సాక్షి, బంజారాహిల్స్: పిల్లర్‌కోసం తీసిన గుంత బాలుడి ప్రాణం బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు గుంత వరదనీటితో నిండిపోవడంతో పొరపాటున అందులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా కంచిరాపల్లి తండాకు చెందిన గోపాల్, మోనిక దంపతులు కూలిపనులు చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల చిన్న కుమారుడు మూడవత్ సిద్దు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నాడు. బస్తీని ఆనుకొని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ కాలనీలో పరుచూరి రవీంద్రనాథ్ అనే వ్యక్తి భవన నిర్మాణం చేపట్టాడు. భవన బిల్డర్ నారాయణరావు గత రెండేళ్ల నుంచి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
నిర్మాణంలో భాగంగా పలు గుంతలు తీశారు. ఇటీవలి వర్షాలకు ఆ గుంతలు వరదనీటితో నిండిపోయాయి. లిప్ట్ కోసం తీసిన భారీ గుంత కూడా వరద నీటితో నిండిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన సిద్దు ఆ గుంతలో పడిపోయాడు. గంట సేపు గడిచినా కొడుకు కనిపించకపోడంతో తల్లి మోనిక అన్ని ప్రాంతాలు గాలిస్తూ నిర్మాణంలో ఉన్న ఖాళీ ప్లాట్‌లోకి వెళ్లి వెతికింది. ఓ గుంతలో కొడుకు విగత జీవిగా నీళ్లపై కనిపించాడు. బాలుడి మృతితో బస్తీవాసులు విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోడకూలి బాలిక మృతి
అబిడ్స్: మంగళ్‌హాట్ ఆర్‌కేపేట్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత గోడ కూలి ఐదేళ్ల బాలిక మృతిచెందింది. ఆర్‌కేపేట్‌లో నివా సం ఉంటున్న ఇమ్రాన్ ఇల్లు ఓ వైపు గోడ కూలడంతో అతని కుమార్తె ఆదిబా(5) మృతి చెందింది. దీంతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబ ఫసియుద్దీన్, మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీ సింగ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రియురాలిని మరువలేక..
నాగోలు: ప్రేమించిన యువతిని మరిచిపోలేక ఓ ఆర్‌ఎంపీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం, ఎల్లాపురం గ్రామానికి చెందిన దున్నా ఉదయ్‌కుమార్ (27) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డులోని ఓ లాడ్జిలో దిగాడు. శనివారం మధ్యాహ్నం వరకు గదిలో నుంచి బయటకు రాలేదు. లాడ్జి సిబ్బంది తలుపుకొట్టినప్పటికీ స్పందించలేదు. దీంతో వారు ఎల్‌బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచిచూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు కట్టిన నైలాన్‌తాడుకు ఉదయ్‌కుమార్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహానికి ముందే ఓ యువతిని ప్రేమించానని, ఆ యువతిని మరిచిపోలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నానని అందులో పేర్కొన్నాడు
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఉప్పల్: సెల్లార్‌లో నిండిన వరద నీటిని తోడటానికి మోటార్ పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘానికి గురైన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..చిలుకానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వద్ద గల జోగు శ్రీనివాస్(45) మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిసెల్లార్ నిండిపోయింది. దీంతో శ్రీనివాస్ సెల్లార్ నీటిని తోడటానికి మోటార్‌ను బిగించి స్విచ్ ఆన్ చేశాడు. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment