
నిలోఫర్ నుంచి తల్లి శిశువులు డిశ్చార్జ్
నాంపల్లి: నిలోఫర్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. కోలుకున్న తల్లీపిల్లలను శనివారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని హస్తినాపురం ప్రాంతానికి చెందిన అమృత (24) పురిటి నొప్పులతో ఫిబ్రవరి 22న నిలోఫర్‌లో అడ్మిట్ అయ్యారు.
ఏడున్నర నెలలకి పురిటి నొప్పులు రావడంతో నిలోఫర్ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పెద్దాపరేషన్ చేశారు. ఈ కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వీరి బరువు 1.6 కేజీ, 1.5 కేజీ, 1.4 కేజీ, 1.2 కేజీలుగా ఉన్నారు.
శిశువులకు పుట్టుకతో శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్, ఎన్‌హెచ్‌ఓడీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నియోనటాలజీ ప్రొఫెసర్ ఎల్.స్వప్న పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో పదిరోజుల పాటు చికిత్సలు అందించారు. నిలోఫర్ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఇన్ఫెక్షన్, కామెర్లు, కంటి సమస్యల నుంచి బయటపడ్డారు. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత నలుగురు పిల్లలు డిశ్చార్జ్ అయ్యారు.