రోజురోజుకూ చిన్నారులపై పెరిగిపోతున్న దాడి ఘటనలు
ఇబ్రహీంపట్నంలో కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి కన్నుమూత
నార్సింగి పరిధిలో దివ్యాంగ బాలుడిపై వీధి కుక్క దాడి
వరంగల్ ఎంజీఎంలో శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న శునకం
ఇబ్రహీంపట్నం/ మణికొండ/ ఎంజీఎం (వరంగల్): రాష్ట్రంలో వీధి కుక్కల దాడి ఘటనలు మరింతగా పెరుగుతున్నా యి. అభంశుభం ఎరుగని చిన్నారులపై దాడి చేస్తున్న వీధి కుక్కలు ‘విధి’రాత మార్చేస్తున్నాయి. పిల్లలను పొట్టనపెట్టు కుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే జరిగిన మూడు ఘట నలు భయాందోళన రేపుతున్నాయి. శునకాల దాడిలో గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందితే.. మరో ఘటనలో దివ్యాంగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మరోచోట శిశువు మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది.
నాలుగేళ్ల చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్‌లో గత నెల 12న స్కూల్ బయట వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాలుగేళ్ల చిన్నారి క్రియాన్‡్ష.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ముక్కుపచ్చలారని తమ కుమా రుడిని కుక్కలు పొట్టనపెట్టుకున్నాయంటూ తల్లిదండ్రులు ఉడుగుల మాధురి, శివగౌడ్ దంపతులు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.శుక్రవారం గ్రామంలో నిర్వ హించిన బాలుడి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది.
దివ్యాంగ బాలుడిపై దాడి
హైదరాబాద్ శివార్లలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని సబితానగర్‌లో ఉంటున్న నర్సింహ, అంజమ్మల కుమా రుడు భరత్ (7). అతను దివ్యాంగుడు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఇంట్లోనే ఉంటాడు. శుక్రవారం అలా ఇంటి వద్దే ఉన్న భరత్.. బహిర్భూమికి వెళ్లి, గుడిసెలోకి వచ్చాడు. వెనకాలే వచ్చిన ఓ వీధికుక్క బాలుడిపై దాడి చేసింది. జననాంగంపై కరిచింది. బాలుడి చేతులు పనిచేయక పోవటం, చిన్న గుడిసె కావడంతో తప్పించుకోలేక పోయాడు. గట్టిగా అరుస్తూ, ఏడవటంతో చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తరిమేశారు. నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి శస్త్రచికిత్స చేయాలని, రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని.. తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ ఘటనతో స్పందించిన నార్సింగి మున్సిపాలిటీ సిబ్బంది.. శుక్రవారం కాలనీలోని కుక్కలను పట్టుకుని, అక్కడి నుంచి తరలించారు.
ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం రద్దీగా ఉండే క్యాజువాలిటీ ప్రాంతం వద్ద ఓ పసికందు మృతదేహాన్ని కుక్క పీక్కుతింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో దీన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ కుక్కను తరిమివేసి ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే శిశువు ఎవరనేది గుర్తించలేనంతగా కుక్క కొరికేసింది. మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఆడ శిశువుగా గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటే కుళ్లిన వాసన వస్తుందని, మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన రాకపోవడంతో శుక్రవారమే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో..
ఆ పసికందు ఎవరు? ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువులదా? బయటినుంచి తీసుకువచ్చిందా? శిశువు బతికి ఉండగా కుక్కల బారిన పడిందా? ఎవరైనా శిశువు చనిపోతే ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారా? అనే సందేహాలతో కలకలం చెలరేగింది. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. పసికందును కుక్క ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే.. ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు కేంద్రంలో శుక్రవారం చిన్నారులెవరూ మృతి చెందలేదని.. పసికందు మృతదేహం ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించినది కాదని సూపరింటెండెంట్ మురళి చెప్పారు. శనివారం పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని, వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment