‘నిలోఫర్‌’లో మరణ మృదంగం | Child Deaths in Niloufer Hospital | Sakshi
Sakshi News home page

'కడుపు'కోత

Published Mon, Apr 29 2019 8:07 AM | Last Updated on Fri, May 3 2019 8:55 AM

Child Deaths in Niloufer Hospital - Sakshi

ఆస్పత్రి ఎదుట శిశువు మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు

సాక్షి, సిటీబ్యూరో: తల్లి కళ్ల ముందే బిడ్డ కన్ను మూస్తోంది. అమ్మకు కడుపుకోత మిగులుతోంది. నిలోఫర్‌ నవజాత శిశువుల కేంద్రంలో మరణ మృదంగం మోగుతోంది. నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించే శిశువులకు ఇక్కడ కనీస వైద్య సేవలూ అందడం లేదు. గతేడాది 4వేలకు పైగా మంది శిశువులు మరణించగా... ఈ ఏడాది ఇప్పటికే 2వేలకు పైగా మంది శిశువులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదివారం కామారెడ్డికి చెందిన నవజాత శిశువు మృతి చెందడంతో ఆస్పత్రి వైద్యులపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిశువును కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందని పీడియాట్రిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రవికుమార్‌ స్పష్టం చేశారు.  

సిబ్బంది కొరత...  
దేశంలోనే రెండో అతిపెద్ద నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రమైన నిలోఫర్‌ ఆస్పత్రి అవుట్‌ పేషెంట్‌ విభాగానికి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సమీప కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి కూడా బాధితులు వస్తుంటారు. వీరిలో నెలలు నిండక ముందే తక్కువ బరువుతో జన్మించిన పిల్లలు, ప్రసవ సమయంలో ఉమ్మనీరు మింగినవారు, గుండెకు రంధ్రాలు, అవయవ లోపాలతో జన్మించినవారు, పుట్టుకతోనే కామెర్లతో జన్మించిన శిశువులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో వచ్చిన ప్రతి రోగిని చేర్చుకోవాల్సి ఉంటుంది. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి అనుగుణంగా వైద్యులు, నర్సులను నియమించలేదు. గత 15రోజులుగా సీటీ స్కాన్‌ పనిచేయడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. అప్పటికే అక్కడ వెయిటింగ్‌ జాబితా భారీగా ఉండడంతో అనివార్య పరిస్థితుల్లో ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి అందుబాటులో తీసుకురావాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

ఔట్‌సోర్సింగ్‌ పేరుతో అవినీతి...  
ప్రస్తుతం ఆస్పత్రిలో 100 మంది వైద్యులు ఉండగా, 130 మంది నర్సులు ఉన్నారు. నిజానికి నవజాత శిశువుల చికిత్సల్లో నర్సుల పాత్రే కీలకం. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో 1:1 చొప్పున, సాధారణ వార్డుల్లో ప్రతి 20 మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ఆస్పత్రిలో ఈ మేరకు నర్సులు లేరు. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కొంతమందిని విధుల్లోకి తీసుకున్నట్లు, వారికి నెలసరి వేతనాలు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పుతున్నప్పటికీ... ఆ మేరకు ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రతినెలా వారి పేరుతో బిల్లులు మంజూరు చేస్తుండడాన్ని పరిశీలిస్తే... ఆస్పత్రిలో అవినీతి ఎలా పేరుకపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందులు...   
నర్సుల కొరతతో శిశువుల సంరక్షణ బాధ్యతలను కూడా వెంట వచ్చిన బంధువులే చూసుకోవాల్సి వస్తోంది. అసలే చిన్న పిల్లలు చికిత్స పొందే వార్డులు.. ఆపై పెద్దవాళ్లు కూడా రోజంతా పడకల పక్కనే ఉండడం, వారు సరైన శుభ్రత పాటించకపోవడంతో ఒకరి నుంచి మరొకరికి ఇన్‌ఫెక్షన్‌ సోకుతోంది. రెండు రోజుల్లో నయం కావాల్సిన జబ్బులు వారం పది రోజులైనా తగ్గకపోగా మరింత ముదురుతోంది. ఆస్పత్రిలో చేరిన శిశువులకు జబ్బు నయం కాకపోగా, కొత్తగా రకరకాల ఇన్‌ఫెక్షన్లు సోకి, చివరికి వారు మృతికి కారణమవుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్య నిపుణులే స్పష్టం చేస్తున్నారు. 

‘కీలక’ ఇన్‌చార్జి డుమ్మా..  
పడకల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండడం, వారికి తక్షణ వైద్యసేవలు అందించేందుకు సరిపడా వైద్యులు ఆస్పత్రిలో లేకపోవడం, ఉన్నవారు కూడా సెలవుల్లో ఉండడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన శిశువులకు కనీస వైద్యసేవలు అందక మృత్యువాతపడుతున్నారు. పసిపిల్లల ప్రాణాలు కళ్లముందే పోతుండడంతో వెంటవచ్చిన బంధువులు ఏమీ చేయలేక ఆగ్రహంతో వైద్యులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు లేకపోలేదు. ఆస్పత్రిలోని ఓ కీలక విభాగం ఇన్‌చార్జి గత 15 రోజులుగా ఆస్పత్రికే రావడం లేదు. కనీసం అధికారికంగా సెలవు కూడా పెట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత డాక్టర్‌పై కనీస చర్యలు తీసుకోవడం లేదంటే ఆస్పత్రి ఉన్నతాధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

గుండెకు రంధ్రాలు పడితే?  
జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న శిశువుల్లో చాలామందికి పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడుతుంటాయి. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఆస్పత్రికి వస్తున్న చిన్నారుల్లో రోజుకు సగటున 15–20 మంది శిశువులు ఇదే సమస్యతో బాధపడుతుంటారు. వీరికి చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవు. దీంతో 2డీఎకో, ఈసీజీ పరీక్షల కోసం వీరిని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఇందుకు రెండు అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ... నిర్వహణ లోపం, డీజిల్‌ ఖర్చులకు నిధులు లేకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. అనివార్య పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్‌ వాహనాల్లో అక్కడికి చేరుకుంటే అప్పటికే అక్కడ అనేక మంది వెయిటింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. టెస్టుల కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తోంది. రిపోర్టు తీసుకొని తిరిగి ఆస్పత్రికి చేరుకుంటే తీరా ఇక్కడ గుండెకు ఏర్పడిన రంధ్రాలకు చికిత్స చేయరని చెప్పి తిప్పి పంపుతున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకునే స్తోమత లేక, నిలోఫర్‌లో చికిత్సలు అందక అనేక మంది పిల్లలు చనిపోతుండడం తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తోంది.  

పరిస్థితి విషమించడంతోనే...
నాంపల్లి: క్రిటికల్‌ కండిషన్‌లో శిశువును ఆస్పత్రికి తీసుకొచ్చారని, పరిస్థితి విషమించడంతోనే మృతి చెందిందని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని డాక్టర్‌ రవికుమార్‌ స్పష్టం చేశారు. వివరాలు.. నిజామాబాద్‌కు చెందిన బాలమణికి ఆదివారం ఉదయం 4గంటలకు కాన్పు అయింది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అయితే శిశువుకు ఊపిరాడడం లేదని మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో బంధువులు శిశువును ఉదయం 7గంటలకు నిలోఫర్‌లో చేర్పించారు. శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12గంటలకు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఉద్రిక్తతకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించారని, పరిస్థితి విషమించడంతోనే శిశువు మృతి చెందిందని డాక్టర్‌ రవికుమార్‌ వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement