మృతి చెందిన శిశువు
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లాలో మూఢనమ్మకాలు పెచ్చుమీరుతున్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ఈ ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతూ ప్రాణాలు పోగొట్టుకుంటుండడం గమనార్హం. ముఖ్యంగా ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లోని ఆదివాసీలకు ఏ జ్వరం వచ్చినా, జబ్బు చేసినా, కడుపునొప్పి వచ్చినా ఆఖరికి చిన్నారులకు సైతం బాగోలేకపోయినా ఆస్పత్రికి తీసుకువెళ్లరు. తమకు తెలిసిన వైద్యం లేదా మూఢనమ్మకాలపై ఆధారపడి భూతవైద్యులను సంప్రదిస్తారు. ఈ క్రమంలో వారు వైద్యం కింద అప్పుడే పుట్టిన బిడ్డలపై ఇనుపరాడ్లను ఎర్రగా కాల్చి, దాంతో వాతలు పెట్టడం వంటివి చేస్తారు. దీంతో చాలా సందర్భాల్లో చాలామంది శిశువులు చనిపోయినా మళ్లీ పాతకాలం నాటి సంప్రదాయాలనే అవలంభిస్తుండడం జరుగుతోంది. గతంలో ఇటువంటి సంఘటనలు అవిభక్త కొరాపుట్ జిల్లాలో ముఖ్యంగా నవరంగపూర్ జిల్లాలో చాలా జరిగాయి.
ఇదే విషయంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అయినా ఎటువంటి సత్ఫలితాలు కనిపించకపోవడం విచారకరం. నాటువైద్యం కారణంగా 28 రోజుల శిశువు చనిపోయిన ఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మంగళవారం జరిగింది. ముండిబుడ గ్రామానికి చెందిన మాలతీ భాయి, డొంబురుదొర యాదవ్ దంపతులకు కొన్నిరోజుల క్రితం ఓ మగబిడ్డ పుట్టారు. బిడ్డపుట్టాడని ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఫంక్షన్ కూడా చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి పుట్టిన శిశువు ఏదో నొప్పితో బాధపడుతూ ఏడుస్తున్నాడు. దీంతో ఆదివాసీ వైద్యుడు దిశారి వద్దకు తీసుకువెళ్లారు. బాలుని కడుపుపై వాతలు పెడితే నయమవుతుందని, చెప్పడంతో శిశువు తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బాలుని కడుపుపై వాతలు పెట్టించారు. అయితే వాతలు పెట్టిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన ఆ బాలుడు మృతిచెందాడు. అప్పుడు అప్రమత్తమైన శిశువు తల్లిదండ్రులు ఉమ్మరకోట్ ప్రభుత్వ ఆస్పత్రికికు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే తమ బాలుని బలిగొన్నాయని బాధిత తల్లిదండ్రులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment