వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కన్నతల్లి దారుణం! | Child Deceased Over Mother Extramarital Affair With Lover | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కన్నతల్లి దారుణం!

Published Sun, Apr 18 2021 9:46 AM | Last Updated on Sun, Apr 18 2021 1:01 PM

Child Deceased Over Mother Extramarital Affair With Lover - Sakshi

మృతి చెందిన చిన్నారి శ్రీవల్లి

పాడేరు: అనుమానాస్పద రీతిలో ఓ చిన్నారి కన్నుమూసింది. ప్రియుడితో కలిసి తల్లే చంపేసిందని తండ్రి ఆరోపిస్తుండగా.. ఆరోగ్యం బాగులేక మృతి చెందిందని తల్లి చెబుతోంది. లగిశపల్లి పంచాయతీ పార్వతీపురం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం వీఆర్‌వో కొండమ్మ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు.

పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ కోళ్ల ఫారంలో గొల్లోరి రాంబాబు, అతని భార్య రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వారికి శ్రీవల్లి అనే ఐదేళ్ల కుమార్తె ఉంది. రాంబాబు భార్యతో కోళ్లఫారం యజమాని కమలాకర్‌కు వివాహేతర సంబంధం ఉండడంతో భార్యభర్తల మధ్య తరచు తగాదాలు జరిగేవి. పదిరోజుల కిందట రాంబాబు హుకుంపేట మండలంలోని తన స్వగ్రామం తడిగిరి వచ్చాడు.

తమకు అడ్డుగా ఉందన్న కోపంతో భర్త లేని సమయంలో ప్రియుడు కమలాకర్‌తో కలిసి తల్లే శ్రీవల్లిని హత్య చేసిందని గ్రామపెద్దలు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన చిన్నారికి కడుపు, వీపు భాగంలో గాయాలు ఉండడంతోపాటు కడుపు ఉబ్బిపోయింది. తల్లి మాత్రం రెండు రోజుల క్రితం మామిడి చెట్టు వద్ద జారి పడిపోవడంతో శ్రీవల్లికి కడుపులో గాయమైందని, కోళ్లఫారం యజమాని చిట్టిమోజు కమలాకర్‌ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించాడని చెబుతోంది. కడుపు ఉబ్బిపోయి శుక్రవారం సాయంత్రం మృతి చెందిందని పోలీసులకు తెలిపింది. కుమార్తె శ్రీవల్లిని తన భార్య, కోళ్లఫారం యజమాని కమలాకర్‌ చంపేశారని రాంబాబు, అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హత్య కేసుగా పరిగణించి, విచారణ చేయాలని తడిగిరి పంచాయతీ సర్పంచ్‌ పి.రంజిత్‌కుమార్, ఇతర గ్రామ పెద్దలంతా ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు జిల్లా ఆస్పత్రిలోని శవపరీక్షల గది ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. చిన్నారికి శవపరీక్షలు జరిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కోళ్లఫారం యజమాని కమలాకర్, మృతురాలి తల్లి అనురాధలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.   

చదవండి: ఓటు వేశాక అనుకోని ప్రమాదం: ఇద్దరు ఉద్యోగులు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement