుంది. సెలవురోజుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పేద మహిళలు, నవజాత శిశువులకు ప్రాణసంకటంగా మారుతోంది. వైద్యులు అందుబాటులో లేకపోవడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆసుపత్రిలో మాత, శిశువుల ప్రాణా నష్టాలు అధికంగా ఉంటున్నాయి. తాజగా పద్మ గర్భిణికి ప్రతి నెల ఈ ఆసుపత్రిలోనే అన్ని వైద్య పరీక్షలు జరిగి, స్కానింగ్‌లో సైతం శిశువు ఆరోగ్యంగా ఉన్నా వైద్యుల ఆలస్యం కారణంగా కడుపులోనే శిశువు మృతి చెందడం గమనార్హం. ఈ విషయమై ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
సవతి తల్లే నరరూపరాక్షసిలా మారి..
సాక్షి, విశాఖపట్నం : సంచలనం సృష్టించిన దువ్వాడ చిన్నారి అలేఖ్య హత్యకేసు మిస్టరీ వీడింది. సవతి తల్లే అలేఖ్యను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి అలేఖ్య పట్ల తండ్రి కృష్ణ చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకే సవతి తల్లి ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. చిన్నారిని ఇంటి గోడకు బలంగా కొట్టి అంతమొందించినట్లు సవతి తల్లి దుర్గ విచారణలో తెలిపింది. అసలేం జరిగింది... దువ్వాడ సెక్టార్ 1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న రాచబత్తుని కృష్ణ, మొదటి భార్య మీనాక్షి రైళ్లలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిన్నారి అలేఖ్యను ఇంటి వద్ద విడిచిపెట్టి సమోసాలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం మీనాక్షి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై భర్త కృష్ణకు విషయం తెలియజేసింది. అనంతరం ఇద్దరూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి దువ్వాడ పోలీసులకు మీనాక్షి ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం కూడా పాప కోసం వెదుకుతుండగా కృష్ణ తోడల్లుడు రాజు ఇంటిని ఆనుకొని ఉన్న తుప్పల్లో అలేఖ్య మృతదేహం కనిపించింది. వెంటనే కృష్ణ దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఏసీపీ రంగరాజు, దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి, గాజువాక సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాప తండ్రి కృష్ణ, అతని రెండో భార్య దుర్గ, ఆమె బావ(కృష్ణ తోడల్లుడు)రాజులను వేర్వేరుగా పోలీసులు విచారించారు. కృష్ణ, రాజుల తీరుపై స్థానికంగా విచారించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ పాప ఉంటున్న ఇంటి వద్ద నుంచి కృష్ణ తోడల్లుడు రాజు ఇంటి వరకు వెళ్లి ఆగింది. గోడ దూకి పాపను చంపి పడేసిన స్థలం వద్దకు వెళ్లి తరువాత రాజు పక్కింటి వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్లి పాప ఇంటికి చేరుకుంది. దీంతో చిన్నారి తండ్రి కృష్ణ, తోడల్లుడు రాజుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వదిలించుకునేందుకే అంతమొందించారా? అన్న కోణంలో.. ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన మీనాక్షి రైళ్లలో యాచకవృత్తి చేసుకుని జీవించేది. నాలుగేళ్ల కిందట ఆమెతో కృష్ణకు పరిచయం ఏర్పడడంతో వీరిరువురు పెళ్లి చేసుకుని దువ్వాడ సెక్టార్ –1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. అనంతరం వీరికి చిన్నారి అలేఖ్య పుట్టింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట దుర్గ అనే యువతిని కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెదుళ్లనరవలో కాపురం పెట్టాడు. ఆమె వద్దే ఎక్కువగా ఉండే కృష్ణ ఎప్పుడైనా మొదటి భార్య మీనాక్షి వద్దకు వచ్చినా ఏదో ఒక విషయంపై గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. భర్త రెండో పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుండడంతో మీనాక్షి స్థానికంగా పనులు చేసుకుని, రైళ్లలో సమోసాలు అమ్ముకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లి సహాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి భార్య మీనాక్షి, కుమార్తె అలేఖ్య అడ్డు తొలగించుకోడానికి కృష్ణ, ఆయన తోడల్లుడు కలిసి ప్రణాళిక రచించి ఉంటారని పోలీ సులు అనుమా నం వ్యక్తం చేశారు. ప్రణాళికలో భాగంగా ముందు చిన్నారిని అంతమొందిస్తే మీనాక్షి భయంతో ఇక్కడి నుంచి బరంపురం వెళ్లిపోయేలా చేయాలని భావించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని భావించారు. అలాగే కృష్ణ రెండో భార్య దుర్గ పాత్రపైన కూడా పోలీసులు ఆరా తీశారు. ఇప్పటికే దుర్గను స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి విచారించారు. దుర్గకు నాలుగు నెలల పాప ఉంది. పాప తండ్రి కృష్ణ, అతని తోడల్లుడు రాజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. -
చిన్నారిని చిదిమేశారు
విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): మానవత్వం మంటగలిసింది. కర్కశత్వం పురులువిప్పింది. రాక్షసత్వం మూడేళ్ల పసిమొగ్గను చిదిమేసింది. కుటుంబ కలహాలకు చిన్నారి బలైపోయిన దారుణ ఘటన దువ్వాడ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న హృదయవిదారకరమైన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడ సెక్టార్ – 1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న రాచబత్తుని కృష్ణ, మొదటి భార్య మీనాక్షి రైళ్లలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిన్నారి అలేఖ్యను ఇంటి వద్ద విడిచిపెట్టి సమోసాలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం మీనాక్షి వెళ్లింది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురై భర్త కృష్ణకు విషయం తెలియజేసింది. అనంతరం ఇద్దరూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో సోమవారం రాత్రి దువ్వాడ పోలీసులకు మీనాక్షి ఫిర్యాదు చేసింది. మంగళవారం ఉదయం కూడా పాప కోసం వెదుకుతుండగా కృష్ణ తోడల్లుడు రాజు ఇంటిని ఆనుకొని ఉన్న తుప్పల్లో అలేఖ్య మృతదేహం కనిపించింది. వెంటనే కృష్ణ దువ్వాడ పోలీసులకు సమాచారం అందించడంతో సౌత్ ఏసీపీ రంగరాజు, దువ్వాడ సీఐ కిషోర్‌కుమార్, స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి, గాజువాక సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాప తండ్రి కృష్ణ, అతని రెండో భార్య దుర్గ, ఆమె బావ(కృష్ణ తోడల్లుడు)రాజులను వేర్వేరుగా పోలీసులు విచారించారు. కృష్ణ, రాజుల తీరుపై స్థానికంగా విచారించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ పాప ఉంటున్న ఇంటి వద్ద నుంచి కృష్ణ తోడల్లుడు రాజు ఇంటి వరకు వెళ్లి ఆగింది. గోడ దూకి పాపను చంపి పడేసిన స్థలం వద్దకు వెళ్లి తరువాత రాజు పక్కింటి వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్లి పాప ఇంటికి చేరుకుంది. దీంతో చిన్నారి తండ్రి కృష్ణ, తోడల్లుడు రాజుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వదిలించుకునేందుకే అంతమొందించారా..? ఒడిశా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన మీనాక్షి రైళ్లలో యాచకవృత్తి చేసుకుని జీవించేది. నాలుగేళ్ల కిందట ఆమెతో కృష్ణకు పరిచయం ఏర్పడడంతో వీరిరువురు పెళ్లి చేసుకుని దువ్వాడ సెక్టార్ –1కు సమీపంలోని ఇందిరానగర్‌లో నివసిస్తున్నారు. అనంతరం వీరికి చిన్నారి అలేఖ్య పుట్టింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట దుర్గ అనే యువతిని కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో వెదుళ్లనరవలో కాపురం పెట్టాడు. ఆమె వద్దే ఎక్కువగా ఉండే కృష్ణ ఎప్పుడైనా మొదటి భార్య మీనాక్షి వద్దకు వచ్చినా ఏదో ఒక విషయంపై గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. భర్త రెండో పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుండడంతో మీనాక్షి స్థానికంగా పనులు చేసుకుని, రైళ్లలో సమోసాలు అమ్ముకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లి సహాయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మొదటి భార్య మీనాక్షి, కుమార్తె అలేఖ్య అడ్డు తొలగించుకోడానికి కృష్ణ, ఆయన తోడల్లుడు కలిసి ప్రణాళిక రచించి ఉంటారని పోలీ సులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా ముందు చిన్నారిని అంతమొందిస్తే మీనాక్షి భయంతో ఇక్కడి నుంచి బరంపురం వెళ్లిపోయేలా చేయాలని భావించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. అలాగే కృష్ణ రెండో భార్య దుర్గ పాత్రపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దుర్గను స్టీల్‌ప్లాంట్ సీఐ లక్ష్మి విచారించారు. దుర్గకు నాలుగు నెలల పాప ఉంది. పాప తండ్రి కృష్ణ, అతని తోడల్లుడు రాజులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలేఖ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రసవం చేసిన నర్సు
తమిళనాడు, సేలం: ప్రసవం మహిళలకు మరో జన్మలాంటిది. ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన ప్రసవాన్ని సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రం నర్సును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సేలం కార్పొరేషన్ కమిషనర్ సతీష్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం దాదగాపట్టికి చెందిన ప్రభాకరన్ (28) ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కలైమణి (28). వీరిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు కుమారుడున్నాడు. కలైమణి రెండోసారి గర్భం దాల్చింది. దీంతో ఆమె ప్రతి నెల దాదగాపట్టి ప్రాథమిక వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించుకుంటోంది. అక్టోబర్ 1న ప్రసవ నొప్పులు రావడంతో కలైమణిని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్స్ సెల్వి, ఆమె సహాయకురాలు తమిళ్ సెల్విలు కలైమణికి ప్రసవం చేశారు. వారు అజాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో ప్రసవంలో ఇబ్బందులు తలెత్తిన కారణంగా కలైమణిని ఉన్నత చికిత్స నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. అక్కడ మృత శిశువు పుట్టింది. దీంతో బిడ్డ మృతదేహాన్ని తీసుకుని ప్రభాకర్ దంపతులు ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత రోజు వచ్చిన నర్సు సెల్వి తాను ప్రసవం చూసినందుకు రూ. 8వేలు ఇవ్వాల్సిందిగా ప్రభాకరన్ వద్ద డిమాండ్ చేసింది. అసలే తాము బిడ్డను కోల్పోయిన బాధలో ఉంటే నర్సు లంచం అడగడం ప్రభాకరన్ జీర్ణించుకోలేకపోయాడు. రెండు రోజుల క్రితం సేలం కార్పొరేషన్ కమిషనర్ సతీష్‌కి ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదులో తన భార్య కలైమణికి నర్సు సెల్వి, ఆమె సహాయకురాలు తమిళ్‌సెల్విలు ప్రసవం చేశారన్నారు. ఆ సమయంలో సెల్వి సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రసవం చేయడంతో మృతశివువు జన్మించాడన్నారు. నర్సు సెల్వి రూ.8000 లంచం అడిగినట్టు వివరించాడు. దీనిపై విచారణ జరపాలని ఆరోగ్యశాఖ అధికారి పార్తిబన్‌కు కార్పొరేషన్ కమిషనర్ సతీష్ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణలో ప్రభాకరన్ ఫిర్యాదు నిజమని తేలింది. దీంతో నర్సు సెల్విని సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ కమిషనర్ సతీష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సెల్వి సహాయకురాలు తమిళ్‌సెల్విని హెచ్చరిస్తూ ఆ సంఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపారు. -
ఆయువు తీసిన అనాస మందు
తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): బిడ్డ తాగిన పాలు కక్కేస్తుందని ఆ తల్లి వారపు సంతలో కొని తెచ్చుకొన్న అనాస మందును పట్టించడంతో పొత్తిళ్లలోని బిడ్డ చనిపోగా ఆ తల్లికి కడుపుకోత తప్పలేదు. రాజవొమ్మంగి మండలం లోతట్టు గ్రామం అమ్మిరేఖల గ్రామానికి చెందిన బోనెం లోవకుమారికి తొలి కాన్పులో పుట్టిన మూడు నెలల పసిపాప గురువారం కాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యకుమారి జూలై 22న రాజవొమ్మంగి పీహెచ్సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప పూర్తి ఆరోగ్యంతో ఉండగా రెండు రోజుల క్రితం వాంతులు, రొంప, ఊపిరి అందక ఇబ్బంది పడింది. తన బిడ్డ రొంపతో బాధపడుతూ పాలు కక్కేసుకొంటోందని ఈనెల 3వ తేదీ బుధవారం రాజవొమ్మంగి పీహెచ్‌సీకు వైద్యం కోసం వెళ్లింది. ఆ పాపను పరీక్షించిన స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి వంశీ పాప ఆరోగ్యంగానే ఉందని కొన్ని మందులు ఇచ్చి పంపారు. ఇంటికి వెళ్లిన పాప ఆ రాత్రి కంటిపై కునుకు లేకుండా ఏడవడంతో ఏం చేయాలో తెలియక వారపు సంతలో కొని తెచ్చిన అనాస మందు పొట్లాన్ని పాపకు పాలలో కలిపి పట్టించింది. తెల్లారేసరికి పాప పరిస్థితి విషమించడంతో వెంటనే మరోసారి రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. పాప పరిస్థితిని గమనించిన డాక్టర్ వంశీ అంబులెన్స్ ఇచ్చి కాకినాడ జీజీహెచ్‌కు పంపారు. అక్కడ వైద్య నిపుణులు పాపను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మరణించిన పాపతో సూర్యకుమారి గురువారం ఇంటికి చేరింది. -
కళాశాల బస్సు కిందపడి చిన్నారి మృతి
గుంటూరు రూరల్: కళాశాల బస్సు కింద పడి చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపాడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. రొంపిచర్ల గ్రామంలోని సుబ్బారెడ్డికాలనీకి చెందిన రావెల గోపి, అంజలి దంపతులకు మూడేళ్ల పాప శ్రావణి ఉంది. గోపి నల్లపాడులోని చెరువు సమీపంలో ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుని గత నాలుగు నెలలుగా రబ్బర్ బూరలు అమ్ముకుని జీవిస్తున్నాడు. ఈక్రమంలో అదే ఖాళీ స్థలంలో రాత్రి సమయంలో నగర శివారుల్లోని ఓ ఫార్మశీ కళాశాలకు చెందిన బస్సును నిలుపుతారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం డ్రైవర్ బస్సును తీస్తుండగా చిన్నారి అక్కడే ఆడుకుంటూ బస్సు కిందకు వచ్చింది. ఇది గమనించని డ్రైవర్ ఆమె పై నుంచి బస్సు పోనించా డు. దీంతో చిన్నారి శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరడంతో డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలాన్ని ఎస్ఐలు కృష్ణబాజీ, అమీర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. -
పురిట్లోనే మృత్యుగీతం
కడుపులో బిడ్డ పడగానే ఆ తల్లితో పాటు కుటుంబసభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ బిడ్డ భూమిపై పడేంత వరకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం సహజం. అయితే ఆ బిడ్డ భూమిపై క్షేమంగా వచ్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీనిపై అధిక శాతం ప్రజలకూ అవగాహన లేదు. ఫలితంగా పుట్టీపుట్టగానే ఎంతో మంది శిశువులు ఈ లోకాన్ని వదిలివెళ్లిపోతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే గత 20 నెలల కాలంలో 2వేల మంది శిశువులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల, ఆదోని మాతాశిశు కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు ఉన్నచోట తల్లులతో పాటు పిల్లలకూ వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలి. అయితే కర్నూలు, నంద్యాలలో మాత్రమే ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు(ఎస్ఎన్సీయూ) ఏర్పాటు చేశారు. సున్నిపెంటలో దీనిని ఏర్పాటు చేసినా అక్కడికి రోగులు రాకపోవడంతోనిరుపయోగంగా ఉంచారు. జిల్లాలో సంవత్సరంలోపు పిల్లలకు ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడినా కర్నూలు, నంద్యాల ఆసుపత్రులకు రావాల్సిందే. కొన్నిసార్లు నంద్యాల నుంచి సైతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే శిశువులను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తున్నారు. ఫలితంగా ఈ విభాగంలోని ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూలకు శిశువుల తాకిడి అధికమైంది. అనధికారికంగా ఎన్ఐసీయూ విభాగం పసిపిల్లలకు ప్రాణాధారం నియోనేటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్(ఎన్ఐసీయూ). దీనిని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అధికారికంగా జిల్లాలో దీనిని ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో పసిపిల్లల రద్దీ దృష్ట్యా అధికారులు అనధికారికంగా ఎన్ఐసీయూను ఏర్పాటు చేశారు. అధికారికంగా దీనిని మంజూరు చేయాలని అధికారులు పలుమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ విభాగం ఏర్పాటైతే వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది పోస్టులు మంజూరై పసిపిల్లలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఈ విభాగంలో నిత్యం 30 నుంచి 40 మందికి పైగా పసిపిల్లలు చికిత్స పొందుతూ ఉంటారు. ఇక్కడి ఎస్‌ఎన్‌సీయులో 20 పడకలు ఉండగా ఒక్కోసారి ఒక్కో రేడియంట్ వార్మర్పై ఇద్దరేసి పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. శిశు మరణాలకు ప్రధాన కారణాలివే.. నెలలు నిండకముందే జన్మించడం, తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు బీపీ అధికంగా ఉండటం, పిల్లలు బరువు తక్కువగా ఉండి జన్మించడం శిశువుల మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ సమస్యను నివారించేందుకు గాను క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నా గర్భవతులకు అందే పోషకాహారం నాసిరకంగా ఉండటం, ఆ పోషకాహారాన్ని సైతం సక్రమంగా తల్లికి అందకపోవడం, ఇంటికి తీసుకెళ్లిన సరుకులను కుటుంబసభ్యులందరూ ఆహారంగా తీసుకోవడం వల్ల తల్లికి పోషకాహారలోపం ఏర్పడుతోంది. ఈ కారణంగా ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరవడిన సౌకర్యాలు జిల్లాలోని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టుతో పాటు పీడియాట్రిషిన్, అనెస్తెటిస్ట్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. జిల్లాలోని 18 కేంద్రాల్లో నాలుగింటిలో మాత్రమే పోస్టులు మంజూరయ్యాయి. మిగిలిన వాటిలో ఎంబీబీఎస్ స్థాయి వైద్యులే చికిత్స అందిస్తున్నారు. రౌండ్ ది క్లాక్ పీహెచ్‌సీలు జిల్లాలో 40 ఉన్నా అందులో కనీసం ప్రసవాలు కూడా సరిగ్గా జరడం లేదు. అధిక శాతం ప్రసవాలు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగంలో మూడు యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇతర విభాగాల్లో రెండు అసిస్టెంట్ పోస్టులుండగా ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంది. పిల్లల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అనధికారికంగా నాలుగో యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు, సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి సైతం తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలను ఇక్కడికే మెరుగైన వైద్యం కోసం పంపిస్తున్నారు. సౌకర్యాలు మరింతగాపెంచాల్సి ఉంది చిన్నపిల్లల విభాగంలో చికిత్స కోసం వచ్చే పిల్లల సంఖ్య బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా వైద్యులు పోస్టులు, సౌకర్యాలు ఉండటం లేదన్నది వాస్తవం. అదనంగా మరో ఎస్ఎన్సీయూ మంజూరు చేయాలని, ఎన్ఐసీయూకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ విభాగానికి అధికంగా ఇతర జిల్లాల నుంచి, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి శిశువులు, పిల్లలను రెఫర్ చేస్తున్నారు. పరిస్థితి విషమించి ఇక్కడకు వచ్చిన వారు మరణిస్తుండటంతో ఈ ఆసుపత్రిలో మరణాలు ఎక్కువగా ఉన్నాయన్న భావన కలుగుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం మా విభాగంలో శిశువుల మరణాలు తక్కువగా ఉన్నాయి. –డాక్టర్ జి. రమాదేవి, చిన్నపిల్లల విభాగం ప్రొఫెసర్, పెద్దాసుపత్రి -
ఆడుకుంటూ.. కిరోసిన్ తాగి..
వైఎస్ఆర్, చెన్నరాజుపోడు (ఓబులవారిపల్లె) : ఆడుకుంటూ కిరోసిన్ తాగిన చిన్నారి మృత్యుఒడికి చేరుకున్నాడు. మండలంలోని చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన దార్ల స్వామిదాస్ (ఏడాదిన్నర వయసు) ప్రమాదవశాత్తూ కిరోసిన్ తాగి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నరాజుపోడు వ్యవసాయ పొలం వద్ద నివాసం ఉండే దార్ల ఆనంద్‌బాబు ఆర్టిస్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య సారమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. స్వామిదాసు నాల్గవ సంతానం. సోమవారం సాయంత్రం స్వామిదాస్ ఆడుకుంటూ ఇంటిలో బ్యాగులో దాచి వుంచిన పాత కిరోసిన్ డబ్బా తీసి తాగాడు. చాలా రోజుల క్రితం పెయింట్‌బ్రష్‌లు కడిగిన కిరోసిన్ కావడంతో తాగిన వెంటనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే రైల్వేకోడూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి బంధువుల సమాచారం మేరకు ఏఎస్ఐ గోపాల్ కేసు నమోదు చేశాడు. ముక్కుపచ్చలారని చిన్నారి మృతి చెందిన విషయం తెలియగానే.. చెన్నరాజుపోడు దళితవాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సింగిల్ విండో అధ్యక్షుడు టంగుటూరు కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ సుంకేసుల రఫీ, గుంటిమడుగు దశరథరామరాజు, వీఆర్ఓ రాంబాబు.. మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి వారు సానుభూతి తెలిపారు. -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
సాక్షి, అమరావతి బ్యూరో : స్కూల్ బస్సుల ఫిట్నెస్ లేకపోవడం, నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో, జిల్లాలో రోజూ ఏదో ఓ మూల పాఠశాల వాహనాలు ప్రమాదాలకు గురౌతున్నాయి. వీటిపై వరుస కథనాలతో ‘సాక్షి’ హెచ్చరిస్తున్నా రవాణా శాఖలో ఏమాత్రం చలనం లేదు. ఫలితంగా జిల్లాలో ఈ రోజు ఓ చిన్నారి ప్రాణం బలైంది. రవాణా శాఖ అంతులేని నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. పక్క రాష్ట్రం తెలంగాణలో నిన్న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వార్త వింటూ ఉండగానే మన జిల్లాలో కూడా డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరగడం విచారకరం. ప్రతి స్కూల్ బస్సుకు ఒక అటెండర్ ఉండాలనే నిబంధనను యాజమాన్యాలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ప్రమాదాలు.. ఆగస్టు నెలలో వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 9న నందిగామలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు చందర్లపాడు మండలంలోని తొర్లపాడు వద్ద స్టీరింగ్ పని చేయక అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బస్సులో 18 మంది పిల్ల లు ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ప్రమాదస్థాయి తక్కువ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయికి చేయి విరగగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికి యాజమాన్యం నిర్వహణ లోపం వల్ల ప్రమాదం జరిగిందని రవాణా శాఖాధికారులు నిర్ధారించారు. నిన్న ఒక్క రోజే జగ్గయ్యపేట, విజయవాడ రూరల్ మండలంలో జరిగిన ఘటనలు ప్రమాదపు ఘంటికలను మోగిస్తున్నాయి. విజయవాడ రూరల్ ఎనికేపాడులో గురువారం జరిగిన ప్రమాదం కూడా అటువంటిదే. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను, ఆటోను ఢీకొని విధ్వంసం సృష్టించింది. నలుగురికి గాయాలవ్వగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఇక్కడ కూడా అధికారుల నుంచి అదే సమాధానం వచ్చింది. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది కానీ నిర్వహణ లోపం వల్ల ప్రమాదం జరిగిందని. మరి వీటిని పట్టించుకోవాల్సింది ఎవరు., రవాణా అధికారుల పని కేవలం విద్యా సంవత్సరం అరంభంలో ఫిట్నెస్ టెస్ట్లని హడావిడి సృష్టించి తర్వాత మిన్నుకుండటమేనా. బస్సుల కండిషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన బాధ్యత వారిపై లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతులేని నిర్లక్ష్యం... నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల తన బస్సుల వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్టును, డ్రైవర్ హెల్త్ కండిషన్‌ను పేరెంట్ మీటింగ్‌లో ఉంచాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో పేరెంట్ మీటింగ్ జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. రవాణా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలో చాలా బస్సులకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు, రేడియం స్టిక్కర్లు లేవు, నిబంధనలకు మించి అధికంగా పిల్లలను తరలిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు లేవు. జరిమానాలు విధించిన దాఖలాలు అసలే లేవు. అంతులేని నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కాసులకు కక్కుర్తిపడి విద్యా సంవత్సరం అరంభంలో ఏజెంట్ల ద్వారా వచ్చే బస్సులకు ఎటువంటి తనిఖీలు లేకుండా సర్టిఫికెట్ ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లీనర్లు బస్సులు నడుపుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి ఎన్నో తప్పిదాలు ఉన్నా పర్యవేక్షణ లోపంతో మరుగునపడుతున్నాయి. నిబంధనలు.. మోటార్ వాహనాల చట్టం, 1969 రూల్ 185లో సవరణల తుది నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించి ఫిట్నెస్తో పాటు తీసుకోవాల్సిన 32 అంశాలపై జారీ చేసింది. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా నిబంధనలను ఉల్లఘించటమే అవుతుం ది. పాఠశాలలు తెరిచిన తర్వాత ఆకస్మిక తనిఖీ లతో ఎప్పటికప్పుడు చూడాల్సిన బాధ్యత రవా ణాశాఖకు ఉంది. అందులో నిన్న ప్రమాదం జరిగిన విధానం చూస్తే ఏఏ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందో తెలుసుకుందాం. ♦ పాఠశాల యాజమాన్యం విధిగా బస్సు డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ సొంత ఖర్చుతో డ్రైవర్‌కు ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ♦ ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన వారినే డ్రైవర్లుగా నియమించాలి. డ్రైవర్ నియామకం గురించి పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లాలి. ♦ బస్సుల పార్కింగ్ కోసం విద్యా సంస్థ పరిధిలోనే స్థలాన్ని కేటాయించాలి. ♦ పాఠశాల ఆవరణ నుంచే బస్సు ఎక్కటం, దిగటాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి. ♦ ప్రతి బస్సులోనూ అటెండర్ ఉండాలి. ♦ డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. ♦ విద్యార్థులు బస్సు ఎక్కేటపుడు, దిగేటపుడు బస్సు అటెండర్ దగ్గరగా నిలబడి సురక్షితంగా ఎక్కి, దిగేలా చూడాలి ♦ ప్రతి ఏడాది ఒకసారి రవాణా శాఖ నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి డ్రైవర్‌ను పంపాలి. పై నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారణ అవుతోంది. ఈ బస్సుకు అటెండర్ లేకపోవడం, పాఠశాలలో బస్సు పార్కింగ్ లేక బయట వేరే ప్రదేశంలో పార్క్ చేయడం కారణం. స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలు బస్సు ఎక్కేటప్పుడు అటెండర్ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. వీటికి తోడు డ్రైవర్ నిర్లక్ష్యం పిల్లాడి మరణానికి దారి తీసింది. విచారణ జరుపుతున్నాం... ప్రమాదం జరిగిన బస్సు కు ఫిటెనెస్ సర్టిఫికెట్ ఉంది. ప్రమాదం ఎం దుకు జరిగిందో విచారిస్తున్నాం. – ఈ. మీరా ప్రసాద్, డీటిసీ, కృష్ణా జిల్లా -
డబ్బా గొంతులో ఇరుక్కుని..
కర్ణాటక, యశవంతపుర : డబ్బా గొంతులో ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన విజయపుర జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు... తికోటా పట్టణానికి చెందిని విశ్వనాథ్ తాళికోటి కుమారుడు మల్లు (తొమ్మిది నెలలు). ఉదయం చిన్నారి మల్లుకు ఇంటిలోని వారు సున్నం డబ్బీ చేతికి ఇచ్చి ఇంటి పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో బాలుడు డబ్బీని నోటిలో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. విషయం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
అన్నానగర్: మంగళం సమీపంలో ప్లాస్టిక్ తొట్టెలో ఉన్న నీటిలో ముంచి రెండున్నర ఏళ్ల కుమార్తెను ఓ కన్నతల్లి కడతేర్చింది. ఈ ఘటన మంగళం సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కరూర్ జిల్లా కులిత్తలైకి చెందిన నాగరాజ్ (23) కూలీ. ఇతను తిరుప్పూర్ సమీపం సామలపురం రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇతని భార్య తమిళ్ ఇసక్కి (21). వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల వయస్సు గల శివన్యశ్రీ అనే కుమార్తె ఉంది. నాగరాజ్ పక్కింటిలో ఇతని తండ్రి పళనిస్వామి, తల్లి ధనలక్ష్మి నివసిస్తున్నారు. రెండు రోజుల ముందు ధనలక్ష్మి ముసిరిలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లింది. సోమవారం ఉదయం నాగరాజ్, పళనిస్వామి ఇద్దరు పనికి వెళ్లారు. ఇంట్లో తమిళ్ ఇసక్కి, శివన్యశ్రీ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ముసిరి నుంచి వచ్చిన ధనలక్ష్మి శివన్యశ్రీకి కొత్త దుస్తులు వేసింది.తరువాత శివన్యశ్రీకి పాలు ఇచ్చి పడుకోబెట్టింది. చిన్నారి నిద్రపోగానే ధనలక్ష్మి తన ఇంటి బయట కూర్చొని ఉంది. నాగరాజ్ వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా నోటి నుంచి నురుగు వచ్చిన స్థితిలో శివన్యశ్రీ స్పృహతప్పి పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే చిన్నారిని కోవై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ శివన్యశ్రీని పరీక్షించిన డాక్టర్లు, చిన్నారి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వెంటనే ధనలక్ష్మి మంగళం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కన్నతల్లిని విచారణ చేశారు. విచారణలో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ తొట్టెలో ఉన్న నీటిలో ముంచి శివన్యశ్రీని హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కన్నతల్లి తమిళ్ ఇసక్కిని అరెస్టు చేశారు. -
అయ్యో పాపం..!
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. బుడిబుడి అడుగులు వేస్తూ కళ్ల ముం దు తిరుగుతూ ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి పంటకాలువలో పడి మృతిచెందాడు. పంట కాలువపై సిమెంట్ మూత గానీ, ఫెన్సింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తుకూరులోని తిమ్మనపట్నానికి చెందిన చిట్టిబాబు, లీలావతికి ఇద్దరు సంతానం. కుమారుడు పాముల గోకుల నందు(6), మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం నెల్లూరు నగరంలోని 13వ డివిజన్లోని సింహపురి హాస్పిటల్ నుంచి చింతారెడ్డిపాళెం వైపు వెళ్లే యల్లంవారిదిన్నె గ్రామంలో ఉన్న తన తల్లి వద్దకు లీలావతివచ్చింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గోకుల నందు ఆడుకుంటూ ఇంటి ముందు ఉండే పంటకాలువ వద్దకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో చిన్నారి కాలువలో పడిన విషయాన్ని గమనించలేదు. తల్లి లీలావతి కుమారుడి కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. సాయంత్రం 5 గంటల సమయంలో అనుమానం వచ్చి ఇంటికి సమీపంలోని వ్యక్తులను కాలువలోకి దించి గాలించారు. ఓ వ్యక్తి కాలికి నందు మృతదేహం తగిలింది. బయటకు తీయగా అప్పటికే నందు మృతిచెందినట్లు గుర్తించారు. సమీపంలోని సింహపురి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా నందు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కళ్ల ముందే తిరుగుతున్న కుమారుడు విగతజీవిగా మారడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అధికారుల నిర్లక్ష్యం యల్లంవారిదిన్నె ప్రధాన రహదారికి ఓ వైపు పంట కాలువను ఏడు నెలల క్రితం నిర్మించారు. కాలువ పక్కనే ఇళ్లు ఉన్నాయి. అయితే కాలువ పై సిమెంట్ స్లాబ్ కానీ, ఫెన్సింగ్ కానీ వేయకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం నుంచి నలుగురు కాలువలో పడిన ఘటనలు ఉన్నాయి. అయితే కాలువలో పడిన సమయంలో అందుబాటులో ఎవరో ఒకరు ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఐదేళ్ల చిన్నారి రేవంత్, వృద్ధురాలు శీనమ్మ, శ్రీను కాలువలో పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే గురువారం జరిగిన ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు కార్పొరేషన్ అధికారులకు కాలువను మూసివేయాలని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరినా ఫలితం లేకుండాపోయింది. స్థానిక డీఈ ఆకుల శ్రీనివాసులుకు కాలువ నిర్మాణం చేస్తున్న సమయంలోనే చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరతున్నారు. -
రిమ్స్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతి
ప్రకాశం, ఒంగోలు సెంట్రల్: వైద్యురాలి నిర్లక్ష్యంతో అప్పుడే పురుడు పోసుకున్న శిశువు (మగబిడ్డ) ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆమె నిర్లక్ష్యానికి ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. ఈ సంఘటన రిమ్స్‌లో గురువారం జరిగింది. శిశువు మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితుల కథనం ప్రకారం.. చినగంజాం మండలం కడవకుదురుకు చెందిన కె. మధులత మొదటి కాన్పుకు ఈ నెల 25న రిమ్స్‌లో చేరింది. 26న కాన్పు చేస్తామని చెప్పిన వైద్యులు పట్టించుకోలేదు. 29న బంధువులు ప్రశ్నించడంతో రాత్రి పదిన్నర గంటల సమయంలో కాన్పు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. కాన్పు కష్టం కావడంతో చాలాసేపు సాధారణ కాన్పు అవుతుందని వేచి ఉన్నారు. బిడ్డ కొద్దిగా బయటకొచ్చి అగిపోయింది. కడుపులో ఉన్న శిశువు ఒత్తిడికి గురై శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత చిన్న శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. బిడ్డ అప్పటికే పూర్తిగా అనారోగ్యానికి గురవడంతో రిమ్స్‌లో ఉన్న చిన్న పిల్లల చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మరణించింది. కాన్పు చేసిన విధానంపై ఆగ్రహం మందులు కావాలంటూ మధులత బంధువులను వైద్యులు అర్ధరాత్రి బయటకు పంపించారు. అప్పటికప్పుడు వారు రెండు వేల రూపాయల మందులు బయట నుంచి తీసుకొచ్చి వైద్య సిబ్బందికి అందించారు. అయినా బిడ్డ ప్రాణాలు దక్కలేదని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. పైగా తల్లికి ఇష్టం వచ్చినట్లు దాదాపు 10 కుట్లకుపైగా వేశారని, రిమ్స్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కాన్పు కోసం ఇష్టం వచ్చినట్లు తల్లి ముఖంపై కొట్టారని, పెదవి చిట్లిపోయి రక్తం కారిందని ఆరోపించారు. పొట్ట మీద ఇష్టం వచ్చినట్లు నొక్కడంతో వాతలు తేలాయని, ఇంత నిర్దయగా వ్యవహరిస్తారని అనుకుంటే తాము చీరాలలోనే కాన్పు చేయించుకునే వారమని విలపించారు. బాధితులు రిమ్స్ క్యాజువాలిటీ వద్ద డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాన్పు కోసం వచ్చిన తమ బిడ్డను పట్టించుకోకుండా డాక్టర్ సమయం వృథా చేయడంతో ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. కాన్పు కష్టం అవుతుందనుకుంటే సీజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయవచ్చు కదాని మధులత బంధువులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం కొంత మంది నాయకులు రంగ ప్రవేశం చేయడంతో బాధితులు, నాయకులు రిమ్స్ డైరెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఎంఓ గది వద్ద బాధితులతో డైరెక్టర్ మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆందోళనకారులకు ఆయన హామీ ఇచ్చారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రనా«థ్‌రెడ్డి, గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు ఉన్నారు. వైద్యుల పొరపాటు లేదు: మధులత విషయంలో వైద్యుల పొరపాటు లేదు. కాన్పు కష్టం అయింది. ఇందుకు తల్లి ఎత్తు, బరువు లేదు. బిడ్డ ఉమ్మ నీరు తాగింది. ఊపిరి తిత్తుల్లోకి కూడా నీరు చేరింది. శిశువు మృతి చెందాడు. అయినా జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నాం. ఎస్కే మస్తాన్ సాహెబ్, డైరెక్టర్, రిమ్స్ -
టీవీ పడి చిన్నారి మృతి
కర్నూలు, పాములపాడు: టీవీ మీద పడడంతోఓ చిన్నారి మృతిచెందింది. ఈవిషాదకర ఘటన మంగళవారం పాములపాడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పాములపాడుకు చెందిన టైలర్ లింగారెడ్డి, అంజలి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నమ్మాయి వెంకటసింధుకు ఏడాదిన్నర వయసు. మంగళవారం ఇంట్లో ఆడుకుంటూ టీవీ తీగలు పట్టుకొని లాగింది. స్టాండ్‌కు ఉన్న చక్రాలు ముందుకు కదలడంతోచిన్నారి తలపై టీవీ పడింది. ఆ శబ్దం విన్న తల్లి అంజలి పరుగున వచ్చి టీవీ పక్కకు తీసేసి.. పాపను చేతుల్లోకి తీసుకుంది. ఎలాంటి రక్తస్రావం కాలేదు. అయితే.. తలకు వెనుక భాగంలో వాపు వచ్చింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆత్మకూరుకు పంపించారు. అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిత్యం కళ్లముందు వచ్చీరాని మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే పాప ఇక లేదన్న వార్త వారిని కలిచివేసింది. -
‘‘యా అల్లా’’ ఎంత పనిచేశావయ్యా..
ఆడపిల్లను భారంగా భావించే రోజులు..ముగ్గురు బంగారు తల్లులు.రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప..పూట గడవని కుటుంబం.పిల్లల చిరునవ్వులే..ఆ ఇంట్లో వెలుగు దివ్వెలు.పట్టుమని పదేళ్లు కూడా లేవు..ఇద్దరు పిల్లలను మృత్యువు కబలించింది.కళ్లెదుటే ఒక్కో ప్రాణం నిలిచిపోయింది..కన్నపేగు విలవిల్లాడింది.అల్లారుముద్దుగా పెంపకం..ఆ ఇంటి పెద్ద హృదయం ముక్కలైంది.తల్లి కంట్లో కన్నీటి సుడులు.. తండ్రి చేతుల్లో కంటి పాపలు..మూడంతస్తుల మేడ..ఒక్కో మెట్టూ కరిగిపోయింది.రాలిన పూల సాక్షిగా..ప్రభుత్వాసుపత్రి మూగబోయింది. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో గురువారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృత్యువొడి చేరారు. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల కళ్లముందే రక్తం కక్కుకుని మృతి చెందిన ఘటనతో ఆసుపత్రి ఆవరణ మూగబోయింది. వివరాల్లోకి వెళితే.. పెనుకొండ పట్టణంలోని బీటీఆర్ కాలనీకి చెందిన మహబూబ్‌బాషా, షబానా దంపతులకు గౌసియా(8), హర్షియా (4), ఆలియా(2) సంతానం. ముగ్గురూ ఆడపిల్లలే ఆయినా మహబూబ్‌బాషా ఏమాత్రం దిగులు చెందలేదు. భార్యతో కలిసి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బట్టీల వద్ద పనిలేనప్పుడు కార్పెంటర్ల వద్ద కూలీ పనులకు వెళ్లేవాడు. బాషా రెక్కాడితేనే ఆ ఇంట్లో పిల్లల డొక్క నిండుతుంది. అయినప్పటికీ బిడ్డలందరినీ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పెద్దకుమార్తె గౌసియా(8) పుట్టుకతో డౌన్‌సిండ్రోమ్(జన్యుపరమైన సమస్య)తో బాధపడుతుండగా.. తన శక్తిమేరకు చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిన్న అమ్మాయి ఆలియా(2) కూడా పదిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు గౌసియాకు కూడా తీవ్ర జ్వరం రావడంతో భయాందోళన చెందిన మహబూబ్‌బాషా ఈ నెల 25న పెనుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. అయితే అక్కడి వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే మందులురాసి ఇంటికి పంపాడు. ఇంటికెళ్లాక ఇద్దరు పిల్లలకు మందులు వేయగా.. వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో హుటాహుటిన చిన్నారులిద్దరినీ కుటుంబీకులు హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. 26వ తేదీ ఉదయం 1.45 గంటల సమయంలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటికే గౌసియా నోరు, ముక్కు నుంచి రక్తాస్రావం అవుతోంది. వైద్యులు పరీక్షించి, బ్లీడింగ్ డయాతసిస్గా నిర్ధారణకు వచ్చారు. రక్తం ఆగేందుకు మందులు పెట్టారు. అలాగే ఆలియాకు జ్వరం తగ్గేందుకు చికిత్స చేశారు. అయితే ఉదయం 10.10 గంటల సమయంలో గౌసియాకు ఫిట్స్రాగా ఆ అమ్మాయి కాసేపటికి మృతి చెందింది. గౌసియా గొంతులో వాపు రావడం కంఠసర్పి లక్షణాలను తలపిస్తోంది. ‘‘యా అల్లా’’ ఎంత పనిచేశావయ్యా.. తమ కళ్లముందే చనిపోయిన ఇద్దరు బిడ్డలను చూసి మహబూబ్‌బాషా, షబానాలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇద్దరు పిల్లలు మంచంపై రక్తం కక్కుని పడి ఉండడాన్ని చూసి తల్లి షబానా బోరున విలపించింది. ‘‘యా అల్లా’’ ఎంత పని చేశావయ్యా... అంటూ విలపించింది. ఆలియా ‘‘భేటీ ఉఠో..ఉఠో’’ అంటూ ఆమె విలపించిన తీరు చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. పెంచిన చేతులతోనే... మృతి చెందిన చిన్నారులను ఆస్పత్రి నుంచి అంబులెన్స్ వరకు తరలించడానికి కనీసం స్ట్రెచ్చర్ కూడా లేని పరిస్థితి. చిన్నపిల్లల విభాగంలో స్ట్రెచ్చర్, వీల్చైర్లు లేకపోవడం.. అక్కడ నాల్గో తరగతి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులే ప్రాణం లేని ఆ పసిబిడ్డలను మూడో అంతస్తు నుంచి కిందవరకూ చేతుల్లోనే మోసుకువెళ్లారు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు..గానీ ఆస్పత్రి సిబ్బందిలోని ఏ ఒక్కరూ వారికి కనీస సాయం చేయలేకపోయారు. అలా బిడ్డలను చేతులమీదే కిందకు తీసుకువచ్చిన మహబూబ్‌బాషా దంపతులు మహాప్రస్థానం వాహనంలో ఇంటికి తీసుకువెళ్లారు. వ్యాధి నిరారించడంలో వైద్యుల విఫలం గౌసియా, ఆలియా మృతి ఘటనలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పెనుకొండ, హిందూపురం ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రమాదకర కేసులను తేలిగ్గా తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కనీసం వ్యాధి నిర్ధారించలేనట్లు అవగతమవుతోంది. చివరి నిమిషంలో సర్వజనాస్పత్రికి పంపి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడినట్లు తెలుస్తోంది. ప్రారంభంలోనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకువచ్చింటే చిన్నారులకు మెరుగైన వైద్యం అందేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. అక్క వెంటే చెల్లి... నిమోనియా, మాల్ న్యూట్రీషియన్తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ఆలియాకు వైద్యులు ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. ఆ సమయంలో గౌసియా చనిపోవడంతో కన్నీరుమున్నీరైన తల్లి.. చిన్నకుమార్తె ఆలియా ఆక్సిజన్ మాస్క్ తొలగించి బయటకు తీసుకెళ్లింది. దీంతో వెంటనే ఆలియా నోరు, ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఆ కొద్దిసేపటికే ఆలియా కూడా మృతి చెందింది. శోకసంద్రంలో పెనుకొండ పెనుకొండ: గౌసియా, ఆలియా మృతి వార్త తెలిసిన వెంటనే పెనుకొండలోని బీటీఆర్ కాలనీకి తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను తీసుకురాగానే బంధువులు, సమీప ప్రాంతాల వారు మహబూబ్‌బాషా ఇంటికి తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న చిన్నారులు చూసి చలించిపోయారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి సాయంత్రం వేళ చిన్నారులిద్దరినీ ఖననం చేశారు. కాగా, ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారని తెలుసుకున్న పోలీసులు మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫిట్స్, నిమోనియాతో పిల్లలు మృతి గౌసియా జన్యుపరమైన సమస్య(డౌన్‌సిండ్రోమ్) బ్లీడింగ్ డయాతసిస్తో బాధపడుతూ అడ్మిట్ అయ్యింది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావమయ్యే సమయంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో గుండె, ఊపిరితిత్తులు పనిచేయక మృతి చెందింది. ఆలియా నిమోనియాతో పాటు మాల్ న్యూట్రీషియన్(పౌష్టికాహారం లోపం)తో బాధపడుతోంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడంతో మృతి చెందింది.– డాక్టర్ మల్లీశ్వరి(హెచ్ఓడీ) -
చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు
పెద్దఅంబర్‌పేట: తన సోదరుడిని పాఠశాలకు పంపించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి బాలుడిని రెప్పపాటులో మృత్యువు కబలించింది. ప్రతి రోజూ స్కూల్ బస్సు వరకు వచ్చి అన్నకు టాటా చెప్పే ఆ చిన్నారిని అదే స్కూల్ బస్సు మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్లిన దుర్ఘటనను ఆ చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపే బుడిబుడి అడుగులు వేస్తూ చిట్టిపొట్టి మాటలతో ఆడుకునే తన ముద్దుల కొడుకు కళ్ల ముందే మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన స్థానికులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారమతిపేట గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జశ్వంత్ హయత్‌నగర్‌లోని శాంతినికేతన్ స్కూల్లో చదువుతుండగా, రెండోవాడు తన్వీష్ (3) ఇంటి దగ్గరే ఉంటున్నాడు. బస్సు చక్రం కిందపడి.. తన కుమారుడిని స్కూల్‌కు పంపించేందుకు రోజు మాదిరిగానే స్కూల్ బస్సు (ఏపీ29టీబీ8114)) ఎక్కించేందుకు స్వాతి మంగళవారం ఉదయం 7:40గంటల సమయంలో తన ఇద్దరు కొడుకులతో కలిసి బస్సు దగ్గరికి వెళ్లింది. జశ్వంత్‌ను బస్సులో ఎక్కించే క్రమంలో తల్లి పక్కనే ఉన్న తన్వీష్ బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా స్కూల్ బస్సు ఒక్కసారిగా ముందుగా కదిలింది. దీంతో బస్సు కింద పడిని తన్వీష్‌పై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఎక్కడ ఉన్నాడని చూసేలోపే స్వాతికి తన కుమారుడు విగతజీవిగా పడి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా స్వాతి కుప్పకూలిపోయింది. తన చిన్న కొడుకు మృతి చెందాడన్న చేదు నిజాన్ని భరించలేక రోదిస్తున్న తీరు స్థానికుల కంట నీరు పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
అప్పటిదాకా బడిలో పాఠాలు నేర్చుకున్న ఇద్దరు చిన్నారులు తరగతులు ముగిశాక సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. వాగు గోతుల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లలో ఈత కొట్టాలని సరదా పడ్డారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మిత్రులిద్దరూ ప్రాణాలు విడిచారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన ముండ్లమూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నింపింది. ముండ్లమూరు: ముండ్లమూరు ఎస్సీ కాలనీకి చెందిన గోపనబోయిన చిన్నా, అంజమ్మలకు ఒక్కగానొక్క సంతానం శ్రీరాములు (శ్రీరామ్). అదే ప్రాంతానికి చెందిన పిల్లి బాలస్వామి, అంజలి దంపతుల మూడోసంతానం అరుణ కుమార్ ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో శ్రీరాములు (10) 5వ తరగతి, అరుణకుమార్ (9) 4వ తరగతి చదువుతున్నారు. చిన్నారులిద్దరూ రోజూ లానే గురువారం బడికి వెళ్లారు. సాయంత్రం బడి విడిచి పెట్టాక కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామానికి శివారున ఉన్న చిలకలేరు వద్దకు వెళ్లారు. వాగులోని ఓగోతిలో కొద్దిగా నీరుండటంతో బట్టలు విప్పి ఒడ్డున పెట్టి ఈతకు దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో ఊపిరాడక మృతి చెందారు. చీకటి పడినా చిన్నారులు ఇద్దరు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకడం మొదలు పెట్టారు. స్నేహితులను వాకబు చేశారు. చిలకలేరు వైపు వెళ్లినట్లు రాత్రి 7 గంటల సమయంలో విద్యార్థులు తెలిపారు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు చిలకలేరులో వెదకడం మొదలు పెట్టారు. వాగు సమీపంలో దుస్తులు, చెప్పులు కనిపించడంతో నీటిలోకి దిగి చూశారు. చిన్నారుల ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివనాంచారయ్య చిలకలేరుకు చేరుకొని మృతదేహాలను కుటుంబ సభ్యుల సాయంతో ఇంటికి చేర్చారు. ఈ ఘటనతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక్కడే కుమారుడు కావడంతో శ్రీరామ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
మరో శిశుమరణం
రాజవొమ్మంగి (రంపచోడవరం): మండలం శరభవరం గ్రామానికి చెందిన బేరా రామలక్ష్మి రాజవొమ్మంగి పీహెచ్‌సీకి పురిటికి రాగా ఆడబిడ్డ పురిట్లోనే చనిపోయింది. పేగు మెడలో చుట్టుకోవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోయిందని పురుడు పోసిన స్థానిక వైద్యులు వంశీ, మోనీషా వివరణ ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన స్థానిక వైద్యులు గోప్యత పాటించడంతో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. రామలక్ష్మికి వైద్యులు పురుడు తేదీ జూన్ 20గా వెల్లడించారు. మూడురోజులుగా ఆమెకు పురిటినొప్పులు వస్తుండడంతో శరభవరంలో గల ఏఎన్ఎంకు రామలక్ష్మి తెలిపింది. అయితే 20వ తేదీ వరకు భయంలేదని ఏఎన్ఎం చెప్పిందని రామలక్ష్మి తెలిపింది. శనివారం నొప్పులు మరీ ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు 108 సహాయంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించగా మృతశిశువు జన్మనిచ్చింది. రామలక్ష్మి పీహెచ్‌సీకి వచ్చిన సమయంలో ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యనిపుణుల సమక్షంలో ‘ప్రధానమంత్రి సురక్షత మాతృత్వ అభియాన్’ వైద్య శిబిరం జరుగుతోంది. అయినా రామలక్ష్మికి మెరుగైన ప్రసూతి సేవలు లభించకపోవడంతో ఆమెకు గర్భశోకం తప్పలేదు. -
8వ అంతస్తు నుంచి జారిపడి పాప మృతి
బొమ్మనహళ్లి: ఎనిమిదవ అంతస్తు నుంచి జారిపడి చిన్నారి పాప మరణించిన ఘటన మంగళూరు నగరంలోఉన్న శక్తి నగరలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి విల్సన్, ఆలిత దంపతుల కుమార్తె శానెల్ జెనిషియా డిసౌజా (5)గా గుర్తించారు. దంపతులు తమ ఐదు సంవత్సరాల కుమార్తెతో కలిసి అపార్టుమెంటులో ఉన్న 8వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. గురువారం ఇంట్లో ఆటలాడుతున్న చిన్నారి డిసౌజా ఇంటిలో ఉన్న స్లైడర్ కిటికి వద్ద ఆడుకుంటూ పైకి ఎక్కి కిందికి జారిపడడంతో తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయింది. స్లైడర్ కిటికి ఏర్పాటు చేసినా దానికి మధ్యలో ఇనుప కడ్డీలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కంకనాడి పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె ఈ ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుఅవుతున్నారు. -
అయ్యో..అక్షర
రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 నెలల చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. తనను కొరికిందని ఆ చిన్నారిపై కోపం పెంచుకున్న మరో బాలిక ఈ ఘాతుకానికి పాల్పడింది. హత్య చేసిన బాలికను అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జలవిహార్‌లో పనిచేసే అప్పల నాయుడు రాజుల కుమార్తె అక్షర గురువారం సాయంత్రం అదే ప్రాంతంలోని మురుగు నీటి సంప్‌లో శవమై తేలిన సంగతి విదితమే. అప్పలనాయుడు కుటుంబం జలవిహార్‌లో పనిచేస్తూ అక్కడే ఉండే రేకుల షెడ్డులో మిగతా కార్మికులతో కలిసి ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం అందరు పనిలో ఉండగా అక్షరతో పాటు మరో 11 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆ బాలిక వెళ్లి అక్షరను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ అప్పలనాయుడుకు చెప్పింది. వెంటనే అన్ని ప్రాంతాల్లో వెదికి రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి చుట్టు పక్కల గాలించగా సంపులో అక్షర మృతదేహం కనిపించింది. సంపులో పడేసి...కిడ్నాప్‌గా డ్రామా ఫిర్యాదు అందగానే ఈ కేసును పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్షర కుటుంబ సభ్యులకు ఎవరైన శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి సీసీ కెమెరాలను పరిశీలించగా 11 ఏళ్ల బాలిక ఈ చిన్నారిని కొద్దిసేపు ఆడిస్తూ, ఎత్తుకుని ఉండటం కనిపించింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు కూడా ఎవరూ కనిపించ లేదు. తనపై ఎవరికి అనుమానం రాకుండా ఎవరో ఎత్తుకుని వెళ్లారని కట్టుకథ అల్లినట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ బాలిక అవసరం లేకున్నా పదేపదే అదే చెబుతుండటం, పొంతన లేకుండా మాటలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగి పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. అక్షర గతంలో ఒక మారు తన చేతిపై కొరికిందని, అందుకే అదే కోపంతో ఎత్తుకుని వెళ్లి సంపులో పడేసినట్లు బాలిక పోలీసులకు చెప్పింది. మాటలు కూడా రాని ఓ 16 నెలల చిన్నారి మృతి చెందితే పూర్తిగా లోకజ్ఞానం కూడా తెలియని బాలిక హంతకురాలు కావడం విచిత్రం. అనంతరం ఆ బాలికను శుక్రవారం అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. మృతి చెందిన చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
శిశువు మృతికి మీరే కారణం!
కనిగిరి: వైద్యుని నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడంటూ తల్లి దండ్రులు, బంధువులు ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసిన ఘటన బుధవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం పీసీపల్లి మండలం మురిగమ్మికి చెందిన నాగమణి రెండో కాన్పుకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిచేరి మగ శిశువుకు మంగళవారం జన్మనిచ్చింది. అయితే శిశువు అనారోగ్యంగా ఉండటంతో పట్టణంలోని శ్రీనివాస« థియేటర్ వద్ద గల ఓ చిన్న పిల్లల ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నపిల్లల వైద్యుడు చికిత్స నిర్వహించి ఆరోగ్యం బాగానే ఉందని రాత్రి 8 గంటలకు శిశువుకు పాలు పట్టించేందుకు తల్లి వద్దకు పంపాడు. అయితే బుధవారం తెల్లవారు జామున 3గంటల నుంచి శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో తండ్రి నాగరాజు తిరిగి చిన్న పిల్లల వైద్యశాలకు వచ్చాడు. డాక్టర్ లేడని ఉదయం 7 గంటలకు రమ్మని తెలిపాడు. ఈ క్రమంలో 7 గంటలకు శిశువును చిన్న పిల్లల వైద్యశాలకు తీసుకొచ్చి డాక్టర్ వద్ద చూపించారు. డాక్టర్ వైద్య, రక్త పరీక్షలు చేయించి తల్లీ బిడ్డలు వైద్యశాలలో మూడు రోజులు జాయిన్ అవ్వాలని చెప్పారు. దీంతో ఉదయం 10 గంటలకు ఆస్పత్రిలో చేరారు. వచ్చిన వెంటనే పరీక్షించి డ్రాప్స్ ఇచ్చిన కాంపౌండర్ ఆతర్వాత పట్టించుకోలేదు. మధ్యాహ్నం తర్వాత బిడ్డలో కదలిక లేక పోవడంతో తల్లి దండ్రులు ఆందోళనకు గురై.. కాంపౌండర్‌పై కేకలు వేయడంతో బాబును పరీక్షించి, ఐసీయూలోకి తీసుకెళ్లి కొద్దిసేపటికే బాబు చనిపోయినట్లు చెప్పాడని తల్లిదండ్రులు జి. నాగమణి, నాగరాజులు విలేకర్లకు తెలిపారు. బరువు తక్కువగా ఉన్న తన బిడ్డకు సకాలంలో వైద్యం అందించకుండా.. కనీసం పట్టించుకోకపోవడంతోనే చనిపోయాడని తల్లిదండ్రులు కుమిలిపోయారు. వైద్యుని నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయాడంటూ బంధువులు ఆరోపిస్తూ అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనిపై ఎస్సై యు శ్రీనివాసులును వివరణ కోరగా.. డాక్టర్ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి వద్దకు వచ్చినట్లు తెలిపారు. శిశువు తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కాగా మృత శిశువును రాత్రి 8.10 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉంచారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి!
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే శిశువు చనిపోయిందంటూ బాలింత బంధువులు ఆరోపించారు. వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ పరహానా గర్భిణి కావడంలో తొమ్మిది నెలలుగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతోంది. పరీక్షలు చేయించడంతో పాటు మందులు వాడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పరిహానాకు కడుపులో నొప్పిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటివరకూ ఆమెకు వైద్యం చేసిన వైద్యురాలు ఆసమయంలో అందుబాటులో లేరు. వైద్యురాలి సూచన మేరకు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఆరోజు, తర్వాత రోజు ఆదివారం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గర్భిణి పరహానాను పట్టించుకోలేదు. సోమవారం వైద్యురాలు వచ్చిన తర్వాత పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పారని, అవసరమైతే మరో రోజు కూడా ఆగవచ్చని అన్నారని బంధువులు అంటున్నారు. తాము ఆపరేషన్ చేసేం దుకు అంగీకరించగా సోమవారం ఉద యం ఆపరేషన్ చేయగా మృత శిశువు జన్మించిందని వాపోయారు. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ శివప్రసాద్ స్పందిస్తూ పరహానాకు వైద్యసేవలు అందించామన్నారు. అన్ని వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకరరావుకు తెలియజేశామన్నారు. డాక్టర్ల్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని బాధితురాలి బంధువులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు, వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. -
విధాత కోర్టులోనూ ఓడిపోయాడు
ఒక చిన్నారి మరణం వంద ప్రశ్నల్ని లేవనెత్తింది. ఆ తల్లిదండ్రుల కడుపుకోత బ్రిటన్ చట్టాలనే బోనులో ఉంచింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్నంత మాత్రానా చేజేతులారా ఒక ప్రాణాన్ని మొగ్గలోనే తుంచేయడమేనా? మాకు కావల్సింది వ్యాధి తగ్గడం కాదు, ఆ ప్రాణం పదిలంగా ఉండటం అన్న ఆ తల్లిదండ్రులు ఆక్రందన పట్టించుకోకపోవడం ఎంతవరకు సరైనది? మెరుగైన చికిత్స ఇప్పిస్తామన్న పోప్ మాటల్ని మతం పేరుతో పెడచెవిన పెట్టి మరీ లైఫ్ సపోర్ట్ తీసేసే కఠినమైన చట్టాలను ఏం చేయాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు లండన్ వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి అల్ఫీ ఇవాన్స్కి నూరేళ్లు నిండిపోయాయి. పుట్టుకతోనే అత్యంత అరుదైన మెదడుకి సంబంధించిన వ్యాధి కలిగిన కన్నబిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తల్లిదండ్రుల ఆరాటం, గత కొన్ని నెలలుగా వాళ్లు చట్టంతో చేసిన పోరాటం చివరికి గుండెకోతనే మిగిల్చాయి. తల్లిదండ్రుల కడుపుతీపి ఒకవైపు, ఆధునిక వైద్యం కూడా చేయగలిగిందేమీ లేదన్న వైద్యుల నిస్సహాయత మరోవైపు, బాలల హక్కులపై బ్రిటిష్ చట్టాలు ఇంకో వైపు, వీటన్నింటి మధ్య రెండేళ్ల చిన్నారి ప్రాణం నలిగి నలిగి అనంత వాయువుల్లో కలిసిపోయింది. తల్లిదండ్రులు వద్దు వద్దని మొరపెట్టుకుంటున్నా, వాటికన్ సిటీలో మెరుగైన వైద్యం ఇప్పిస్తామంటూ పోప్ ఫ్రాన్సిస్ హామీ ఇచ్చినా, కోర్టులు చెప్పాయంటూ బ్రిటన్ వైద్యులు ఆ చిన్నారికి లైఫ్ సపోర్ట్ తీసివేయడంతో అల్ఫీ ఇవాన్స్ మరణించాడు. ఈ చిన్నారి మృతి ఎందరినో కదిలించింది. బాలల హక్కులపై వందల ప్రశ్నల్ని లేవనెత్తింది. వేలాది మంది ఆ బాలుడి మృతికి కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రి దగ్గర పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. చట్టంతో తల్లిదండ్రుల పోరాటం లండన్‌కు చెందిన టామ్ ఇవాన్స్, కేట్ జేమ్స్ దంపతులకు జన్మించిన అల్ఫీ పుట్టుకతోనే మృత్యుముఖానికి దగ్గరయ్యాడు. అత్యంత అరుదైన మెదడులో నరాలకు సంబంధించిన వ్యాధితో జన్మించాడు. ఈ వ్యాధి నెమ్మది నెమ్మదిగా మెదడు పనిచేసే సామర్థ్యాన్ని తగ్గించి చివరికి ప్రాణాలను తీసేస్తుంది. ఏడు నెలలకే కోమాలోకి వెళ్లిపోయిన అల్ఫీ ఇవాన్స్ లండన్‌లోని లివర్పూల్స్ ఆల్డర్ హే చిల్డ్రన్స్ ఆస్పత్రిలో లైఫ్ సపోర్ట్ మీదే ఉన్నాడు. ఇక ఆ బాలుడికి మందులేవీ పని చేయవని, లైఫ్ సపోర్ట్ తీసేయాలని చికిత్స అందించిన వైద్యులు నిర్ణయానికి వచ్చేశారు. కానీ తల్లిదండ్రుల్లో మాత్రం ఏ మూలో రెపరెపలాడే ఆశ ఉండేది. వేరే దేశాల్లో ఆ బాలుడికి చికిత్స ఇప్పించాలని అనుకున్నారు. లైఫ్ సపోర్ట్ తీయొద్దంటూ కోర్టుకెక్కారు. దీంతో ఈ బాలుడి గురించి ప్రపంచ దేశాలకు తెలిసింది. ఏకంగా పోప్ ఫ్రాన్సిస్ మద్దతు ఆ తల్లిదండ్రులకు లభించింది. ఇవాన్స్‌కు ఇటలీ పౌరసత్వం ఇవ్వడమే కాదు మెరుగైన చికిత్స అందించడానికి ఎప్పుడంటే అప్పుడు బాలుడ్ని తీసుకురావడానికి మిలటరీ ఎయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ బ్రిటన్ వైద్యులు మాత్రం ఆ బాలుడి వ్యాధిని ఎవరూ నయం చేయలేరని, లైఫ్ సపోర్ట్ ఇవ్వడం అంటే ఆ లేత శరీరాన్ని మరింత బాధించడమేనని వాదించారు. బ్రిటన్‌లో 1989 బాలల చట్టం ప్రకారం ఇలాంటి అరుదైన వ్యాధి సోకిన బాలలకు చికిత్స విషయంలో తల్లిదండ్రులు తమకిష్టమైన పద్ధతిలో చేయడానికి వీలు లేదు. కోర్టులు ఏం చెబితే అలాగే నడుచుకోవాలి. బ్రిటన్‌లో కోర్టులు కూడా ఇలాంటి అరుదైన కేసుల్లో భావోద్వేగాలను, తల్లిదండ్రుల కడుపు తీపిని కాస్త కూడా పట్టించుకోవు. వైద్యుల సలహా మేరకే అవి నడుచుకుంటాయి. ఆ బాలుడికి వచ్చిన అరుదైన వ్యాధిని నయం చేయడం అసాధ్యమని మూడు దేశాల్లో ప్రముఖ వైద్యులు తేల్చేయడంతో బ్రిటన్ కోర్టులు కూడా వైద్యుల మాటకే విలువనిచ్చి లైఫ్ సపోర్ట్ తీసేయాలంటూ ఆదేశాలు ఇచ్చాయి. అల్ఫీ మరణంతో బ్రిటన్ చట్టాలపై చర్చ జరగడమే కాదు, ఇవాన్స్ కేథలిక్ కావడం వల్లే చికిత్సకు వాటికన్ సిటీ ముందుకు వచ్చిందంటూ పసి ప్రాణానికి మతాన్ని ముడిపెట్టి కొందరు చేసిన ప్రచారం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేథలిక్ దేశాలు బ్రిటన్ వైద్యుల్ని విమర్శిస్తున్నాయి. అంత హుటాహుటిన లైఫ్ సపోర్ట్ తీయాల్సిన పనేముందని నిలదీస్తున్నాయి. -
కాన్పు సమయంలో శిశువు మృతి
కావలిరూరల్: కాన్పు సమయంలో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చోటుచేసుకుంది. శిశువు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సన్నగిరి శివప్రసాద్ భార్య కావ్య కాన్పుకోసం బిట్రగుంటలోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. రాత్రి 9.51 గంటలకు ఆమెకు సహజ ప్రసవం ద్వారా మగ శిశువు జన్మించాడు. అయితే కాసేపటికి శిశువు మరణించాడు. దీంతో కావ్యతోబాటు ఆమె కుటుంబసభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు. కాన్పు సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అక్కడ లేరు. కాల్ ఆన్ డ్యూటీలో ఉన్న చిన్న పిల్లల వైద్యనిపుణులు అర్ధగంట తర్వాత ఆస్పత్రికి రాగా, డ్యూటీ డాక్టర్ మరో పావు గంట తర్వాత చేరుకున్నారు. శిశువు మృతిచెందాడని వారు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుబ్బారావు, చైర్మన్ గుత్తికొండ కిషోర్‌బాబు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. డాక్టర్లు సకాలంలో స్పందించలేదు ఇక్కడ కాన్పులు బాగా జరుగుతున్నాయంటే తీసుకువచ్చాం. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేరు. సిబ్బందే కాన్పు చేశారు. వారు ఫోన్ చేయగా చిన్నపిల్లల డాక్టర్ అర్ధగంటకు వచ్చారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.– దరిశి సుధీర్, కావ్య సోదరుడు పూర్తి స్థాయిలో విచారిస్తాం కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మా సిబ్బంది తీసుకున్నారు. డాక్టర్లు అందుబాటులో లేరనే విషయంపై విచారిస్తున్నాం. కాన్పు సమయంలో గర్భంలో మలం కలసిపోయి శిశువు ముక్కులు, నోట్లోకి వెళ్లి చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారిస్తాం. – డాక్టర్ కె.సుబ్బారావు, ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం శిశువు మృతి చెందాడనే విషయం తెలియగానే కమిటీ సభ్యులతో కలసి ఇక్కడికి చేరుకున్నాం. డాక్టర్లు అందుబాటులో లేరనే ఆరోపణలపై ఆరా తీస్తున్నాం. ఈ ఘటనలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం. – గుత్తికొండ కిషోర్‌బాబు, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చెర్మన్ -
పురిటిలోనే పసికందు మృతి
చీపురుపల్లి: ప్రసవం కోసం వస్తే పట్టించుకోలేదు....ఆస్పత్రిలో చేరితే కనీసం వైద్య పరీక్షలు చేయలేదు...ప్రసూతి వార్డు వైపు సిబ్బంది కన్నెత్తి చూడలేదు....సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు నూరేళ్లు బతకాల్సిన తమ బిడ్డ పురిటిలోనే లోకాన్ని విడచివెళ్లిపోయాడని కొత్తపేట గ్రామానికి చెందిన బాలింత పొదిలాపు స్వాతి, ఆమె భర్త రాంబాబు, తదితరులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట గ్రామానికి చెందిన పొదిలాపు స్వాతికి శుక్రవారం ప్రసవ నొప్పులు రావడంతో పది గంటలు సమయంలో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ గదిలో ఓ వైద్యురాలు పరీక్షలు నిర్వహించి అప్పుడే ప్రసవం రాదని చెప్పి అంతవరకు ఆస్పత్రిలో చేరాలని సూచించారు. దీంతో వారు గర్భిణిని ప్రసూతి వార్డులో చేర్పించారు. ఆ తర్వాత గర్భిణిని ఎవ్వరూ పట్టించుకోలే దు. మధ్యాహ్న సమయంలో స్వాతి బాత్రూమ్కు వెళ్లగా అక్కడ ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో దిగువస్థాయి సిబ్బంది వచ్చి ఆమెను బెడ్‌పై వేశారు. అప్పటికే ఆమె మగబిడ్డను ప్రసవించింది. అప్పటికీ వైద్యులు హాజరవ్వకపోవడంతో కాసేపట్లో బిడ్డ మృతి చెందింది. వైద్యులు పట్టించుకోకపోవడంతోనే తమ బిడ్డ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడమని చెబితే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిపోయేవారమని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. -
చిన్నారిని చిదిమేసిన మృత్యుశకటం
అమ్మానాన్న, అక్కతో అంతవరకూ ఆనందంగా గడిపిన అభయం శుభం తెలియని అయిదేళ్ల చిన్నారిని అంతలోనే మృత్యువు కబళించింది. తల్లిదండ్రులు,అక్క చూస్తుండగానే కర్కశంగా వ్యాన్ రూపంలో పొట్టనపెట్టుకుంది. మొక్కు చెల్లించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. నాతవరం(నర్సీపట్నం): నర్సీపట్నం–తుని రోడ్డులో నాతవరం మండలం తాండవ జంక్షన్లో గురువారం వేగంగా వస్తున్న వ్యాను బ్రేకులు పట్టక వరుసగా మూడు వాహనాలను ఢీకొని బీభత్సవం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. నాతవరం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కోనే విజయ రామకృష్ణ ,అతని భార్య దేవి, తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి గురువారం ఉదయం దైవదర్శనానికి బయలు దేరారు. రోలుగుంట మండలం సింగరాజుపేట గ్రామంలో గల గంగాలమ్మ తల్లిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. నాతవరం మండలం తాండవ జంక్షన్లో జామకాయలు కోసం ఆగారు. రోడ్డు పక్కన బైక్ నిలిపి, దానిపై విజయరామకృష్ణ, చిన్న కుమార్తె దుర్గశ్రీ కూర్చొన్నారు. భార్య దేవి, పెద్ద కుమార్తె మౌనిక దేవి బైక్ దిగి జామ కాయలు కొనుగోలు చేయడానికి దుకాణం వద్దకు వెళ్లారు. వారిద్దరూ జామకాయలను పరిశీలిస్తుండగా ఆ సమయంలో తుని వైపు నుంచి వస్తున్న వ్యానుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ముందు వెళ్తున్న టాటా ఏస్ వ్యానును బలంగా ఢీకొంది. అనంతరం ప్రయాణికులను దించేసి నర్సీపట్నం వైపు నెమ్మదిగా వెళ్తున్న ఆర్టీసి బస్సును ఢీకొంది. టాటా ఏస్ వ్యాను బైక్‌పై ఉన్న విజయరామకృష్ణ, అతని కుమార్తెపై బోల్తా ఢీకొంది. ఈ ప్రమాదంలో కోనె దుర్గశ్రీ (5) అక్కడికక్కడే మృతి చెందింది. విజయరామకృష్ణ తలకు గాయమైంది. బైక్ పూర్తిగా నుజ్జయింది, జామకాయల దుకాణం వద్ద ఉన్న భార్య దేవి, పెద్ద కుమార్తె మౌనిక దేవికి స్వల్ప గాయాలయ్యాయి. నాతవరం మండలం వి.బి.ఆగ్రహరం గ్రామానికి చెందిన సుర్ల నాగరత్నం, ముత్యాల దేవి తాండవ జంక్షన్లో గల స్టేట్ బ్యాంకులో డ్వాక్రా సొమ్ము తీసుకోవడం కోసం వచ్చారు. బ్యాంకులో పని పూర్తి చేసుకుని జామకాయలు కొనుక్కుని ఇంటి వెళ్లిపోదామనుకున్నా రు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో వారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంతవరకు సరదాగా ఉన్న చెల్లెలు అంతలోనే మృత్యువాత పడడంతో అక్క మౌనిక దేవి భోరున విలపించింది. కళ్లముందే కుమార్తెను మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించా రు. ఈసంఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై నాతవరం హెడ్ కానిస్టేబుల్ జి.గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన సెరిలాక్
రామనగర (దొడ్డబళ్లాపురం): గొంతులో సెరిలాక్ ఇరుక్కుపోవడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన బెంగళూరు సమీపంలోని మాగడి పట్టణంలో బుధవారం జరిగింది. హోసపాళ్యలో నివసిస్తున్న మంజునాథ్, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమార్తె సంతానం. వీరు చిన్నారికి 15 రోజులు కిందట సెరిలాక్ తినిపించడం ఆరంభించారు. బుధవారం ఉదయం చిన్నారికి సెరిలాక్ కలిపి తల్లి తినిపిస్తుండగా..అది గొంతులో ఇరుక్కోవడంతో శిశువు ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పపత్రికి తీసుకెళ్లగా గొంతులో సెరిలాక్ ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
మిద్దెపై నుంచి పడి చిన్నారి ఐశ్వర్య దుర్మరణం
అందరూ క్రిస్మస్ను సంతోషంగా జరుపుకున్నారు. క్రీస్తు గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో చిన్నారి మృతిచెందింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ ఇంటిలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఒక్కగానొక్క కూతురు మిద్దెపై నుంచి జారి పడి దుర్మరణం చెందడంతో ఆ దంపతులు చేస్తున్న చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. ఈ సంఘటన రేణిగుంట మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు, రేణిగుంట:మిద్దెపై నుంచి పడి చిన్నారి మృతిచెందిన సంఘటన రేణిగుంటలో జరిగింది. మండలంలోని ఎల్లమండ్యంకు చెందిన మదన్మోహన్ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ భార్య కళ, కుమార్తె ఐశ్వర్య (3)ను పోషించుకుంటున్నాడు. రేణిగుంట మంచినీళ్ల గుంత వద్ద ఉన్న తన సమీప బంధువు ఇంటిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం అందరూ ఇంటి పనుల్లో ఉండగా ఐశ్యర్య మూడవ అంతస్తు మిద్దిపైకి ఎక్కింది. ఆటలాడుకుంటూ అక్కడి నుంచి కాలుజారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను తిరుపతి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కళ్లముందే కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో నిండు గర్భిణిగా ఉన్న కళను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చిన్నారి మృతితో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లమండ్యకు తీసుకెళ్లడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ఈ దుర్ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. -
మృతిచెందిన శిశువు బతకాలని పూజలు!
►మృతిచెందిన శిశువును బతికించేందుకు మూడు రోజులుగా పూజలు బరంపురం(ఒడిశా): కటక్ పెద్దాస్పత్రిలో మూడేళ్ల శిశువు మృతిచెందిందని వైద్యులు నిర్ధారించినప్పటికీ ఆ శిశువును బతికించేందుకు గ్రామస్తులు గుడ్డిగా మూఢనమ్మకంతో మూడురోజులుగా తాంత్రిక పూజలు చేసిన సంఘటన గంజాం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేగింది. మృతిచెందిన శిశువు సాయినంద్‌కు దహనసంస్కారాలు చేసేందుకు శ్మశానానికి తీసుకువెళ్లగా అక్కడ శిశువు కాళ్లు చేతులు కదలడంతో శిశువు సాయినంద్ బతికి ఉన్నట్లు అనుమానించారు. దీంతో తల్లితో సహా గ్రామస్తులు ఊరిశివారు చెట్టుకింద శిశువును ఉంచి బతికించుకునేందుకు మూడురోజులుగా తాంత్రిక పూజలు చేసిన సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేగింది. గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం గంజాం జిల్లా ఛత్రపూర్ బ్లాక్ పరిధిలో గల సుందరపూర్ గ్రామంలో గల మజ్జిడియా వీధిలో నివాసం ఉంటున్న కుటుంబంలో 3 ఏళ్ల శిశువు సాయినంద్‌కు కొద్ది రోజుల క్రితం జ్వరం రావడంతో ఛత్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. సాయినంద్ పరిస్థితి విషమించడంతో బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు కటక్ పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. కటక్ పెద్దాస్పత్రిలో శిశువు సాయినంద్‌కు వైద్యులు చికిత్స చేస్తుండగా మృతిచెందాడు. మృతి చెందిన సాయినంద్ను కుటుంబసభ్యులు సుందరపూర్ సొంత గ్రామానికి తీసుకువచ్చి గ్రామస్తుల సహకారంతో దగ్గరలో ఉన్న శ్మశానానికి తరలించగా అక్కడ సాయినంద్ కాళ్లు చేతులు అడడంతో బంధువులు అనుమానంతో ఊరి శివారు మామిడి తోట కింద శిశువును ఉంచి గత 5వ తేదీ నుంచి మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తున్నారు. తాంత్రిక పూజలతో శిశువును బతికించుకోవాలని గ్రామస్తులు కూడా వెయ్యిమందికి పైగా చేరి రాత్రి పగలు పూజల్లో పాల్గొన్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా మరో రోజు ఊరుకోవాలని శిశువును బతికించుకుంటామని కుటుంబసభ్యులు పోలీసులను కోరగా వెళ్లిపోయినట్లు తెలిసింది. అధునిక ప్రపంచీకరణ యుగంలో మూఢనమ్మకాలతో ఇంకా తాంత్రిక విద్యలతో మృతశిశువును బతికించుకునేందుకు సుందరపూర్ గ్రామస్తుల ప్రయత్నం శుక్రవారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా సుందరపూర్ గ్రామస్తులు శిశువును విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.