కట్టుకున్న భర్త.. కనిపెంచిన పిల్లలు.. కంటికి రెప్పలా కాపాడుకునే కుటుంబ సభ్యులు.. వీళ్లందరి పరువు బజారుకీడుస్తూ ‘ఆమె’ తన జీవితాన్ని చేజేతులా కాలరాసుకుంటోంది. తాళికి విలువ లేకుండా పోతోంది. బంధం పలుచనవుతోంది. మానవత్వం మాయమైపోతోంది. ‘చీకటి’ నిర్ణయాలతో జీవితాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షణికమైన ఆనందాలకు కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. వెనక్కు తిరిగి చూసుకుంటే.. నా అనే బంధం లేకుండా పోతోంది. ఈ కోవలో ఓ మహిళ వేసిన తప్పటడుగు ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. ఒకరికి మూడేళ్లు.. మరొకరికి ఆరు నెలలు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని ప్రియుడు ఇద్దరు చిన్నారులను అర్ధరాత్రి నిద్రలోనే కర్కశంగాచంపి పాతిపెట్టిన ఘటన పుట్టపర్తిలో కలకలం రేపింది.
అనంతపురం, పుట్టపర్తి టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడే ఆమె ఇద్దరు పిల్లలను హతమార్చిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టపర్తి అర్బన్ సీఐ ఆంజనేయులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు వివరాలివీ.. పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన ఓబుళేసు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న గణేష్‌తో ఆరు నెలల క్రితం పరిచయమైంది. గణేష్ భార్య నాగమ్మ కూడా అక్కడే హెల్పర్‌గా పనిచేస్తోంది. ఈ దంపతులకు దర్శిని(3), ఆరు నెలల కూతురు సంతానం. ఈ క్రమంలో నాగమ్మతో ఓబుళేసుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ పరిచయంతో ఓబుళేసు తాను వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను సొంత గ్రామమైన వెంకటగారిపల్లికి తీసుకొచ్చాడు. మొదటి భార్య రాములమ్మకు ఆమెను పరిచయం చేసి రెండో వివాహం చేసుకోబుతున్నట్లు చెప్పాడు.
హత్యకు గురైన దర్శిని ,హత్యకు గురైన ఆరు నెలల పాప(ఫైల్)
అందుకు ఆమె ససేమిరా అన్నా వినిపించుకోలేదు. ఇంట్లో ఉంచేందుకు భార్య అంగీకరించకపోవడంతో ఐదు రోజుల క్రితం పుట్టపర్తిలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని నాగమ్మ, ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు. గత నెల అక్టోబర్ 26న శుక్రవారం నాగమ్మ నిద్రపోతున్న సమయంలో ఓబులేసు ఇద్దరు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా చంపి సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చేశాడు. తెల్లవారుజామున నిద్రలేచిన ఆమె పిల్లలు ఎక్కడని ప్రశ్నించగా.. ఇక్కడ అడ్డు వస్తున్నారని బంధువుల ఇంట్లో వదిలి వచ్చినట్లు నమ్మించాడు. ఆ తర్వాత శనివారం తిరిగి యథావిధిగా ఇద్దరూ బెంగళూరుకు వెళ్లిపోయారు. అయితే పిల్లలు లేకుండా ఒక్కతే రావడంతో భర్త గణేష్‌తో పాటు బంధువులు నిలదీశారు. ఓబులేసు ఏమి చేశాడో తెలియదని చెప్పడంతో అందరూ కలిసి అతన్ని ప్రశ్నించగా చంపినట్లుగా అంగీకరించి పుట్టపర్తికి తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓబులేసు పిల్లలు లేరు, ఏమి చేసుకుంటారో చేసుకోండని.. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్నీ చంపుతానని బెదిరించాడు. విధిలేని పరిస్థితుల్లో గణేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. ఆ మేరకు ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పిల్లలు ఇద్దరినీ తానే చంపినట్లు అంగీకరించాడు. కాగా గురువారం రాత్రి పొద్దుపోవడంతో శుక్రవారం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం చేయిస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment